గర్భిణికి HIV రక్తం: నేరం బ్లడ్ బ్యాంక్‌దా? రక్తం ఇచ్చిన 19 ఏళ్ల కుర్రాడిదా?

గర్భిణికి HIV రక్తం: నేరం ఎవరిది? బ్లడ్ బ్యాంక్‌దా? రక్తం ఇచ్చిన 19 ఏళ్ల కుర్రాడిదా?

ఫొటో సోర్స్, DESHAKALYAN CHOWDHURY

తమిళనాడులోని విరుదునగర్ జిల్లా శివకాశి ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణికి హెచ్‌ఐవీ బాధితుని రక్తం ఎక్కించారు. అయితే ప్రస్తుతం ఆమె గర్భంలో ఉన్న శిశువుకు హెచ్ఐవీ సోకకుండా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

సాత్తూరుకు చెందిన ఓ మహిళకు శివకాశి ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ వ్యక్తి రక్తం ఎక్కించారు. కొన్ని రోజుల తర్వాత ఆమెకు రక్తదానం చేసిన 19 ఏళ్ల యువకుడు.. స్వయంగా ఆస్పత్రికి వచ్చి, తనకు హెచ్ఐవీ ఉందని వెల్లడించాడు. అంతకు ముందు హెచ్ఐవీ ఉన్న సంగతి తనకు తెలియదని ఇప్పుడే ఆ విషయం తెలిసిందని ఆ యువకుడు పేర్కొన్నాడు.

తను దానం చేసిన రక్తాన్ని ఎవరికి ఎక్కించారన్న విషయాన్ని ఆరా తీయడం ప్రారంభించాడు.

ఫొటో సోర్స్, Hindustan Times

ఈ నేపథ్యంలో ఎనిమిది నెలల గర్భిణికి ఇతని రక్తం ఎక్కించినట్లు తేలింది. ప్రస్తుతం ఆ గర్భిణికి, గర్భంలోని శిశువుకు చికిత్స అందిస్తున్నట్లు వైద్య అధికారులు తెలిపారు.

రాష్ర్ట ఆరోగ్య శాఖ ఉప కార్యదర్శి రాధాకృష్ణన్ రక్తం సేకరించిన బ్లడ్ బ్యాంక్ వద్దకు వెళ్లి విచారించారు.

అనంతరం బ్లడ్ బ్యాంకుకు చెందిన ముగ్గురు సీనియర్ ఉద్యోగులను పదవి నుంచి తొలగించామని అధికారులు తెలిపారు.

ఇది వైద్య రంగంలో ఓ విపత్తుగా అధికారులు తెలిపారు. బాధిత మహిళకు అవసరమైన వైద్యం అందించి, ఆమె డిగ్రీ పూర్తి చేసి ఉండటంతో.. ప్రసవం తర్వాత ఆమెకు, ఆమె భర్తకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

ఫొటో సోర్స్, SHAMMI MEHRA

ఈ ఘటనతో ఆ ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తం ఎక్కించుకున్న వారు కాస్త ఆందోళనలో ఉన్నారు.

రక్త దానం చేసే ఆర్.శరవణన్ బీబీసీతో మాట్లాడుతూ.. రక్త దాన శిబిరాల్లో రక్తం సేకరించేటపుడు తగిన పరిశోధనలు, పరీక్షలు చేయాల్సిన అవసరాన్ని ఈ ఘటన సూచిస్తోందని చెప్పారు.

ఫొటో సోర్స్, MONEY SHARMA

''నేను 12 ఏళ్లుగా రక్త దానం చేస్తున్నాను. ఒకరు క్రమం తప్పకుండా రక్తదానం చేస్తున్నా. పరీక్షల తర్వాత ఆ రక్తాన్ని ఇంకొకరికి ఎక్కించాలి. గతంలో మేం నిర్వహించిన రక్తదాన శిబిరంలో హెచ్ఐవీ బాధితుడు ఒకరు రక్తదానం చేశారు. తర్వాత పరీక్షల్లో ఆ విషయం బయటపడింది. దీంతో ఆ రక్తాన్ని బ్లడ్ బ్యాంకుకు పంపకుండా ఆపేశాం. సదరు వ్యక్తిని గుర్తించి, ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తున్నాం'' అని శరవణన్ చెప్పారు.

మహిళకు హెచ్ఐవీ రక్తం దానం చేసిన కుర్రాడు బుధవారం ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)