వాడుకుని వదిలేయడంలో చంద్రబాబు నంబర్ 1.. కేసీఆర్ తీవ్ర ఆరోపణ: ప్రెస్ రివ్యూ

కేసీఆర్

ఫొటో సోర్స్, kcr/fb

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విమర్శించారని ఈనాడు తెలిపింది.

‘‘ఆయన పచ్చిఅబద్ధాల కోరు, అవకాశవాది అని.. వాడుకుని వదిలేయడంలో నంబర్‌ వన్‌ అని కేసీఆర్ విమర్శించారు. రాజకీయాల కోసం ఆయన ఎవరినైనా బలిచేస్తారని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు తెదేపాకు అధ్యక్షుడు కాదు మేనేజర్‌ అని, ఎన్టీఆర్‌ స్థాపించిన పార్టీని లాక్కున్నారని, హరికృష్ణ మరణంపైనా రాజకీయాలు చేశారని విమర్శించారు.

ప్రగతిభవన్‌లో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబుపై కేసీఆర్‌ మండిపడ్డారు. ఆయనకు మాట మీద నిలబడే తత్వం ఉందా అని ప్రశ్నించారు. డిసెంబరు నాటికి హైకోర్టు భవనాలు సిద్ధం చేసుకుంటామని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిందని తెలిపారు.

ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏపీ హైకోర్టును అక్కడికి మార్చుకోవాల్సింది పోయి అనవసర విమర్శలు చేయడం మంచిది కాదన్నారు. రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు గడిచినా హైకోర్టుకు ఏర్పాట్లు చేసుకోకపోవడం ఎవరి తప్పని ప్రశ్నించారు. ఏర్పాట్లు చేయకుండా హైకోర్టు విభజన చేశారని చంద్రబాబు మాట్లాడుతున్న మాటలకు అర్థం ఉందా అని నిలదీశారు.

చంద్రబాబు హరికృష్ణ సెంటిమెంట్‌ను ఉపయోగించుకొని గెలుద్దామనుకున్నారు. ఆయన బిడ్డ సుహాసినిని తీసుకొచ్చి కూకట్‌పల్లి నుంచి నిలబెట్టారు. చంద్రబాబు ఇప్పుడు ఆమెను పట్టించుకుంటారా? అని ప్రశ్నించారు.

‘గతంలో చంద్రబాబు చక్రం తిప్పానంటారు. ఆయన చక్రం తిప్పలేదు. మన్నూ లేదు. అప్పుడూ ఏమీ చేయలేదు. అదో మోసం. చంద్రబాబు చెప్పేదాన్ని ఒకటి, రెండు పత్రికలు ఈస్ట్‌మన్‌ కలర్‌లో చూపిస్తాయి. చంద్రబాబుకు నాలుగు ముక్కలు ఇంగ్లీష్‌ రాదు.. రెండు ముక్కలు హిందీ రాదు. జాతీయ స్థాయిలో రాజకీయాలు చేస్తారా? మీడియా రాస్తుంది తప్పితే.’ అని విమర్శించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఉపయోగించిన భాషపై ఏపీ మంత్రులు, టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో మోదీ దించిన రెండో కృష్ణుడే కేసీఆర్‌ అని ధ్వజమెత్తారు.

కేసీఆర్‌ ఎంతకైనా దిగజారతారనేందుకు చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. టీడీపీ నీడలో ఎదిగిన ఆయన ఇప్పుడు మోదీకి అద్దె మైకులా.. జగన్‌కు సొంత మైకులా తయారయ్యారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తాము చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రాలు విడుదల చేస్తే కేసీఆర్‌కు కడుపుమంట ఎందుకని ప్రశ్నించార’’ని ఈనాడు కథనంలో రాశారు.

