సునామీ : ''అప్పుడు నాకు 13 ఏళ్లు.. ఆ భయం నన్ను ఇప్పటికీ వెంటాడుతోంది''

  • విష్ణుప్రియ రాజశేఖర్
  • బీబీసీ ప్రతినిధి
బాధితురాలు

ఫొటో సోర్స్, Getty Images

సునామీ- పదిహేనేళ్ల క్రితం వరకు తమిళనాడులో ఈ మాట ఎవరికీ పెద్దగా తెలియదు.

2004 డిసెంబరు 26- తమిళనాడులో సునామీ సృష్టించిన పెను విధ్వంసం, మహా విషాదాన్ని చూసిన, వీటి గురించి విన్న ఎవ్వరూ మరచిపోలేని తేదీ ఇది.

నాకు అప్పుడు పదమూడేళ్లే. చెన్నై తీరానికి దగ్గర్లో ఉండేదాన్ని. సునామీ విధ్వంసం నాపై నేరుగా ప్రభావం చూపలేదు. కానీ ఆ చీకటి రోజున సంభవించిన విషాదం, ప్రాణ, ఆస్తి నష్టం చూశాను, వాటి గురించి మరెంతో విన్నాను.

నాడు సునామీ కలిగించిన భయం నన్ను నేటికీ వెంటాడుతూనే ఉంది.

సునామీ తమిళనాడును తాకిన రోజు ఆదివారం. సెలవు రోజు. సాధారణంగా అయితే క్రిస్మస్ తర్వాతి రోజు కావడం, కొత్త సంవత్సరం సమీపిస్తుండటంతో ఆ రోజు అంతటా ఉత్సాహభరిత వాతావరణం ఉంటుంది. కానీ సునామీతో అదంతా మాయమై విషాదం అలముకొంది.

మా ఇల్లు సముద్ర తీరానికి దగ్గర్లోనే ఉన్నందున మా క్షేమం గురించి తెలుసుకొనేందుకు మా దూరపు బంధువు ఒకరు ఆ రోజు ఫోన్ చేశారు. ఆ ఫోన్ కాల్‌తోనే మాకు మెలకువ వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

2004 డిసెంబరు 26న సునామీ తర్వాత చెన్నైలోని మెరీనా బీచ్‌లో కనిపించిన దృశ్యం

'సునామీ'నా.. అంటే ఏంటి?

సునామీ కెరటాలు తమిళనాడు తీరాన్ని తాకాయనే సమాచారం మాకు అందినప్పుడు ఆ మాటే కొత్తగా అనిపించింది. ఎప్పడూ వినని మాట అది. ఆ మాట కూడా సరిగా పలకలేకపోయాం మొదట్లో.

ప్రతి ఆదివారం మేం చెన్నైలో రద్దీ ఎక్కువగా ఉండే కాసిమేడు చేపల మార్కెట్‌కు వెళ్తుంటాం. బేరసారాలు, కొనుగోళ్లు, అమ్మకాలతో అక్కడి వాతావరణం హడావుడిగా, సరదాగా ఉంటుంది. ఆ ఆదివారం మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధమైన వాతావరణం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

చెన్నై: సునామీ వచ్చిన రోజు

బీచ్‌కు వెళ్లినప్పుడు నా కాళ్లను చుట్టేసుకునే కెరటాలు నాకు ఎప్పుడూ స్నేహితుల్లా అనిపించేవి.

సునామీ విధ్వంసం ముందు వరకు తీరంలో ఇసుకతో నేనెన్నో ఇళ్లు కట్టుకున్నాను.

ఒక్క రోజు, ఒకే ఒక్క రోజులో అంతా మారిపోయింది. అప్పటివరకు నా స్నేహమైన కెరటమే శత్రువు అయ్యింది. ఆ అలలు ఎంతో మంది ప్రాణాలను తీసుకుపోయిన తర్వాత వాటిని నా స్నేహితులను ఎలా అనుకోగలను?

ఫొటో సోర్స్, Getty Images

చేపల మార్కెట్‌లో పడివున్న మృతదేహాలను చూసినప్పుడు ఏదో తెలియని బాధ నన్ను ఆవరించింది. నా కాళ్లు వణికాయి. అప్పుడు నాకు కలిగిన బాధ, వచ్చిన దుఃఖం మాటల్లో చెప్పలేను.

నేనే కాదు, పెద్దవాళ్లు కూడా భయాందోళనతో పెద్దగా ఏడ్చారు. విశాలమైన ప్రదేశంలోనే ఉన్నా నాకెందుకో శ్వాస ఆడనట్టు అనిపించింది.

