హైకోర్టు విభజన: ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులకు ఇబ్బంది ఏంటి?

  • బళ్ల సతీశ్
  • బీబీసీ ప్రతినిధి
హైదరాబాద్ హైకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

తెలుగు రాష్ట్రాల హైకోర్టు విభజనకు తేదీ ఖరారైంది. జనవరి 1, 2019 నుంచి అమరావతిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రారంభం అవుతుందంటూ తాజాగా భారత రాష్ట్రపతి రాజపత్రం విడుదల చేశారు. దాంతో తమ దశాబ్దాల కల నెరవేరిందంటూ తెలంగాణ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తుండగా... ఇంత హడావుడిగా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు.

ఆంధ్ర తెలంగాణలు విడిపోయినప్పటి నుంచీ హైకోర్టు విభజనకు సంబంధించిన గొడవ నడుస్తోంది. అమరావతిలో భవన నిర్మాణాలు పూర్తవడానికి సమయం కోరుతూ వచ్చింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.

చివరకు 2018 డిసెంబరు 14 వరకు తేదీ ఇవ్వడంతో సుప్రీంకోర్టు ఆమేరకు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో జనవరి 1, 2019 నుంచి అమరావతిలో ఆంధ్ర హైకోర్టు ప్రారంభం అవుతుందంటూ రాజపత్రం విడుదల చేశారు రాష్ట్రపతి.

ఈ నోటిఫికేషన్ నేపథ్యంలో ఉమ్మడి హైకోర్టులో సందడి వాతావరణం ఏర్పడింది. ఎక్కడికక్కడ న్యాయవాదులు ఇదే అంశంపై చర్చించుకుంటూ కనిపించారు.

కేక్ కటింగులు, బాణా సంచా కాల్చడం, ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరు న్యాయవాదులు ప్రధాన న్యాయమూర్తిని కలిసి తమ సమస్యలు చెప్పుకోవడం అన్నీ జరిగాయి.

చిరకాల స్వప్నం తీరిన తెలంగాణ న్యాయవాదులు సంబరాలు చేసుకుంటుంటే, ఆంధ్ర న్యాయవాదులు మాత్రం గెజిట్ లో ఉన్న తారీఖుల విషయంలో ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్రం విడిపోయాక, ఎటూ విజయవాడ వెళ్లడం తప్పదని ఆంధ్ర న్యాయ వాదులకూ తెలుసు. అందుకు వారూ సిద్ధమయ్యారు. కానీ గెజిట్ లో కనీసం రెండు, మూడు నెలల సమయం ఉంటుందని వారు ఆశించారు. కానీ కేవలం ఐదు రోజుల తేడాతో గెజిట్ విడుదల చేయడం ఆంధ్రకు వెళ్లాలనుకున్న వారికి ఇబ్బందిగా మారింది.

ఫొటో సోర్స్, NCBN/Twitter

అమరావతి వెళ్లి ఎక్కడ ఉండాలి?

గెజిట్ ప్రకారం 1వ తేదీ నుంచి అంతా అమరావతి నుంచే జరగాలి. అంటే జడ్జీలు, లాయర్లు, కోర్టులు అంతా అక్కడే. తమకు ఈ సమయం సరిపోదని ఆంధ్రా న్యాయవాదులు అంటున్నారు.

తెలుగుదేశం, బీజేపీ గొడవలో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.

"ఛత్తీస్‌గఢ్ , ఉత్తరాఖండ్, ఝార్ఖండ్ హైకోర్టుల నోటిఫికేషన్లో 90 రోజుల గడువు ఇచ్చారు. కానీ ఆంధ్రకు మాత్రం 5 రోజులు ఇచ్చారు. మోదీ పగ తీర్చుకుంటున్నారు. ఐదు రోజుల్లో అమరావతి వెళ్లి ఎక్కడ ఉండాలి? సుప్రీం ఆదేశాల మేరకే అని చెప్పడం తప్పు. సుప్రీం ఆదేశాలిచ్చినప్పుడు ఆంధ్ర ప్రభుత్వాన్ని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. అక్కడ భవనాల బయటి పనులు అయిపోయాయి. లోపల ఇంటీరియర్ ఇంకా ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. కొన్ని కోర్టు హాళ్లు రెడీ అయ్యాయి. కొన్ని కాలేదు. పక్కాగా జనవరి ఒకటి నుంచి కోర్టు వెళ్లిపోవాలనుకుంటే రెండు నెలల ముందే నోటిఫికేషన్ ఇవ్వొచ్చు కదా" అని ప్రశ్నించారు హైకోర్టు న్యాయవాది సీతారాం.

