మన్మోహన్ సింగ్‌ను రాజకీయాల్లోకి తెచ్చింది పీవీ నరసింహరావే : ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్

ఫొటో సోర్స్, Getty Images
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ జీవితంపై తెరకెక్కిన ‘ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' ట్రైలర్ రిలీజవడంతో రాజకీయ వాతారణం ఒక్కసారిగా వేడెక్కింది.
గురువారం రాత్రి బీజేపీ అధికారిక ట్విటర్ హ్యాండిల్ ఈ సినిమాకు ఒక విధంగా ప్రచారం కల్పించిన తర్వాత ఇది చర్చనీయాంశమైంది.
బీజేపీ తన ట్విటర్ హ్యాండిల్లో "ఒక కుటుంబం ఒక దేశాన్ని పదేళ్ల పాటు ఎలా తాకట్టు పెట్టిందో చెప్పే ఆసక్తికరమైన కథ. వారసుడు సిద్ధం అయ్యేవరకూ ప్రధానమంత్రి కుర్చీని చూసుకునే ఒక ప్రతినిధిగా డాక్టర్ సింగ్ ఉండిపోయారా. ఒక లోపలి వ్యక్తి అనుభవాల ఆధారంగా తెరకెక్కిన 'ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' ట్రైలర్ చూడండి. ఇది జనవరి 11న రీలీజ్ అవుతోంది" అని పోస్ట్ చేసింది.
ఈ చిత్రాన్ని 2004 నుంచి 2008 మధ్యలో మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారుగా ఉన్న సంజయ్ బారు రాసిన ఒక పుస్తకం ఆధారంగా తీశారు.
సినిమా ట్రైలర్‌తోపాటు మన్మోహన్ సింగ్ రాజకీయ కెరీర్ గురించి కూడా జోరుగా విశ్లేషణ జరుగుతోంది. కానీ మన్మోహన్ సింగ్‌ను రాజకీయాల్లోకి తీసుకు వచ్చిన ఘనత పూర్తిగా మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహరావుకే దక్కుతుందనే విషయం మీకు తెలుసా?
ఫొటో సోర్స్, PENMOVIES/TRAILERGRAB/BBC
1991లో ప్యాకప్.. రాజీవ్ మరణం తరువాత రీఎంట్రీ
ఒక ర కంగా చెప్పాలంటే 1991లో పీవీ నరసింహరావు రాజకీయ జీవితం ముగిసింది. దాంతో రోజర్స్ రిమూవల్ కంపెనీకి చెందిన ఒక ట్రక్కులో ఆయన తన పుస్తకాలున్న 45 అట్టపెట్టెలను హైదరాబాద్ పంపించేశారు.
కానీ ఆ సమయంలో జ్యోతిష్యం అంటే ఆసక్తి ఉన్న పీవీ బ్యూరోక్రాట్ మిత్రుడొకరు ఆయనతో "ఈ పుస్తకాలను ఇక్కడే ఉంచేయండి. నాకెందుకో మీరు మళ్లీ తిరిగి వస్తారనిపిస్తోంది" అన్నారు.
వినయ్ సీతాపతి తన 'హాఫ్ లయన్-హౌ పీవీ నరసింహా రావ్ ట్రాన్స్‌ఫర్డ్ ఇండియా' అనే పుస్తకంలో "పీవీ నరసింహారావు ఒక విధంగా రిటైర్మెంట్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. ఆయన దిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో సభ్యత్వం కోసం అప్లికేషన్ కూడా పెట్టారు. అంటే భవిష్యత్తులో ఎప్పుడైనా తను కొన్ని రోజులు దిల్లీ వస్తే, ఉండడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు" అని రాశారు.
కానీ అప్పుడే హఠాత్తుగా పరిస్థితులన్నీ మారిపోయాయి. 1991 మే 21న శ్రీపెరంబదూర్‌లో రాజీవ్ గాంధీ హత్య జరిగింది. ఆ ఘటన తర్వాత కొన్ని గంటల్లోనే బీబీసీ నుంచి పర్వేజ్ ఆలం ఆయన్ను నాగపూర్‌లో కలిశారు. ఆయనతో జరిగిన సంభాషణలో కొన్ని రోజుల్లో ఆయన భారత ప్రధాన మంత్రి కాబోతున్నారనే విషయం చూచాయగా తెలిసింది.
