వాస్కో డి గామా: భారతదేశాన్ని వెతకాలనే కోరిక వెనుక అసలు కారణం ఇదీ..

  • జఫర్ సయ్యద్
  • బీబీసీ ప్రతినిధి
వాస్కోడీగామా

ఫొటో సోర్స్, ARCHIVES OF THE UNIVERSITY OF THE WITWATERSRAND

1497 జులై 8, శనివారం. పోర్చుగల్ రాజ పరివారంలోని జ్యోతిష్కులు ఆ రోజును చాలా జాగ్రత్తగా ఎంచుకున్నారు.

రాజధాని లిస్బన్ నగర వీధుల్లో వాతావరణం ఉత్సాహంగా ఉంది. జనం ఊరేగింపుగా సముద్ర తీరం వైపు వెళ్తున్నారు. అక్కడ నాలుగు సరికొత్త తెరచాప పడవలు సుదీర్ఘ సముద్ర యానానికి సిద్ధంగా ఉన్నాయి.

నగరంలోని క్రైస్తవ మతాధికారులంతా మెరిసే దుస్తుల్లో ఆశీర్వచనాలు అందించడానికి అక్కడకు చేరుకున్నారు.

చక్రవర్తి రోమ్ మాన్యువల్ ఆ యాత్రపై చాలా ఆసక్తిగా ఉన్నారు. వాస్కో డి గామా నేతృత్వంలో నాలుగు పడవలు.. సుదీర్ఘ సముద్ర యాత్రకు వెళ్లడానికి అవసరమైన పరికరాలు, పటాలు తీసుకుని బయల్దేరాయి. వాటితోపాటు ఆ పడవల్లో ఆధునిక ఫిరంగులనూ మొహరించారు.

పడవలోని దాదాపు 170 మంది నావికులు చేతులు లేని చొక్కాలు వేసుకున్నారు. వారి చేతుల్లో వెలుగుతున్న కొవ్వొత్తులు ఉన్నాయి. వాళ్లు ఒక సైనిక పటాలంలా పడవ వైపు మార్చ్ చేస్తున్నారు.

అక్కడున్న అందరూ ఆ యాత్రను కళ్లారా చూడాలని, వారికి వీడ్కోలు చెప్పాలని వచ్చారు. వాళ్ల కళ్లలో బాధ, సంతోషం రెండూ కనిపిస్తున్నాయి. ఎంతమంది తిరిగివస్తారో ఎవరికీ తెలియదు.

దానిని మించిన ఇంకో ఆశ కూడా ఉంది వారికి. ఆ యాత్ర సఫలం అయితే యూరప్‌లో ఒక చిన్న దేశమైన పోర్చుగల్ ప్రపంచ చరిత్రలో విజయవంతంగా ఒక కొత్త అధ్యాయం లిఖించగలుగుతుంది.

ఫొటో సోర్స్, Getty Images

చరిత్రకు కొత్త మలుపు

పది నెలల 12 రోజుల తర్వాత ఈ పడవలు భారతదేశ తీరానికి చేరినప్పుడు, వారంతా అనుకున్నదే నిజమైంది. ఆ యాత్రతో ప్రపంచంలోని తూర్పు, పశ్చిమాలు సముద్ర మార్గంలో ఒకటిగా కలవడమే కాదు, ఒకదాన్నొకటి ఢీకొన్నాయి.

అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం ఒక జలమార్గంగా మారిపోయాయి. అక్కడి నుంచే ప్రపంచ చరిత్ర ఒక కొత్త మలుపు తీసుకుంది.

ఒక ఐరోపా దేశం.. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో అడుగుపెట్టడానికి ఇది ఒక నాందిగా నిరూపితమైంది.

ఆ ప్రయాణం భారతదేశంలో చాలా మార్పులకు కారణమైంది. వాస్కో డి గామా లేకుంటే మనం ఈరోజు ఈ జీవితాన్ని అసలు ఊహించలేం. ఆ చారిత్రక ప్రయాణం వల్ల దక్షిణాసియాకే కాదు, మొత్తం ఆసియాకు మొక్కజొన్న, బంగాళాదుంప, టమోటా, మిరపకాయలు, పొగాకు వంటి పంటల గురించి తెలిసింది. అవి లేని జీవితాన్ని ఈ రోజు ఊహించడం కూడా కష్టం.

