ట్రిపుల్ తలాక్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం... కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణ ఏంటి?

ముస్లిం మహిళ

ఫొటో సోర్స్, Getty Images

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది.

మధ్యాహ్నం 2 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ బిల్లును ప్రవేశ పెట్టి చర్చను ప్రారంభించారు.

అనంతరం వాడీవేడీగా చర్చ జరిగిన తర్వాత సాయంత్రం నిర్వహించిన ఓటింగ్‌లో బిల్లుకు ఆమోదం లభించింది.

ఈ బిల్లుకు అనుకూలంగా 245 మంది సభ్యులు ఓటు వేశారు. 11 మంది వ్యతిరేకంగా ఓటేశారు. దాంతో బిల్లు ఆమోదం పొందిందని స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.

ఈ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌తో పాటు అన్నాడీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

ఫొటో సోర్స్, Loksabha TV

కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణ ఏంటి?

ఒకేసారి ట్రిపుల్ తలాక్ చెప్పడాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే రాజ్యాంగ విరుద్ధం అని చెప్పింది.

ఈమెయిల్ లేదా టెక్ట్స్ మెసేజ్ ఎలా అయినా, ముస్లిం పురుషులు ఒకేసారి ట్రిపుల్ తలాక్ చెప్పే సంప్రదాయం చట్టవిరుద్ధం అని 2017 ఆగస్టులో సుప్రీంకోర్టు చెప్పింది.

గత ఏడాది లోక్‌సభలో పాస్ చేసిన బిల్లులో కేంద్ర కేబినెట్ కొన్ని సవరణలు చేసింది. దీంతో ఈ బిల్లు మళ్లీ లోక్‌సభకు వచ్చింది.

దీని ప్రకారం భార్యకు ఒకేసారి ట్రిపుల్ తలాక్ ఇచ్చి దోషి అయిన భర్తకు బెయిల్ ఇచ్చే నియమాన్ని బిల్లులో జోడిస్తారు. ఒక వేళ ఏ భర్త అయినా మహిళకు ఒకేసారి ట్రిపుల్ తలాక్ ఇచ్చేస్తే, బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు (ఎఫ్ఐఆర్) నమోదు చేస్తారు.

కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతోంది?

"భార్యాభర్తల మధ్య విభేదాలను పరిష్కరించాలనుకుంటే కొన్ని నియమాలు-షరతులతో మేజిస్ట్రేట్‌కు ఆ నేరం మాఫీ చేసే హక్కు ఉంటుంది" అని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.

ట్రిపుల్ తలాక్ మతవిశ్వాసాలకు సంబంధించిన అంశం కాదని, ఇది లింగ న్యాయం, లింగ సమానత్వం, మహిళల ప్రతిష్ట, మానవతా దృష్టితో లేవనెత్తిన అంశంగా కేంద్రం చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)