మేఘాలయ బొగ్గుగనిలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు విశాఖ నుంచి గజ ఈతగాళ్లు

  • 29 డిసెంబర్ 2018
మేఘాలయ బొగ్గు గనులు Image copyright Getty Images

మేఘాలయలో ప్రయివేటు బొగ్గుగనిలో వందల అడుగుల లోతున చిక్కుకుపోయిన 15 మంది కార్మికులను రక్షించేందుకు విశాఖ నేవీకి చెందిన గజ ఈతగాళ్లు రంగంలోకి దిగారు.

గత 16 రోజులుగా మేఘాలయ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు, ఫైర్ సిబ్బంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కార్మికుల జాడ తెలుసుకోలేకపోయారు.

ర్యాట్ హోల్ మైనింగ్‌గా చెప్పే ప్రమాదకర విధానంలో భూగర్భంలో బాగా లోతుకు వెళ్లి అక్కడ నుంచి అడ్డంగా చిన్నచిన్న రంధ్రాలు చేసుకుంటూ బొగ్గును తవ్వే క్రమంలో సమీపంలోని నది నుంచి నీరు గనిలోకి భారీగా చేరడంతో కార్మికులు చిక్కుకుపోయారు.

వారిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలూ విఫలమవడంతో శనివారం విశాఖ నేవీకి చెందిన 15 మంది గజ ఈతగాళ్లు, అత్యాధునిక పరికరాలతో అక్కడికి చేరుకున్నారు.

Image copyright Getty Images

ఏం జరిగింది!

ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో.. రాజధాని షిల్లాంగ్‌కు 80 కిలోమీటర్ల దూరంలో.. ఈస్ట్ జైంథియా హిల్స్ జిల్లా లుంథారీ గ్రామంలోని క్సాన్ ప్రాంతంలో ఉన్న ఈ గనిలో డిసెంబరు 13న మొత్తం 20 మంది కార్మికులు 370 అడుగుల లోతుకు వెళ్లి.. అక్కడి నుంచి నేలకు సమాంతరంగా సన్నని సొరంగ మార్గాల్లో తవ్వకాలు సాగించే ప్రయత్నంలో ఉన్నారు..

అంతలోనే.. సమీపంలోని లైతే నది నుంచి నీరు ఒక్కసారిగా గనిలోకి రావడం మొదలైంది.. అంతే, కార్మికులంతా బయటపడే ప్రయత్నం చేశారు. కానీ, అయిదుగురు మాత్రమే ప్రాణాలతో బయటకు రాగలిగారు. మిగతావారంతా గనిలోనే చిక్కకుపోయారు.

వారిప్పుడు ప్రాణాలతోనే ఉన్నారా..? వారిని రక్షించడం సాధ్యమేనా? అన్నది సమాధానం లేని ప్రశ్నగా మారింది.

Image copyright Getty Images

వెంటనే సహాయ చర్యలు మొదలై ఉంటే..

16 రోజులైనా తమవారి జాడ తెలియకపోవడంతో వారంతా బతికున్నారా లేదా అన్న ఆందోళనతో బాధిత కుటుంబాలు బిక్కుబిక్కు మంటున్నాయి.

ప్రమాదం జరిగిన వెంటనే సహాయ చర్యలు మొదలైతే కార్మికులను రక్షించే అవకాశం ఉండేది. కానీ, ఆ ప్రమాదం గురించి సమాచారం అందిన తరువాత ఆ గని ఎక్కడుందో తెలుసుకోవడానికే అధికారులకు చాలా సమయం పట్టింది.

డిసెంబరు 14 నుంచి సహాయ చర్యలు ప్రారంభించినట్లు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌(ఎన్డీఆర్ఎఫ్) చీఫ్ ఆఫీసర్ ఎస్‌కే శాస్త్రి ఏఎన్ఐ వార్తాసంస్థతో చెప్పారు.