ఫొటో సోర్స్, chandrababu/fb

ఇదా మీ నిర్వాకం.. ఉద్యోగులపై చంద్రబాబు ఆగ్రహం

ఏపీ ముఖ్యమంత్రి, మంత్రులు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు... ఇలా మూకుమ్మడిగా రెవెన్యూ శాఖపై విరుచుకుపడ్డారు! 'మీ నిర్వాకంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చుక్కల భూములు, నిషేధ భూముల సమస్యకు పరిష్కారం చూపడంలేదు. పైగా... సమస్యను మరింత జటిలం చేస్తున్నారు. దశాబ్దాలతరబడి ఉన్న కాలనీలను, ఊరూ వాడను కూడా నిషేధ జాబితాలో చేర్చేశారు'' అంటూ ధ్వజమెత్తారని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.

నిషేధ భూముల సమస్యను... ఉదాహరణలతో సహా వివరించారు. రెవెన్యూ ఉత్తర్వుల వల్ల అనేక సమస్యలొచ్చాయని మంత్రులు, సీనియర్‌ అధికారులు సూటిగా చెప్పారు. వారి వాదనతో ముఖ్యమంత్రి కూడా ఏకీభవించారు.

అప్పటికప్పుడు... భూ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గం ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, సమాచార శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు ఈ ఉపసంఘంలో సభ్యులుగా ఉంటారు.

భూ సమస్యలు పరిష్కారం కాకుండా మరింత జటిలం చేస్తున్న ప్రభుత్వ ఉత్తర్వులు, చట్టాలను సమీక్షించి సులభతరమైన విధివిధానాలను తీసుకురావడంతోపాటు... సమస్యాత్మక ఉత్తర్వులను ఉపసంహరించుకోవడం, పలు చట్టాలను సవరించడం వంటి అంశాలను ఈ ఉపసంఘం పరిశీలిస్తుంది.

ఉపసంఘం పనికి సంబంధించిన విధివిధానాలను త్వరలో ఖరారు చేయాలని ఆయన ఆదేశించారు. నిషేధ భూముల జాబితా కింద వచ్చిన దరఖాస్తుల్లో 50వేల దరఖాస్తులను పరిష్కరించామని, కేవలం 1229 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. జనవరి 28 నాటికి అన్నీ పరిష్కరిస్తామని సీఎంకు నివేదించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్‌ చంద్ర జోక్యం చేసుకొని... ఎస్‌ఎల్‌ఏలో పెండింగ్‌లో ఉన్న వాటిని ఇష్టానుసారంగా తిరస్కరిస్తున్నారని తెలిపారు

''నిబంధనలు, చట్టాలను సులభతరం చేసి సంక్లిష్టమైన భూ సమస్యలను సులువుగా పరిష్కరించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. దీనిని అర్థం చేసుకోకుండా రెవెన్యూశాఖ మరింత జటిలం చేసింది'' అని సీఎం ఆగ్రహించారు. ''ప్రజలకు మీరు మేలుచేస్తున్నారా? చేటు చేస్తున్నారా? చుక్కల భూములపై వినూత్న పరిష్కారమేదైనా గుర్తించారా? ఈ విషయంలో ప్రభుత్వ స్ఫూర్తిని అర్థం చేసుకోలేకపోయారు. 2016లో ఆ ఉత్తర్వు వచ్చినందువల్ల ఇన్ని సమస్యలు వచ్చాయన్నది నాకూ తెలియదు. దాని గురించి తెలుసుకునే లోపల చాలా నష్టం జరిగిపోయింది’’అని చంద్రబాబు పేర్కొన్నట్లు ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఫొటో సోర్స్, Tsec

వంట మనిషి, అటెండర్‌కు ఎన్నికల విధులు

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలంలోని మొగడ్‌ధగడ్‌ ఆశ్రమోన్నత పాఠశాలలో పని చేస్తున్న అటెండర్‌ కిషన్‌ (గుర్తింపు సంఖ్య: 1346510), వంట మనిషి దొమ్మాట కొమురయ్య(గుర్తింపు సంఖ్య: 1343587)లను పంచాయతీ ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారులుగా నియమిస్తూ కౌటాల ఎంపీడీఓ లక్ష్మీనారాయణ ఈ నెల 27న ఉత్తర్వులు జారీ చేశారని ఈనాడు తెలిపింది.

