అమరావతిలో ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన: అంత ఎత్తైన భవనాన్ని ఎలా నిర్మిస్తారు?

ఏపీ అసెంబ్లీ భవనం నమూనా స్కై స్క్రాపర్స్ స్కై స్క్రాపర్ ఆకాశ హర్మ్యాలు

ఫొటో సోర్స్, APCRDA

అమ‌రావ‌తిలో నూత‌న స‌చివాల‌యం భ‌వ‌నానికి శంకుస్థాప‌న జ‌రిగింది.

రాయపూడి-కొండమరాజుపాలెం వద్ద ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చేతుల మీదుగా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

సచివాలయ భవనాల నిర్మాణానికి సంబంధించిన‌ రాఫ్ట్‌ ఫౌండేషన్‌ను కాంక్రీట్‌తో నింపే కార్యక్రమం ప్రారంభ‌మ‌య్యింది.

మాస్ కాంక్రీట్ ప‌ద్ధ‌తిలో రాఫ్ట్ ఫౌండేష‌న్ నింపే కార్య‌క్ర‌మం ఈనెల 29 నాటికి పూర్త‌వుతుంద‌ని సీఆర్డీయే అధికారులు తెలిపారు. 72 గంట‌ల పాటు నిరాటంకంగా ఈ ప‌నులు జ‌రుగుతాయ‌న్నారు.

225 మీటర్ల ఎత్తులో...

ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌చివాల‌య స‌ముదాయాన్ని ఐదు ట‌వ‌ర్లుగా నిర్మిస్తున్నారు. అందులో నాలుగు ట‌వ‌ర్లు వివిధ శాఖాధిపతుల‌కు కేటాయిస్తారు. సీఎం ట‌వ‌ర్‌గా పిలుస్తున్న ప్ర‌ధాన నిర్మాణాన్ని 225 మీట‌ర్ల ఎత్తులో 50 అంత‌స్తుల్లో నిర్మిస్తున్నారు. మొత్తం 69.8ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఈ ట‌వ‌ర్ల నిర్మాణం ఉంటుంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ భ‌వ‌నంపై 250 మీట‌ర్ల (సుమారు 820 అడుగుల) ఎత్తులో స్పైక్ ట‌వ‌ర్ నిర్మిస్తున్నారు. దానిపైన 80 మీట‌ర్ల ఎత్తు నుంచి లిఫ్ట్ ఏర్పాటు చేసి అమ‌రావ‌తి న‌గ‌ర ద‌ర్శ‌నానికి అనుగుణంగా తీర్చిదిద్ద‌బోతున్న‌ట్టు సీఆర్డీయే క‌మ్యూనికేష‌న్స్ విభాగ ఇన్ఛార్జ్ హ‌నుమంత‌రావు తెలిపారు.

కానీ వందల మీటర్ల ఎత్తులో నిర్మించే అలాంటి ఒక ఆకాశ హర్మ్యాన్ని గాల్లో ఠీవిగా నిలిచిపోయేలా ఎలా కడతారు?

అంత ఎత్తున నిర్మించే భవనాలకు పునాదులు ఏ నేలలో ఎంత గట్టిగా ఉండాలి?

ప్రకృతి ఉత్పాతాలను తట్టుకుని నిలబడేలా స్కై స్కాపర్స్‌ నిర్మాణంలో ఎలాంటి పద్ధతులు ఉపయోగిస్తారు?

ఫొటో సోర్స్, APCRDA

ఎత్తైన భవనం ఎలా కడతారు?

అభివృద్ధి చెందిన నగరాల్లో వందల అంతస్తులు ఉన్న భారీ భవనాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. వాటిని చాలా ప్రతిష్టాత్మకంగా, వింత డిజైన్లతో నిర్మిస్తారు.

రద్దీగా మారుతున్న నగరాల్లో అదనపు స్థలం కోసం ఒక పరిష్కారం అందించడంతోపాటు, భవిష్యత్తులో ఆ నగరం ఆకాంక్షలు నెరవేరడానికి కూడా ఈ ఎత్తైన భవనాలు ఒక మార్గంగా మారుతాయి.

20వ శతాబ్దంలో ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనం ఉన్న నగరం అనిపించుకునేందుకు న్యూయార్క్, చికాగో పోటీపడ్డాయి. అప్పట్లో న్యూయార్క్‌లో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, చికాగోలో సీర్స్ టవర్ అత్యంత ఎత్తైన భవనాలుగా ఉండేవి.

కానీ 21వ శతాబ్దం వచ్చేసరికి చైనా, యుఏఈ ఆకాశ హర్మ్యాల రేసులో చాలా ముందుకు వెళ్లిపోయాయి. ఇప్పుడు ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా నిలిచిన ఒకే ఒక్క భవనం దుబయ్‌లోని బుర్జ్ ఖలీఫా మాత్రమే.

ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనాలు ఇవే..

2018 నవంబర్ నాటికి ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనాల జాబితా. (నిర్మాణం పూర్తయినవి)

అయితే ఎంత ఎత్తుగా ఉంటే, అంత పేరు తెచ్చుకునే ఈ ఆకాశ హర్మ్యాలను ఇంజనీర్లు పడిపోకుండా ఎలా కట్టకలరు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

బుర్జ్ ఖలీఫా, దుబై

పునాదులే కీలకం

నిర్మాణ రంగంలో ఇంజనీరుగా ఉన్న రోమా అగర్వాల్ ఇలాంటి భవనాలను డిజైన్ చేస్తున్నప్పుడు ఎన్నో సవాళ్లు ఎదుర్కున్నారు.

వేల టన్నుల బరువుండే ఆ కట్టడాలు భూమ్యాకర్షణ శక్తిని తట్టుకుని అంత ఎత్తున నిలబడాలంటే చాలా కష్టం. కానీ అలా అని ప్రపంచంలో ఆకాశ హర్మ్యాల నిర్మాణం ఆగిపోలేదు. మరింత జోరుగా సాగుతోంది.

ఎలాంటి నేల అయినా, ఎడారులు, సముద్ర తీరాల్లో కూడా ఇప్పుడు ఇంజనీర్లు ఆకాశ హర్మ్యాలకు ప్రాణం పోసేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

లండన్‌లోని షార్డ్ టవర్ బరువు 18 వేల టన్నులు. ఇంత బరువును పునాదుల్లో ఉన్న ఒక కాంక్రీట్ స్లాబ్, కాంగ్రీట్ పిల్లర్లు మోస్తున్నాయి

మెత్తటి నేలలో ఎత్తైన నిర్మాణం ఎలా సాధ్యం?

ఒక భవనాన్ని నిలబెట్టాలంటే పునాదులు చాలా కీలకం. కానీ ప్రపంచంలో కనిపించే చాలా ఆకాశ హర్మ్యాలు ఉన్నది గట్టి నేలపై కాదు.

లండన్‌లో చాలా భవనాలను మెత్తటి మట్టి ఉన్న నేలపైనే నిర్మిస్తున్నారు. వాటిలో పశ్చిమ ఐరోపాలోనే అత్యంత ఎత్తైన భవనమైన 95 అంతస్తుల షార్డ్ టవర్ కూడా ఉంది. దానికి పునాదులు వేయడానికి భూగర్భంలో చాలా లోతుగా తవ్వారు.

షార్డ్ టవర్‌ను ఒక పెద్ద కాంక్రీట్ శ్లాబ్‌పైన కట్టారు. వందలాది కాంక్రీట్ పిల్లర్లపై అది ఉంది. భవనం మిగతా బరువును తట్టుకోవాలంటే మట్టి పైనుంచి లోపలకు 53 మీటర్ల లోతున గట్టి ఇసుక పొర తగిలేవరకూ ఆ కాంక్రీట్ పిల్లర్లు నింపాల్సి వచ్చింది.

షార్డ్ టవర్ కోసం పునాదులను న్యూయార్కులో ఉన్న ఎత్తైన భవనాలకంటే చాలా లోతుగా తవ్వారు. ఎంపైర్ స్టేట్ భవనం పునాదులకోసం భూమిలోపల 16 మీటర్ల లోతు మాత్రమే తవ్వారు.

చికాగోలోని మోంటాక్ బ్లాక్ భవనం కట్టడానికి ఫ్లోటింగ్ రాఫ్ట్ ఫొండేషన్ వ్యవస్థను ఉపయోగించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

బుర్జ్ ఖలీఫా

ఎడారి నేలలో ఎత్తైన భవనం

గట్టి నేలల్లోనే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, ఎడారి ఇసుకలో ప్రపంచంలో ఎత్తైన బుర్జ్ ఖలీఫాను నిర్మించడానికి ఏం చేసి ఉంటారు? ఎలాంటి ప్రక్రియ ఉపయోగించారు?

దుబయ్‌లో బుర్జ్ ఖలీఫాను నిర్మించడానికి పునాదులు వేయాలని అనుకున్నప్పుడు భూమి అడుగున మట్టి, ఇసుక, రాతి పొరల మధ్య ప్రవహించే ఉప్పు నీటి నుంచి పెను సవాలు ఎదురైంది.

ఇవి సముద్రం నీటి కంటే 8 రెట్లు ఉప్పగా ఉంటాయి. అంటే ఇవి సిమెంటు, ఇనుమును వేగంగా తినేస్తాయి.

దాంతో ఇంజనీర్లు ఈ భవనం కోసం ఉప్పు నీటిని కూడా తట్టుకోగలిగేలా ఒక ప్రత్యేకమైన కాంక్రీట్ ఉపయోగించాల్సి వచ్చింది.