ఫొటో సోర్స్, ANTÓNIO MANUEL DA FONSECA

ఫొటో క్యాప్షన్,

వాస్కో డి గామా

మసాలా వ్యాపారం లక్ష్యం

భారతదేశం చేరుకోవాలనే పోర్చుగీసు వారి ఈ ప్రయత్నం అదే తొలిసారి కాదు. పశ్చిమ ఐరోపాలోని ఒక చిన్న దేశం చాలాకాలం నుంచి ఆఫ్రికా పశ్చిమ తీరాలను పరిశీలిస్తూనే వచ్చింది. అదే సమయంలో ఎంతోమంది నావికులు తమ ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు.

అయినా యూరప్ దేశమైన పోర్చుగల్‌కు భారత దేశం అంటే అంత ఆసక్తి ఎందుకు కలిగింది?

వారి ప్రయాణానికి కొన్నేళ్ల ముందే 1453లో ఉస్మానీ సుల్తాన్ మెహమద్ 2 కాన్‌స్టాంట్‌నోబుల్ (ప్రస్తుత ఇస్తాంబుల్)ను ఆక్రమించి యూరప్‌లో కలకలం సృష్టించాడు. అప్పట్లో తూర్పు నుంచి వ్యాపారులు ఎక్కువగా ఉస్మానియా లేదా ఈజిఫ్టు ద్వారా రావడానికి వీలయ్యేది. వారు భారతదేశం, ఆసియాలోని మిగతా ప్రాంతాల్లో లభించే ఉత్పత్తులకు ముఖ్యంగా మసాలాలకు భారీగా పన్నులు చెల్లించేవారు.

మరోవైపు యూరప్‌లో కూడా వెనిస్, జెనీవా లాంటి నగరాలు జర్మనీ గుండా వెళ్లే వ్యాపారులపై గుత్తాధిపత్యం చూపించేవి. దాంతో స్పెయిన్, పోర్చుగల్ లాంటి ఐరోపా దేశాలకు చాలా కష్టాలు ఎదురయ్యేవి. అందుకే వాస్కోడిగామా ప్రయాణానికి ఐదేళ్ల ముందే స్పెయిన్.. క్రిస్టొఫర్ కొలంబస్ నేతృత్వంలో పశ్చిమ మార్గంలో భారత్ చేరుకునే ప్రయత్న చేసింది.

కానీ కొలంబస్‌కు అంత జ్ఞానం లేదని, ఆయన దగ్గర దానికి సంబంధించిన వివరాలు కూడా లేవని పోర్చుగీసువారికి తెలుసు. కొలంబస్ ఎప్పటికీ భారత్ చేరుకోలేడని వారు భావించారు. కొలంబస్ తన చివరిరోజుల్లో కూడా భారత్ చేరుకున్నాననే అనుకున్నాడు. కానీ ఆయన తనకు తెలీకుండానే ఒక మహాద్వీపాన్ని గుర్తించినవాడిగా మిగిలిపోయారు.

అయితే అన్వేషణలు, అంతకు ముందు చేసిన యాత్రల వల్ల పోర్చుగీసు వారికి అట్లాటింక్ మహాసముద్రంలో దక్షిణ దిశగా ప్రయాణిస్తే.. ఆఫ్రికా వెంబడి వెళ్తూ హిందూ మహాసముద్రంలోకి చేరుకుంటే.. ఆసియా వ్యాపారం నుంచి మిగతా యూరప్ దేశాలను దూరం చేయవచ్చని భావించారు.

ఫొటో సోర్స్, Getty Images

గుట్టు విప్పిన గుజరాతీ వ్యాపారి

ప్రయాణంలో ఎదురైన ఎన్నో కష్టాలను అధిగమించిన తర్వాత వాస్కో డి గామా యూరప్ చరిత్రలో మొదటిసారి ఆఫ్రికా దక్షిణ తీరాన్ని చేరుకోవడంలో విజయం సాధించారు. అయితే ఆయన చేరాల్సిన భారత్ ఇంకా కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ సమయంలో వాస్కో డి గామాకు భారత్‌కు దారిని గుర్తించడం చీకట్లో సూది వెతకడంలాగే అనిపించింది.

