జస్‌ప్రీత్ బుమ్రా: ఆ కోచ్ గుర్తించకపోతే ఎక్కడుండేవాడో

  • ప్రదీప్ కుమార్
  • బీబీసీ ప్రతినిధి
బుమ్రా

ఫొటో సోర్స్, Getty Images

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మ్యాచ్‌పై పూర్తిగా పట్టు సాధించింది.

మరో విజయానికి అడ్డుగా ఉన్న రెండు వికెట్లను ఎంత త్వరగా పడగొడదామా అని ఎదురుచూస్తోంది. టీమిండియాలో ఈ ఉత్సాహం వెల్లువెత్తడానికి ప్రధాన కారణం జస్‌ప్రీత్ బుమ్రా.

బుమ్రా ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 15.5 ఓవర్లు బౌలింగ్‌ చేసి 33 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. ఆ ఆరు వికెట్లలో ముగ్గురు టాప్ ఆర్డర్ ముగ్గురు, ముగ్గురు టెయిలెండర్లు ఉన్నారు.

రెండో ఇన్నింగ్స్‌లో కూడా 53 పరుగులు ఇచ్చిన బుమ్రా ఫించ్, షాన్ మార్ష్‌ను అవుట్ చేశాడు.

బుమ్రా ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ప్రధానంగా నాలుగు స్పెల్ వేశాడు. ఆ నాలుగు స్పెల్స్‌లో వికెట్లు తీసి కెప్టెన్ కోహ్లీ నమ్మకాన్ని నిలబెట్టాడు.

మూడో స్పెల్‌ వేస్తున్న బుమ్రాను చూసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్‌ తన కామెంటరీలో రేయాన్ హ్యారిస్‌ను గుర్తు చేసుకున్నాడు. తనకు వికెట్ కావల్సినప్పుడల్లా అతడి చేతికి బంతిని ఇచ్చేవాడినని చెప్పాడు.

అంటే, అప్పుడే గంటకు 142 కిలోమీటర్ల వేగంతో బంతిని వేసిన తర్వాత గంటకు 115 కిలోమీటర్ల వేగంతో స్లో యార్కర్ వేసి షాన్ మార్ష్‌ను అవుట్ చేశాడు. ఆ బంతిని చూసిన క్రికెట్ విశ్లేషకులు బుమ్రాను ప్రశంసలతో ముంచెత్తారు.

ఫొటో సోర్స్, Reuters

బంతిపై నియంత్రణ

బుమ్రాకు ఆయన వేసే బంతిపై అద్భుతమైన నియంత్రణ ఉంటుందని చెబుతుంటారు.

25 ఏళ్ల బుమ్రా తన ఈ ప్రత్యేకతను తరచూ ప్రదర్శిస్తాడు. ఆయన ఈ విషయంలో తొలి పాఠాన్ని మొదట అతడు తన తల్లి నుంచే నేర్చుకున్నాడు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 1993 డిసెంబర్ 6న వ్యాపార కుటుంబంలో పుట్టిన బుమ్రా జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి.

బుమ్రాకు ఏడేళ్ల వయసులోనే తండ్రి చనిపోయాడు. దాంతో ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న తల్లి దల్జీత్ బుమ్రా అన్నీ తానై అతడిని పెంచారు.

బుమ్రా చిన్నప్పుడే టీవీలో ఫాస్ట్ బౌలింగ్ చూసి దాన్ని అనుకరించేవాడు. ఇంట్లో గోడకు బాల్ వేస్తూ బౌలింగ్ ప్రాక్టీస్ చేసేవాడు.

బంతి ఊరికే గోడకు తగలడంతో వచ్చే శబ్దానికి తల్లికి విసుగొచ్చేది. దాంతో శబ్దం తక్కువ వచ్చేలా ఆడుకోమన్నారు. లేదంటే ఇంట్లోనే ఆడద్దని గట్టిగా చెప్పారు

ఫొటో సోర్స్, EPA

గోడ దిగువకు యార్కర్

దాంతో బుమ్రాకు ఒక ఐడియా వచ్చింది. బౌలింగ్ చేసేటప్పుడు బంతిని గోడ దిగువ అంచులో వేసే ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

అలా బంతి ఫ్లోరింగ్, గోడ కలిసే ఉండే చోట తగలడం వల్ల బంతి శబ్దం చాలా తక్కువగా వచ్చేది. దాంతో బుమ్రా ప్రాక్టీస్ కొనసాగింది.

చిన్నతనం నుంచీ ఫాస్ట్ బౌలింగ్ అనుకరించిన బుమ్రాకు ఎప్పుడు ఆ యాక్షన్ ప్రత్యేకంగా మారిందో తనకే తెలీదు. కానీ మనకు బుమ్రా యాక్షన్ చూస్తే ఏదో ప్రత్యేకత ఉందనిపిస్తుంది.

అది బుమ్రా క్రికెట్ జీవితానికే ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది.