"మేం ఆంధ్రకు వెళ్లడానికి మానసికంగా సిద్ధమయ్యాం. మేం ఏదో వెళ్లడం ఇష్టంలేక ఈ మాటలు చెప్పడం లేదు. అసలు రాజధానితో పాటే హైకోర్టు వెళ్లాలి. అప్పుడు తీసుకెళ్లలేదు. కానీ అప్పటికప్పుడు నాలుగు రోజులు గడువిచ్చి వెళ్లిపోమనడం ఏంటి? ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదిద్దరిదీ తప్పుంది. డిసెంబరు 14కల్లా అన్ని ఏర్పాట్లూ చేసేస్తామని అఫిడవిట్ వేయడం ఆంధ్ర ప్రభుత్వం చేసిన తప్పు. పిల్లల చదువులు, ఆఫీసుల తరలింపూ ఇవన్నీ చూసుకోవాలి. మామూలు ఇల్లు ఖాళీ చేయడానికి నెల రోజులు, ఆఫీసు ఖాళీ చేయడానికి రెండు నెలలూ టైం ఇస్తారు. అలాంటిది స్వయంగా హైకోర్టే ఇలా విభజిస్తే మిగిలిన వ్యవస్థ ఎలా ఉంటుంది? దీనిపై రివిజన్ పిటిషన్ వేద్దాం అన్న ఆలోచన ఉంది. నిర్ణయం తీసుకోలేదు. మా అసమ్మతి తెలుపుతూ ఆందోళన కూడా చేస్తాం." అన్నారు ఆంధ్రప్రదేశ్ కి చెందిన బార్ కౌన్సిల్ సభ్యులు నాగిరెడ్డి.

లాయర్లు కార్లలో వెళ్తారు, మరి ఫైళ్లు?

"చంద్రబాబు మీద ఉన్న పగను మామీద తీర్చుకుంటున్నారు. లేకపోతే ఏంటి? లాయర్లు విజయవాడకు కార్లు వేసుకుని వెళ్లిపోతారు. మరి ఫైళ్లు ఎవరు తెస్తారు? వేసవి సెలవుల తరువాత విభజన జరుగుతుంది అనుకున్నాం. ఇంత హడావుడిగా, ఫైళ్లను విభజించకుండా చేయాల్సిన అవసరం ఏముంది?" అని ప్రశ్నించారు హైకోర్టు సీనియర్ న్యాయవాది ఎంఎస్ఆర్ సుజాత.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

హైకోర్టు వద్ద తెలంగాణ న్యాయవాదులు (పాత చిత్రం)

దశాబ్దాల కల నెరవేరింది

అయితే తెలంగాణ న్యాయవాదుల వాదన మరోలా ఉంది. నిజానికి వారికిది ఎన్నాళ్లో వేచిన ఉదయం అనే చెప్పాలి. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో విభజనకు ఈ సమయం సరిపోతుందని వారు అంటున్నారు. "నాలుగు దశాబ్దాల కల. రెండు దశాబ్దాలుగా మేం దీని కోసం పోరాడుతున్నాం. అసలు రాష్ట్రంతో పాటే హైకోర్టు కూడా విడిపోతుంది అనుకున్నాం. కానీ, ఉమ్మడి రాజధాని కారణంతో ఇంత ఆలస్యమైంది. ఆంధ్రలో కొత్త భవనం పూర్తయింది. జడ్జీల విభజన పూర్తయింది. ఇక సిబ్బంది విభజన మాత్రమే మిగిలి ఉంది. జనవరి 3 నుంచి సంక్రాంతి సెలవులున్నాయి. ఈ నాలుగు రోజులు కూడా కోర్టు సెలవు ప్రకటిస్తే, విభజన సులువవుతుంది" తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు దామోదర రెడ్డి అన్నారు.

