చైనా ఆట కట్టించడానికి భారత్ ఏం చేయాలి: అభిప్రాయం

  • భరత్ కర్నాడ్
  • బీబీసీ కోసం
జిన్ పింగ్, మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ప్రస్తుతం అమెరికా ఉన్న స్థానాన్ని చేరుకోవాలని, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశంగా ఆవిర్భవించాలని అనుకుంటున్న చైనాకు కళ్లం వేయాలని, చాలా దేశాలు భావిస్తున్నాయి.

అమెరికా విదేశాంగ శాఖ పాలసీ, ప్లానింగ్ విభాగం మాజీ అధిపతి రిచర్డ్ హాస్ "మేనేజ్‌ చేయడం ద్వారా అలాంటి సంబంధాలు ఏర్పరుచుకోవచ్చని" రాశారు.

1962లో హిమాలయాల్లో జరిగిన యుద్ధం తర్వాత పొరుగు దేశంతో సంబంధాలను మేనేజ్ చేయడం అనేది భారత్‌కు కొత్త విషయం కాదు.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ అందుకున్న "హిందీ-చీనీ భాయీ భాయీ" రాగానికి ఈ యుద్ధం తర్వాత దిల్లీ నీళ్లొదిలేసింది.

కానీ కాలం గడిచేకొద్దీ ఈ సంబంధాలను నిర్వహించడం కష్టంగా మారుతోంది. ఎందుకంటే చైనా వ్యూహాత్మకంగా తన ప్రణాళికలను బలోపేతం చేస్తోంది.

మిగతా దేశాలతో స్నేహంగా ఉండడానికి, లక్ష్యంగా చేసుకున్న దేశాలను ప్రభావితం చేయడానికి చైనా దగ్గర భారీ వనరులు ఉన్నాయి. వాటి ద్వారా అది మరింత ముందుకు వెళ్తోంది.

ఫొటో సోర్స్, Getty Images

చైనా వ్యూహం ఏమిటి

హిందూ మహాసముద్రంలో ఆసియా సముద్ర తీర దేశాలు చైనా బలం పెరగకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. కానీ, కొన్ని బలహీన దేశాలు చైనా అందిస్తున్న సాయానికి, సరళ షరతులతో ఇస్తున్న రుణాలకు, నాణ్యమైన మౌలిక సదుపాయాలు లాంటి ఆఫర్ల నుంచి తప్పించుకోవడం కష్టం.

ఇది అత్యున్నత స్థాయి "రుణ ఆధారిత దౌత్యం". ఆ విషయంలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఉన్న జపాన్, భారత్ సహా ఏ దేశం కూడా చైనాతో పోటీపడలేదు.

అది వేరే విషయం, ఇక చైనా శ్రీలంకలో ఉన్న హంబన్‌టోటా రేవును గుర్తించింది. అధిక వ్యయంతో కూడిన ఆ ప్రాజెక్టుతో శ్రీలంకకు ఎదురైన సమస్యలను దూరం చేయడానికి ఆ దేశానికి రుణం ఇచ్చింది. చివరకు అది చైనా కంపెనీకి ఆ రేవును 99 ఏళ్లు లీజుతో అప్పగించేలా చేసింది.

మిగతా దేశాలకు ఇది గుణపాఠమైంది. శ్రీలంకలా కాకుండా మయన్మార్, మలేసియా, థాయ్‌లాండ్ తమ దేశంలో చైనా రుణాలతో నిర్మిస్తున్న ప్రాజెక్టులను పూర్తి చేశాయి, లేదంటే తగ్గించేశాయి. పాకిస్తాన్‌ కూడా చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ తమకు వరం అనుకుంది. కానీ ఆ దేశంలో ఎక్కువమంది మాత్రం రుణాన్ని చైనా ఉచ్చుగా భావిస్తున్నారు. అందులో తమ దేశం పడుతోందని అనుకుంటున్నారు.

తమ ఆధిపత్యం చూపించుకోడానికి చైనా ఆర్థికంగానే కాదు, యుద్ధతంత్ర లక్ష్యాలను నెరవేర్చుకోవడంపైనా దృష్టి పెట్టింది. దానినే చైనా వ్యూహకర్తలు 'మలక్కా డైలమా' అంటున్నారు.

హిందూ మహాసముద్ర మార్గంలో జరిగే తమ 80 శాతం వ్యాపారాన్ని రక్షించుకోవడం చైనాకు చాలా అవసరం. ఈ మార్గం మలక్కా, లాంబక్, సుండా జలసంధుల "చెక్ పాయింట్స్" నుంచి వెళ్తుంది.

ప్రస్తుతం వాటిని దేశంలోని తూర్పు తీరంలో, అండమాన్ నికోబార్ ద్వీపాల్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ ద్వారా భారత నావికా దళం సమర్థంగా నియంత్రిస్తోంది.

అందువల్ల.. చైనా రేవు పట్టణాలు, సముద్ర స్థావారాలు ఎందుకు వెతుకుతోందనేది సులభంగా అర్థం చేసుకోవచ్చు.

అందుకే చైనా ఉత్తర-దక్షిణ రోడ్, రైల్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టింది. మయన్మార్‌ బంగాళాఖాతంలోని చాక్‌ప్యూ, పాకిస్తాన్‌ అరేబియా సముద్రంలోని గ్వాదర్‌ను ఏళ్ల తరబడి రేవు పట్టణాలుగా ఉపయోగించవచ్చని భావించింది.

ఫొటో సోర్స్, Getty Images

చైనాను ఎలా అడ్డుకోవచ్చు

చైనా ఆడుతున్న ఈ ఆటను ఆపలేం అనుకుంటే, ఆ ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి.

