ర్యాట్ హోల్ మైనింగ్: మేఘాలయలో 400 అడుగుల లోతులో చిక్కుకున్న కార్మికులు.. కాపాడడం సాధ్యమేనా?

ర్యాట్ హోల్ మైన్

ఫొటో సోర్స్, Fairfax Media/getty

ఫొటో క్యాప్షన్,

భూగర్భంలో వందల అడుగుల లోతున మనిషి దూరేంత సన్నని రంథ్రాలు చేసుకుంటూ బొగ్గును తవ్వుతారు. మేఘాలయలోని ఈస్ట్ జైంథియా హిల్స్ జిల్లాలోని ఒక ర్యాట్ హోల్ మైన్ ఇది

భూగర్భంలో 370 అడుగుల లోతున బొగ్గు తవ్వడానికి వెళ్లిన 15 మంది కార్మికులు 13 రోజులుగా అందులోనే చిక్కుకుపోయారు.

వారిని రక్షించడానికి సహాయ బృందాలు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో వారేమయ్యారోనన్న ఆందోళనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో.. రాజధాని షిల్లాంగ్‌కు 80 కిలోమీటర్ల దూరంలో.. ఈస్ట్ జైంథియా హిల్స్ జిల్లా లుంథారీ గ్రామంలోని క్సాన్ ప్రాంతంలో ఉన్న ఈ గనిలో 15 మంది చిక్కుకుపోయారు.

డిసెంబరు 13న మొత్తం 20 మంది కార్మికులు గనిలో 370 అడుగుల లోతుకు వెళ్లి.. అక్కడి నుంచి నేలకు సమాంతరంగా సన్నని సొరంగ మార్గాల్లో తవ్వకాలు సాగించే ప్రయత్నంలో ఉన్నారు..

అంతలోనే.. సమీపంలోని లైతే నది నుంచి నీరు ఒక్కసారిగా గనిలోకి రావడం మొదలైంది.. అంతే, కార్మికులంతా బయటపడే ప్రయత్నం చేశారు. కానీ, అయిదుగురు మాత్రమే ప్రాణాలతో బయటకు రాగలిగారు. మిగతావారంతా గనిలోనే చిక్కకుపోయారు.

వారిప్పుడు ప్రాణాలతోనే ఉన్నారా..? వారిని రక్షించడం సాధ్యమేనా? అన్నది సమాధానం లేని ప్రశ్నగా మారింది.

ఫొటో సోర్స్, SannioSiangShai

ఆశలు వదులుకుంటున్న అయినవాళ్లు

సహాయచర్యలూ రెండు రోజులుగా నిలిపివేయడంతో తమవారు బతికున్నారా లేదా అన్న ఆందోళనతో బాధిత కుటుంబాలు బిక్కుబిక్కు మంటున్నాయి.

గనిలోని నీటిని రెండు మోటార్లతో తోడుతున్నప్పటికీ కొంచెం కూడా నీటిమట్టం తగ్గకపోవడంతో మరింత శక్తిమంతమైన మోటార్లను తెప్పించేవరకు సహాయచర్యలు నిలిపివేశారు.

అయితే, ప్రమాదం జరిగిన వెంటనే సహాయ చర్యలు మొదలైతే కార్మికులను రక్షించే అవకాశం ఉండేది. కానీ, ఆ ప్రమాదం గురించి సమాచారం అందిన తరువాత ఆ గని ఎక్కడుందో తెలుసుకోవడానికే అధికారులకు చాలా సమయం పట్టింది.

డిసెంబరు 14 నుంచి సహాయ చర్యలు ప్రారంభించినట్లు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌(ఎన్డీఆర్ఎఫ్) చీఫ్ ఆఫీసర్ ఎస్‌కే శాస్త్రి ఏఎన్ఐ వార్తాసంస్థతో చెప్పారు.

స్థానికులెవరూ సహకరించకపోవడంతోనే గనిని చేరుకోవడానికి సమయం పట్టిందని.. ఇవన్నీ అక్రమంగా తవ్వుతున్న గనులు కావడంతో, వాటి గురించి చెబితే మైనింగ్ మాఫియా నుంచి తమకు ముప్పు ఉంటుందన్న భయంతో స్థానికులెవరూ సమాచారం ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, ROBERTO SCHMIDT/gettyimages

ఫొటో క్యాప్షన్,

మేఘాలయలో ర్యాట్ హోల్ మైన్ నుంచి బలహీనమైన చెక్క మెట్ల మీదుగా బయటకు బొగ్గు మోసుకొస్తున్న కార్మికుడు

ఇంకా సమయం పడుతుంది

''చిక్కుకుపోయిన కార్మికులు గని ప్రధాన మార్గంలో ఎక్కడైనా నీరు లేని చోట సురక్షితంగా ఉండొచ్చని భావిస్తున్నాం. మరింత శక్తిమంతమైన మోటార్లను తెప్పిస్తున్నాం. వాటితో నీటిని తోడాక వారిని చేరుకోవాలన్నది మా ప్రయత్నం. అందుకు సమయం పడుతుంది'' అని ఎన్డీఆర్ఎఫ్ అధికారి సంతోష్ సింగ్ చెప్పారు.

