PUBG మొబైల్ గేమ్‌పై మహారాష్ట్ర హైకోర్టు నిషేధం నిజమేనా? - BBC Reality Check
- ఫ్యాక్ట్ చెక్ బృందం
- బీబీసీ

ఫొటో సోర్స్, PUBG
వాదన: భారత్‌లో పాపులర్ మొబైల్ గేమ్ PubGని బహిరంగంగా ఎవరైనా ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని గుజరాత్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే, దేశంలో ఈ ఆటను ''మహారాష్ట్ర హైకోర్టు'' నిషేధించిందంటూ సోషల్ మీడియాలో మరో పోస్టు వైరల్ అయ్యింది.
వాస్తవం: అవి నకిలీ పోస్టులని మా పరిశీలనలో తేలింది. పూర్తి వాస్తవాల కోసం ఈ కథనం మొత్తం చదవండి.
ప్రస్తుతం అత్యంత పాపులర్ మొబైల్ ఆటల్లో PubG (ప్లేయర్ అన్నౌన్స్ బ్యాటిల్ గ్రౌండ్స్) ఒకటి. ఇది ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని ఆకర్షించింది. భారత దేశంలో ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకుంది.
ఈ గేమ్ తొలుత 2017 మార్చిలో విడుదలైంది. బ్యాటిల్ రాయలే అనే జపనీస్ థ్రిల్లర్ సినిమాను స్ఫూర్తిగా తీసుకుని ఈ ఆటను రూపొందించారు. ఇందులో, 100 మందిని ఒక దీవిలో దించుతారు. వారిలో అందరూ ఆయుధాలు అందుకుని పోరాడుతారు. ఆఖరికి ఎవరు మిగులుతారో వాళ్లే విజేత.
ఈ గేమ్‌కు వ్యతిరేకంగా ఉన్న రెండు పోస్టులు వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్, ట్విటర్లో వైరల్ అయ్యాయి.
ఫొటో సోర్స్, ugc
'మహారాష్ట్ర హైకోర్టు' జారీ చేసినట్లుగా చెబుతున్న నకిలీ ఉత్తర్వు
ఆ నోటీసులో అన్నీ తప్పులే
ముందు 'మహారాష్ట్ర హైకోర్టు' నోటీసులు జారీ చేసినట్లుగా చెబుతున్న బూటకపు పోస్టు గురించి చూద్దాం.
ఈ పోస్టులో పేర్కొన్న న్యాయస్థానం పేరే అనుమానం కలిగిస్తోంది. మహారాష్ట్ర హైకోర్టు అనే పేరుతో కోర్టు లేదు. ఆ రాష్ట్ర హైకోర్టును అధికారికంగా 'బాంబే హైకోర్టు' అని పిలుస్తారు.
’’మీకు తెలియజేయునది ఏమనగా... ఇక నుంచి పబ్జీ పనిచేయదు. అందుకు సంబంధించి టెన్సెంట్ గేమ్స్ కార్పొరేషన్‌కు లీగల్ నోటీసులు జారీ అయ్యాయి" అని ఆ నకిలీ నోటీసులో ఉంది.
అందులోనూ పలు అక్షర దోషాలు ఉన్నాయి. అధికారిక ఉత్తర్వుల్లో అలాంటి తప్పులు కనిపించడం చాలా అరుదు. ఉదాహరణకు, "magistrates" అనే పదాన్ని "majestratives" అని రాశారు.
ఈ ఉత్తర్వు మీద ప్రీజడ్జ్ ("prejudge") సంతకం చేసినట్లుగా ఉంది. నిజానికి, భారత న్యాయ వ్యవస్థలో "prejudge" అనే పోస్టు లేనేలేదు.
కే. శ్రీనివాసులు దాని మీద సంతకం చేసినట్లుగా ఉంది. అయితే, ఆ పేరు కలిగిన వ్యక్తులు బాంబే హైకోర్టులో ఉన్నట్లు ఎక్కడా ఆధారాలు దొరకలేదు.