అదృష్టవశాత్తూ ఆయన కెన్యాలో తీరప్రాంత నగరమైన మాలిందిలో ఒక గుజరాతీ ముస్లిం వ్యాపారిని కలిశాడు. అంతే, ఆ వ్యాపారి వాస్కోకు హిందూ మహాసముద్రంలో తనకు బాగా తెలిసిన మార్గాల గురించి వివరంగా చెప్పాడు.

హిందూ మహాసాగరం గుట్టు విప్పిన ఆ గుజరాతీ వ్యాపారి వల్ల వేల సంవత్సరాల నుంచీ సాగిన అరబ్ వ్యాపారం ఛిన్నాభిన్నమైంది.

ఆ వ్యాపారి ఇచ్చిన సమాచారంతో 1498 మే 20న వేల కిలోమీటర్లు ప్రయాణం చేసిన వాస్కో డి గామా తన నావికుల్లో ఎంతోమందిని పోగొట్టుకున్న తర్వాత చివరకు భారతదేశంలో కాలికట్ తీరాన్ని చేరుకోగలిగాడు.

ఆ సమయంలో ఐరోపా గురించి తెలియని కాలికట్ ప్రజలు వాస్కో డి గామాను.. తప్పిపోయి, అక్కడకు వచ్చిన క్రైస్తవ సన్యాసిగా భావించారు. పోర్చుగల్ నావికులు తీర ప్రాంతాల్లో ఉన్న ఆలయాల్లోకి వెళ్లి హిందూ దేవుళ్లు దేవతలను మేరీగా, ఏసుగా భావించి వాటి ముందు మోకరిల్లేవారు.

కాలికట్‌లో కష్టాలు తీసుకొచ్చిన బహుమతులు

కాలికట్‌లో సముద్ర రాజుగా చెప్పుకునే ఒక రాజు వాస్కో డి గామాకు ఘన స్వాగతం పలికారు. పల్లకిలో కూచోపెట్టి అతడిని రేవు నుంచి దర్బారుకు తీసుకెళ్లారు. కానీ ఆయన ఇచ్చిన బహుమతులు (ఎర్ర టోపీ, రాగి పాత్ర, కొన్ని కిలోల చక్కెర, తేనె) చూసి ఆగ్రహించారు.

స్థానిక అధికారి వాస్కో డి గామాను ఒక సముద్రపు దొంగేమో అనుకున్నాడు.

వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వాలని, తమకు పన్నులు విధించడం రద్దు చేయాలని కోరిన పోర్చుగీసు వారి వినతిని సముద్ర రాజు తిరస్కరించాడు. ఆ తర్వాత పోర్చుగీసు వారిపై ఆగ్రహంతో స్థానికులు వారిలో చాలా మందిని చంపేశారు కూడా.

దాంతో ఆగ్రహించిన వాస్కో డి గామా తన పడవల్లో ఉన్న ఫిరంగులతో కాలికట్‌పై గుళ్ల వర్షం కురిపించాడు. రాజమహలుతోపాటు ఎన్నో భవనాలు ధ్వంసం చేశాడు. దాంతో సముద్రరాజుకు దేశం లోపలికి పరుగులు తీయాల్సిన పరిస్థితి ఎదురైంది.

కానీ కాలికట్‌లో మూడు నెలలు ఉన్నవాస్కో డి గామాకు అక్కడి మార్కెట్లలో విలువైన మసాలు ఎంత చౌకగా లభించాయంటే.. వాటితో ఆయన తన పడవలన్నింటినీ నింపేశాడు.

