కేసీఆర్‌ చొరవ భేష్‌: అఖిలేష్ యాదవ్ :ప్రెస్‌రివ్యూ

అఖిలేష్ యాదవ

ఫొటో సోర్స్, Getty Images

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోగా ప్రాంతీయ పార్టీలతో కలిసి ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేయడానికి టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీసుకుంటున్న చొరవ ప్రశంసనీయమని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ కితాబిచ్చారని ఈనాడు వెల్లడిచింది.

బుధవారం లఖ్‌నవూలో అఖిలేశ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 'ప్రాంతీయ పార్టీలను ఒకే వేదిక పైకి తెచ్చేందుకు కేసీఆర్‌ పాటుపడుతున్నారు. ఇప్పటికే ఆయనతో నేను మాట్లాడాను. మంగళ, లేదా బుధవారాల్లో మేమిద్దరం భేటీ కావాల్సి ఉంది. కొన్ని కారణాల రీత్యా అది సాధ్యం కాలేదు. ఆయన్ని కలిసేందుకు త్వరలో నేనే హైదరాబాద్‌కు వెళ్తా. యూపీలోనే కాకుండా కేంద్రంలోనూ బీజేపీ ప్రభుత్వాలు వాగ్దానాలను నెరవేర్చడం లేదు. ఘనమైన హామీలిచ్చి ఏవీ నిలబెట్టుకోలేదు. నాలుగున్నరేళ్ల బీజేపీ పాలనలో డొల్లతనం ఇప్పుడు బయటపడిపోతోంది. వంచించిన ప్రభుత్వాల తీరుపై ప్రజలు ఏమాత్రం సంతోషంగా లేరు' అని అఖిలేశ్‌ చెప్పారు.

బీజేపీపై పోరాడే కూటమిలో కాంగ్రెస్‌ని కలుపుకొంటారా అనే ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానమివ్వలేదు. మధ్యప్రదేశ్‌లో తమ పార్టీ తరఫున ఎన్నికై, ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా నిలిచిన ఏకైక శాసనసభ్యుడికి మంత్రివర్గంలో స్థానం లభించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో సమాజ్‌వాదీతో ఎవరెవరు కలిసి ప్రయాణం చేయదలచుకున్నా స్వాగతిస్తామని చెప్పారు.

మరోవైపు సమాఖ్య కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం దిల్లీలో బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతితో భేటీ కానున్నారు. కూటమి విషయమై ఇప్పటికే ఒడిశా, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రులు నవీన్‌ పట్నాయక్‌, మమతా బెనర్జీలను కేసీఆర్‌ కలిసిన సంగతి తెలిసిందే.

అయిదు రోజుల సెలవుల అనంతరం గురువారం పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో సొంత రాష్ట్రాలకు వెళ్లిన ప్రాంతీయ పార్టీల నేతలు దిల్లీ రానుండడంతో సాధ్యమైనంత ఎక్కువ మందితో భేటీకి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మద్దతుగా నిలిచిన రాష్ట్రీయ లోక్‌దళ్‌, ఝార్ఖండ్‌ ముక్తిమోర్చా నేతలతోనూ చర్చించే అవకాశమున్నట్లు తెలిసిందిని ఈనాడు పేర్కొంది.

ఫొటో సోర్స్, AP govt

ఫొటో క్యాప్షన్,

అమరావతిలో హైకోర్ట్ భవనం నమూనా చిత్రం

అమరావతికి హైకోర్టు

హైదరాబాద్‌తో ముడిపడిన కీలక 'కార్యస్థానం'... రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విభజన అధికారికంగా పూర్తయిందని ఆంధ్రజ్యోతి వెల్లడిచింది.

అమరావతి కేంద్రంగా 'ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు' పని చేయనుంది! కొత్త సంవత్సరం... జనవరి 1వ తేదీ నుంచి నవ్యాంధ్ర, తెలంగాణ హైకోర్టులు వేటికవిగా పని చేస్తాయి. ఈ మేరకు బుధవారం రాష్ట్రపతి గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు.