ప్రత్యేకంగా, వింతగా ఉండే బుమ్రా బౌలింగ్ యాక్షన్ చూసి బ్యాట్స్‌మెన్ గందరగోళంలో పడేవారు. స్కూల్ క్రికెట్ నుంచే ఒక గుర్తింపు రావడంతో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ బుమ్రాను ఎంపిక చేసింది.

తర్వాత అతడు ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్‌కు సెలక్ట్ అయ్యాడు. తర్వాత చూస్తూ చూస్తూనే గుజరాత్ అండర్-19 జట్టులో చోటు దక్కించుకున్నాడు.

మొదటి మ్యాచ్‌లోనే సౌరాష్ట్ర అండర్-19 బ్యాట్స్‌మెన్లకు బుమ్రా చుక్కలు చూపించాడు.

దాంతో గుజరాత్ రంజీ కోచ్ హితేష్ మజుందార్, టీమ్ మేనేజ్‌మెంట్ అతడికి సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 మ్యాచ్‌లో అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు.

2013లో జరిగిన ఆ టోర్నీలో రాణించిన బుమ్రా గుజరాత్ జట్టును చాంపియన్‌గా నిలపడంలో కీలకం అయ్యాడు. ఫైనల్లో మూడు వికెట్లు కూడా పడగొట్టాడు. కానీ అదే టోర్నీ అతడి కెరీర్‌ను మరో మలుపు తిప్పింది.

సరిగ్గా అదే సమయంలో ముంబై ఇండియన్స్ కోచ్ జాన్‌ రైట్ పుణెలో జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ-20 టోర్నమెంట్ చూడ్డానికి వచ్చాడు. ఆయన్ను జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ ఆకట్టుకుంది.

ఆయన బుమ్రాతో ముంబై ఇండియన్స్‌కు కాంట్రాక్ట్ సైన్ చేయించాడు. చూస్తూ చూస్తూనే జస్‌ప్రీత్ బుమ్రా సచిన్ తెందుల్కర్, లసిత్ మలింగ లాంటి స్టార్ ఆటగాళ్లతో డ్రెసింగ్ రూం పంచుకున్నాడు.

ఫొటో సోర్స్, AFP

స్టార్స్ సలహాల ఎఫెక్ట్

స్టార్ ఆటగాళ్లతో ఆడిన ఫలితం బుమ్రా మొదటి మ్యాచ్‌లోనే కనిపించింది. నిజానికి బుమ్రా మొట్టమొదట ముంబై ఇండియన్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌లో ఆడాడు.

విరాట్ కోహ్లీ బుమ్రా మొదటి మూడు బంతులకూ వరస బౌండరీలు బాది అతడికి ఐపీఎల్లో స్వాగతం పలికాడు.

దాంతో డల్ అయిపోన బుమ్రాకు సచిన్ తెందుల్కర్ "ఒక మంచి బంతితో మనం మ్యాచ్ మార్చేయచ్చు, ఏం దిగులు పడకు" అని సలహా ఇచ్చాడు.

చివరికి అదే జరిగింది. బుమ్రా అదే ఓవర్లో విరాట్ కోహ్లీని ఎల్‌బిడబ్ల్యు చేశాడు. ఐపీఎల్ అరంగేట్రం మ్యాచ్‌లోనే మూడు వికెట్లు పడగొట్టాడు.

బుమ్రా సక్సెస్‌కు అమితాబ్ బచ్చన్ కూడా ట్వీట్ చేసి శుభాకాంక్షలు చెప్పాడు. కానీ బుమ్రా హఠాత్తుగా ఫాం కోల్పోయాడు.

ఫిట్‌నెస్ సమస్యలు కూడా అతడిని ఇబ్బంది పెట్టాయి. కానీ ముంబై ఇండియన్స్ నమ్మకాన్ని మాత్రం నిలబెట్టుకున్నాడు.

లసిత్ మలింగతో కలిసి ఆడడంతో స్లో బాల్ టిప్స్ నేర్చుకోవడం బుమ్రాకు కష్టం కాలేదు. అతడు దానిని తన ప్రమాదకరమైన ఆయుధంగా మార్చుకోవడంలో సక్సెస్ అయ్యాడు.

కానీ అత్యంత డేంజరస్ మాత్రం బుమ్రా బౌలింగ్ యాక్షనే అని ప్రూవ్ అయ్యింది.

దాని గురించి మెల్‌బోర్న్ టెస్ట్ మూడో రోజు ఆట తర్వాత మాట్లాడిన బుమ్రా "చిన్నతనం నుంచి నేను చాలా మంది బౌలర్లను చూసి నేర్చుకున్నాను. కానీ ఈ యాక్షన్ ఎలా డెవలప్ అయ్యిందో నాకే తెలీదు. కానీ ఎక్కడికెళ్లినా ఏ కోచ్ దీనిని మార్చుకోమని నాకు చెప్పలేదు. బాడీని ఫిట్‌గా ఉంచుకోమని మాత్రం చాలా మంది చెప్పారు. ఎందుకంటే శరీరం బరువెక్కితే నా స్పీడ్ తగ్గుతుందని వారికి అనిపించింది" అన్నాడు.