ఫొటో సోర్స్, ugc
గుజరాత్ పోలీసులు జారీ చేసినట్లుగా చెబుతున్న నకిలీ నోటీసు
అది నకిలీ నోటీసు: గుజరాత్ పోలీసులు
ఇప్పుడు గుజరాత్ పోలీసులు జారీ చేసినట్లుగా చెబుతున్న నోటీసు గురించి చూద్దాం.
గుజరాతీ భాషలో రాసి ఉన్న ఈ నకిలీ నోటీసులో "ఎవరైనా పబ్జీ గేమ్‌ను బహిరంగంగా ఆడుతూ పట్టుబడితే, వారి మీద న్యాపరమైన చర్యలు తీసుకుంటాం. వారి మొబైల్ ఫోన్‌ను జప్తు చేస్తాం" అని ఉంది.
ఈ నోటీసును కాస్త పరిశీలిస్తే అది అధికారికంగా విడుదల చేసిందేనా? అన్న అనుమానం స్పష్టంగా వస్తుంది. ఆ నోటీసు మీద తేదీ లేదు. అధికారి సంతకం కూడా లేదు.
ఇందులోనూ కొన్ని వ్యాకరణ, అన్వయ దోషాలు ఉన్నాయి. అలాంటివి సాధారణంగా అధికారిక ఉత్తర్వుల్లో కనిపించవు.
ఈ నకిలీ పోస్టు ట్విటర్లోనూ బాగా చక్కర్లు కొడుతోంది.
అయితే, భగీరథ్ సింగ్ వాలా అనే ఓ వ్యక్తి ఈ పోస్టులో వాస్తవమెంతో తెలుసుకునేందుకు దానిని గుజరాత్ పోలీసుల అధికారిక ట్విటర్ హ్యాండిల్‌కు రీట్వీట్ చేశారు.
కొద్దిసేపటికే "అది నకిలీ పోస్టు. అలాంటి ఉత్తర్వులను గుజరాత్ పోలీసులు జారీ చేయలేదు" అని పోలీసులు తెలిపారు.
ఈ నకిలీ పోస్టుల వ్యాప్తి మీద టెన్సెంట్ గేమ్స్ సంస్థ ఇంకా స్పందించలేదు.
PubG అనేకమందిని ఆకట్టుకోవడంతోపాటు, పలు వివాదాలకు కూడా కారణమవుతోంది.
ఈ గేమ్ స్టోర్‌లో పెట్టిన ఓ ఫొటో జూలైలో వివాదానికి దారితీసింది. అది జపాన్ మిలిటరీ వినియోగించే చిహ్నంలా ఉందంటూ చాలామంది కొరియన్లు, చైనీయులు అభ్యంతరం చెప్పారు.
దాంతో ఆ చిత్రాన్ని తొలగించిన యాప్ రూపకర్తలు, అప్పటికే దాన్ని కొనుగోలు చేసిన వారికి నగదును వెనక్కి ఇచ్చేశారు.
ఇవి కూడా చదవండి:
- ఈ బంగారు కడ్డీల్లో ఏది నకిలీ?
- వేధిస్తున్నాడని.. పిలిచి మర్మాంగం కోసేసింది
- పెయిడ్ న్యూస్: ‘తెలంగాణ ఎన్నికల్లో రూ.100 కోట్ల చెల్లింపు వార్తలు’
- ఫేక్ న్యూస్: బూటకపు వార్తలను ఎలా గుర్తించాలి?
- విదేశాల్లో కరెన్సీ నోట్లను ముద్రిస్తే దేశానికి ప్రమాదమా?
- వాట్సాప్‌లో వదంతులను ఆపలేమా?
- చైనా నుంచి టీ రహస్యాన్ని ఆంగ్లేయులు ఎలా దొంగిలించారు?
- గగన్‌యాన్: ముగ్గురు భారతీయులు, ఏడు రోజులు, రూ.10 వేల కోట్ల వ్యయం
- చైనా నుంచి టీ రహస్యాన్ని ఆంగ్లేయులు ఎలా దొంగిలించారు?
- బ్యాంకు ఖాతాల అటాచ్‌మెంట్‌పై స్పందించిన మహేశ్ బాబు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)