ఫొటో సోర్స్, CIVITATES ORBIS TERRARUM

క్రైస్తవ ప్రపంచానికి మసాలాలు

వాస్కో డి గామాకు తిరుగు ప్రయాణంలో కష్టాలు చుట్టుముట్టాయి. సగం మంది నావికులు జబ్బు పడ్డారు. ఒక నౌక తుఫానులో చిక్కుకుని మునిగిపోయింది. చివరికి లిస్బన్ నుంచి వారు బయల్దేరిన రెండేళ్ల తర్వాత.. వేల కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత 1499 జులై 28వ తేదీన పోర్చుగల్ నావలు తిరిగి లిస్బన్ చేరుకున్నాయి. వారికి ఘన స్వాగతం లభించింది. (వాస్కో డి గామా తన సోదరుడు జబ్బు చేయడంతో ఒక ద్వీపంలోనే ఆగిపోయారు) ఆ 170 మంది నావికుల్లో 54 మంది మాత్రమే ప్రాణాలతో తిరిగి స్వదేశానికి చరుకున్నారు.

కింగ్ మాన్యువల్-2 ఆ విజయం గురించి వెంటనే యూరప్ అంతా తెలియాలని అనుకున్నారు. ఆయన స్పెయిన్ మహారాణి ఇసబెల్లా, కింగ్ ఫెర్డినాండ్‌కు లేఖ రాస్తూ "దేవుడి దయ వల్ల ఏ వ్యాపారం ముస్లింలను ధనవంతులుగా మార్చిందో.. ఇప్పుడు అది మా సామ్రాజ్యంలోని నౌకల్లో ఉంది. ఈ మసాలాలు మొత్తం క్రైస్తవ ప్రపంచానికంతటికీ చేరుస్తాం" అన్నాడు.

కానీ ఇక్కడ ఒక చిన్న దేశం వేల కిలోమీటర్ల దూరంలో భారీ స్థాయిలో ఉన్న వ్యాపార నెట్‌వర్క్‌ను ఎలా ధ్వంసం చేయగలదనే ప్రశ్న తలెత్తడం సహజం.

ఫొటో సోర్స్, Getty Images

వ్యాపారం ముసుగులో యుద్ధం

వాస్కో డి గామా తను కాలికట్‌లో ఉన్నప్పుడు అక్కడ ముస్లిం వ్యాపారులవి కనీసం 1500 నౌకలు లెక్కించారు. అందేకాదు.. ఒక ఆసక్తికరమైన విషయం కూడా గుర్తించారు. ఆ పడవల్లో ఆయుధాలేవీ ఉండేవి కావు. హిందూ మహాసముద్రంలో వ్యాపారం అంతా పరస్పర మార్పిడితో నడిచేది. అంటే రెండు వైపుల వారికీ ప్రయోజనం కలిగేలా రెవెన్యూ ఉండేది.

పోర్చుగీసువారు అలాంటి వ్యాపారం చేయాలని అనుకోలేదు. వాళ్ల లక్ష్యం.. బలం చూపించి గుత్తాధిపత్యం ప్రదర్శించడం. మిగతా వారిని తమ షరతులకు ఒప్పుకునేలా చేయడం.

పోర్చుగీసువారి ఆలోచన త్వరలోనే బయటపడింది. వాస్కో డి గామా అక్కడికి చేరిన ఆరు నెలల్లోనే పెడ్రో అల్వరెజ్ కాబ్రల్ నేతృత్వంలో మరో పోర్చుగల్ నౌకా దళం భారత్ వైపు బయల్దేరింది. ఈసారీ అందులో 13 నౌకలు ఉన్నాయి. వారు వ్యాపారం కంటే ఎక్కువగా యుద్ధ సన్నాహాలతోనే భారత్ వైపు బయల్దేరారు.

ఫొటో సోర్స్, BIBLIOTECA NACIONAL DE PORTUGAL

విధ్వంసమే లక్ష్యం

ప్రయాణానికి ముందు కాబ్రల్‌కు పోర్చుగల్ చక్రవర్తి ఒక లిఖిత సలహా ఇచ్చారు.

"మీకు సముద్రంలో మక్కా యాత్రికుల నౌకలు కనిపిస్తే, ఎలాగైనా వాటిని స్వాధీనం చేసుకోండి. వాటిలోని సరుకులు, సామాన్లు, స్వాధీనం చేసుకోండి. పడవల్లోని ముస్లింలను ఉపయోగించుకోండి. వారితో యుద్ధం చేయండి. వీలైనంత ఎక్కువ నష్టం కలిగించడానికి ప్రయత్నించండి" అని అందులో చెప్పారు.

