ఈ-కామర్స్ కంపెనీలకు కొత్త నిబంధనలు, ఆన్‌లైన్ షాపింగ్‍ చేసేవారి 'అచ్ఛే దిన్' ముగిసినట్టేనా?

అమెజాన్ సేల్స్ బంద్

ఫొటో సోర్స్, Getty Images

విదేశీ కంపెనీల పెట్టుబడులు కలిగిన ఆన్‌లైన్ విక్రయ సంస్థలు, ఆ కంపెనీల ఉత్పత్తులను తమ మార్కెట్ ద్వారా అమ్మరాదంటూ భారత ప్రభుత్వం నిషేధం విధించింది.

అమెజాన్ డాట్ కాం, వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ లాంటి ఈ-కామర్స్ కంపెనీలకు కఠిన నిబంధనలు విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీలకు ఏ కంపెనీల్లో వాటాలు ఉంటాయో అలాంటి ఉత్పత్తులను అవి అమ్మకూడదని తెలిపింది.

దీనిపై ఒక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం "ఈ కంపెనీలు ఇక వస్తువులు అమ్మే కంపెనీలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకోవడం కుదరదని" చెప్పింది. ఫిబ్రవరి నుంచి కొత్త నిబంధనలు అమలు అవుతాయని తెలిపింది.

చిన్నపాటి కిరాణా కొట్లు భారత రిటైల్ మార్కెట్‌ను శాసించేవి. కానీ, ఆన్‌లైన్ విక్రయసంస్థలు వచ్చాక ఈ పరిస్థితి పూర్తిగా మారింది.

ఈ- కామర్స్ కంపెనీల వల్ల తమ వ్యాపారం దెబ్బతింటోందని చిరు వ్యాపారులు, వ్యాపారవేత్తలు గతకొంతకాలంగా ఫిర్యాదు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ప్రత్యేక ఒప్పందాలకు చెక్

దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను కలిగి ఉన్న ఫ్లిప్‌కార్ట్‌ - వాల్‌మార్ట్స్ గ్రూప్, అమెజాన్‌ లాంటి ఈ కామర్స్ సంస్థలపై కొన్ని నిబంధనలు విధించింది.

ఈ కామర్స్ సంస్థల్లో ఏదేని విదేశీ సంస్థ కొంత వాటాను కలిగివుంటే ఆ కంపెనీ ఉత్పత్తులను విక్రయించకూడదని పేర్కొంది.

''ఈ-కామర్స్ కంపెనీ, లేక దాని గ్రూపుకు చెందిన మరేదైనా కంపెనీ.. ఒక సంస్థలో షేర్లు కలిగివుంటే, ఆ సంస్థకు చెందిన ఉత్పత్తులను తమ వేదిక(.com) ద్వారా విక్రయించరాదు'' అని భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

వివిధ ఉత్పత్తులను తయారు చేసే సంస్థలతో ఈ కామర్స్ కంపెనీలు ప్రత్యేక ఒప్పందాలు చేసుకోకూడదని తెలిపింది.

కానీ ఇదెలా జరుగుతుంది. నిజానికి ఈ-కామర్స్ కంపెనీలు తమ హోల్‌సేల్ యూనిట్ లేదా గ్రూప్‌లోని ఇతర కంపెనీల ద్వారా భారీ స్థాయిలో కొనుగోళ్లు జరుపుతుంది.

అవి ఆ కంపెనీకి తమ ఉత్పత్తులు అమ్ముతాయి. ఇలాంటి కంపెనీలకు దానితో భాగస్వామ్యం గానీ, ఒప్పందాలు గానీ ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images

క్యాష్‌బ్యాక్ ఆఫర్లలో వివక్ష వద్దు

ఈ కంపెనీలు తర్వాత వేరే కంపెనీలు లేదా, వినియోగదారులకు నేరుగా ఉత్పత్తులు అమ్మగలవు. ఎందుకంటే ఉత్పత్తుల ధర మార్కెట్ రేటు కంటే తక్కువగా ఉంటుంది. అందుకే అవి చాలా వరకూ డిస్కౌంట్ ఇవ్వగలవు.

ఉదాహరణకు ఓ చైనా మొబైల్ కంపెనీ తన నూతన ఉత్పత్తులను మొదట కేవలం ఒక ఈ కామర్స్ వైబ్‌సైట్ నుంచే విక్రయిస్తోంది. ఇకపై అలా చేయడానికి వీలుండదు.

అలాగే, ఈ -కామర్స్ కంపెనీలు ప్రభుత్వ నిబంధనలను పాటించామని ధృవీకరిస్తూ, గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ నివేదికను సెప్టెంబరు 30 లోపు ఆర్‌బీఐకి అందించాలని కూడా ఆదేశించింది.

ఈ కామర్స్ సంస్థలు.. వినియోగదారుడికి ఇచ్చే క్యాష్ బ్యాక్ ఆఫర్‌లలో వివక్ష చూపకుండా, న్యాయంగా ఉండాలని తెలిపింది. భారత రీటైలర్లు, వ్యాపారుల ఫిర్యాదులతోనే ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు.

ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీలు తమ సహచర కంపెనీల వస్తువును తమ అదుపులో ఉంచుకుంటాయి. లేదా వాటి అమ్మకాల కోసం ప్రత్యేక ఒప్పందం చేసుకుంటాయి.

ఫొటో సోర్స్, Getty Images

చిన్న వ్యాపారులకు ఊరట

అలా అమ్మకాలు చేయడం వల్ల మార్కెట్లో వాటికి చట్టవిరుద్ధంగా ప్రయోజనాలు లభిస్తాయి. అవి వినియోగదారులకు చాలా తక్కువ ధరలకు ఉత్పత్తులను అమ్మగలుగుతాయి.

కొత్త నియమాలు దేశంలోని చిన్న వ్యాపారులకు ఊరట కల్పిస్తుంది. వారంతా అమెరికాకు చెందిన ప్రముఖ కంపెనీలు ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాం ద్వారా భారత రీటైల్ బజారును వెనక్కు నెడుతోందని భయపడుతూ వచ్చారు.

ప్రభుత్వ ఆదేశాలు అలాగే అమలైతే ఈ-కామర్స్ కంపెనీల తక్కువ ప్రైసింగ్ విధానం, భారీ డిస్కౌంట్లు ఇచ్చే రోజులకు దెబ్బ పడవచ్చని కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ చెబుతోంది.

ఈ ఏడాది మేలో వాల్‌మార్ట్ 16 బిలియన్ డాలర్లకు ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేసింది.

అప్పుడే ఆ ఒప్పందాన్ని వ్యతిరేకించిన కన్ఫెడరేషన్ దానివల్ల ఏకపక్ష వాతావరణం నెలకొంటుందని, ప్రైసింగ్ విషయంలో ఈ-కామర్స్ కంపెనీలకు చిన్న వ్యాపారులతో పోలిస్తే తప్పుడు ప్రయోజనాలు అందుతాయని చెప్పింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)