సిబ్బంది విభజన

హైకోర్టు సిబ్బందిలో 80 శాతం ఆంధ్ర ప్రాంతం వారు, 20 శాతం తెలంగాణ ప్రాంతం ఉంటారని తెలంగాణ న్యాయవాదులు చెబుతున్నారు. కానీ, సిబ్బంది విభజనకు ఆప్షన్లలో 80 శాతం మంది తెలంగాణలోనే ఉంటామన్నారు.

ప్రస్తుతానికి ఉద్యోగుల విభజనకు సంబంధించిన ఆదేశాలు ఇంకా రాలేదు. ఈ నాలుగు రోజుల్లోనే అది జరగాల్సి ఉంది.

మరోవైపు, తెలంగాణ సంఘాలకు కొన్ని అభ్యంతరాలున్నాయి. ఎక్కడ పుట్టారన్న దాని ఆధారంగా కాకుండా, సీనియారిటీ ఆధారంగా ఉద్యోగుల కేటాయింపు ఉంటుందన్న వార్తలను వారు వ్యతిరేకిస్తున్నారు.

సీనియర్లను తెలంగాణకు, జూనియర్లను ఆంధ్రకు ఇస్తే చాలా మంది తెలంగాణ వారు అమరావతి వెళ్లి అక్కడ ఉద్యోగం చేయాల్సి వస్తుందని దామోదర్ రెడ్డి అన్నారు. అదే జరిగితే తాము మళ్లీ పోరాడతామని ఆయన తెలిపారు.

"ఫైళ్ల బదిలీ, కేసుల బదిలీ, లాయర్లు మారడానికి తగిన సమయం ఇవ్వకుండా కేవలం భవనాలు ఉన్నాయని చెప్పి రాజకీయ కారణాలతో హైకోర్టు మార్చడంలో పారదర్శకత లోపించింది. దీనివల్ల ఏ ఉపయోగమూ లేదు. లాయర్లుగా మేం ఒక ప్రాంతానికి పరిమితం కాదు, దేశమంతా ప్రాక్టీస్ చేసే హక్కుంది. కానీ ఇలాంటి హడావుడి నిర్ణయాలు న్యాయ సేవలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఉదాహరణకు ఒకే కక్షిదారుకు చెందిన రెండు కేసులు వేర్వేరు కోర్టులకు విభజిస్తే, అప్పుడు వాళ్లు సుప్రీంకోర్టుకు వెళ్ళి ట్రాన్స్ఫర్ పిటిషన్ వేయాలి. విడాకులు, పిల్లల అప్పగింత, కుటుంబ వివాదాల్లో ఇలాంటివి చూస్తున్నాం. ఇదంతా కేసుల భారాన్ని పెంచుతుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తక్షణావసరం కోసం న్యాయవ్యవస్థ రాజీ పడి తక్కువ ప్రమాణాల మధ్య పనిచేయకూడదు" అని అభిప్రాయపడ్డారు విశాఖకు చెందిన లీగల్ ల్యాబ్స్ న్యాయవాది సాయి పద్మా మూర్తి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

హైకోర్టులో 42 శాతం మంది తెలంగాణ ప్రాంతం వారు ఉండేలా చూడాలంటూ రాష్ట్ర విభజనకు ముందు ఆందోళనలు జరిగాయి. (2010 సెప్టెంబర్ 17 నాటి చిత్రం)

ఎవరికేంటి?

తెలంగాణ

తెలంగాణలోని సామాన్య ప్రజలకు హైకోర్టు విభజన పెద్దగా మార్పు కనిపించకపోవచ్చు. కానీ, న్యాయవ్యవస్థలో ఉండే వారికి ఇది ముఖ్యమైన విషయం.

న్యాయ వ్యవస్థలో తెలంగాణ ప్రాంతంపై వివక్ష స్పష్టంగా కనిపించేదని చెబుతారు. 1956 నుంచి 2014 వరకూ ఉమ్మడి హైకోర్టులో కేవలం ఒక్కరంటే ఒక్క అడ్వకేట్ జనరల్ మాత్రమే తెలంగాణ వ్యక్తి ఉన్నారు. అది కూడా తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అడ్వొకేట్ జనరల్ పదవిలో తెలంగాణకు చెందిన సుదర్శన్ రెడ్డిని నియమించారు.

కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యే వరకూ 55 ఏళ్లలో ఒక్క తెలంగాణ వ్యక్తీ, హైకోర్టులో ఏజీ కాదు కదా, కనీసం పీపీ (పబ్లిక్ ప్రాసిక్యూటర్) ఉద్యోగం కూడా పొందలేకపోయారని.. ఇది వ్యవస్థీకృతమైన వివక్ష అని విమర్శిస్తారు తెలంగాణ న్యాయవాదులు.

జడ్జీల నియామకాల్లోనూ వారికి ఈ అభ్యంతరాలున్నాయి. అవన్నీ దాటుకుని ఇన్నాళ్లకు తెలంగాణకు సొంత హైకోర్టు రావడం తెలంగాణ వారికి భావోద్వేగ పూరితమైన అంశం.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

2011లో ప్రత్యేక రాష్ట్రం కోసం హైకోర్టు భవనంలో తెలంగాణ న్యాయవాదుల నిరసన

ఆంధ్రప్రదేశ్

1953కి ముందు ఆంధ్రప్రదేశ్‌కు మద్రాస్ హైకోర్టు ఉండేది. 1953 నుంచి 1956 వరకూ గుంటూరులో హైకోర్టు ఉండేది. ఆంధ్ర, తెలంగాణలు కలవడంతో అది 56లో హైదరాబాద్‌కు వచ్చేసింది.

1956 నుంచి 2014 మధ్యలో తమ ప్రాంతంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలంటూ రాయలసీమ, ఉత్తరాంధ్ర, గుంటూరుల్లో డిమాండ్లు వినిపించినా అవి బలమైనవి కావు.

ఇప్పుడు ఆంధ్రలో హైకోర్టు వస్తోంది. దీంతో విజయవాడ, గుంటూరు ప్రాంతంలో ఉండే న్యాయవాదులకు హైకోర్టుతో దగ్గరవుతుంది.

ఆంధ్రలోని చాలా ప్రాంతాల వారికి కేసుల కోసం హైదరాబాద్ రావాల్సిన ఇబ్బంది తప్పుతుంది. గంటల ప్రయాణం తగ్గుతుంది.

సచివాలయం ఇప్పటికే అమరావతిలో ఉండడంతో, అధికారులు కోర్టుకు సమాచారం ఇవ్వడం, ప్రభుత్వ న్యాయవాదులతో సంప్రదింపుల వంటి వాటికి అయ్యే సమయం బాగా తగ్గుతుంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

హైకోర్టు భవనం (పాత చిత్రం)

సామాన్యులకు వచ్చేదేంటి?

సామాన్య ప్రజలకు కావాల్సింది సత్వర న్యాయం. ఈ విభజన వల్ల అదేమైనా జరుగుతుందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జడ్జీలనే ఆంధ్రకు 58 - తెలంగాణకు 42 నిష్పత్తిల్లో కేటాయిస్తారు.

ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టులో ఉండాల్సిన జడ్జీలు 61 మంది. కానీ, వాస్తవంగా విధులు నిర్వహిస్తోంది 26 మంది. వారిలో 16 మందిని ఆంధ్రకు, 10 మందిని తెలంగాణకు కేటాయించారు.

కొత్త జడ్జీ పోస్టులు ఏర్పడడం సంగతి పక్కన పెడితే, ఉన్న జడ్జీ పోస్టులే పూర్తి స్థాయిలో భర్తీ చేయడం లేదని న్యాయవాదులు అంటున్నారు.

ఉమ్మడి హైకోర్టులో సుమారు రెండున్నర లక్షల పెండింగ్ కేసులు ఉన్నట్టు అంచనా.

ఏ రాష్ట్రం కేసు ఆ రాష్ట్రానికి వెళ్ళిపోతుంది. సిబ్బందినీ విభజిస్తారు. ఈ 26 మంది జడ్జీలూ కలసి ఆ రెండున్నర లక్షల కేసులను ఎంత త్వరగా తేల్చగలరన్న ప్రశ్న వేసుకుంటే, సామాన్యుడికి న్యాయం ఎంత త్వరగా దొరుకుతుందన్న ప్రశ్నకు సమాధానం లభిస్తుందన్నది న్యాయవాదుల మాట.