తమ ఉద్యోగ కాలంలో తొలిసారి ఇలాంటి ఉత్తర్వు అందుకున్న వారు తప్పనిసరి పరిస్థితుల్లో శనివారం శిక్షణ తరగతులకు హాజరై 'మాకు ఎన్నికల విధులేమిటి సారూ?' అంటూ అధికారులతో మొరపెట్టుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్నికల విధుల కేటాయింపులో అధికారుల నిర్లక్ష్యానికి ఈ ఉదంతం దర్పణమనే విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ విషయమై ఎంపీడీవో లక్ష్మీనారాయణను ఈనాడు వివరణ కోరగా ఆయా శాఖల అధికారులు పంపిన జాబితా ప్రకారం ఉన్నతాధికారులు వారికి విధులు కేటాయించారని, వారిని విధుల నుంచి తప్పిస్తామని పేర్కొనడం కొసమెరుపు.

ఉత్తర్వుల్లో వారి ఉద్యోగ హోదాను కూడా పేర్కొన్న అధికారులు వారికి విధులు కేటాయించకూడదన్న విషయాన్ని ఎందుకు గుర్తించలేకపోయారన్నది ప్రశ్నార్థకమేనని ఈనాడు వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images

ఏ పరీక్ష రాయాలి దేవుడా?

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ నియామకాలకు పూనుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్, రాష్ట్ర ప్రభుత్వం పోలీస్‌ కానిస్టేబుల్, డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేశాయి. మూడింటిలో ఏదో ఒకటి సాధించకపోమా అన్న ఆశతో ఉన్న అభ్యర్థుల ఆశలను ఆడియాసలు చేస్తూ అభ్యర్థులకు హాల్‌టికెట్లు అందాయి. ఒకే రోజు(జనవరి 6న) మూడు పరీక్షలు ఉన్నట్టు తేలడంతో ఏ పరీక్ష రాయాలిరా దేవుడా...అంటూ అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారని సాక్షి ఒక కథనాన్ని ప్రచురించింది.

రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఎస్‌ఐ నియామకాలకు వచ్చే ఏడాది జనవరి 6న దేశ వ్యాప్తంగా కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నారు. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు పరీక్షలు నిర్వహిస్తోంది.

ఒకటి ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ కానిస్టేబుల్, మరొకటి డీఎస్సీ పీఈటీ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్ష. ఇలా ఒకే రోజు మూడు నియామక పరీక్షలు ఉండటంతో అభ్యర్థులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహిస్తున్న రోజు రాష్ట్ర ప్రభుత్వాలు మరే పరీక్షను నిర్వహించకూడదు. కానీ ప్రభుత్వం అదేరోజు ఏకంగా రెండు పరీక్షలు నిర్వహిస్తోంది.

ఎన్నికలు సమీపిస్తుండటం, నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోతుండటంతో ప్రభుత్వం ఆగమేఘాల మీద తక్కువ పోస్టులతో కూడిన నోటిఫికేషన్లను ఒకటి అరా ఇచ్చి చేతులు దులుపుకుంటోంది.

ఎదో విధంగా నియామక పరీక్షలు జనవరి నెలలో నిర్వహించి మమ అనిపించేయాలన్న ఉద్దేశంతో ఒక ప్రణాళిక లేకుండా ఎడాపెడా తేదీలను ప్రకటించి అభ్యర్థులను సందిగ్ధంలోకి నెడుతోంది.

అసలే నియామకాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇలా ఒకే రోజు అన్ని పరీక్షలు నిర్వహించడం ఏమిటని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని సాక్షి వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)