వేధిస్తున్నాడని... పిలిచి మర్మాంగం కోసేసింది

ప్రతీకాత్మక చిత్రం
తనను రెండేళ్లుగా వేధిస్తున్నాడని ఓ మహిళ ఆ యువకుడి మర్మాంగం కోసేశారు. ఈ విషయాన్ని ముంబయి పోలీసులు బీబీసీ న్యూస్ తెలుగుకు ధృవీకరించారు.
అసలేం జరిగింది..
ముంబయిలోని కల్యాణ్ డోంబ్యూలీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మన్పాద పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ (క్రైమ్) జీఎస్ గోరె బీబీసీ తెలుగుకు తెలిపిన వివరాల మేరకు.. బాధితుడి పేరు తుషార్ పుజారే. వయసు 27.
అతను థానే లోని ఓ ప్రైవేటు గృహరుణ సంస్థలో పని చేస్తున్నాడు. ఇతనికి రెండేళ్ల కిందట, తమ అపార్ట్మెంట్లో నివసించే రచనా గోథోస్కర్ (42) అనే మహిళతో పరిచయం ఏర్పడింది.
భర్త మరో చోట పని చేస్తుంటంతో ఆమె ఒంటరిగా ఉంటున్నారు. దీన్ని అవకాశంగా చేసుకుని, రచనను గత రెండేళ్లుగా వేధిస్తున్నాడని పోలీసులు తెలిపారు. చివరకు తమ మధ్య అక్రమ సంబంధం ఉందని రచన భర్తకు కూడా అతడు చెప్పినట్లు ఇన్స్పెక్టర్ గోరే వెల్లడించారు.
దీంతో ఆగ్రహానికి గురైన రచన పుజారేను ఎవరూ లేని నాంగావ్ టేక్డీ అనే చోటుకు రమ్మని చెప్పి మరో ఇద్దరు స్నేహితుల సహాయంతో, పుజారే మర్మాంగాన్ని కోసేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
ప్రస్తుతం తుషార్ పూజారేకి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
రచనా గోథోస్కర్, ఆమె స్నేహితులను అదుపులోకి తీసుకుని, సెక్షన్ 307, 352, 342,120బి కింద కేసు నమోదు చేశామని ఇన్స్పెక్టర్ గోరె చెప్పారు.
ఫొటో సోర్స్, Getty Images
ముంబయి
పోలీసులకు ఎలా తెలిసింది..
పుజారేపై దాడి జరిగిన తర్వాత నిందితులే అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అక్కడి నుంచి పోలీసులకు సమాచారం అందింది.
పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా.. అక్కడ రక్తంతో తడిసిన చాకు దొరికింది. ఇప్పుడు పుజారే పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పినట్లు గోరె వెల్లడించారు.
నిందితులకు ఈ నెల 30 వరకు పోలీసు రిమాండ్ విధించారని, ప్రస్తుతం స్టేషన్లోనే వారిని విచారిస్తున్నట్లు చెప్పారు.
బాధితుడి సోదరుడు స్వప్నీ పూజారే.. ఈ ఘటనపై మాట్లాడుతూ.. '' వాళ్లు ప్లాన్ చేసి దాడి చేశారు. ఆమె చెప్పిందంతా అబద్దం. మహిళ చెప్పింది కదా అని గుడ్డిగా నమ్మలేం కదా. నా తమ్ముడు వంద శాతం కరెక్ట్ అని చెప్పను. కానీ అలా దాడి చేయడం మాత్రం తప్పు. ఆమెకు ఎలాంటి దురుద్దేశం లేకపోతే అంతదూరం ఎలా వెళుతుంది? ఇద్దరి మధ్య నిజంగా ఏదో సంబంధం ఉందని నాకు అనుమానం'' అని పేర్కొన్నారు.
నిందితురాలు రిమాండ్లో ఉండటం వల్ల ఆమెతో మాట్లాడటానికి వీలు కాలేదు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)