డీఎన్ఏ పరిశోధన: తొలి భారతీయులు ఎవరు.. ఆఫ్రికా నుంచి వలసొచ్చినవారి వారసులా?
- టోనీ జోసెఫ్
- రచయిత

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో అంతకుముందున్న నాగరికత పతనమైన తర్వాత ఈ దేశానికి వచ్చిన చాలా వలస సమూహాల్లో ఆర్యులది ఒకటై ఉండొచ్చని భారతీయ మేధావులు చాలా మంది చెబుతారు. ఆ పతనమైన నాగరికతే సింధూ లోయ (హరప్పా) నాగరికత.
భారతీయులు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? గత కొన్నేళ్లుగా ఈ ప్రశ్నలపై చర్చ తీవ్రతరమైంది.
ఆర్యులుగా పిలిచే ప్రజలే భారత నాగరికతకు మూలమని హిందూ మితవాదులు చెబుతున్నారు. గుర్రాలపై తిరిగే, పశువులను పోషించే యోధులు, పశువుల పెంపకందార్లతో కూడిన సంచార జాతే ఆర్యులు. ప్రాచీన హిందూ గ్రంథాలైన వేదాలను ఆర్యులే రాశారని హిందూ మితవాదులు నమ్ముతారు.
ఆర్యులు భారత్‌లోనే పుట్టారని, తర్వాత ఆసియా, ఐరోపాలోని చాలా ప్రాంతాలకు విస్తరించారని వారు వాదిస్తారు. నేటికీ యూరోపియన్లు, భారతీయులు మాట్లాడే ఇండో-యూరోపియన్ భాషల కుటుంబం ఏర్పాటుకు వారు దోహదపడ్డారని చెబుతారు.
ఆర్యులదే సర్వోన్నత జాతి అని, యూరప్‌ను జయించింది ఆర్యులేనని 19వ శతాబ్దానికి చెందిన చాలా మంది మానవ సామాజిక పరిశోధకులు, అడాల్ఫ్ హిట్లర్ లాంటి నాయకులు భావించేవారు. ఈ జాతి మూలాలు నోర్డిక్ జాతిలో ఉన్నాయని హిట్లర్ అనుకొనేవారు.
ఫొటో సోర్స్, Getty Images
భారతీయులు విభిన్నమైన మూలాలు, చరిత్రల నుంచి సుస్థిరమైన నాగరికతను నిర్మించుకున్నారు.
ఇండో-యూరోపియన్ భాషలను మాట్లాడిన, తమను తాము ఆర్యులుగా పిలుచుకొన్న ప్రజలను 'ఆర్యులు'గా పరిశోధకులు వ్యవహరిస్తారు. నేను కూడా ఈ వ్యాసంలో 'ఆర్యన్' అనే మాటను ఇదే అర్థంలో వాడుతున్నాను. హిట్లర్ చెప్పినట్లుగానో లేదా కొందరు హిందూ మితవాదులు వాడుతున్నట్లుగానో 'జాతి' అనే అర్థంలో ఈ మాటను ఉపయోగించడం లేదు.
భారత్‌లో అంతకుముందున్న నాగరికత పతనమైన తర్వాత ఈ దేశానికి వచ్చిన చాలా వలస సమూహాల్లో ఆర్యులది ఒకటై ఉండొచ్చని భారతీయ మేధావులు చాలా మంది చెబుతారు. ఆ పతనమైన నాగరికతే సింధు లోయ (హరప్పా) నాగరికత. ఈజిప్షియన్, మెసపొటేమియన్ నాగరికతలు విలసల్లిన కాలానికి కొంచెం అటూ ఇటుగా నేటి వాయవ్య భారత్, పాకిస్తాన్లలో సింధూ లోయ నాగరికత ఫరిడవిల్లింది.
హిందూ మితవాదులు మాత్రం సింధూ లోయ నాగరికత కూడా ఆర్యుల నాగరికతేనని భావిస్తారు. దీనినే వైదిక నాగరికతగా కూడా వ్యవహరిస్తారు.
సింధూ లోయ నాగరికత తర్వాత ఆర్యుల నాగరికత ఏర్పడిందనేవారికి, సింధూ లోయ నాగరికత కూడా ఆర్యుల నాగరికతేనని వాదించేవారికి మధ్య కొన్నేళ్లుగా విభేదాలు తీవ్రతరమవుతున్నాయి. ముఖ్యంగా 2014లో హిందూ జాతీయవాద పార్టీ 'భారతీయ జనతా పార్టీ' అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు గ్రూపుల మధ్య విభేదాలు ఎక్కువయ్యాయి.