ఇంజనీర్లు బుర్జ్ ఖలీఫా పునాదుల కోసం 'కాథొడిక్ ప్రొటెక్షన్' అనే ఒక ప్రక్రియను కూడా ఉపయోగించారు. ఇందులో పునాదుల్లోని కాంక్రీట్ బేస్‌లో ఉండే ఉక్కును కాపాడ్డానికి మరో లోహాన్ని కూడా జోడిస్తారు.

ఈ ప్రక్రియలో ఉప్పు నీళ్లు కాంక్రీట్ తినేస్తూ వచ్చినా లోపల ఉన్న మరో లోహం మాత్రమే తుప్పు పడుతుంది. బరువు మోస్తున్న ఉక్కు కడ్డీలకు ఎలాంటి నష్టం జరగదు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

సిటీకార్ప్ సెంటర్, న్యూయార్క్

భవనాలను వణికించే గాలులు

న్యూయార్క్‌లోని సిటీకార్ప్ సెంటర్ అనే సిటీగ్రూప్ సెంటర్ భవనానికి లోపల ఒక కౌంటర్ వెయిట్ మెకానిజం ఉంది.

అది ఈ భవనాన్ని భూకంపాలు, బలమైన గాలులు వచ్చినా తట్టుకోగలిగేలా చేస్తుంది.

పునాదులే కీలకం

ఆకాశహర్మ్యాలకు మరో శత్రువు కూడా ఉంది. అదే గాలి. బలమైన గాలులు వీచినపుడు ఎత్తుగా ఉన్న భవనాలు అటూఇటూ ఊగిపోతాయి.

గాలులు మనకంటే ఎత్తున వస్తుంటాయని మనం అనుకుంటాం. కానీ ఆ ప్రభావం మన కాళ్ల అడుగున కూడా ఉంటుంది. బలమైన గాలులు తోయడం వల్ల ఎత్తైన భవనాలు పునాదులు కదిలిపోవచ్చు.

కానీ ఆ భవనాల పునాదులు బుర్జ్ ఖలీఫాకు వేసినట్టు విశాలంగా వ్యాపించి ఉంటే, అవి కదిలే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

లండన్‌లోని ఘెర్కిన్ భవనం బయటి పిల్లర్స్

కోర్, ట్యూబ్ చాలా కీలకం

గాలుల తీవ్రతను తట్టుకోడానికి ఎత్తైన భవనాలకు బలమైన మధ్యభాగం లేదా 'కోర్' ఉండాలి. అంటే భవనానికి వెన్నెముకలా ఒక బలమైన కాంక్రీట్ గోడను కడతారు.

కానీ అది మాత్రమే సరిపోదు. దానికి మరికొన్ని ఇంజనీరింగ్ పరిష్కారాలు కూడా జోడించాలి. భవనం బయట బలమైన స్తంభాలు, బీములు ఉండాలి. బిల్డింగ్ లోపలంతా ఒక బలమైన ట్యూబ్ ఉండాలి. అవి ఎత్తైన భవనాలను లండన్లోని ఘెర్కిన్ టవర్లా వింతగా కనిపించేలా చేస్తాయి.

కోర్, ట్యూబ్ అనే రెండు వ్యవస్థల కలయికతో భవనాలు.. ఆకాశం అంచున ఠీవిగా నిలవగలవు.

టెక్నాలజీ

న్యూయార్క్‌లోని సిటీగ్రూప్ సెంటర్ లాంటి కొన్ని భవనాలు, గాలి ఏ దిశ నుంచి వీస్తున్నప్పటికీ.. దాన్ని తట్టుకునేలా ఒక కంప్యూటర్ వ్యవస్థను ఉపయోగిస్తాయి.

భవనంలోని ఈ కంప్యూటర్ వ్యవస్థ గాలులకు తగినట్లు భవనం లోపల ఉన్న భారీ బరువులను కదిలిస్తూ ఉంటుంది. గాలి ఉద్ధృతి పెరుగుతూ, తగ్గుతూ ఉన్నప్పుడు దానికి తగ్గట్టు ఇది భవనం బరువును తగ్గించడం, పెంచడం చేస్తుంటుంది.

ఇంకా నిర్మించని బయోనిక్ టవర్ పునాదులు చెట్ల వేర్లులా ఉండబోతున్నాయి. అవి భూగర్భంలో ఎన్నో మీటర్ల లోతు వరకూ నిర్మించబోతున్నారు. 300 అంతస్తుల ఎత్తున ఉండే ఈ భవనాన్ని హాంకాంగ్ లేదా షాంఘైలో నిర్మించాలని చైనా భావిస్తోంది. దీని ఎత్తు 1228 మీటర్లు ఉండనుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)