ఏపీకి 16 మంది, తెలంగాణకు 10 మంది న్యాయమూర్తులను కేటాయించారు. రాజధాని అమరావతి పరిధిలో నిర్మిస్తున్న 'జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌'లో ఏపీ హైకోర్టు ఏర్పాటవుతుంది. ఈ భవన నిర్మాణం దాదాపుగా పూర్తికావొచ్చింది. ఇప్పటికే సిబ్బంది, కేసుల విభజన కూడా పూర్తయింది. సంక్రాంతి సెలవుల అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కేసుల విచారణ అమరావతి కేంద్రంగానే జరుగుతుంది.

అమరావతి కేంద్రంగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత న్యాయస్థానం దేశంలో 25వ హైకోర్టు. ''ప్రతీ రాష్ట్రానికీ ప్రత్యేకంగా ఒక హైకోర్టు ఉండాలని రాజ్యాంగంలోని 214వ అధికరణం చెబుతోంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని చట్టంలోని సెక్షన్‌ 31 ప్రకారం ఏపీకి ప్రత్యేకంగా హైకోర్టు ఏర్పాటు కావాలి. అది ఏర్పడేదాకా, ప్రస్తుత హైకోర్టే రెండు రాష్ట్రాలకూ ఉమ్మడిగా పనిచేయాలని సెక్షన్‌ 30(ఎ) చెబుతోంది.

హైకోర్టు విభజనకు సంబంధించి దాఖలైన ఓ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై ఇచ్చిన తీర్పులో జనవరి 1లోగా హైకోర్టు విభజనకు అభ్యంతరాల్లేవని, సంబంధిత అధికారి నోటిఫికేషన్‌ జారీ చేయవచ్చని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది.

దీనిపై తగు చర్యలు తీసుకొని జనవరి 1 నాటికి ఏర్పాటయ్యేలా చూడాలని కేంద్రాన్ని ఆదేశించింది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఏర్పాటుచేస్తూ రాష్ట్రపతి నోటిఫికేషన్‌ జారీ చేశారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న హైకోర్టు జనవరి 1 నుంచి తెలంగాణ రాష్ట్ర హైకోర్టుగా రూపాంతరం చెందుతుంది'' అని కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి రాజీందర్‌ కశ్యప్‌ బుధవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఫొటో సోర్స్, Nara Chandrababu Naidu/Facebook

మూడో ఫ్రంట్‌ అయ్యే పని కాదు

కేసీఆర్‌తో ఏ ఫ్రంటూ అయ్యే పనికాదని, నిన్నటి వరకూ ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరిట పర్యటనలు చేసిన ఆయన బుధవారం ప్రధాని మోదీతో భేటీ కావడమే అందుకు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారని ఈనాడు తెలిపింది.

ఈ భేటీలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఆయన ప్రధానిని కలిసింది తెలంగాణ సమస్యలు విన్నవించేందుకా? ఫెడరల్‌ ఫ్రంట్‌ భేటీల సారాంశాన్ని వివరించేందుకా? అన్న దానిపై సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. కేసీఆర్‌ మాటలకు, పనులకు పొంతన లేదని, అందుకే వారిపై ఎవరికీ నమ్మకం లేకుండా పోతోందని అభిప్రాయపడ్డారు.

ఉండవల్లిలోని ప్రజావేదికలో బుధవారం ఆయన 'రైతు సంక్షేమం'పై శ్వేతపత్రం విడుదల చేశారు. అంతకుముందు తెదేపా కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ రెండు సందర్భాల్లో చంద్రబాబు మాట్లాడారు.