నౌకా బలగంతో కాలికట్ చేరుకున్న కాబ్రల్ ముస్లిం వ్యాపారుల పడవలపై దాడి చేశాడు. సరుకులన్నీ దోచుకుని, వ్యాపారులు, నావికులు ఉన్న నౌకలన్నింటికీ నిప్పు పెట్టారు.

కాలికట్‌పై రెండు రోజుల వరకూ ఫిరంగి గుళ్లు పేల్చిన కాబ్రల్.. నగరంలో ఉన్న వారందరూ పారిపోయేలా చేశాడు. అంత విధ్వంసం సృష్టించిన కాబ్రల్ కొచ్చిన్, కన్నూర్ రేవుల్లో దిగినప్పుడు అక్కడి రాజులు భయపడిపోయారు. పోర్చుగీసు వారి షరతులకు ఒప్పుకుని, వారి వ్యాపార కేంద్రాలను అనుమతించారు.

తర్వాత మసాలాలతో నిండిన కాబ్రల్ నౌకలు తిరిగి పోర్చుగల్ చేరుకున్నప్పుడు.. లిస్బన్‌లో ఘనంగా సంబరాలు జరిగితే, వెనిస్‌ విషాదంలో మునిగిపోయింది.

ఒక చరిత్రకారుడు "ఇది వెనిస్‌కు అశుభవార్త. వెనిస్ వ్యాపారులు నిజంగా చాలా కష్టాల్లో చిక్కుకుపోయారు" అని రాశాడు.

ఫొటో సోర్స్, Getty Images

ఫిరంగుల నౌకలతో భయం భయం

అందరూ ఊహించిందే నిజమైంది. 1502లో వెనిస్ నౌక అలెగ్జాండ్రియా రేవుకు చేరినప్పుడు అక్కడ మసాలాలు దాదాపు కనిపించలేదు. వాటి ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి.

రెండోసారి వాస్కో డి గామా భారతదేశ యాత్ర చేసినపుడు ఆయన ఉద్దేశం వేరే. ఈసారీ వాస్కో ఆఫ్రికా తూర్పు తీరంలో ఉన్న నగరాలపై విచక్షణారహితంగా ఫిరంగు గుళ్లు పేల్చాడు. అక్కడి నుంచి సుంకం వసూలు చేశాడు. అక్కడి నుంచి వెళ్లి ఇక వ్యాపారం చేయకూడదని ముస్లిం వ్యాపారుల నుంచి మాట కూడా తీసుకున్నాడు.

భారతదేశానికి వెళ్తున్న వాస్కో డి గామా తన దారికి అడ్డుగా వచ్చిన నౌకలను ముంచేశాడు. ఆ సమయంలో హాజీలతో ఉన్న 'మీరీ' అనే ఒక నౌక వాస్కో డి గామా చేతికి చిక్కింది. ఆ సమయంలో అందులో 400 మంది యాత్రికులు ఉన్నారు. వారంతా కాలికట్ నుంచి మక్కా వెళ్తున్నారు.

వాస్కో డి గామా ఆ యాత్రికులందరినీ బంధించి నౌకకు నిప్పు పెట్టాడు. "ఆ నౌకలోని మహిళలు పిల్లలను చేతుల్లోకి తీసుకుని వదిలిపెట్టమని వేడుకున్నా వాస్కో డి గామా తన నౌక నుంచి తమాషా చూస్తూ ఉండిపోయార"ని ఆ ఘటనను గురించి చరిత్రకారులు చెబుతారు.

మలబార్ తీరంలో ఇప్పటికీ మీరీ నౌక ధ్వంసం గురించిన వివరాలు ఉన్నాయి. వాస్కో డి గామా విధ్వంసంతో ఆ ప్రాంతంలో పోర్చుగీసు వారంటే ఒక భయం ఏర్పడింది.

వాస్కో డి గామా తన లక్ష్యంలో పూర్తిగా విజయం సాధించాడు. ఈ వార్త సముద్ర మార్గంలో హిందూ మహాసముద్రం దాటి సుదూర ప్రాంతాలకు కూడా చేరిపోయింది.