నిజానికి దీనికి నివారణ మాత్రమే పరిష్కారం. భారత్ సహా మిగతా తీర దేశాలు, పలు ఇతర దేశాలన్నీ ఒకే రక్షణ బృందాన్ని ఏర్పాటు చేసి బలమైన వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.

భారత సైన్యం ఒమన్‌లోని దుకమ్, ఆఫ్రికా జిబుతిలో 'ఫ్రాన్స్ బేస్' హెరాన్, సీషెల్స్, మాల్దీవులు, శ్రీలంకలోని ట్రింకోమాలీ వరకూ చేరుకోగలదు. ఇప్పుడు భారత నౌకా దళం సుమత్రా రేవు సబాంగ్, మధ్య వియత్నాంలో ఉన్న నాథరాంగ్‌ దగ్గర కూడా బలోపేతం కావల్సిన అవసరం ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images

వియత్నాం ఈ రేవును భారత నావికా దళం ఉపయోగించుకోడానికి ఇస్తామంటూ ముందుకొచ్చింది. మన దేశంతో సంయుక్త ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ సేకరణకు స్టేషన్ ఏర్పాటు చేసుకునే విషయం కూడా ప్రస్తావించింది. దీని ద్వారా హైనాన్ ద్వీపంలో చైనా నౌకాదళం ముఖ్య స్థావరమైన సాన్యాపై భారత్ నిఘా పెట్టవచ్చు.

సైనిక స్థావరాల ఈ వరుసలో భారత నౌకాదళం స్థానిక నౌకాదళంతో కలిసి ఒక క్రమబద్ధమైన, కఠిన అభ్యాసం చేయాల్సి ఉంటుంది.

అప్పుడే మూడు జలసంధులకు రెండు వైపులా ఎంత బలాన్ని కూడదీసుకున్నా సమస్యలు తప్పవని బీజింగ్‌కు తెలిసొస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images

భారత్ తన బ్రహ్మోస్ క్రూజ్ మిసైళ్లను వియత్నాం, ఇలాంటి మిసైళ్ల కోసం చూస్తున్నమిగతా దేశాలకు కూడా భారీ మొత్తంలో అందించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. దాంతో చైనా దక్షిణ సముద్రంలోని దళాలు, హిందూ మహాసముద్రలోని రహస్యంగా ఉన్న నాలుగో దళాలకు కచ్చితంగా కళ్లెం వేయవచ్చు.

దానివల్ల దక్షిణ చైనా సముద్రంలో చైనా గుత్తాధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్న దేశాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇప్పటివరకూ ఇలాంటి యుద్ధతంత్ర కూటమిని లేదనే భావించారు.

ఇది పరస్పర సహకారంపై ఆధారపడిన నౌకాదళ వ్యూహం. దీనిని భారత ప్రభుత్వ 'థియేటర్ స్విచింగ్' వ్యూహంతో పోల్చిచూస్తే దానికంటే మెరుగైనది. భారత్ థియేటర్ స్విచింగ్ వ్యూహం అస్థిరంగా ఉంది. కానీ ఈ కొత్త వ్యూహం అమలు చేయడం వల్ల 4,700 కిలోమీటర్ల పొడవున్న వాస్తవాధీన రేఖపై చైనా ఆధిపత్యం తగ్గిపోతుంది.

ఫొటో సోర్స్, Getty Images

భారత్ వ్యూహం మార్చాల్సి ఉంటుంది.

నిజానికి బీజింగ్ భారత నౌకాదళం, సైన్యంపై ఒకేసారి ఆధిపత్యం చూపించాలని చూస్తోంది. అవసరమైతే, తగిన మౌలిక సదుపాయాలను మెరుగుపరచి సుదూర ఎయిర్ స్ట్రిప్స్ కూడా శాశ్వత స్థావరాలుగా మార్చగలమని, టిబెట్‌లో తన వైమానిక దళాన్ని, మిసైళ్లను మోహరించడం పెంచవచ్చని భావిస్తోంది.

దీనికి భారత్ దగ్గర సరైన సమాధానం ఏదీ లేదు. పర్వతాలపై దాడి చేయగల ఒకే ఒక దళాన్ని భారత్ అభివృద్ధి చేస్తోంది. వారికి తేలికపాటి ట్యాంకులకు బదులు, మైదాన ప్రాంతాల్లో దాడికి ఉపయోగించే ఆయుధాలను అందిస్తోంది.

ఇకఈ విషయంలో డోనల్డ్ ట్రంప్ నేతృత్వంలో అమెరికాను కూడా నమ్మలేం. సిరియా, అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సైన్యం హఠాత్తుగా తిరిగివెళ్లడం, జనరల్ జేమ్స్ మాటిస్ పెంటగాన్ నుంచి హఠాత్తుగా తప్పుకోవడం లాంటివి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, సదరు ఆసియా దేశాలను పునరాలోచనలో పడేసాయి. అవన్నీ ఇన్నాళ్లు తమను అమెరికా కాపాడుతుందన్న నమ్మకంలో ఉండేవి.

ట్రంప్ నాటో స్థాయిని తగ్గించారు. దక్షిణ కొరియాతో సైనిక సహకారం తగ్గించారు. అమెరికా తన మిత్రులు, సహచరుల సంక్షేమం విషయంలోనూ చూసీచూడనట్టు వ్యవహరిస్తోంది. ఇవన్నీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కోరిక ప్రకారమే జరుగుతున్నాయి.

1947 తర్వాత ఇప్పుడు మిత్రులతో, సహచర ప్రజాస్వామ్య దేశాలతో అమెరికా సంబంధాలు కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ఆ దేశంపై నమ్మకం ఉంచలేం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)