కశ్మీర్ కాల్పులు: ఈ చిన్నారి కంటికి గాయం చేసిన భద్రతా బలగాల పెల్లెట్

హిబా నిసార్

ఫొటో సోర్స్, Getty Images

హిబా నిసార్ వయసు 20 నెలలు. కశ్మీర్‌లో భద్రతా బలగాలు పేల్చిన పెల్లెట్ ఈ పసికందు కుడి కంటికి గాయం చేసింది. కశ్మీర్‌లో పెల్లెట్ గాయాల బాధితుల్లో అతి పిన్న వయసు హిబాదే.

ఆరోజు జరిగిన సంఘటన గురించి హిబా తల్లి మర్సాలా జాస్ బీబీసీకి వివరించారు.

‘‘మా పొరుగు గ్రామంలో ఎదురు కాల్పులు జరిగాయి. దాంతో మేం ఇళ్లలోనే ఉండిపోయాం. అంతలో మా ఇంటికి సమీపంలో.. ఆందోళనకారులకు, భద్రతా బలగాలకు మధ్య ఘర్షణలు మొదలయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images

మా గదులన్నీ టియర్ గ్యాస్‌తో నిండిపోయాయి. మేం గదిలోంచి వరండాలోకి వచ్చాం. ఇంతలో ఏదో తగిలినట్లు అనిపించింది.

హిబా కుడి కంట్లోంచి రక్తం కారసాగింది. నా చేయి అడ్డు పెట్టి, పాపను కాపాడే ప్రయత్నం చేశాను. నా చిన్నారి గుక్కపెట్టి ఏడ్వసాగింది’’ అని మర్సాలా అన్నారు.

వీడియో క్యాప్షన్,

వీడియో: హిబా కుడి కంట్లోని కరోనాకు రంధ్రం పడింది.

పెల్లెట్ తగలడంతో హిబా కుడి కంట్లోని కరోనాకు రంధ్రం పడింది.

నెల రోజుల వ్యవధిలో ఈ పసిబిడ్డకు రెండు సార్లు ఆపరేషన్ జరిగింది.

‘‘పాపను మళ్లీ తీసుకురావాల్సి ఉంటుందా అని డాక్టర్లను అడిగాను. మేం చేయగలిగిందంతా చేశాం.

ఇక.. ఆ పైవాడి దయ అన్నారు. ఆమెకు మళ్లీ చూపు రావాలని మేం కోరుకుంటున్నాం’’ అన్నారు.

అయితే హిబా విషయంలో మాట్లాడేందుకు డాక్టర్లు నిరాకరించారు. మీడియాతో మాట్లాడవద్దని వారిపై ఆంక్షలున్నాయి.

‘‘హిబాకు బదులు ఆ పెల్లెట్ నాకు తగిలినా బాగుండు. చెల్లి పడుతున్న బాధను చూడలేకపోతున్నా.. అని హిబా అన్నయ్య అంటున్నాడు. ఇంట్లో అందరూ బాధపడుతున్నారు’’ అని మర్సాలా అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

2010 నుంచి పెల్లెట్స్ వాడకం

పెల్లెట్ గన్స్ అంటే పంప్ యాక్షన్ షాట్ గన్స్. ఒక తూటా పేల్చితే, దాంట్లోంచి ఎన్నో చిన్న లోహపు గుళ్లు ఒక విశాల ప్రాంతంలోకి దూసుకెళ్తాయి.

కశ్మీర్‌లో భద్రతా బలగాలు 2010 నుంచి పెల్లెట్ గన్స్ ఉపయోగిస్తున్నాయి.

పెల్లెట్ల కారణంగా 2016 నుంచి ఇప్పటి వరకు 6,000 మందికి పైగా గాయపడ్డారు.

వారిలో 782 మంది కళ్లకు గాయలయ్యాయని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ తెలిపింది.

‘‘ఈ పసి పాప చేతిలో తుపాకీ ఉందా? లేక తనేమైనా రాళ్లు రువ్వుతోందా? అని సాయుధ బలగాలను అడుగుతున్నా..’’ అని మర్సాలా అన్నారు.

హిబాకు పెల్లెట్ గాయమైన తర్వాత కశ్మీర్‌లో నిరసన వెల్లువెత్తింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు గవర్నర్ రక్షణ సలహాదారు కె.విజయ్ కుమార్ ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)