భారత తీర పట్టణాల్లో పోర్చుగీసు ఫిరంగులకు, పోర్చుగీసు సైన్యానికి ఎదురు లేకుండా పోయింది. దాంతో మిగతా వ్యాపారులందరూ తమ వ్యాపారం వారి చేతికి అప్పగించారు.

సముద్ర మార్గంపై పట్టు లేని స్థానిక రాజులకు.. నౌకల్లో వచ్చే పోర్చుగీసువారిని ఎలా అడ్డుకోవాలో అర్థం కాలేదు.

సముద్ర దొంగల్లా దోపిడీలు

ఆసియాలో వాస్కో డి గామా వ్యాపారానికి బదులు సముద్రంలో దౌపిడీ చేస్తుంటే, పోర్చుగల్ మిగతా యూరోపియన్ దేశాలకు బలమైన ప్రత్యర్థిగా మారింది. వారు వ్యాపారంలో సైనిక బలాన్ని ఉపయోగించడం, సైనిక బలగాలతో కొత్త కొత్త వ్యూహాలు అమలు చేసేవారు.

మొత్తం హిందూ మహాసముద్రంపై పోర్చుగీసువారి గుత్తాధిపత్యానికి అది ప్రారంభం. స్థానిక రాజులు వారిని ఎలాగైనా అడ్డుకోవాలని ప్రయత్నించారు. కానీ ప్రతి యుద్ధంలోనూ వారికి ఓటమే ఎదురైంది.

ఫలితంగా మరో ఒకటిన్నర శతాబ్దంలోనే పోర్చుగీసువారు కన్నూర్, కొచ్చిన్, గోవా, మద్రాస్, కాలికట్‌తోపాటు ఎన్నో తీర ప్రాంతాలపై పట్టు సాధించారు. ఆయా ప్రాంతాల్లో తమ వైస్రాయ్‌లను, గవర్నర్లను నియమించారు.

మిగతా ఐరోపా దేశాలన్నీ దీనిని ఆసక్తిగా తిలకిస్తూ వచ్చాయి. తర్వాత నెదర్లాండ్స్, ఫ్రాన్స్, చివరికి ఆంగ్లేయుల ఈస్డిండియా కంపెనీ అదే కథను పునరావృతం చేశాయి.

పోర్చుగీస్ మాత్రం తమ ఆటను కొనసాగించింది. భారత్‌తోపాటు మొత్తం హిందూ మహాసముద్రాన్నే తమ గుప్పిట్లో పెట్టుకుంది. దక్షిణాసియాకు పూర్తి విముక్తి కలిగేవరకూ గోవా, దమన్, డయ్యూ మాత్రం పోర్చుగీసు వారి చేతుల్లోనే ఉండిపోయాయి. చివరికి 1961 డిసెంబర్లో భారత ప్రభుత్వం సైన్యాన్ని పంపించి పోర్చుగీసు వారి నుంచి ఈ ప్రాంతాలకు విముక్తి కల్పించింది.

ఫొటో సోర్స్, ARCHIVES OF THE UNIVERSITY OF THE WITWATERSRAND

మిరపకాయను పరిచయం చేశారు

కానీ అంతకు ముందు సుమారు ఒకటిన్నర శతాబ్దం వరకూ పోర్చుగీసు వారు భారత్ నుంచి గరం మసాలా, అల్లం, యాలకలు, లవంగాలు, బట్టలు తీసుకెళ్లేవారు. మలయా నుంచి దాల్చిని, చైనా నుంచి పట్టు, పాత్రలను ఐరోపాకు తరలించేవారు.

వాటితోపాటు యూరప్ నుంచి మద్యం, ఉన్ని, బంగారం ఇతర ఉత్పత్తులను ఆసియాలోని మిగతా ప్రాంతాల్లో అమ్మేవారు. అంతే కాదు.. ఆసియా, ఆఫ్రికాల్లోని చాలా ప్రాంతాలపై పెత్తనం చెలాయిస్తూ వ్యాపారుల నుంచి భారీ పన్నులు వసూలు చేసేవారు.

