అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో ‘సోనియా గాంధీ’ పేరు చెప్పిన మధ్యవర్తి మిషెల్ - ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్

క్రిస్టియన్ మిషెల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

క్రిస్టియన్ మిషెల్

అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోళ్లలో మధ్యవర్తి పాత్ర పోషించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రిస్టియన్ మిషెల్‌ను ఆదివారం దిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో హాజరు పరిచారు.

క్రిస్టియన్ మిషెల్ కోర్టులో తన వాంగ్మూలం ఇచ్చారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తెలిపింది.

మిషెల్ తన వాంగ్మూలంలో 'శ్రీమతి గాంధీ' పేరు ప్రస్తావించారని ఈడీ చెబుతోంది. అయితే మిషెల్ ఈ పేరు ఏ సందర్భంలో చెప్పారనేది ఇంకా స్పష్టం కాలేదు.

కోర్టు మిషెల్‌ను ఏడు రోజులు రిమాండ్‌కు పంపిందని పటియాలా హౌస్ కోర్టుకు హాజరైన జర్నలిస్ట్ సుచిత్ర మొహంతి బీబీసీకి చెప్పారు. మిషెల్‌ను ఎప్పుడు కలిసినా ఒక నిర్ణీత దూరం పాటించాలని ఆయన న్యాయవాదులను కోర్టు ఆదేశించినట్లు తెలిపారు.

న్యాయవాదులు మిషెల్‌ను కలవడానికి కోర్టు ఒక సమయం కూడా నిర్దేశించింది. ఇక నుంచి రోజూ ఉదయం, సాయంత్రం 15 నిమిషాలపాటు వారు మిషెల్‌ను కలవవచ్చని సూచించింది.

ఈడీ మాత్రం మిషెల్‌ తన న్యాయవాదులను కలవకుండా అడ్డుకోవాలని కోర్టును కోరినట్లు సుచిత్రా మొహంతి చెప్పారు. లాయర్ల ద్వారా బయటి వ్యక్తుల నుంచి మిషెల్‌కు సందేశం అందవచ్చని ఈడీ సందేహించిందని అన్నారు.

ఫొటో సోర్స్, Reuters

డిసెంబర్ ప్రారంభంలో భారత్‌కు

క్రిస్టియన్ మిషెల్‌ను డిసెంబర్ 5న దుబయ్ నుంచి భారత్‌కు తీసుకొచ్చారు.

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ సూచనలతో మిషెల్ భారత్ తీసుకొచ్చే ఆపరేషన్‌ పూర్తి చేశామని అప్పట్లో సీబీఐ చెప్పింది.

మిషెల్‌ను భారత్ తీసుకురావడానికి సీబీఐ జాయింట్ ఇన్‌స్పెక్టర్ సాయి మనోహర్ నేతృత్వంలో అధికారుల ఒక టీమ్ దుబయ్ వెళ్లింది.

57 ఏళ్ల మిషెల్ అపీలును కోర్టు కొట్టివేయడంతో యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్(యుఏఈ) ప్రభుత్వం మిషెల్‌ అప్పగింతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మిషెల్‌ను భారత్ తీసుకొచ్చిన తర్వాత రోజే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక ఎన్నికల ప్రచార సభలో 'మిషెల్ వచ్చేశాడని, ఇక రహస్యాలన్నీ బయటపడతాయని' అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసు ఏంటి?

బ్రిటన్-ఇటాలియన్ కంపెనీ అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో జరిగిన 77 కోట్ల డాలర్ల ఒప్పందంలో ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. భారత ప్రభుత్వం 2010లో 12 వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలు కోసం ఈ ఒప్పందం చేసుకుంది.

ఫొటో సోర్స్, LEONARDO COMPANY

ఈ 12లో మూడు హెలికాప్టర్లు భారత్ కూడా చేరాయి. కానీ ఒప్పందం ధరల్లో అవకతవకలు జరిగినట్లు వెలుగు చూడడంతో మిగతా హెలికాప్టర్లు భారత్ తీసుకురాకుండా ఆపేశారు.

ఫిన్‌మెకానికా అనే ఇటలీ కంపెనీ అగస్టా వెస్ట్‌ల్యాండ్ సహచర కంపెనీగా ఉంది. ఇందులో ఇటలీ ప్రభుత్వానికి 30 శాతం భాగస్వామ్యం ఉంది.

ఈ ఒప్పందం జరిగిన ఏడాది తర్వాత యూరప్‌లో ఇద్దరు మధ్యవర్తులు అరెస్ట్ అయ్యారని ఇటలీ మీడియాలో వార్తలు వచ్చాయి. వారిలో ఈ ఒప్పందం వెనుక కీలక పాత్ర పోషించిన వారు కూడా ఉన్నారని చెప్పారు. ఇప్పుడు భారత్ తీసుకొచ్చిన క్రిస్టియన్ మిషెల్ ఆ మధ్యవర్తుల్లో ఒకరని ఆరోపణలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)