నారా చంద్రబాబు నాయుడు శ్వేత పత్రాలు: అసలు శ్వేత పత్రం అంటే ఏమిటి? అందులో ఏముంటాయి?

ncbn

ఫొటో సోర్స్, Ncbn

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగున్నర ఏళ్ల పాలనపై వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు. ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరిస్తున్నారు. ఇంతకీ శ్వేత పత్రం అంటే ఏమిటి? అందులో ఏముంటాయి? ఆ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది?

శ్వేత పత్రం అనే పదాన్ని తరచూ మనం వింటుంటాం. ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి, ఫలానా అంశంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది అనే వార్తలు మనం చూస్తుంటాం.

ప్రభుత్వం ఏదైనా ఒక అంశంపై విడుదల చేసే సాధికారిక నివేదికను లేదా మార్గదర్శక పత్రాన్ని శ్వేతపత్రంగా చెప్పొచ్చు. అంటే ఒక అంశంపై ప్రభుత్వం యొక్క అధికారిక సమాచారం, వాస్తవ నివేదికగా దాన్ని భావించాలి.

ఏదైనా ఒక అంశంపై ప్రభుత్వం తన విధానాలను తెలియపరుస్తూనే, అభిప్రాయాలను ఆహ్వానించడం కూడా శ్వేతపత్రం ద్వారా చేయోచ్చు. అలాగే, ఒక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడాని కంటే ముందు దాని వివరాలను శ్వేతపత్రం ద్వారా విడుదల చేసి ప్రజలకు సమాచారం అందించవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images

ఎక్కడి నుంచి వచ్చింది

శ్వేతపత్రం అనే భావన పాలన నిర్వహణ నుంచి ఆవిర్భవించింది.

బ్రిటన్ ప్రభుత్వం తొలిసారిగా ఈ పదాన్ని ఉపయోగించింది. 1922లో చర్చిల్ ప్రభుత్వం విడుదల చేసిన నివేదికను తొలి శ్వేతపత్రంగా చెబుతుంటారు.

యూదులపై పాలస్తీనా హింసపై ఆ దేశంలోని తొలి బ్రిటీశ్ హైకమిషనర్ సర్ హెర్‌బర్ట్ శ్యాముల్ రూపొందించిన ముసాయిదా పత్రాన్ని తొలి శ్వేతపత్రం (చర్చిల్ మోమోరాండం)గా పేర్కొంటారు.

బ్రిటన్ పార్లమెంట్ నిర్వచనం ప్రకారం 'ప్రభుత్వ విధానాలను, చట్టపరమైన ప్రతిపాదనలను, బిల్లు రూపం దాల్చడానికి ముందు జరిగే వ్యవహారాలను, ఒక్కోసారి ప్రజల అభిప్రాయలను సేకరించే ప్రభుత్వ నివేదకను శ్వేతపత్రంగా పేర్కొంటారు. '

బ్రిటన్ నుంచి ఈ శ్వేతపత్రం భావనను తీసుకొని భారత్, కెనడా, అమెరికాలతో పాటు అనేక దేశాలు తమ పాలనలో భాగం చేసుకున్నాయి.

ఫొటో సోర్స్, cbn

కొన్ని దేశాల్లో వైట్ పేపర్‌తో పాటు గ్రీన్ పేపర్ విధానం కూడా అమలులో ఉంది.

వివిధ అంశాలపై ప్రభుత్వం శ్వేతపత్రాని కంటే ముందు గ్రీన్ పేపర్‌ను విడుదల చేస్తుంది.

ఒక అంశానికి సంబంధించిన ప్రతిపాదనలు, చర్చల సారాంశం, సలహాలు ఇతర విషయాలపై ప్రభుత్వం విడుదల చేసే సూత్రప్రాయి నివేదికను గ్రీన్ పేపర్‌గా పిలుస్తారు.

శ్వేతపత్రాలు వల్ల ప్రభుత్వ విధాన నిర్ణయాలు, అంశాల గురించి ప్రజలు తెలుసుకోగలగుతున్నారు.

అలాగే, ప్రభుత్వ పనితీరును అవగాహన చేసుకొని సూచనలు చేసే అవకాశం కలుగుతోంది.

ప్రభుత్వ విధానాలను, నిర్ణయాలను ప్రజలు తెలుసుకోడానికి శ్వేతపత్రాలు చక్కగా ఉపయోగపడుతాయని రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పెంటపాటి పుల్లరావు చెప్పారు. ఇటీవల శ్వేత పత్రాలను విడుదల చేయడం తగ్గుతోందని, ఈ పరిస్థితి మారాలని అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)