అదే సమయంలో అమెరికా ఖండం అన్వేషణ కూడా పూర్తైంది. అక్కడ స్పెయిన్‌తోపాటు పోర్చుగల్, ఇతర ఐరోపా దేశాలు కూడా కొత్త వ్యాపార కేంద్రాలు స్థాపించడం ప్రారంభించాయి.

పోర్చుగీసు వారు ఆ కొత్త ప్రపంచం నుంచి మొక్కజొన్న, బంగాళాదుంప, పొగాకు, పైనాపిల్, జీడిపప్పు, ఎండు మిరపకాయలు లాంటి పంటలను భారత్, ఇతర ఆసియా దేశాలకు పరిచయం చేశారు.

ఇప్పుడు భారతదేశంలో వంటల్లో మిరపకాయ భాగమైపోయింది. కానీ పోర్చుగీసువారు భారత్ రాక ముందు దాని గురించి ఎవరికీ తెలియదు.

దేశంలో కలగలిసిన పోర్చుగీసు భాష

పోర్చుగీసు వారి ప్రభావం సైనిక, వ్యాపార రంగాల్లో మాత్రమే కాదు దేశ సంస్కృతి, నాగరికతపై కూడా పడింది.

శతాబ్దాల వరకూ పోర్చుగీసు భాషను భారత్‌లోని రేవు పట్టణాల్లో మాట్లాడేవారు. డచ్, ప్రెంచ్, ఆంగ్లేయులు కూడా భారత్ వచ్చాక భారతీయుల నుంచి ఆ భాష నేర్చుకోవాల్సి వచ్చింది.

సిరాజుద్దౌలాను ఓడించిన లార్డ్ క్లైవ్ కూడా స్థానిక భారతీయులతో పోర్చుగీసులోనే మాట్లాడేవారు. ఆ భాష ప్రభావం స్థానిక భాషలపై కూడా పడింది. అందుకే దక్షిణాసియాలో 50కి పైగా భాషల్లో పోర్చుగీసు భాషా పదాలు కనిపిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images

సముద్రంపై ఆసక్తి చూపని మొఘలులు

1526లో బాబర్ భారత్‌లో మొఘల్ సామ్రాజ్యం స్థాపించే సమయానికే పోర్చుగీసు వారు దేశంలోని తీర ప్రాంతాలన్నింటిలో అడుగుపెట్టేశారు. అయితే మొఘలులు మధ్య ఆసియా నుంచి వచ్చారు. వారికి సముద్రం గురించి పూర్తిగా తెలీదు. అందుకే వారికి సముద్ర ప్రయాణంపై ఎలాంటి ఆసక్తీ లేకపోయింది.

పోర్చుగీసు వారు మొఘలులతో రాజకీయ సంబంధాలు ఏర్పరచుకునేందుకు అక్బర్, జహంగీర్, షాజహాన్ లాంటి వారికి రకరకాల బహుమతులు పంపేవారు.

ముఖ్యంగా యూరోపియన్ పెయింటింగ్స్ మొఘలులను చాలా ప్రభావితం చేశాయి. వాటి ప్రభావం మొఘలుల కాలం నాటి కళపై కూడా పడింది.

దక్షిణాసియాకు పోర్చుగీసు వారి వల్ల ఒక ముఖ్యమైన కళ కూడా అందింది. మనం ఇప్పుడు విని ఆనందించే బాలీవుడ్ సంగీతం కూడా పోర్చుగీసు వారి ప్రభావంతోనే పుట్టింది.

పోర్చుగీసు సంగీత విధ్వాంసుల ప్రభావం భారతదేశ సంగీత దర్శకులకు మ్యూజిక్‌, ఆర్కెస్ట్రా ఉపయోగం గురించి నేర్పించింది.

శంకర్ జైకిషన్, సి రామచంద్ర, ఓపీ నయ్యర్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ లాంటి సంగీత దర్శకుల బాణీల్లో మనకు పోర్చుగీసు సంగీత విద్వాంసుల శైలి వినిపిస్తుంది. అది ఒక గతించిన చరిత్రను గుర్తుచేస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)