‘లేడీస్ హాస్టల్ తలుపులు 24 గంటలు తెరుచుకుంటే... నాకు భయం వేస్తోంది. ఎందుకు?’: అభిప్రాయం
- ఆరిష్ ఛాబడా
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
‘ఆమెకూ నాలాగే రెండు కాళ్లూ, రెండు చేతులూ ఉంటాయని తెలుసు. తనక్కూడా నాలాగే భావోద్వేగాలు ఉంటాయని తెలుసు. కానీ.. ఆమె ఆమెగా ప్రవర్తిస్తే ఏం చేయాలో నాకు తెలీదు’
అక్కచెల్లెళ్లు ఉంటే చాలు.. మహిళల గురించి మాట్లాడటానికి లైసెన్స్ వచ్చినట్లేనని చాలామంది మగవాళ్లు భావిస్తారు. మహిళల గురించి కామెంట్ చేయడానికి తమ తోబుట్టువును ఓ అర్హతగా భావిస్తారు.
నాకూ ముగ్గురు అక్కలు ఉన్నారు. నాకూ అలాంటి లైసెన్స్ దొరికింది. కానీ ఈ బ్లాగ్ రాస్తున్నపుడు నేను నిస్పక్షపాతంగా వ్యవహరించాలి.
ఆమెకు ఎంత ధైర్యం?
నేను మాట్లాడుతోంది కనుప్రియ గురించి. కొన్ని నెలల క్రితం పంజాబ్ యూనివర్సిటీ క్యాంపస్ స్టూడెంట్స్ కౌన్సిల్ మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికై, పురుష లోకాన్ని ఆమె.. నిరాశపరిచింది. తన విజయం.. మహిళల విజయమని, సమానత్వం సాధించిన విజయమని ఆమె అంటోంది.
పంజాబ్ యూనివర్సిటీ హాస్టల్లో మహిళా విద్యార్థుల రాకపోకలపై ఉన్న నిబంధనలపై ఆమె పోరాడింది. చివరకు.. ఏ సమయంలోనైనా అంటే 24/7.. హాస్టల్ విద్యార్థినులు స్వేచ్ఛగా బయటకు వెళ్లిరావడానికి హక్కును సాధించింది.
మగవాడు తన పురుషత్వాన్ని ప్రదర్శించడానికి నగర వీధులు ప్రధాన వేదికలు. మరి వీధులన్నీ ఆడవాళ్లతో నిండిపోతే మగవారి గతేంకాను? మేం మా పురుషత్వాన్ని ఎక్కడ ప్రదర్శించాలి?
ఇంతకాలం అమ్మాయిలు హాస్టల్ గదులకే పరిమితం అయ్యారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఆడపిల్లలు నిర్భయంగా వీధుల్లోకి వస్తే మగవాడు ఏం చేయాలో తెలీదు. అసలే దేశంలో నిరుద్యోగం ఎక్కువగా ఉంది. అలా రోడ్డుపైకి వెళ్దామంటే వెళ్లలేని పరిస్థితి.. ఇప్పుడు ఏ పనీ లేదు!
ఫొటో సోర్స్, Facebook/KanuPriya
హాస్టల్లో మహిళా విద్యార్థుల రాకపోకలపై ఉన్న నిబంధనలపై కనుప్రియ పోరాడారు. ఏసమయంలోనైనా హాస్టల్ విద్యార్థినులు స్వేచ్ఛగా బయటకు వెళ్లి వచ్చే హక్కును సాధించారు
'సమానత్వం అన్నది చాలా గొప్పది..' ఆగండాగండి తోటి పురుషుల్లారా.. నన్ను తప్పుగా అనుకోకండి. మనందరిదీ ఒకటే దారి. చెబుతా వినండి..
అందరి మహిళల్లాగే నా ముగ్గురు అక్కయ్యలపై కూడా ఆంక్షలు ఉన్నాయి. వారి భద్రత కూడా నాకు ముఖ్యం.
మా అక్కయ్యల ముందు తమ పురుషత్వాన్ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉండే నా తోటి మగవాళ్ల నుంచి వారిని కాపాడుకోవడానికి నేనెప్పుడూ తోడుగా వెళ్లేవాడిని. నేనే వారికి రక్షణ కవచం! అలాంటి సమయాల్లో నా తోటి పురుషులకు నేనొక సవాలుగా ఉండేవాడిని.
ప్రపంచంలో సమానత్వాన్ని కాపాడేందుకు నా ముగ్గురు అక్కయ్యలూ, ఎప్పుడూ, ఎక్కడా, ఏరోజూ.. ఒంటరిగా వెళ్లింది లేదు. సమానత్వం పాటించేందుకు నన్నూ వాళ్లతోపాటే తీసుకుపోయేవాళ్లు.
