రాహుల్ గాంధీ: మధ్యతరగతి ఇబ్బందులకు మోదీ సమాధానం 'వణక్కం పుదుచ్చేరి'

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Reuters

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

బీజేపీ కార్యకర్తలకు కూడా ఆయన సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారని విమర్శించారు.

ఇటీవల తమిళనాడుకు చెందిన బీజేపీ బూత్‌స్థాయి కార్యకర్తలతో ' నమో' యాప్ ద్వారా మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేసి మాట్లాడారు.

ఈ సందర్భంలో నిర్మల్‌కుమార్‌ జైన్‌ అనే కార్యకర్త 'మీ ప్రభుత్వం మధ్యతరగతి వారి నుంచి పన్నులు ఎక్కువగా వసూలు చేస్తూ వారి బాగోగులను ఎందుకు పట్టించుకోవడం లేదు?' అని అడిగారు.

అప్పుడు మోదీ అతని ప్రశ్నను పక్కనబెట్టి 'పుదుచ్చేరికో వణక్కం' అంటూ వేరే కార్యకర్తలతో సమావేశమయ్యారు.

దీనిపై ట్విటర్ వేదికగా రాహుల్ స్పందించారు.

'వణక్కం పుదుచ్చేరి!- ఇబ్బందులు పడుతోన్న మధ్యతరగతి ప్రజలకు మోదీ ఇస్తున్న సమాధానం ఇదే.

ప్రెస్ కాన్ఫరెన్స్‌లను మర్చిపోండి కనీసం వారి పార్టీకి చెందిన పోలింగ్ బూత్ కార్యకర్తల ప్రశ్నలకు కూడా మోదీ సమాధానం చెప్పడం లేదు.

బీజేపీ తనిఖీ చేసిన తర్వాత ప్రశ్నలను అనుమతించడం మంచి ఉపాయం. సమాధానాలను కూడా ఆ పార్టీ తనిఖీ చేస్తే బాగుంటుంది' అని రాహుల్‌ ట్వీటారు.

'వణక్కం పుదుచ్చేరి' పై సోషల్ మీడియాలో సెటైర్లు

'ఇకపై ప్రశ్నపత్రాల్లో ఉండే NOTA(None of the above) బదులుగా వణక్కం పుదుచ్చేరి పదాన్ని వాడాలని మేం కోరుతున్నాం అని మింటో అనే నెటిజన్ ట్విటర్‌లో డిమాండ్ చేశారు.

కొన్పల్ పట్నీ అనే మరో నెటిజన్ దీనిపై కింది విధంగా స్పందించారు.

'యజమాని: నువ్వు భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నావు ?

నేను: వణక్కం పుదుచ్చేరి

'కొత్త పదం పుట్టింది. I don't know = Chaliye Puducherry to Vanakkam’ అంటూ బ్లాంక్ చెక్ అనే మరో నెటిజన్ స్పందించారు

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)