సుదీర్ఘ కాలంగా ఉన్న ఈ వివాదంలోకి, పోల్చిచూస్తే కొత్త అంశమైన 'పాపులేషన్ జెనెటిక్స్' ప్రవేశించింది. పూర్వం మనుషులు ఎక్కడి నుంచి ఎక్కడకు వలస వెళ్లారో నిర్ధరించేందుకు పురాతన డీఎన్ఏపై ఇది ఆధారపడుతుంది.
పురాతన డీఎన్ఏపై ఆధారపడే పరిశోధనల్లో వెల్లడైన ఫలితాలు కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్నాయి. అప్పటివరకున్న చరిత్రలను తిరగరాస్తున్నాయి. భారత్‌కు సంబంధించి ఎంతో ఆసక్తికరమైన అంశాలను ఈ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన జన్యుశాస్త్ర పరిశోధకుడు డేవిడ్ రీచ్ నేతృత్వంలోని ఒక బృందం 2018 మార్చిలో ఒక అధ్యయనం ఫలితాలను ప్రచురించింది.
ఇందులో ప్రపంచం నలుమూలలకు చెందిన 92 మంది స్కాలర్లు వివిధ అంశాలపై రాశారు. జన్యుశాస్త్రం, చరిత్ర, పురావస్తు శాస్త్రం(ఆర్కియాలజీ), మానవ పరిణామ శాస్త్రం(ఆంత్రోపాలజీ) లాంటి రంగాల్లో లబ్ధ ప్రతిష్టులు వీరిలో ఉన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
గుజరాత్లో కచ్ జిల్లా ధొలవిరాలోని సింధూ లోయ నాగరికతకు చెందిన స్థలం
'ద జినోమిక్ ఫార్మేషన్ ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ ఏసియా' అనే శీర్షికతో వెలువడిన ఈ అధ్యయనంలో ఆశ్చర్యపరిచే అంశాలు ఉన్నాయి.
గత 10 వేల సంవత్సరాల్లో భారత్‌లోకి ప్రధానంగా రెండు వలసలు జరిగాయని ఈ అధ్యయనం చెబుతోంది.
మొదటి వలస నైరుతి ఇరాన్‌లోని జాగ్రోస్ ప్రాంతంలో మొదలైంది. మేకలను మనుషులు మచ్చిక చేసుకొన్నారనేందుకు ప్రపంచంలోనే తొలి ఆధారం జాగ్రోస్ ప్రాంతంలోనే లభించింది.
ఈ వలసలో జాగ్రోస్ నుంచి వ్యవసాయదారులు భారత్‌కు వచ్చారు. వీరు పశుపోషకులు అయ్యుండొచ్చు.
బిఫోర్ కామన్ ఎరా(బీసీఈ) 7000, బీసీఈ 3000 సంవత్సరాల మధ్య ఈ వలస జరిగి ఉండొచ్చు.
జాగ్రోస్ ప్రాంతం నుంచి వచ్చినవారు ఉపఖండంలో అప్పటికే నివసిస్తున్న తొలి భారతీయుల్లో (ఫస్ట్ ఇండియన్స్‌లో) కలిసిపోయారు. వీరిద్దరూ కలిసి సింధూ లోయ నాగరికతను సృష్టించారు. ఈ తొలి భారతీయులు ఎవరంటే- సుమారు 65 వేల సంవత్సరాల క్రితం వచ్చిన ఆఫ్రికా (ఔట్ ఆఫ్ ఆఫ్రికా-వోవోఏ) వలసదారుల వారసులు.
2000 బీసీఈ తర్వాతి శతాబ్దాల్లో మరో వలసదారుల సమూహం వచ్చింది. అలా వచ్చినవారే ఆర్యులు. యురేషియన్ స్టెప్పీ ప్రాంతం అంటే బహుశా నేటి కజకిస్థాన్ ప్రాంతం నుంచి వీరు వలస వచ్చి ఉండొచ్చు. ప్రారంభ దశలో ఉన్న సంస్కృత భాషను వీళ్లు తమతోపాటు భారత్‌కు తీసుకొని వచ్చి ఉండొచ్చు. గుర్రాలను మచ్చిక చేసుకోవడం, వాటిని వాడుకోవడంలో వీరికి ప్రావీణ్యం ఉండి ఉండొచ్చు. బలి ఇవ్వడం లాంటి సాంస్కృతిక సంప్రదాయాలను వీరు పాటించారు. తొలి దశ హైందవ/వైదిక సంస్కృతికి ఇవే మూలమయ్యాయి. (భారత్‌కు ఈ వలస జరగడానికి వెయ్యేళ్ల ముందు స్టెప్పీ ప్రాంతం నుంచి ఐరోపాకు కూడా ప్రజలు వలస వెళ్లారు. అప్పటికే అక్కడున్న వ్యవసాయదారులతో కలిసిపోవడం లేదా వారి స్థానంలోకి వీరు రావడం జరిగింది. అలా కొత్త సంస్కృతులు ఏర్పడ్డాయి. కొత్త ఇండో-యూరోపియన్ భాషలు వ్యాప్తి చెందాయి.)
ఫొటో సోర్స్, Getty Images
భారత్‌కు జరిగిన మరిన్ని వలసలను ఇతర జన్యు పరిశోధనలు వెలుగులోకి తెచ్చాయి. ఆగ్నేయాసియా నుంచి వచ్చిన ఆస్ట్రో-ఏసియాటిక్ భాషలు మాట్లాడేవారు, ఇతర వలసదారులు ఈ వలసల్లో భారత్‌కు చేరుకున్నారు.
నా పుస్తకంలో రాసినట్లు భారత జనాభా మూలాలను అర్థం చేసుకోవడానికి ఒక సులభమైన మార్గం ఏమిటంటే- భారత్‌ను ఒక పిజ్జా అనుకోవాలి. తొలి భారతీయులను పిజ్జా బేస్‌గా చెప్పుకోవచ్చు. పిజ్జాలోని మిగతా భాగానికి ఇదే ఆధారం. 50 శాతం నుంచి 65 శాతం వరకు భారతీయుల జన్యు మూలాలు తొలి భారతీయులవేనని అధ్యయనాలు చెబుతున్నాయి. పిజ్జా బేస్‌పై వేసే సాస్‌ను సింధూ లోయ నాగరికత ప్రజలుగా చెప్పుకోవచ్చు. సాస్ తర్వాత టాపింగ్స్, చీజ్ వేస్తాం కదా. ఆస్ట్రో-ఏసియాటిక్, టిబెటో-బర్మన్, ఇండో యూరోపియన్ భాషలు మాట్లాడేవారు లేదా ఆర్యులు- ఇలా భారత ఉపఖండంలోకి తర్వాత ప్రవేశించిన అందరినీ టాపింగ్స్, చీజ్‌గా చెప్పుకోవచ్చు.
చాలా మంది హిందూ మితవాదులకు ఈ అధ్యయన ఫలితాలు రుచించవు. పాఠ్యాంశాలను మార్పించేందుకు, భారత్‌లోకి ఆర్యుల వలస ప్రస్తావనను పాఠ్యపుస్తకాల నుంచి తీసేయించేందుకు వీళ్లు ప్రయత్నిస్తున్నారు.
ఆర్యులు భారత్‌లోకి వలస వచ్చారనే సిద్ధాంతాన్ని సమర్థించే భారత ప్రముఖ చరిత్రకారులపై ట్విటర్లో చాలా కాలంగా పలువురు ప్రముఖ హిందూ మితవాదులు దాడులు చేస్తున్నారు.
''భారత్‌లో మొట్టమొదట నివసించింది ఆర్యులు కాదు, ఆర్యుల కన్నా చాలా ముందు నుంచే సింధూ లోయ నాగరికత ఉండేది'' అనే వాదనను హిందూ జాతీయవాదులు అంగీకరించలేరు. ఎందుకంటే ఈ వాదనను అంగీకరిస్తే-భారత నాగరికతకు ఏకైక మూలం ఆర్యులు/వైదిక సంస్కృతి కాదని, మూలాలు వేరే చోట ఉన్నాయని వారు ఒప్పుకొన్నట్లు అవుతుంది.
వైదిక విద్యతోనే మన పిల్లలు బాగా ఎదుగుతారని, మానసిక క్రమశిక్షణ ఉన్న దేశభక్తులుగా తయారవుతారని మానవ వనరుల అభివృద్ధిశాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ అన్నట్లు ఇటీవల మీడియాలో వచ్చింది.
వేర్వేరు జన సమూహాలను కలిపి చూసే భావన కూడా హిందూ జాతీయవాదులకు నచ్చదు. ఎందుకంటే వారు 'జాతి స్వచ్ఛత'కు ప్రాధాన్యం ఇస్తారు.
ఆర్యులు వేరే ప్రాంతం నుంచి భారత్‌కు వలస వచ్చారనే సిద్ధాంతంతో వీరికి మరో చిక్కు కూడా ఉంది. తర్వాతి కాలంలో భారత్‌కు వచ్చిన మొఘలులు, ఇతర ముస్లిం రాజులనూ, ఆర్యులనూ ఇద్దరినీ ఈ సిద్ధాంతంతో ఒకే గాటన కట్టినట్టు అవుతుంది.
ఫొటో సోర్స్, Getty Images
నాగరికతపై హిందూ మితవాదుల చర్చలు కేవలం సైద్ధాంతికపరమైనవి కాదు.
సింధూ లోయ (హరప్పా) నాగరికత పేరును సరస్వతీ నదీ నాగరికతగా మార్చాలని హరియాణాలోని బీజేపీ ప్రభుత్వం డిమాండ్ చేసింది. నాలుగు వేదాల్లో మొట్టమొదటిదైన వేదంలో సరస్వతి ప్రధాన నది అయినందున, సింధూ లోయ నాగరికత పేరును సరస్వతీ నాగరికతగా మారిస్తే, ఈ నాగరికతకు, ఆర్యులకు మధ్య సంబంధం ఉన్నట్లు బలంగా చెప్పొచ్చన్నది ఈ డిమాండ్ వెనకున్న ఉద్దేశం.
ఇలాంటి చర్చలకు కొత్త అధ్యయనం ముగింపు పలుకుతుంది. అందువల్లే ఇది హిందూ మితవాదులకు దిగ్భ్రాంతి కలిగించింది. అధ్యయన సహరచయిత ప్రొఫెసర్ రీచ్‌పై పాలక బీజేపీ ఎంపీ, హార్వర్డ్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ సుబ్రమణ్యన్ స్వామి ట్విటర్లో విరుచుకుపడ్డారు. అధ్యయనాన్ని అబద్ధాల పుట్టగా కొట్టిపారేశారు.
ఈ అధ్యయనంలో ఉత్తేజపరిచే, ఆశావహమైన సందేశం ఒకటుంది. అదేంటంటే- భారతీయులు విభిన్నమైన మూలాలు, చరిత్రల నుంచి సుస్థిరమైన నాగరికతను నిర్మించుకున్నారు.
భారత నాగరికత అత్యుత్తమ దశల్లో కనిపించిన గొప్ప లక్షణం ఏమిటంటే అందరినీ కలుపుకొనే తత్వం, ఎవరినీ వేరుచేసి చూడని తత్వం. భారత జన్యు నిర్మాణంలోనే భిన్నత్వంలో ఏకత్వం ప్రధానాంశంగా ఉంది.
(టోనీ జోసెఫ్ 'ఎర్లీ ఇండియన్స్: ద స్టోరీ ఆఫ్ అవర్ యాన్సెస్టర్స్ అండ్ వేర్ వి కమ్ ఫ్రమ్' పుస్తక రచయిత)
ఇవి కూడా చదవండి:
- రవీంద్రనాథ్ ఠాగూర్: ‘జాతీయవాదం ప్రమాదకారి. భారతదేశ సమస్యలకు అదే మూలం’
- 'గాంధీ జాత్యహంకారి'
- ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం సాధ్యమేనా?
- పీవీ నరసింహారావు: ‘సంస్కరణల పితామహుడు’ చేసిన నేరం ఏంటి?
- ఎగ్జిట్ పోల్స్: ఎలా నిర్వహిస్తారు.. కచ్చితత్వం ఎంత
- భారత్ కన్నా పేద దేశమైన చైనా 40 ఏళ్లలో ఎలా ఎదిగింది?
- ఠాక్రే ట్రైలర్: దక్షిణ భారతీయులంటే బాల్ ఠాక్రేకు ఎందుకు నచ్చదు?
- గూగుల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్: భావి నగరాలకు నమూనా అవుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)