అన్నీ కలిసి రావడంతో 2016లో టీ-20 జట్టుకు ఎంపికైన బుమ్రా అదే ఏడాది జనవరిలో ఆస్ట్రేలియా వన్డే టీమ్‌కూ సెలక్ట్ అయ్యాడు. చూస్తూ చూస్తూనే భారత జట్టులో అందరికంటే ఫాస్టెస్ట్ బౌలర్ అయ్యాడు.

ఫొటో సోర్స్, AFP

బుమ్రా జోరు కొనసాగుతుందా?

కానీ టెస్ట్ మ్యాచుల్లో బుమ్రా మాయ కొనసాగుతుందా అనే ప్రశ్న వచ్చింది.

ఆ ప్రశ్నకు 2018 సమాధానం ఇచ్చింది. జనవరిలో టెస్ట్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన బుమ్రా తన బౌలింగ్‌తో వరసగా జట్టుకు నమ్మకమైన బౌలర్‌గా ఎదిగాడు.

మెల్‌బోర్న్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీసిన బుమ్రా టెస్టు మ్యాచుల్లో ఈ ఏడాది మొత్తం 47 వికెట్లు పడగొట్టాడు. ఇది భారత బౌలర్లలో రికార్డ్. బుమ్రాకు ముందు భారత్‌కు చెందిన దిలీప్ దోషీ పేరిట ఈ రికార్డు ఉంది. ఆయన ఒకే ఏడాదిలో 40 వికెట్లు పడగొట్టాడు.

ప్రపంచ బౌలర్లలో బుమ్రా ఇప్పుడు మూడో స్థానంలో ఉన్నాడు. 1981లో అరంగేట్రం చేసిన ఆస్ట్రేలియా బౌలర్ టేరీ ఎల్డర్‌సన్ ఆ ఏడాదిలో 54 వికెట్లు పడగొట్టాడు. ఆ రికార్డ్ ఇప్పటివరకూ అలాగే ఉంది. తర్వాత స్థానంలో 1988లో 49 వికెట్లు తీసిన ఆంబ్రోస్ ఉన్నాడు.

మెల్‌బోర్న్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీసిన బుమ్రా 2010లో 46 వికెట్లు తీసిన ఇంగ్లండ్ స్టీవెన్ ఫిన్ రికార్డును అధిగమించాడు.

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

ఏ ఆసియా బౌలర్‌కూ దక్కని ఘనత

అంతే కాదు, మెల్‌బోర్న్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన బుమ్రా అంతకు ముందు ఏ ఆసియా బౌలర్ సాధించలేని ఒక అరుదైన ఘనత కూడా అందుకున్నాడు.

బుమ్రా ఒకే క్యాలెండర్ ఇయర్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన ఘనత సాధించాడు. ఇదే ఏడాది జొహన్నెస్‌బర్గ్‌(దక్షిణాఫ్రికా)లో 54 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసుకున్న బుమ్రా, ట్రెండ్‌బ్రిడ్జ్‌(ఇంగ్లండ్)లో 85 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. ఇప్పుడు మెల్‌బోర్న్‌లో 33 పరుగులకు ఆరు వికెట్లు తీశాడు.

బుమ్రా భారత క్రికెట్‌కు ఒక కొత్త గుర్తింపు తీసుకొచ్చాడు. ప్రస్తుతం అతడు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలుగుతున్నాడు. తన వేరియేషన్‌తో ప్రపంచంలోని ఏ బ్యాటింగ్ ఆర్డర్‌ను అయినా కుప్పకూలుస్తున్నాడు.

కాలతోపాటూ ఫిట్‌నెస్ కూడా మెరుగుపరుచుకున్న బుమ్రా బౌలింగ్‌లో ఇన్ స్వింగర్, బౌన్సర్ లాంటి ఆయుధాలకు కూడా పదును పెట్టాడు. కానీ స్పెషల్ బౌలింగ్ యాక్షన్‌తోనే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఎక్కువ కాలం సక్సెస్ దక్కించుకోలేమనే విషయం కూడా అతడికి బాగానే తెలిసుంటుంది.

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

మూడో రోజు ఆట తర్వాత మాట్లాడిన బుమ్రా "నేనిప్పటివరకూ భారత్‌లో టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. కానీ దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలో ఆడాను. అందుకే నేను చాలా నేర్చుకోగలిగాను. ప్రారంభం బాగుంది. ఇక ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి" అన్నాడు.

బుమ్రా ముందున్న అసలు సవాళ్లు రెండే.. మొదట అతడి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలగాలి, ఎక్కువ కాలం క్రికెట్ మైదానంలో కొనసాగగలగాలి..

బుమ్రాకు అది తన ఫిట్‌నెస్ కాపాడుకుంటూ, ప్రతి క్షణం నేర్చుకోవాలనే ఆసక్తిని, ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లినప్పుడే ఇది సాధ్యం అవుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)