గగన్‌యాన్‌: ముగ్గురు భారతీయులు, ఏడు రోజులు, రూ.10 వేల కోట్ల వ్యయం... 40 నెలల్లో మానవ సహిత అంతరిక్షయాత్ర

అంతరిక్షంపై ఆసక్తితో విష్ణు సుశీల్ అంగారకుడిపై భారతదేశ జాతీయ జెండా ఎగురుతున్నట్లు తయారు చేసిన ఊహా చిత్రం ఇది

ఫొటో సోర్స్, ISRO/facebook

ఫొటో క్యాప్షన్,

అంతరిక్షంపై ఆసక్తితో విష్ణు సుశీల్ అంగారకుడిపై భారతదేశ జాతీయ జెండా ఎగురుతున్నట్లు తయారు చేసిన ఊహా చిత్రం ఇది

మానవ సహిత అంతరిక్ష యాత్ర అయిన 'గగన్‌యాన్’ కార్యక్రమానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.

ఇందులో భాగంగా రెండు మానవరహిత, ఒక మానవసహిత యాత్రకు ప్రణాళికలు రూపొందించనున్నారు.

వీటిలో మొదటి మానవ సహిత అంతరిక్ష యాత్రను 40 నెలలలోపే నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ మొదటి దశ అంతరిక్షయాత్రకు 9023 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం గగన్‌యాన్ కార్యక్రమానికి ఆమోదముద్ర వేసింది.

భూమి దిగువ కక్ష్యలో జరిగే ఈ మానవ సహిత అంతరిక్ష యాత్రను కక్ష్య అవధి నుంచి గరిష్టంగా ఏడు రోజులపాటు నిర్వహించనున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

దీనికి జీఎస్ఎల్వీ మార్క్-3ని ఉపయోగిస్తారు. ఇందులో ఉండే ఆర్బిటల్ మాడ్యూల్‌లో ముగ్గురు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లడానికి అవసరమైన ఏర్పాట్లు ఉంటాయి.

జాతీయ ఏజెన్సీలు, విద్యాసంస్థలు, ఇతర సంస్థల సమన్వయంతో ఇస్రో గగన్‌యాన్ కార్యక్రమంలో సిబ్బందికి శిక్షణ ఇస్తుంది, ఫ్లైట్ సిస్టమ్స్, గ్రౌండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తుంది.

టెక్నాలజీ డెవలప్‌మెంట్, ఫ్లైట్ హార్డ్‌వేర్, ఇతర కీలక మౌలిక సదుపాయాలన్నీ కలిపి గగన్‌యాన్ కార్యక్రమానికి మొత్తం 10 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి.

గగన్‌యాన్ కార్యక్రమంలో రెండు మానవరహిత యాత్రలు కూడా ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images

గగన్‌యాన్ ప్రయోజనాలు

  • ఇస్రో, విద్యాసంస్థలు, పరిశ్రమలు, జాతీయ సంస్థలు, ఇతర సైంటిఫిక్ సంస్థల మధ్య సమన్వయం కోసం గగన్‌యాన్ కార్యక్రమం విస్తృత ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటు చేస్తుంది.
  • ఇది వైవిధ్యమైన సాంకేతిక, పారిశ్రామిక సామర్థ్యాలను ఏకం చేస్తుంది. ఎంతోమంది విద్యార్థులకు, పరిశోధకులకు ప్రయోజనం అందించేలా పరిశోధన అవకాశాలను, సాంకేతిక అభివృద్ధికి విస్తృత భాగస్వామ్యం ఏర్పడేలా చేస్తుంది.
  • ఇది అత్యాధునిక సాంకేతికతలో ఉపాధిని, మానవ వనరులకు శిక్షణను అందిస్తుందని భావిస్తున్నారు.
  • దేశాభివృద్ధి కోసం సైన్స్, టెక్నాలజీలో కెరీర్ ఎంచుకునేలా విద్యార్థుల్లో ఇది స్ఫూర్తి నింపుతుందని భావిస్తున్నారు.
  • గగన్‌యాన్ కార్యక్రమం దేశం కృషిగా నిలుస్తుంది. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న పరిశ్రమలు, విద్యాసంస్థలు, జాతీయ ఏజెన్సీలు, అన్నీ పాలుపంచుకుంటాయి.

ఫొటో సోర్స్, ISRO/facebook

ఆగస్టు 15న ప్రధాని మోదీ ప్రకటన

భారతీయులు సొంతంగా అంతరిక్షంలోకి పంపించాలనే ప్రాజెక్టు గురించి ఈ ఏడాది ఆగస్టు 15న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.

ఎర్రకోటపై ప్రసంగించిన మోదీ 2022లో దేశ యువతీయువకుల్లో ఎవరో ఒకరిని అంతరిక్షంలోకి పంపిస్తామని చెప్పారు.

ప్రధాని ప్రకటన తర్వాత దీనిపై మాట్లాడిన ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కె శివన్ ప్రస్తుతం తాము బిజీగా ఉన్నామని, కానీ 2022 లోపు మానవ సహిత యాత్రను తాము పూర్తి చేయగలమని చెప్పారు.

ఇస్రో సన్నాహాలు ఎంత వరకు వచ్చాయి?

ముగ్గురు వ్యోమగాములను భూమి దిగువ కక్ష్యలోకి తీసుకెళ్లడానికి అవసరమైన పేలోడ్ సామర్థ్యంతో ప్రయోగించే జీఎస్ఎల్వీ-మార్క్ 3 తయారీని ఇస్రో పూర్తి చేసింది.

మానవ సహిత అంతరిక్షయాత్రలో కీలకమైన క్రూ ఎస్కేప్ సిస్టంను ఇస్రో ఇప్పటికే పరీక్షించింది.

జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగంలో భాగంగా ఉపయోగించే క్రూ మాడ్యూల్ ఏరోడైనమిక్ క్యారెక్టరైజేషన్ కూడా పూర్తి చేసింది.

వ్యోమగాములు ధరించే లైఫ్ సపోర్ట్ సిస్టమ్, స్పేస్ సూట్ కూడా ఇప్పటికే పరీక్షించారు.

వీటితోపాటు స్పేస్ కాప్స్యూల్ రీఎంట్రీ ప్రయోగం(ఎస్ఆర్ఈ) ద్వారా ఆర్బిటల్ అండ్ రీఎంట్రీ మిషన్, రికవవరీ ఆపరేషన్స్ కూడా పరీక్షించారు.

మానవ సహిత యాత్రకు కీలకమైన సాంకేతిక అంశాల్లో చాలా వాటిని ఇస్రో ఇప్పటికే రూపొందించి, పరీక్షించింది.

40 నెలల్లోపు మొదటి మిషన్ ప్రారంభించగలమని ఇస్రో భావిస్తోంది.

ఇదే మిషన్‌లో భాగంగా నవంబర్‌లో జీఎస్ఎల్వీ మార్క్ 3డీ 2ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)