బాబా రాందేవ్ బీజేపీ నుంచి ఎందుకు దూరం జరిగారు
- ఇమ్రాన్ ఖురేషీ
- బీబీసీ కోసం

ఫొటో సోర్స్, Getty Images
రాజకీయంగా తటస్థంగా ఉండాలని యోగా గురు బాబా రాందేవ్ నిర్ణయించుకోవడం ఇఫ్పుడు పెద్ద చర్చగా మారుతోంది.
ఆయన ఆరునెలల కిందట చెప్పిన మాటపై వెనక్కు తగ్గడంతో ఇప్పుడు బాబా రాందేవ్ ఎందుకు బీజేపీకి దూరం జరుగుతున్నారన్న ప్రశ్న మొదలైంది.
మంగళవారం సాయంత్రం మదురై విమానాశ్రయంలో బాబా రాందేవ్ విలేఖర్లతో మాట్లాడారు.
'' ఇప్పుడు రాజకీయ పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి. తదుపరి ప్రధాని ఎవరో, దేశానికి ఎవరు నాయకత్వం వహిస్తారో ఇప్పుడు చెప్పలేం.'' అని వ్యాఖ్యానించారు.
అయితే దేశంలో పరిస్థితి ఆసక్తికరంగా, హోరాహోరీగా ఉందని చెప్పారు.
ఇప్పుడు తాను రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించలేదని.. తాను ఏ పార్టీకీ, ఏ వ్యక్తికీ మద్ధతు పలకడం లేదని అన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
గతంలో బీజేపీకి ముఖ్యంగా నరేంద్ర మోదీకి అనుకూలంగా పెద్దఎత్తున ప్రచారం చేసిన బాబా రాందేవ్ తాజా రాజకీయ నిర్ణయం, ప్రకటన ఆశ్చర్యం కలిగించేలా ఉంది.
ఇంకా చెప్పాలంటే.. ఆరు నెలల కిందట కూడా రాందేవ్ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వెనుక ఉంటూ మోదీ ప్రభుత్వ నాలుగేళ్ల పాలనను కీర్తించారు. అప్పట్లో బాబా '' ప్రధాని నాయకత్వంలో దేశం మరింత ముందుకు వెళ్తుంది.'' అని ప్రశంసించారు.
అప్పట్లో అమిత్ షా మాట్లాడుతూ.. '' బాబా రాందేవ్ సాయం తీసుకుంటే.. ఆయనుకున్న కోట్లాది మంది అనుచరులకు చేరువ అవుతాం'' అని అన్నారు.
2014లో తమతో ఉన్న వీరి నుంచి తమకు ఆశీర్వాదం కావాలని ఆశిస్తున్నామని అమిత్ షా చెప్పారు.
ఫొటో సోర్స్, BJP-TWITTER
జూన్ నుంచి ఇప్పటి వరకు దేశంలో జరిగిన రాజకీయ మార్పు ఒకటే.
మూడు హిందీ రాష్ర్టాలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో బీజేపీ అధికారం కోల్పోయింది.
ఈ అంశంపై సీనియర్ రాజకీయ విశ్లేషకులు అనికేంద్రనాథ్ సేన్ బీబీసీతో మాట్లాడుతూ.. రాందేవ్ ఇప్పుడు బాబాకన్నా, స్వామీజీకన్నా మంచి వ్యాపారవేత్త.
అందువల్ల అతను తన ప్రయోజనాలకు అనుగుణంగా వ్యాఖ్యానించొచ్చు.'' అని అన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
మరోవైపు మూడు హిందీ రాష్ర్టాల్లో బీజేపీ అధికారం కోల్పోయిన నేపథ్యంలో బాబా అలా వ్యాఖ్యానించి ఉండొచ్చని అన్నారు.
బాబా రాందేవ్ 2014లో పరిస్థితి నుంచి ఇఫ్పుడు చాలా దూరం వెళ్లిపోయారని చెప్పారు. మొదట అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమానికి మద్దతు పలికిన బాబా తర్వాత బీజేపీలో చేరారు. ఇప్పుడు అవినీతి ఆరోపణలు మోదీపై వస్తున్నాయి కనుక అవినీతి వ్యతిరేక ఉద్యమం పూర్తైపోయింది.. అని సేన్ అన్నారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)