‘తూర్పుగోదావరి జిల్లాలో ఆవుపై అత్యాచారం జరగలేదు’: జిల్లా పోలీసు కార్యాలయం

‘తూర్పుగోదావరి జిల్లాలో ఆవుపై అత్యాచారం జరగలేదు’: జిల్లా పోలీసు కార్యాలయం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తూర్పు గోదావ‌రి జిల్లా పిఠాపురం మండ‌లం గోకివాడలో ఆవుపై లైంగిక దాడి జరిగినట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్త ఆ గ్రామంలో కలకలం రేపింది. కానీ ఈ విషయంలో దర్యాప్తు చేసిన పోలీసులు.. ఆవుపై అత్యాచారం జరగలేదని ప్రకటించారు.

ఇందులో వాస్తవాన్ని తెలుసుకునేందుకు బీబీసీ ప్ర‌య‌త్నం చేసింది. ఆవు యజమాని, స్థానిక గోపాలమిత్ర, పశువైద్యుడితో మాట్లాడింది.

గోకివాడలోని నామా బుచ్చిరాజు అనే రైతు ఈ నెల 22న రాత్రి తన ఆరు ఆవుల‌ను పశువుల పాక‌లో క‌ట్టేసి ఇంటికి వ‌చ్చారు. మళ్లీ మరుసటి రోజు ఉదయం వెళ్లి చూస్తే అక్కడ ఆవులు క‌నిపించ‌లేదు.

దీంతో తన కుమారుడు, మరికొందరు గ్రామస్తులతో కలిసి ఊరంతా వెతికారు. అయినా ఆవుల జాడ తెలియరాలేదు.

సమీప గ్రామాల వారికి ఫోన్ చేయగా తెల్ల‌వారుజామున తమ ఊరు నుంచి వెళ్లిన వ్యానులో ఆవులు కనిపించాయని చెప్పారు.

'ఆవుపై లైంగిక దాడి జరిగిందని చెప్పారు'

దీంతో ఆవులను ఎవరో దొంగిలించారేమోనని బుచ్చిరాజు భావించారు. దగ్గర్లో ఉన్నప‌శువుల సంత‌ల గురించి ఆరా తీశారు. ఈలోగా తెల్ల‌వార‌డంతో గ్రామానికి కొంచెం దూరంలో చెట్టుకి క‌ట్టేసి ఉన్న ఒక ఆవు ఆయనకు క‌నిపించింది.

'ద‌గ్గ‌ర‌కు వెళ్లి చూసే సరికి చెట్టుకు క‌ట్టిన ఆవు తీవ్ర ర‌క్త‌స్రావంతో ఉంది. చ‌నిపోయింద‌నుకున్నాం. దానిని క‌దిపేందుకు ప్ర‌య‌త్నించగా కొన ఊపిరితో ఉన్న‌ట్టు క‌నిపించ‌డంతో వెంట‌నే గోపాల‌మిత్ర‌ (ప‌శుసంవ‌ర్థ‌క శాఖకు అనుబంధంగా పనిచేసే గ్రామస్థాయి సహాయకులు)ని పిలిచాం' అని బుచ్చిరాజు బీబీసీకి తెలిపారు.

తాను వెళ్లేస‌రికి ఆవు ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉంద‌ని గోపాలమిత్ర గంగ‌రాజు బీబీసీకి తెలిపారు. మ‌ల్లాం ప‌శువైద్య‌శాల డాక్ట‌ర్ తిరుమ‌ల రావు సూచ‌న‌ల ప్ర‌కారం ఆవుకు కాల్షియం అందించి, యాంటీ బ‌యోటిక్ స‌హా ప్రాథమిక చికిత్స అందించిన‌ట్టు తెలిపారు.

‘ఆవుపై ఎవ‌రో లైంగిక దాడుల‌కు పాల్ప‌డిన‌ట్టు స్థానికులు చెప్పారు. ఆ స‌మాచారాన్ని డాక్ట‌ర్‌ తిరుమల రావుకు తెలియజేశాను. ఆయన గోకివాడ వెళ్లారా లేదా అన్న‌ది నాకు తెలియ‌దు, ఆవు కొంత కోలుకోవడంతో నేను వెన‌క్కి వచ్చాను’ అని ఆయన బీబీసీకి చెప్పారు.

అత్యాచారం అవాస్తవం: పోలీసులు

ఈ నేపథ్యంలో విచారణ ప్రారంభించిన పోలీసులు డిసెంబర్ 27 గురువారంనాడు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అందులో..

‘‘గోవుపై జరిగిన దాడి జరిగిందంటూ ఫిర్యాదు అందింది. ఈ విషయమై 1960 చట్టం కింద కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టాం. దర్యాప్తులో భాగంగా ఆవును పశువైద్యాధికారికి చూపించాం. ఆవును పరిశీలించిన వైద్యులు అత్యాచారం జరగలేదని ధృవీకరిస్తూ ‘ఊండ్ సర్టిఫికేట్’ ఇచ్చారు’’ అని కాకినాడ పోలీసు కార్యాలయ ప్రకటన తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)