కుమారస్వామి కొత్త వివాదం: ‘నిర్దాక్ష్యిణ్యంగా కాల్చిపారేయండి’.. పోలీస్ అధికారికి కర్నాటక సీఎం ఫోన్

  • ఇమ్రాన్ ఖురేషీ
  • బీబీసీ కోసం
కుమారస్వామి

ఫొటో సోర్స్, MANJUNATH KIRAN/GettyImages

కర్నాటక ముఖ్యమంత్రి, జనతాదళ్(సెక్యులర్) నేత కుమారస్వామి తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు.

తమ పార్టీ నాయకుడి హత్యపై పోలీసు అధికారితో కుమారస్వామి ఫోన్లో మాట్లాడుతూ హంతకులను ''కాల్చి చంపండి, నిర్దాక్షిణ్యంగా' అని ఆవేశంగా చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

మాండ్యా జిల్లాలోని మద్దూరు తాలూకాలో జేడీఎస్ నేత హెచ్.ప్రకాశ్‌(48) హత్యకు గురయ్యారు. ఆయన్ను దుండగులు నరికి చంపారు. దానిపై పోలీసులతో మాట్లాడుతూ కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images

ఘటనా స్థలాన్ని సందర్శించాక విజయపురి జిల్లాలో హెలికాప్టర్ ఎక్కడానికి ముందు కుమారస్వామి ఓ పోలీస్ అధికారితో మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ- ''ఆయన చాలా మంచివారు. ఆయన్నెవరు చంపారో నాకు తెలియదు. మీరు ఈ కేసును మీరే చూస్తున్నారని నాకు తెలియదు. ఇది మీ బాధ్యత. నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేయండి వాళ్లను. ఏ సమస్యా రాదు. ఏం భయం లేదు'' అని కుమార స్వామి అన్నట్లుగా వీడియోలో ఉంది.

మద్దూరు తాలూకాలో ఇంతకుముందు రెండు మూడు హత్యలు జరిగాయని, ఈ విషయం పోలీసులకు తెలిసే ఉంటుందని సదరు పోలీసు అధికారితో ముఖ్యమంత్రి అన్నారు.

హత్యకు గురైన ప్రకాశ్ సీఎం కుమారస్వామికి బాగా సన్నిహితులు. మాండ్యా జిల్లాలో జేడీఎస్ విజయానికి ప్రకాశ్ కృషే ప్రధాన కారణం.

ప్రకాశ్ హత్యతో వెంటనే స్థానికంగా బంద్ జరిగింది. బెంగళూరు-మైసూరు జాతీయ రహదారిపై కొన్ని గంటలపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

వివాదాస్పదమైన తన వ్యాఖ్యలపై కుమారస్వామి తర్వాత ట్విటర్‌లో వివరణ ఇచ్చారు. ''పోలీసు అధికారి నుంచి నేను సమాచారం సేకరించేటప్పుడు ఉద్వేగంతో వచ్చిన స్పందన అది. అదేమీ పోలీసు అధికారికి ఇచ్చిన ఆదేశమేమీ కాదు. ఆ వ్యాఖ్యల గురించి చిలువలు పలువలు చేయాల్సిన అవసరం లేదు'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

కాంగ్రెస్ మాజీ సీఎం సిద్ధరామయ్య, కుమార స్వామి

పోలీసు అధికారితో కుమారస్వామి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది.

ముఖ్యమంత్రివి బాధ్యతారహిత వ్యాఖ్యలని, ఆయన క్షమాపణ చెప్పాలని బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు, శాసనసభలో ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప డిమాండ్ చేశారు.

రైతులు చనిపోయినప్పుడు ఎలాంటి ఉద్వేగానికి లోనవని, ప్రభుత్వ అధికారులు హత్యకు గురైనప్పుడు స్పందించని, భారీ అవినీతిని పట్టించుకోని, దళితులను బానిసత్వంలోకి నెట్టడంపై నోరువిప్పని సీఎం కుమారస్వామి.. జీడీఎస్ నేత హత్యకు గురైతే మాత్రం దుండగులను కాల్చి చంపేయండని పోలీసులను ఆదేశించారని కర్ణాటక బీజేపీ ట్విటర్‌లో విమర్శించింది.

గత నెల్లో బెళగావిలో సువర్ణ సౌధ గేట్ల తాళాలు బద్దలు కొట్టడానికి ప్రయత్నించిన రైతులపై కుమారస్వామి చేసిన వ్యాఖ్యలూ వివాదాస్పదమయ్యాయి.

''వాళ్లను ఎవరైనా రైతులంటారా? నా సహనానికీ ఓ హద్దుంది. మా ప్రభుత్వం రైతుల కోసం పాటుపడుతోంది. వాళ్లు తమ చేష్టలతో రైతులను అవమానిస్తున్నారు'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

కుమారస్వామి తండ్రి దేవెగౌడ ఆచితూచి మాట్లాడతారనే పేరుంది.

చక్కెర కర్మాగారాలు నాలుగేళ్లుగా బకాయిలు చెల్లించడం లేదని, రైతుగా తానెంతో బాధపడుతున్నానంటూ ఒక మహిళ చెప్పుకొన్న సమస్యపై కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. ''తల్లీ నేను ముఖ్యమంత్రి అయ్యింది ఐదు నెలల కిందటే. ఈ సమస్య వల్ల నువ్వు నాలుగేళ్లుగా బాధపడుతున్నావు. ఈ నాలుగేళ్లూ ఎక్కడ నిద్రపోతున్నావు'' అని కుమారస్వామి ఒక బహిరంగ సభలో అన్నారు.

కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం నడపడం, ఇతర రాజకీయ అంశాల్లో వివిధ సందర్భాల్లో కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

కుమారస్వామి తండ్రి, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ ప్రతి మాట ఆచితూచి మాట్లాడతారనే పేరుంది. కుమారస్వామి మాటతీరు తండ్రి మాటతీరులా ఉండదనే విమర్శలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)