మేం ఉండే చోటకు దగ్గర్లో అప్పట్లో చాలా గుడిసెలు ఉండేవి. వాటిలో చాలా వరకు మత్స్యకార కుటుంబాలే ఉండేవి. సునామీ విధ్వంసం అధికంగా ఉన్న ప్రాంతాల్లో మత్స్యకారుల నివాస ప్రాంతం ఒకటి. సునామీతో వాళ్ల గుడిసెల పైకప్పులు ఎగిరిపోయాయి. వాళ్ల సామగ్రి, వస్తువుల్లో దాదాపు అన్నింటినీ అలలు లాగేసుకొనిపోయాయి. దెబ్బతిన్న సామగ్రి, వస్తువులు కొన్ని చుట్టుపక్కల పడి ఉండటం నాకు కనిపించింది.

నేనప్పుడు చాలా చిన్నదాన్నే అయినప్పటికీ, ''వీళ్లంతా తిరిగి తమ జీవితాలను ఎలా మొదలుపెట్టగలరు'' అనే ప్రశ్న నాకు వచ్చింది. వీళ్లంతా నేను అంతకుముందు మాట్లాడిన లేదా చూసిన మనుషులే. ఏదో తెలియని బాధతో ఏడ్చాను.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images

సునామీ మిగిల్చిన విషాదాన్ని చూసి బరువెక్కిన గుండెతో ఇంటికి చేరుకున్నాం. మా క్షేమం గురించి, సునామీ గురించి తెలుసుకోవడానికి మా బంధువులు, స్నేహితుల నుంచి అప్పటికే చాలా ఫోన్లు వచ్చాయి.

సునామీ విధ్వంసాన్ని, విషాదాన్ని టీవీ ఛానళ్లు నిరంతరాయంగా చూపిస్తున్నాయి. పెద్దసంఖ్యలో మృతదేహాలు, గుండెలవిసేలా విలపిస్తున్న చిన్నాపెద్దా ఎంతో మంది టీవీలో కనిపిస్తున్నారు.

ఇదంతా చూస్తుంటే బాధ ఇంకా ఎక్కువైంది. కన్నీళ్లు ఆగడం లేదు.

నాగపట్నం, కడలూరు జిల్లాల్లో పెద్దసంఖ్యలో చనిపోయారనే సమాచారం తెలిశాక సునామీ మిగిల్చిన విషాదం చాలా ఎక్కువగా ఉందని అర్థమైంది.

ఈ దృశ్యాలన్నీ నన్ను బాగా కలచివేశాయి. డిసెంబరు 26ననే కాదు ఆ తర్వాత కూడా ఇవి నన్ను వెంటాడాయి. చాలా రోజులు భయంతో నిద్రలోంచి లేచాను.

ఫొటో సోర్స్, Getty Images

నా స్నేహితుల పుస్తకాలు పోయాయి

సునామీ వచ్చిన పది రోజుల తర్వాత పాఠశాలలు తిరిగి తెరచుకున్నాయి. సునామీ బారినపడ్డ కొందరు స్నేహితులను కలుసుకున్నాను. నా స్నేహితుల్లో చాలా మంది తీర ప్రాంతంలో ఉండేవారు. వాళ్లలో అత్యధికులు స్కూల్ యూనిఫాంలు, పుస్తకాలు సునామీతో పోయాయి. వాళ్ల బాధను ఎలా తగ్గించాలో నాకు తెలియలేదు. వాళ్లు కనీసం ప్రాణాలతో బయటపడ్డారనే ఆలోచన కాస్త ఊరటనిచ్చింది.

సునామీ తర్వాత జీవితం ముందున్నట్లు ఉండదు. సముద్రం, అలలు అప్పటివరకు ఇచ్చిన మంచి అనుభూతి మాయమైపోయింది. ఆ స్థానంలో భయం వచ్చి చేరింది.

సునామీ అంటే తెలియక ముందు, బీచ్‌లో ఆడుకోనివ్వండని నా తల్లిదండ్రుల వద్ద మారాం చేసేదాన్ని. సునామీ తర్వాత చాన్నాళ్ల వరకు నాకు తిరిగి బీచ్‌లో అడుగు పెట్టే ధైర్యం రాలేదు.

చెన్నై కాసిమేడు చేపల మార్కెట్‌కు, ఫిషింగ్ హార్బర్‌కు చాలా సంవత్సరాల తర్వాతే మళ్లీ వెళ్లాను. చాలా మారిపోయాయి. కానీ సునామీ రోజు నాకు కనిపించిన బాధాకర దృశ్యాలు మాత్రం నా మనసులో అలాగే ఉండిపోయాయి.

నాపై సునామీ నేరుగా ప్రభావం చూపలేదు. కానీ సునామీతో ఎన్నో కోల్పోయిన నా స్నేహితులు, ఇరుగుపొరుగు తమ గాథలను గుర్తుచేసుకున్నప్పుడు నా కళ్లు చెమర్చుతాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

సునామీతో అనాథగా మిగిలిన ఒక బాలిక

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)