‘తెలంగాణలో రైతుబంధుకు నిధుల కొరత’ :ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, kcr/fb
ఎన్నికల కమిషన్ అభ్యంతరాలను, అడుగడుగునా వస్తున్న ఆటుపోట్లను తట్టుకుంటూ ముందుకు సాగిన 'రైతు బంధు' పథకం.. పక్షం రోజులుగా నిధుల కొరతతో నిలిచిపోయిందని ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది.
ఇంకా 10 లక్షల మంది రైతులు రైతుబంధు కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా రూ.500 కోట్లను పంపిణీ చేయాల్సి ఉంది. శాసనసభ ఎన్నికల ముందు వరకు, ఈనెల మొదటి వారంలో ఆన్లైన్లో నిధుల బదిలీ జరిగింది. ఎన్నికల ఫలితాల తర్వాత ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు.
రబీ సీజన్లో 52 లక్షల మందికి రైతు బంధు సాయం పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకొన్న విషయం తెలిసిందే. ఈనెల మొదటి వారం వరకు 45 లక్షల మంది రైతులకు ఆన్లైన్ ద్వారా నిధులు బదిలీ చేశారు. మరో 7 లక్షల మంది మిగిలిపోయారు.
ఇక, ఖరీఫ్ సీజన్లో రైతుబంధు తీసుకోకుండా, పట్టాదారు పాస్ పుస్తకాల సమస్యలు పరిష్కారమైన రైతులు మరో 3 లక్షల మంది ఉన్నారు. ఎన్నికల కమిషన్ అభ్యంతరాలతో వీరికి రైతుబంధు నగదు పంపిణీ జరగలేదు. వీరంతా వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇంకా తమ ఖాతాల్లో డబ్బులు పడలేదని నిలదీస్తున్నారు.
వారి డేటాను అధికారులు ఆన్లైన్లో నమోదు చేసినా.. ఇప్పుడు సమస్యంతా ప్రభుత్వ ఖజానా, ట్రెజరీలో ఉంది. పెన్షన్లు, వేతనాలు, ఇతరత్రా సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు సర్దుబాటు చేసేందుకు రైతు బంధుకు నిధులు నిలిపివేశారు. కొన్ని నిధులేమో రంగారెడ్డి ట్రెజరీలో పెండింగ్‌లో ఉన్నాయి.
జన్‌ధన్ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన సమస్యలు కొన్ని ఉన్నాయి. అన్నీ కలిసి 10 లక్షల మందికి సాయం నిలిచిపోయింది. నెలాఖరుకు కూడా నిధులు సర్దుబాటయ్యే పరిస్థితి కనిపించటం లేదు.
పైగా, ఒకటో తేదీన వేతనాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో, జనవరి మొదటి వారంలో రైతు బంధుకు నిధులు సర్దుబాటు చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. గ్రామాల్లో కొంతమంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడి.. మరికొందరి ఖాతాల్లో పడకపోవటంతో వ్యవసాయ శాఖ అధికారులు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.
ఫొటో సోర్స్, Getty Images
‘పేదలను పక్కన పెట్టి సొమ్ములిచ్చేవారికే వైద్య సేవలు’
సర్కారీ దవాఖానాల పరిస్థితి ఎప్పటికీ మారడంలేదు. ఒకవైపు సీటీ, ఎంఆర్ఐ స్కాన్ల కోసం పేద రోగులు రోజుల తరబడి వేచి చూస్తుండగా.. వారందరినీ పక్కనబెట్టి.. డబ్బులు ముట్టజెప్పినవారికి.. బయటి రోగులకు మాత్రం నేరుగా స్కానింగ్ చేస్తున్న ఉదంతాలు ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో వెలుగుచూశాయని ఈనాడు ఒక కథనాన్ని ప్రచురించింది.
ఒక్క ఉస్మానియా ఆసుపత్రిలోనే.. ఒక్క నెలలోనే సుమారు ఒక వెయ్యికి పైగా ఇలాంటి అక్రమ స్కానింగ్‌లు జరిగినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ప్రభుత్వ వైద్యుడి ఆదేశం లేకుండానే.. బయటి నుంచి వస్తున్న రోగులకు సీటీ, ఎంఆర్ఐ స్కానింగ్‌లను నిర్వహిస్తున్నట్లుగా నిర్ధారించారు.
ఇందులో రేడియాలజీ విభాగంలో పనిచేసే సహాయకులు, సాంకేతిక నిపుణులు, కొందరు రేడియాలజీ వైద్యనిపుణుల పాత్ర కూడా ఉందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సహాయకులు, సాంకేతిక నిపుణుల కుమ్మక్కు కారణంగా రూ. లక్షల సొమ్ము అక్రమంగా చేతులు మారినట్లుగా తెలుస్తోంది.
ఈ వ్యవహారంపై ఫిర్యాదులు అందడంతో వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేశ్‌రెడ్డి సత్వర చర్యలు చేపట్టారు. సీటీ, ఎంఆర్ఐ స్కానింగ్‌లు చేయాలని సూచించే సంబంధిత వైద్యనిపుణుల సంతకం లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ బోధనాసుపత్రుల్లో స్కాన్ పరీక్షలు చేయొద్దంటూ తాజాగా ఆదేశాలు జారీచేశారు.
బోధనాసుపత్రుల్లో జరుగుతున్న అక్రమాలపై ఇటీవలే ఉస్మానియా సూపరింటెండెంట్ వైద్యవిద్య సంచాలకుల దృష్టికి తీసుకెళ్లారు. సీటీ, ఎంఆర్ఐ స్కానింగ్‌లు అవసరమా? కాదా? అనేది నిపుణులైన వైద్యులు నిర్ణయించాలే తప్ప.. ఎవరుపడితే వారు చీటిపై రాసిస్తే ఎలా పరీక్షలు నిర్వహిస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
కొందరు సిబ్బంది బయటి వైద్యులతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారని నిర్ధారించారు. దీంతో బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా వైద్యవిద్య సంచాలకులు ఆదేశాలు జారీచేశారు. అన్ని బోధనాసుపత్రుల్లోనూ ప్రత్యేక నిర్ధారణ పరీక్షల పత్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. స్కానింగ్ అవసరమంటూ వైద్యనిపుణులు సంతకం చేయాలని పేర్కొన్నారని ఈనాడు తెలిపింది.
ఫొటో సోర్స్, Getty Images
కర్ణాటక 'ఎత్తు'లు... తెలుగు రాష్ట్రాలకు తిప్పలు!
కృష్ణా బేసిన్లో నెలకొంటున్న తీవ్ర వర్షాభావ పరిస్థితులతో తెలంగాణ, ఏపీల ప్రాజెక్టులకు నీళ్లు కరువవుతుంటే.. మరోపక్క ఎగువన ఉన్న కర్ణాటక మాత్రం కృష్ణా నీటిని మరింత కట్టడి చేసేందుకు యత్నిస్తోందంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రచురించింది.
దిగువకు చుక్క నీటిని కూడా వదలకుండా తన స్వప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం ఇస్తూ ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచే వ్యూహాలకు పదును పెడుతోంది. బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పును సాకుగా చూపి, అది అమల్లోకి రాకుండానే డ్యామ్ ఎత్తును 519.60 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచేలా పావులు కదుపుతోంది. దీనికి బలమిచ్చేలా ఆల్మట్టి ఎత్తును పెంచుతున్నట్లు, దీనికోసం రూ.30,143 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు కర్ణాటక భారీ నీటిపారుదలశాఖ మంత్రి డీకే శివకుమార్ ఇటీవల చేసిన ప్రకటన తెలుగు రాష్ట్రాలను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది.
ఇటీవల కర్ణాటకలో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఆల్మట్టి ఎత్తు అంశాన్ని తెరపైకి తెచ్చాయి. ఎత్తు పెంచడంతోపాటు, పెంచితే అందుబాటులోకి వచ్చే 130 టీఎంసీలను వినియోగించుకునేలా 9 ఎత్తిపోతలు చేపడతామని ప్రకటించాయి.