గనిలోని నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో సహాయ బృందాలకు కష్టమవుతోందని.. మరిన్ని మోటార్లు తెప్పించి కార్మికులను రక్షించే ప్రయత్నం చేస్తామని మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు.

కాగా ఇప్పటివరకు మూడు హెల్మెట్లు తప్ప గని నుంచి ఇంకేమీ బయటకు తీయలేకపోవడంతో కార్మికులను రక్షించే అంశంపై కుటుంబీకుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.

ఫొటో సోర్స్, Daniel Berehulak/gettyimages

ఫొటో క్యాప్షన్,

ఈస్ట్ జైంథియా హిల్స్‌లో ఒక ర్యాట్ హోల్ మైన్ నుంచి బయటకు తాళ్ల లిఫ్ట్ సహాయంతో బయటకు వెళ్తున్న కార్మికులు

ఏమిటీ ర్యాట్ హోల్ మైనింగ్

మేఘాలయలో అత్యధిక శాతం భూములు ప్రయివేటు వ్యక్తులు, సామాజిక సమూహాల చేతిలో ఉంటాయి. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ ప్రకారం ఏర్పడిన స్వతంత్ర ప్రతిపత్తి గల జిల్లా కౌన్సిళ్ల చట్టాల పరిధిలో ఇవి ఉంటాయి.

ఇక్కడ అక్రమంగా బొగ్గు తవ్వకాలు సాగుతున్నాయి. భూఉపరితలం నుంచి వందల అడుగుల లోతుకు బావి తవ్వి.. దాని అడుగు నుంచి అడ్డంగా మనిషి దూరేంత రంథ్రాలు చేసుకుంటూ పోతారు. ఇవి 3 నుంచి 4 అడుగుల వ్యాసంతో మాత్రమే ఉంటాయి.

భూగర్భంలో అడ్డంగా వందల మీటర్ల దూరం ఇలాంటి సన్నని సొరంగాలను తవ్వుకుంటూ బొగ్గును వెలికి తీస్తారు. దీన్నే ర్యాట్ హోల్ మైనింగ్ అంటారు.

అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో, అశాస్త్రీయ విధానంలో జరిగే ఈ ర్యాట్‌హోల్ మైనింగ్‌‌పై 2014లో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ నిషేధం విధించింది. పర్యావరణ సమస్యలతో పాటు కార్మికుల ప్రాణాల రక్షణ దృష్టితోనూ నిషేధం విధిస్తున్నట్లు ట్రైబ్యునల్ చెప్పింది.

ఫొటో సోర్స్, Kuni Takahashi/gettyimages

అక్రమ తవ్వకాలకు సాక్ష్యం

కాగా, మేఘాలయలోని గారో హిల్స్‌లో నిషేధం ఉన్నప్పటికీ అక్రమంగా బొగ్గు గనులు తవ్వడమనేది చాలాకాలంగా సాగుతున్న వ్యవహారం. ప్రయివేటు వ్యక్తులు మనుషులను నియమించుకుని ఈ తవ్వకాలు సాగిస్తుంటారు.

మేఘాలయతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు వీటిలో పనిచేస్తుంటారు.

తాజా ప్రమాదంతో మరోసారి ఈ ర్యాట్ హోల్ మైనింగ్ అందరి దృష్టికీ వచ్చింది. 2014లో ట్రైబ్యునల్ విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ గనుల యజమానులు సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. అవి ఇంకా విచారణలో ఉన్నప్పటికీ మైనింగ్ మాత్రం యథాతథంగా కొనసాగుతోందనడానికి ఈ ఘటనే ఉదాహరణ.

ప్రస్తుతం ప్రమాదం జరిగిన ఈస్ట్ జైంథియా హిల్స్ జిల్లాలో అక్రమ మైనింగ్‌పై పరిశీలనకు వెళ్లిన ఇద్దరు యాక్టివిస్టులపై గత నెలలో దాడి జరిగింది.

కాగా, ప్రమాదం జరిగిన మరుసటి రోజున పోలీసులు గని యజమాని క్రిప్ చుల్లెట్‌ను అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఈస్ట్ జైంథియా హిల్స్ జిల్లా ఎస్పీ సిల్విస్టర్ నోంగ్‌త్యాంగర్ పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ ధ్రువీకరించారు.

ఈ ఘటన నేపథ్యంలో మేఘాలయ మానవ హక్కుల కమిషన్ ఆ రాష్ట్ర ప్రభుత్వంపై సు మోటోగా కేసు నమోదు చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)