మరో సమస్య

'హైకోర్ట్ ఆఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ది స్టేట్ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్' - ఇది ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న హైకోర్టు పేరు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ హైకోర్టు అనో, హైదరాబాద్ హైకోర్టు అనో కాకుండా ఇంత పెద్దపేరు పెట్టారు.

ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే, భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఎంత సంక్లిష్టంగా, ప్రజలు అర్థం చేసుకోవడానికి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలంటారు కొందరు నిపుణులు.

ప్రస్తుతానికి గెజిట్లలో హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హైకోర్టు ఆఫ్ తెలంగాణ రావడం కాస్త ఊరట! అదే సరళత్వం న్యాయ పరిపాలనలో కొనసాగితే సామాన్యుడికి లాభం అని న్యాయనిపుణులు అంటున్నారు.

ఫొటో క్యాప్షన్,

రాష్ర్టపతి గెజిట్

హైకోర్టులో జడ్జీల కేటాయింపు ఇలా జరిగింది.

ప్రస్తుతం పూర్తి స్థాయి ప్రధాన న్యాయమూర్తి లేరు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి తొట్టత్తిల్ రాధాకృష్ణన్ తెలంగాణకు కొనసాగుతారు. ఆంధ్రకు కేటాయించిన వారిలో అత్యంత సీనియర్ అయిన చాగరి ప్రవీణ్ కుమార్ ఆంధ్రా తాత్కాలిక ఛీఫ్ జస్టిస్ గా వ్యవహరిస్తారు.

ఆంధ్రాకు కేటాయించిన వారు - వీరంతా జనవరి ఒకటి నుంచి అమరావతి వెళ్లాలి.

1. జస్టిస్ రమేశ్ రంగనాథన్ (ప్రస్తుతం ఉత్తరాఖండ్ ఛీఫ్ జస్టిస్ గా ఉన్నారు)

2. జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్

3. జస్టిస్ సరస వేంకట నారాయణ భట్టి

4. జస్టిస్ ఆకుల వేంకట శేష సాయి

5. జస్టిస్ దామా శేషాద్రి నాయుడు (ప్రస్తుతం కేరళ హైకోర్టులో ఉన్నారు)

6. జస్టిస్ మందాట సీతారామ మూర్తి

7. జస్టిస్ ఉప్మాక దుర్గా ప్రసాద రావు

8. జస్టిస్ తేల్లూరి సునీల్ చౌదరి

9. జస్టిస్ మల్లవోలు సత్యనారాయణ మూర్తి

10. జస్టిస్ గుడిసేవ శ్యాం ప్రసాద్

11.జస్టిస్ కుమారి జవలకర్ ఉమా దేవి

12.జస్టిస్ నక్కా బాలయోగి

13.జస్టిస్ తేలప్రోలు రజని

14.జస్టిస్ దూర్వాసుల వేంకట సుబ్రహ్మణ్య సూర్యనారాయణ సోమయాజులు

15.జస్టిస్ కొంగర విజయ లక్ష్మి

16.జస్టిస్ మంతోజ్ గంగా రావు

తెలంగాణకు కేటాయించిన వారు - వీరంతా హైదరాబాద్ లోనే కొనసాగుతారు.

1. జస్టిస్ పులిగోరు వేంకట సంజయ్ కుమార్

2. జస్టిస్ మామిడన్న సత్య రత్న శ్రీ రామచంద్ర రావు

3. జస్టిస్ అడవల్లి రాజశేఖర రెడ్డి

4. జస్టిస్ పొనుగోటి నవీన్ రావు

5. జస్టిస్ చాళ్ల కోదండరాం చౌదరి

6. జస్టిస్ బులుసు శివ శంకర రావు

7. జస్టిస్ షమీమ్ అక్తర్

8. జస్టిస్ పొట్లపల్లి కేశవ రావు

9. జస్టిస్ అభినంద్ కుమార్ శావిలి

10. జస్టిస్ తొడుపునూరి అమరనాథ్ గౌడ్

ఆర్ సుభాష్‌ రెడ్డి ప్రస్తుతం సుప్రీం కోర్టుకు ఎంపికయ్యారు. ఆయన తెలంగాణ ఆప్షన్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)