ఈ మేరకు కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ ప్రకటన చేశారు. ఆల్మట్టి ఎత్తు పెంపునకే తమ తొలి ప్రాధాన్యమని తెలిపారు. ఈ ప్రకటన తెలుగు రాష్ట్రాల్లో గుబులు రేపుతోంది. ఇప్పటికే ఆల్మట్టి నుంచి దిగువన ఉన్న శ్రీశైలం, సాగర్లకు నీళ్లు వచ్చేందుకు ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఆగాల్సి వస్తోంది.
ఎత్తు పెంచాక అక్టోబర్ తర్వాతే నీళ్లొచ్చే అవకాశాలున్నాయి. అదే జరిగితే దిగువ రాష్ట్రాల్లో సాగు నీటి ప్రాజెక్టుల కింద ఆయకట్టు పరిస్థితి దారుణంగా మారుతుంది. ముఖ్యంగా మిగులు జలాలపై ఆధారపడి రాష్ట్రంలో చేపట్టిన.. నెట్టెంపాడు, కల్వకుర్తి, ఏఎమ్మార్పీ, పాలమూరు-రంగారెడ్డి, డిండి వంటి ప్రాజెక్టులు, వీటి పరిధిలోని 23 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించడం కష్టతరమే కానుంది. ఈ నేపథ్యంలో ఎత్తు పెంపుపై మళ్లీ న్యాయస్థానాల్లో పోరాటమే తెలుగు రాష్ట్రాలకు శరణ్యం కానుందని సాక్షి తెలిపింది.
ఫొటో సోర్స్, Tsec
'పంచాయతీ' అంతా వెబ్సైట్లోనే!
పంచాయతీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో పల్లెల్లో హడావుడి పెరిగింది. సర్పంచి పదవికి నామినేషన్ వేసేదెవరు.. ఉపసంహరించుకునే వారెవరు.. తుది పోరులో నిలిచేది ఎవరు.. అర్హతలేంటి.. ఇలాంటి విషయాలన్నీ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో తెలుసుకోవచ్చుని ఈనాడు తెలిపింది.
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ tsec.gov.in వెబ్సైట్లోకి వెళ్తే.. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సమస్త సమాచారం ఇట్టే తెలిసిపోతుంది. సర్పంచిగా పోటీ చేసే వారి కోసం ప్రత్యేకంగా క్యాండిడేట్ పోర్టల్‌ను రూపొందించారు. అభ్యర్థులు అనుసరించాల్సిన నియమావళిపై ఇందులో కరదీపిక ఉంటుంది.
పోలింగ్ కేంద్రాలవారీగా ఓటర్ల జాబితా సైతం లభిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా గత ఎన్నికల్లో చేసిన ఖర్చును వెల్లడించకుండా అనర్హతకు గురైన వారి వివరాలూ ఇందులో ఉంటాయి. నామినేషన్‌ను సైతం ఆన్లైన్లో పూరించి, ప్రింట్ తీసి సంతకం చేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తే సరిపోతుంది.
ఓటర్లు ఆన్లైన్లో ఓటరు స్లిప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. గ్రామంలో గతంలో పోటీ చేసిన ప్రజాప్రతినిధుల వివరాలు, ప్రస్తుతం బరిలోఉన్న వారి సమాచారాన్నీ వెబ్సైట్లో చూడొచ్చు.
అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లను సైతం ఇందులో అప్లోడ్ చేయనున్నారు. ప్రజలకు అవసరమైన సమాచారం మొత్తం వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని టీఎస్ఈసీ కార్యాలయ అధికారులు తెలిపారు.
నామినేషన్లు, అఫిడవిట్ల పత్రాలన్నింటినీ స్కాన్ చేసి నమోదు చేయాలని మండల అధికారులకు సూచించామన్నారు. ఎన్నికలు ముగిసిన రోజు ఫలితాలు సైతం వెబ్సైట్లో ఉంచుతామని.. మీ గ్రామంలో ఎవరు గెలిచారో ఎక్కడి నుంచైనా తెలుసుకోవచ్చని వివరించారని ఈనాడు పేర్కొంది.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)