'దేశంలో భాజపా అనుకూల, వ్యతిరేక కూటములకే అవకాశముంది. మూడో కూటమికి ఆస్కారం లేదు. భాజపా, కాంగ్రెస్‌లలో ఏదో ఒక పార్టీ లేకుండా కూటమి సాధ్యం కాదు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ రెండింటిలో ఏదో ఒక పార్టీ లేకుండా కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడలేదు. దానినిబట్టే విధానం ఉండాలి తప్ప విశ్వామిత్ర సృష్టి చేసేస్తా. కొత్త వ్యవస్థ తీసుకొచ్చేస్తా? అని కేసీఆర్‌ ఎలా చెబుతారు? కేసీఆర్‌ ఏర్పాటు చేద్దామని భావిస్తున్న ఫెడరల్‌ ఫ్రంట్‌ సాకారమయ్యే పరిస్థితులు లేవు.’

‘ఆయన అయోమయం సృష్టిస్తున్నారు. ఒడిశా సీఎంను కేసీఆర్‌ కలిసిన వెంటనే నవీన్‌ పట్నాయక్‌ మనవద్దకు తన ఎంపీని పంపారు. జాతీయ స్థాయిలో మనం చేసే పోరాటానికి మద్దతుగా నిలుస్తామని సందేశం పంపించారు. మనపై జాతీయ స్థాయిలో ఒక నమ్మకం ఉంది. మన పరపతికి ఇదొక నిదర్శనం. మమతా బెనర్జీని కేసీఆర్‌ కలిసినా ఆమె ఒక ముఖ్యమంత్రి వస్తే చర్చించినట్లు మాట్లాడారే తప్ప ఎక్కడా మద్దతు పలుకుతున్నట్లుగా ఏమీ మాట్లాడలేదు’అని చంద్రబాబు పేర్కొన్నారని ఈనాడు వెల్లడించింది.

ఫొటో సోర్స్, High court website

‘ఘోరతప్పిదాన్ని ఎలా సరిచేస్తారు’?

జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో తెలుగు మీడియం అభ్యర్థులకు 14 ప్రశ్నలను ఎటువంటి అనువాదం లేకుండా ఇంగ్లీష్‌లో ఇవ్వడాన్ని హైకోర్టు ప్రాథమికంగా తప్పుపట్టిందని సాక్షి వెల్లడించింది.

దీనిని ఘోర తప్పిదంగా అభివర్ణించింది. పోటీ పరీక్షల్లో ఒక్కో మార్కు కూడా అభ్యర్థి జీవితాన్ని తారుమారు చేస్తుందని, అటువంటిది 14 ప్రశ్నలను ఇంగ్లిష్‌లోనే ఇచ్చారంటే అభ్యర్థులు 14 మార్కులు కోల్పోయినట్లేనని బుధవారం హైకోర్టు వ్యాఖ్యానించింది.

తెలుగు మీడియంలో పరీక్ష రాసిన అభ్యర్థుల 4.62 లక్షల మంది పరిస్థితి ఏంటని, ఈ ఘోర తప్పిదాన్ని ఎలా సరి చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. చేసిన తప్పును ఒప్పుకుని దానిని సరిదిద్దుకోవాలే తప్ప, సమర్థించుకోవడం సరికాదని ప్రభుత్వానికి హితవు పలికింది.

పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికైన అభ్యర్థులకు నియామకపు పత్రాలు ఇవ్వొద్దంటూ ఇటీవల ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసే ప్రసక్తే లేదని జస్టిస్‌ ఎమ్మెస్‌ రామచంద్రరావు తేల్చి చెప్పారు.

తమకు స్పష్టత వచ్చేంత వరకు ఆ మధ్యంతర ఉత్తర్వులు యథాతథంగా కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ 14 ప్రశ్నల విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.

మొత్తం 6 ప్రశ్నలకు తుది కీలో ఇచ్చిన సమాధానాలు తప్పుగా ఉన్నాయంటూ అభ్యర్థులు చెబుతున్న నేపథ్యంలో వాటి విషయంలో ప్రభుత్వ వైఖరేంటో తెలపాలంటూ.. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారని సాక్షి తెలిపింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)