ఫొటో సోర్స్, Getty Images
భారత రాజకీయాలకు మహోపకారం
నట్వర్ సింగ్ బీబీసీతో "రాజీవ్ గాంధీ హత్య తర్వాత సంతాపం తెలపడానికి వచ్చిన విదేశీ అతిథులందరూ వెళ్లిపోయిన తర్వాత సోనియా ఇందిరాగాంధీకి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన పీఎన్ హక్సర్‌ను 10, జన్‌పథ్ పిలిపించారు. మీ దృష్టిలో కాంగ్రెస్ తరఫున ప్రధాన మంత్రి అయ్యేందుకు తగిన వారు ఎవరని అడిగారు. హక్సర్ అప్పటి ఉపరాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ పేరు చెప్పారు" అని చెప్పారు.
"అరుణా అసఫ్ అలీకి శంకర్ దయాళ్ శర్మ పేరును పరిశీలించే బాధ్యతలు అప్పగించారు. శర్మకు ఈ విషయం అంతా తెలిసింది. సోనియా తనకు అందించాలనుకున్న బాధ్యతలను ఆయన ఒక గౌరవంగా భావించారు. కానీ భారత ప్రధాన మంత్రి అంటే పూర్తికాలం బాధ్యతలు నిర్వహించాలి. ఈ వయసులో నా ఆరోగ్యం నాకు సహకరిస్తుందా, నేను అంత పెద్ద పదవికి న్యాయం చేయగలనా అనుకున్నారు".
ఇద్దరూ శంకర్ దయాళ్ శర్మ సందేశాన్ని సోనియాగాంధీకి చేర్చారు. ఆమె మరోసారి హక్సర్‌ను పిలిపించారు. ఈసారీ ఆయన పీవీ నరసింహరావు పేరు చెప్పారు. తర్వాత జరిగిందంతా దేశ చరిత్రలో నిలిచిపోయింది.
పీవీ నరసింహరావు భారత రాజకీయాల్లో చివరి స్థాయికి చేరుకుని కఠిన పరిస్థితి నుంచి మళ్లీ ప్రధాని పదవి వరకూ చేరారు. ఏదైనా పదవిని పొందడానికి ఆయన ఎలాంటి రాజకీయ ప్యారాచూట్ల సాయం తీసుకోలేదు. ఆ తర్వాత పీవీ డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను గుర్తించి కాంగ్రెస్‌కు, భారతదేశానికి ఒక మహోపకారం కూడా చేశారు.
ఫొటో సోర్స్, Getty Images
మన్మోహన్ పేరు సూచించిన అలెగ్జాండర్
వినయ్ సీతాపతి బీబీసీతో "పీవీ నరసింహారావు 1991లో ప్రధాని అయినప్పుడు, ఆయన చాలా రంగాల్లో నైపుణ్యం సంపాదించారు. అంతకు ముందే ఆరోగ్య, విద్యా మంత్రిత్వశాఖల్లో పనిచేశారు. భారత విదేశాంగ మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన చేతికి లొంగనిది ఏదైనా ఉంది అంటే అది ఆర్థిక శాఖే. ప్రధాని అయ్యే రెండు రోజుల ముందు క్యాబినెట్ సెక్రటరీ నరేష్ చంద్ర ఆయన చేతికి 8 పేజీల ఒక నోట్ ఇచ్చారు. భారత దేశ ఆర్థిక స్థితి చాలా ఘోరంగా ఉన్నట్టు అందులో ఉంది" అని చెప్పారు.
"భారత్ ఇక పాత మార్గాల్లో వెళ్లదని చెప్పడానికి, అంతర్జాతీయ ద్రవ్య నిధిని వ్యతిరేకించేవారిని ఒప్పించడానికి ఆయనకు ఒక ముఖం లేదా ముసుగు కావల్సి వచ్చింది. దాంతో ఆయన అప్పట్లో తన సలహాదారు అయిన పీసీ అలెగ్జాండర్‌ను పిలిపించారు. ఆర్థిక మంత్రిగా నియమించేందుకు అంతర్జాతీయ స్థాయిలో ఆమోదయోగ్యం అయిన ఒకరి పేరు చెప్పమన్నారు. అలెగ్జాండర్ ఆయనకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డైరెక్టర్‌గా పనిచేసిన ఐజీ పటేల్ పేరు సూచించారు" అని సీతాపతి తెలిపారు.