స్థానికులెవరూ సహకరించకపోవడంతోనే గనిని చేరుకోవడానికి సమయం పట్టిందని.. ఇవన్నీ అక్రమంగా తవ్వుతున్న గనులు కావడంతో, వాటి గురించి చెబితే మైనింగ్ మాఫియా నుంచి తమకు ముప్పు ఉంటుందన్న భయంతో స్థానికులెవరూ సమాచారం ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారు.

Image copyright Getty Images

ఏమిటీ ర్యాట్ హోల్ మైనింగ్

మేఘాలయలో అత్యధిక శాతం భూములు ప్రయివేటు వ్యక్తులు, సామాజిక సమూహాల చేతిలో ఉంటాయి. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ ప్రకారం ఏర్పడిన స్వతంత్ర ప్రతిపత్తి గల జిల్లా కౌన్సిళ్ల చట్టాల పరిధిలో ఇవి ఉంటాయి.

ఇక్కడ అక్రమంగా బొగ్గు తవ్వకాలు సాగుతున్నాయి. భూ ఉపరితలం నుంచి వందల అడుగుల లోతుకు బావి తవ్వి.. దాని అడుగు నుంచి అడ్డంగా మనిషి దూరేంత రంధ్రాలు చేసుకుంటూ పోతారు. ఇవి 3 నుంచి 4 అడుగుల వ్యాసంతో మాత్రమే ఉంటాయి.

భూగర్భంలో అడ్డంగా వందల మీటర్ల దూరం ఇలాంటి సన్నని సొరంగాలను తవ్వుకుంటూ బొగ్గును వెలికి తీస్తారు. దీన్నే ర్యాట్ హోల్ మైనింగ్ అంటారు.

అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో, అశాస్త్రీయ విధానంలో జరిగే ఈ ర్యాట్‌హోల్ మైనింగ్‌‌పై 2014లో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ నిషేధం విధించింది. పర్యావరణ సమస్యలతో పాటు కార్మికుల ప్రాణాల కాపాడాలన్న దృష్టితోనూ నిషేధం విధిస్తున్నట్లు ట్రైబ్యునల్ చెప్పింది.

Image copyright Getty Images

ఆగని అక్రమ తవ్వకాలు

కాగా, మేఘాలయలోని గారో హిల్స్‌లో నిషేధం ఉన్నప్పటికీ అక్రమంగా బొగ్గు గనులు తవ్వడమనేది చాలాకాలంగా సాగుతున్న వ్యవహారం. ప్రయివేటు వ్యక్తులు మనుషులను నియమించుకుని ఈ తవ్వకాలు సాగిస్తుంటారు.

మేఘాలయతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు వీటిలో పనిచేస్తుంటారు.

తాజా ప్రమాదంతో మరోసారి ఈ ర్యాట్ హోల్ మైనింగ్ అందరి దృష్టికీ వచ్చింది. 2014లో ట్రైబ్యునల్ విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ గనుల యజమానులు సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. అవి ఇంకా విచారణలో ఉన్నప్పటికీ మైనింగ్ మాత్రం యథాతథంగా కొనసాగుతోందనడానికి ఈ ఘటనే ఉదాహరణ.

ప్రస్తుతం ప్రమాదం జరిగిన ఈస్ట్ జైంథియా హిల్స్ జిల్లాలో అక్రమ మైనింగ్‌పై పరిశీలనకు వెళ్లిన ఇద్దరు యాక్టివిస్టులపై గత నెలలో దాడి జరిగింది.

కాగా, ప్రమాదం జరిగిన మరుసటి రోజున పోలీసులు గని యజమాని క్రిప్ చుల్లెట్‌ను అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఈస్ట్ జైంథియా హిల్స్ జిల్లా ఎస్పీ సిల్విస్టర్ నోంగ్‌త్యాంగర్ పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ ధ్రువీకరించారు.

ఈ ఘటన నేపథ్యంలో మేఘాలయ మానవ హక్కుల కమిషన్ ఆ రాష్ట్ర ప్రభుత్వంపై సుమోటోగా కేసు నమోదు చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు