పన్ను బకాయిలు చెల్లించిన మహేశ్ బాబు

డీడీ రూపంలో పన్ను బకాయిలు చెల్లించిన మహేశ్ బాబు

టాలీవుడ్ ప్రముఖ హీరో మహేశ్ బాబు 2007-08 ఆర్థిక సంవత్సరానికి గాను వివాదంలో ఉన్న పన్ను బకాయిలను శనివారం చెల్లించారు.

31,47,994 రూపాయలను హైదరాబాద్‌లోని జీఎస్టీ కమిషనరేట్‌కు చెల్లిస్తూ డీడీ పంపించారు.

గురువారం జీఎస్టీ డిపార్ట్‌మెంట్ యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకుల్లోని మహేశ్ బాబు ఖాతాలను అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. పన్ను, వడ్డీ, పెనాల్టీల రూపంలో 73.5 లక్షల రూపాయలు రికవరీ చేసేందుకు ఈ అటాచ్‌మెంట్ జరిపినట్లు జీఎస్టీ కమిషనరేట్ పేర్కొంది.

యాక్సిస్ బ్యాంకులో ఉన్న 42.96 లక్షల రూపాయలను జీఎస్టీ కమిషనరేట్ తీసుకుంది. మిగతా మొత్తానికి గాను మహేశ్ బాబు డిమాండ్ డ్రాఫ్ట్ తీసి తన ప్రతినిధుల ద్వారా పన్ను విభాగం అధికారులకు పంపించారు.

ఫొటో క్యాప్షన్,

పన్ను బకాయిలు చెల్లించేందుకు మహేశ్ బాబు పేరిట ఆయన ప్రతినిధులు జీఎస్టీ కమిషనరేట్ కు సమర్పించిన డిమాండ్ డ్రాఫ్ట్

జీఎస్టీ కమిషనరేట్ ఏం చెబుతోంది?

మహేశ్ బాబు కొన్ని ఉత్పత్తుల తరపున ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం ఆయా ఉత్పత్తుల (కొనుగోళ్లను) ప్రోత్సహిస్తోంది కాబట్టి, ఆ మేరకు సదరు ఉత్పత్తుల తయారీ సంస్థ నుంచి తీసుకునే పారితోషకంపై సర్వీస్ ట్యాక్స్ కట్టాలని అధికారులు కోరారు.

2007-08 ఆర్థిక సంవత్సరానికి గాను మహేశ్ బాబు ప్రభుత్వానికి సర్వీస్ ట్యాక్స్ చెల్లించలేదన్నది పన్ను విభాగం అధికారుల వాదన. ఆ ఏడాది వివిధ ఉత్పత్తుల ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్‌ / అప్పియరెన్స్ మనీ / అడ్వర్టైజింగ్ మొదలైన వాటి ద్వారా ఆయన అందించిన సేవలకు లభించిన పారితోషకంపై చెల్లించాల్సిన పన్నులు చెల్లించలేదని వారు తెలిపారు.

అప్పట్లో ఆ మొత్తం 18.5 లక్షల రూపాయలు. వడ్డీ, పెనాల్టీల రూపంలో 73.5 లక్షల రూపాయలు అయ్యింది.

ఫొటో సోర్స్, urstrulyMahesh/facebook

మహేశ్ బాబు ఏమన్నారు?

ఈ వ్యవహారంపై మహేశ్ బాబు నేరుగా స్పందించలేదు.

అయితే, ఆయన ప్రతినిధులు మాత్రం ఈ వ్యవహారంపై పత్రికా ప్రకటన విడుదల చేశారు.

2007-08 ఆర్థిక సంవత్సరానికి గాను (బ్రాండ్) అంబాసిడర్ సర్వీసెస్ పన్నుల పరిధిలో లేవని వారు తెలిపారు.

2010 జూన్ 1వ తేదీ నుంచి ఉత్పత్తులకు ప్రచారం చేసే వారికి లభించే పారితోషకంపై సర్వీస్ ట్యాక్స్ వసూలు చేయాలనే నిబంధన (సెక్షన్ 65 (105) (zzzzq) ద్వారా) ప్రవేశపెట్టారని వారు తెలిపారు.

వాస్తవానికి ఇంతకు ముందే మహేశ్ బాబు తరపున ఆయన ప్రతినిధులు ఈ అంశంపై ట్రిబ్యునల్‌కు వెళ్లారు. అక్కడ వారికి అనుకూలంగా తీర్పు రాలేదు. దీంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఈ వ్యవహారం ఇంకా కోర్టు పరిధిలోనే ఉన్నదని, అయినప్పటికీ ఎలాంటి నోటీసు లేకుండా జీఎస్టీ కమిషనరేట్ బ్యాంకు అకౌంట్లను అటాచ్ చేసిందని తెలిపారు.

మహేశ్ బాబు చట్టానికి కట్టుబడే పౌరునిగా తన పన్నులన్నింటినీ సక్రమంగా చెల్లించారని వారు పేర్కొన్నారు.

జీఎస్టీ కమిషనరేట్ స్పందన

వివాదం కోర్టు పరిధిలోనే ఉన్నప్పటికీ, ఎలాంటి నోటీసు లేకుండా బ్యాంకు అకౌంట్లను నిలుపుదల చేశారంటూ మహేశ్ బాబు ప్రతినిధులు చేసిన ప్రకటనపై జీఎస్టీ కమిషనరేట్ స్పందించింది.

2010వ సంవత్సరంలోనే మహేశ్ బాబుకు నోటీసులు జారీ చేశామని చెప్పింది.

ఈ వ్యవహారంపై మహేశ్ బాబు ట్రిబ్యునల్‌కు, అప్పీలేట్ అథార్టీకి వెళ్లారని, ఆ రెండూ పన్ను చెల్లించమని ఆదేశించాయని వివరించింది.

దీంతో మహేశ్ బాబు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారని, అప్పీలేట్ అథార్టీ (పన్ను చెల్లించాలని ఆదేశిస్తూ జారీ చేసిన) తీర్పును హైకోర్టు నిలుపుదల చేయలేదని, ఈ నేపథ్యంలోనే ఆయన బ్యాంకు ఖాతాలను అటాచ్ చేశామని తెలిపింది.

ఫొటో సోర్స్, AFP

బ్యాంకు ఖాతాల్లోంచి జీఎస్టీ కమిషనరేట్‌ డబ్బు తీసేసుకోవచ్చా?

ఒక వ్యక్తి ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉన్నప్పుడు, అతనికి చెందే సొమ్ము నుంచి (అది వ్యవస్థల వద్ద ఉన్నా, వ్యక్తుల వద్ద ఉన్నా) తమకు రావాల్సిన మొత్తాన్ని తీసుకునేందుకు పన్నుల విభాగానికి అధికారాలు ఉన్నాయని జీఎస్టీ కమిషనరేట్‌కు చెందిన పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ఉన్నతాధికారి బీబీసీ తెలుగుతో అన్నారు.

ఆ అధికారాలను వినియోగించి.. సెక్షన్ 87 ఆఫ్ ఫైనాన్స్ యాక్ట్ 1994 ప్రకారం జీఎస్టీ కమిషనరేట్ బ్యాంకు ఖాతాలను అటాచ్ చేసింది.

ఎవరైనా వ్యక్తులు పన్ను చెల్లించాల్సి ఉండి, సుదీర్ఘకాలం పాటు చెల్లించని పక్షంలో, సహేతు కారణాలతో వారి బ్యాంకు ఖాతాల్లో ఉన్న సొమ్ము నుంచి తమకు రావల్సిన మొత్తాన్ని తీసుకునే వెలుసుబాటు పన్నుల విభాగానికి ఉంది అని సదరు అధికారి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)