ఫొటో సోర్స్, Getty Images
‘తమకు ఇష్టమొచ్చిన బట్టలు వేసుకునే హక్కు కావాలంటారు, అసలు.. జీవితంలో పొరబాట్లు చేయడానికే హక్కు కావాలనీ అడుగుతారు..!’
నాకెంతో... కోపం
హాస్టళ్లలోకి వచ్చిపోవడానికి కాల నిబంధనలను తొలగిస్తూ పంజాబ్ యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయంపై నాకు చాలా కోపంగా ఉంది. ఎందుకంటే.. ఇప్పుడేమో ఏ సమయంలోనైనా హాస్టల్‌కు రావచ్చు, పోవచ్చు అంటున్నారు.
ఇలాంటి హక్కులు అలానే కొనసాగితే రేపు.. తమకు ఇష్టమొచ్చిన బట్టలు వేసుకుంటాం అంటారు, జీవిత భాగస్వామిని ఎన్నుకోవడానికీ స్వేచ్ఛ కావాలంటారు.
అసలు ఒక వ్యక్తితో కలిసి బతకడమే ఇష్టం లేదనవచ్చు కూడా! ఇంకా.. జీవితంలో పొరబాట్లు చేయడానికే తమకు హక్కు కావాలనీ అడగవచ్చు.
పంజాబ్ యూనివర్సిటీ హాస్టల్ ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకుని అందరు మహిళలూ ప్రతి ఒక్క హక్కునూ పొందాలని భావిస్తారు. అది చాలా భయంకరంగా ఉంటుంది మిత్రులారా!
పెళ్లి చేసుకున్నాక ముసలి తల్లిదండ్రులను వదిలి, మేం అత్తగారింటికి ఎందుకు వెళ్లాలి? మా ఆయనకు ఉన్నట్లే మాకూ తల్లిదండ్రులపై ప్రేమ ఉంటుంది కదా.. అని ప్రశ్నిస్తే?
బయటికి వెళ్లొద్దండి.. పరిస్థితులు బాగోలేవు అని ఎవరైనా ఆడపిల్లలకు చెబితే, ’ఇల్లాజికల్..’ అని కొట్టిపారేస్తూ..
'బయట.. పురుషులతో సమానంగా మహిళలు లేరు కాబట్టే మాకు రక్షణ లేదు. ఆ ఖాళీని భర్తీ చేసేందుకే మేం వెళ్తున్నాం..’ అంటున్నారు.
వీరు కోరుకున్నట్లు పురుషులతోపాటుగా, లేక పురుషుల కంటే ఎక్కవగా మహిళలే రోడ్లపైకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? మీసం దువ్వుతూ కన్నుగీటే మగవాళ్ల పరిస్థితి ఏమిటి?
ఫొటో సోర్స్, Facebook/KanuPriya
చండీఘర్ గెడీ రోడ్డుపై 2017 మార్చి నెలలో ఓరోజు రాత్రి 11 నుంచి 1గంట వరకూ వందలాది మంది మహిళలు ర్యాలీ నిర్వహించారు
'స్వేచ్ఛా మార్గం'
చంఢీఘర్‌లోని 'గెడీ రోడ్డు' ప్రాంతానికి ‘పురుషుల అడ్డా’గా పేరుంది. ధనికులు నివసించే ప్రాంతం గుండా వెళ్లే ఆ మార్గంలో తరచూ మహిళలపై వేధింపులు జరుగుతుంటాయి.
ఇందుకు నిరసనగా, గెడీ రోడ్డుపై 2017 మార్చి నెలలో ఓరోజు రాత్రి 11 నుంచి 1గంట వరకూ వందలాది మంది మహిళలు ర్యాలీ నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో నిలబడ్డానికి, నడవటానికి పురుషులతోపాటు తమక్కూడా సమాన హక్కు ఉందని పాటలు పాడుతూ ప్రదర్శన చేశారు.
ఆ ప్రదర్శన తర్వాత ఆ రోడ్డు పేరును 'ఆజాద్ మార్గ్'(స్వేచ్ఛా మార్గం)గా మార్చాలని వారు డిమాండ్ చేశారు. కానీ పేరు మారినంత మాత్రాన అన్నీ మారిపోతాయా?
ఫొటో సోర్స్, Getty Images
ఢిల్లీలో 2018 సెప్టెంబర్ 9వ తేదీ అర్థరాత్రి నిర్వహించిన ఫియర్ లెస్ రన్ కార్యక్రమంలో పాల్గొన్న యువతులు
అదే జరిగితే..?
ఒకవేళ మహిళలే నగర వీధులన్నిటినీ ఆక్రమిస్తే, ఏంచేయాలో ఒక మగవాడిగా నాకు తెలీదు. ఎందుకంటే అలాంటి పరిస్థితి ఇంతవరకూ నాకు ఎదురుకాలేదు.
అప్పుడు వీధుల్లో.. మహిళలు ఏం చేస్తారు? మనల్ని చూసి కామెంట్ చేస్తారా? ఓరగా చూసి కన్నుగీటుతారా? మగాడిని వెంబడిస్తారా? లేక ఓరచూపులు, కొంటెచూపులు అన్నవి స్త్రీపురుషుల మధ్య చాలా సహజంగా మారిపోతాయా??
పంజాబ్ యూనివర్సిటీ హాస్టల్ తలుపులు 24గంటలూ తెరుచుకున్నపుడు అసలు ఈ మహిళలు ఏం చేస్తారు?
బహుశా అర్ధరాత్రి పూట.. బస్టాండ్ దగ్గర ఉండే పరాఠా హోటల్‌కు వెళతారేమో.. కానీ అంత రాత్రిపూట తమ హోటల్‌కు వచ్చిన మహిళా కస్టమర్లు ఎలాంటి వంటలు తింటారో పాపం ఆ హోటల్వాడికి ఎలా తెలుస్తుంది?
అర్ధరాత్రిపూట పురుషులకే కానీ ఆడవాళ్లకు వండిపెట్టిన అనుభవం ఆ హోటల్‌కు ఉండదు కదా! పురుషుల్లాగే వీళ్లు కూడా అవే పదార్థాలు తింటారా? లేక మెనూ ఏమైనా మారుతుందా?
ఫొటో సోర్స్, Getty Images
దిల్లీలో జరిగిన పియర్ లెస్ మిడ్నైట్ రన్లో పాల్గొన్న యవతులు
ఆమె ఆమెగా మారితే?
ఆడవాళ్లక్కూడా నాలాగే రెండు కాళ్లూ, రెండు చేతులూ ఉంటాయని తెలుసు. వాళ్ళలో కూడా నాలో ఉన్నట్లే ప్రతిస్పందనలు, భావోద్వేగాలు ఉంటాయని తెలుసు. కానీ.. ఎపుడైనా ఓ మహిళ తాను తనుగా ప్రవర్తిస్తే ఏం చేయాలో, నేనెలా ప్రవర్తించాలో నాకు తెలీదు. ఎందుకు?
నేనొక సుశిక్షుతుడైన, ఆధిపత్యం ప్రదర్శించే ఓ భారతీయ పురుషుడిని.
పురుషులతో సమాన హోదా మహిళాలోకానికి వస్తే నేను ఏం చేస్తాను?
మహిళలకు వ్యతిరేకంగా ఇలాంటి వ్యాసాలు రాసి, ఇదంతా తూచ్.. అని పగలబడి నవ్వేస్తానా?
లేకపోతే పురుషాధిక్యానికి మద్దతు ఇచ్చినందుకు అపుడు నాకు శిక్ష వేస్తారా?
అసలు.. వ్యాసాలు స్త్రీపురుషుల మధ్య సమానత్వాన్ని పాటిస్తాయా? స్త్రీపురుష లింగభేదాలకు అతీతంగా ఓ వ్యక్తిని ఉదహరించేటపుడు సదరు వ్యక్తికి తడుముకోకుండా పురుషత్వాన్ని ఆపాదించగలనా?
మా అక్కయ్య కొడుకు ఏడిస్తే, 'ఆడపిల్లలా ఏడవ్వొద్దు..' అని ధైర్యంగా అనగలనా?
ఇవన్నీ జరగాలంటే ఇంకా చాలా సమయం ఉంది.. అందుకే కనుప్రియను నమ్మవద్దు.. నన్ను నమ్మండి.
‘ఎందుకంటే, నాకు ముగ్గురు అక్కయ్యలు...’
ఇవి కూడా చదవండి
- ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం సాధ్యమేనా?
- వాజ్‌పేయి మాటల్ని నెహ్రూ ఎందుకంత శ్రద్ధగా వినేవారు?
- వాస్కోడిగామా: భారతదేశాన్ని వెతకాలనే కోరిక వెనుక అసలు కారణం ఇదీ..
- చైనా ఆట కట్టించాలంటే భారత్ ఏం చేయాలి
- శక్తి టీమ్స్: పోలీస్ శాఖలో మహిళా శక్తి
- YouTube Stars: అమ్మాయిల కోసం, అమ్మాయిల చేత, అమ్మాయిలతో.. ‘గాళ్ ఫార్ములా’
- #MeetToSleep: దిల్లీ అమ్మాయిలు పార్కుల్లో ఒంటరిగా ఎందుకు పడుకుంటున్నారు?
- ఆన్లైన్లో అమ్మాయిలు.. ఈ ఒంటరితనానికి పరిష్కారమేంటి
- అమ్మాయిలంతా డాక్టర్లు, ఇంజనీర్లే ఎందుకు కావాలి?
- BBC Special: చైనా పెళ్లిళ్ల సంతలో ‘మిగిలిపోయిన అమ్మాయిలు’
- వీళ్లకు కావల్సింది భార్యలా? లేక బ్యూటీ క్వీన్లు, వంట మనుషులా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)