‘మీ న్యూ ఇయర్ పార్టీకి ఎంత పన్ను కట్టాలో తెలుసా’ :ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
కొత్త ఏడాది వేడుకలకు జీఎస్టీ కట్టాల్సిందేనంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో.. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నిర్వహించే వివిధ రకాల వినోదాత్మక కార్యక్రమాలకు ముందస్తుగా జీఎస్టీ చెల్లించాలని రాష్ట్ర పన్నుల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు.
పన్ను చెల్లించకుండా వేడుకలను నిర్వహించేవారికి పన్నుతోపాటు 100% జరిమానా విధిస్తామని హెచ్చరించారు. వినోదాత్మక కార్యక్రమాలపై 28% మేర జీఎస్టీని వసూలు చేయాలన్న నిబంధన ఉందని కమిషనర్ తెలిపారు.
రిజిస్టర్ చేసుకోని ఈవెంట్ ఆర్గనైజర్లు కొత్తసంవత్సరం వేడుకలకు ముందస్తుగానే చెల్లించాలని సూచించారు. వేడుకలకయ్యే వ్యయాన్ని అంచనా వేసి, దానిపై 28% చొప్పున పన్నును తమ వాణిజ్య పన్నుల సర్కిల్ కార్యాలయాల్లో చెల్లించాలని ఆయన తెలిపారు.
మరోవైపు నూతన సంవత్సరం సందర్భంగా మద్యం షాపుల వద్ద ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా వైన్ షాపులు, బార్ల యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ఇన్చార్జ్ కమిషనర్ సోమేశ్ కుమార్ సూచించినట్లు ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.
ఫొటో సోర్స్, facebook/TDP
‘కేంద్రంపై కసితోనే కడప ఉక్కుకు శంకుస్థాపన’
'కడపలో ఉక్కుపరిశ్రమకు పునాదిరాళ్లు వేయడం నా జీవితంలో మరచిపోలేను' అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారంటూ ఈనాడు దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..
కేంద్రం మనల్ని బానిసలుగా చూస్తోంది. కేవలం పన్నులు కట్టే యంత్రాలుగా చూస్తోంది. మన అభివృద్ధికి సహకరించకుండా ఇబ్బంది పెడుతోంది.
అందుకే బీజేపీతో పొత్తు వద్దనుకుని రాజీలేని పోరాటం చేస్తున్నా. విభజనచట్టం హామీలు నెరవేర్చకున్నా రాష్ట్ర ప్రభుత్వం వాటి సాకారానికి పోరాడుతోంది. అందులో భాగంగానే రాయలసీమ ఉక్కుకు పునాదిరాయి వేశా'' అని చంద్రబాబు అన్నారు.
''రాయలసీమ ఉక్కు పరిశ్రమకు కేంద్రాన్ని తాము డబ్బు అడగలేదని, చెల్లించాల్సిన పన్నులపైనైనా రాయితీ ఇవ్వాలని కోరామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. 'మొదటి దశలో రూ.18వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నాం. ఇది సవ్యంగా జరిగితే.. ఐదేళ్ల తర్వాత మలిదశలో రూ.15వేల కోట్లు పెడతాం. రెండుదశల్లో పదివేల ఉద్యోగాలు వస్తాయి. ఇతర అనుబంధ పరిశ్రమలు ఏర్పాటవుతాయి. రవాణా సౌకర్యాలు మెరుగవుతాయి. తద్వారా అదనంగా రూ.10వేల కోట్ల పెట్టుబడులు సమకూరే అవకాశం ఉంటుంది'' అని చంద్రబాబు మాట్లాడారని ఈనాడు కథనం పేర్కొంది.
ఫొటో సోర్స్, facebook/KCR
‘ట్రక్కు గుర్తు ఎవ్వరికీ ఇవ్వకండి..’
ట్రక్కు గుర్తును ఎన్నికల్లో ఎవ్వరికీ కేటాయించొద్దని తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎన్నికల సంఘాన్ని కోరినట్లు నవతెలంగాణ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..
ట్రక్కు, కెమెరా, ఇస్త్రీపెట్టే, హ్యాట్ సింబల్స్‌పై చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌తో సీఎం కేసీఆర్ చర్చించారు. వీటి వల్ల శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు నష్టం జరిగిందని వివరించారు.
గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లు కారు గుర్తును పోలి ఉండటంతో గందరగోళానికి గురైనట్టు తెలిపారు. దాదాపు 15 నియోజవర్గాల్లో అభ్యర్థులకు వెయ్యి నుంచి 15 వేల ఓట్ల నష్టం జరిగిందని ఈసీకి తెలిపారు.
మరికొన్ని నియోజకవర్గాల్లో వెయ్యి మేర ఓట్ల నష్టం వాటిల్లినట్టు చెప్పారు. గుర్తుతో పాటూ, అభ్యర్థి పేరును సైతం ఒకే విధంగా ఉండటంతో ఓటర్లు కమ్ఫ్యూజ్ అయ్యారని తెలిపారు.
అందువల్ల ట్రక్కు గుర్తును రానున్న రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఎవ్వరికీ కేటాయించొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటర్లకు అనువుగా గుర్తులు ఉండాలని, ఓటర్లను గందరగోళానికి గురి చేసే విధంగా ఉండకూడదని సీఎం చెప్పారు.
ఎన్నికల ముందే ఈ అంశంపై తాము కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్టు గుర్తు చేశారని నవతెలంగాణ పేర్కొంది.
ఫొటో సోర్స్, Getty Images
ప్రతీకాత్మక చిత్రం
హోంవర్క్ చేయలేదని నగ్నంగా నిలబెట్టారు!
స్కూలు పిల్లలను బట్టలువిప్పి నగ్నంగా నిలబెట్టిన ఘటన గురించి ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..
పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని, హోంవర్క్ చేయలేదనే కారణాలతో ఓ పాఠశాల ఉపాధ్యాయులు ఆరుగురు విద్యార్థులను ఎండలో నగ్నంగా నిలబెట్టారు.
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం ఎన్ఎ్సపేటలోని చైతన్య భారతి ఇంగ్లిష్ మీడియం స్కూల్లో 3, 4 తరగతుల విద్యార్థులు ఆరుగురు బుధవారం పాఠశాలకు ఆలస్యంగా వచ్చారు.
దీంతో టీచర్లు వారిని బట్టలు ఊడదీయించి పాఠశాల ఆవరణలో ఎండలో నిలబెట్టారు. ఈ విషయం గురువారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలెక్టర్ ప్రద్యుమ్న స్పందించి విచారణకు ఆదేశించారు.
స్కూల్ గుర్తింపును రద్దు చేసి మూత వేయించారు. పాఠశాల కరస్పాండెంట్ నాగరాజ నాయుడు, హెచ్ఎం భువనేశ్వరిపై జువైల్ జస్టిస్ యాక్ట్ అండ్ ఐపీసీ 323 ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు.
హైదరాబాద్‌కు చెందిన బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు ఈ ఘటనపై ఢిల్లీలోని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌లో అర్జెంట్ పిటిషన్ దాఖలు చేశారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)