"ఆ సమయంలో ఐజీ పటేల్‌కు దిల్లీ రావడం ఇష్టం లేదు. ఎందుకంటే తల్లి అనారోగ్యం పాలవడంతో ఆయన వడోదరలో ఉండేవారు. దాంతో అలెగ్జాండర్ పీవీకి తర్వాత మన్మోహన్ సింగ్ పేరు చెప్పారు. ప్రమాణ స్వీకారానికి ఒక రోజు ముందు అలెగ్జాండర్, మన్మోహన్ సింగ్‌కు ఫోన్ చేశారు. అప్పుడాయన నిద్రపోతున్నారు. కొన్ని గంటల ముందే ఆయన విదేశాల నుంచి వచ్చారు. ఆయన్ను లేపి ఈ విషయం చెప్పినా మన్మోహన్ ఆ మాటలు నమ్మలేదు".
ఫొటో సోర్స్, Pib
మన్మోహన్‌కు పీవీ క్లాస్
"తర్వాత రోజు ప్రమాణ స్వీకార వేడుకకు మూడు గంటల ముందు మన్మోహన్ సింగ్‌కు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఆఫీస్ నుంచి పీవీ ఫోన్ చేశారు. నేను మిమ్మల్ని ఆర్థిక మంత్రిగా చేయాలని అనుకుంటున్నాను అన్నారు. ప్రమాణ స్వీకార వేడుకకు ముందు నరసింహారావు మన్మోహన్ సింగ్‌తో "మనం విజయం సాధిస్తే ఆ ఘనత ఇద్దరికీ దక్కుతుంది. కానీ విఫలమైతే మీరు వెళ్లాల్సి ఉంటుంది అన్నారు" అని సీతాపతి చెప్పారు.
"1991 బడ్జెట్‌కు రెండు వారాల ముందు మన్మోహన్ సింగ్ బడ్జెట్ ముసాయిదా తీసుకుని నర్సింహరావు దగ్గరకు వెళ్లినపుడు ఆయన దానిని చూసి పక్కన పడేశారు. ఇలాంటి బడ్జెట్ కావాలనుకుంటే నేను మిమ్మల్ని ఎంచుకోవడం ఎందుకు అన్నారు".
తన మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టిన మన్మోహన్ సింగ్ విక్టర్ హ్యూగో చెప్పిన ఒక వాక్యం ప్రస్తావించారు. "సమయానికి వచ్చిన ఆలోచనను ప్రపంచంలో ఏ శక్తీ అడ్డుకోలేదు" అని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు.
ఆయన తన బడ్జెట్ ప్రసంగంలో రాజీవ్ గాంధీ, ఇందిరా, నెహ్రూ పేర్లను మాటిమాటికీ ప్రస్తావించారు. కానీ వారి ఆర్థిక విధానాలను మార్చడానికి కొంచెం కూడా తగ్గలేదు.
ఇవి కూడా చదవండి:
- హిందుత్వ అజెండా గురి తప్పిందా? అందుకే బీజేపీ ఓడిందా?
- ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందా, ఉండదా
- కేసీఆర్ ప్రధాని అవుతారా?
- క్రీ.శ.536: చరిత్రలో అత్యంత ఘోరమైన సంవత్సరం అదే
- వృద్ధాశ్రమాల్లో జీవితం ఎలా ఉంటుందంటే..
- క్యాథలిక్ చర్చిలో పవిత్ర కన్యలు: 'నేను క్రీస్తును పెళ్లాడాను... నా శరీరాన్ని అర్పిస్తాను'
- సంక్రాంతి పండుగ కోసం వెయిటింగ్.. కోడి పందేలకు కత్తులు రెఢీ.. కోళ్లు రెఢీ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)