బంగ్లాదేశ్ ఎన్నికలు: హ్యాట్రిక్ విజయం సాధించిన షేక్ హసీనా ఎవరు?

షేక్ హసీనా
బంగ్లాదేశ్ పాలక పార్టీ అవామీ లీగ్ నాయకురాలు, ప్రధానమంత్రి షేక్ హసీనా వాజెద్ బంగ్లాదేశ్ జాతిపితగా పిలిచే షేక్ ముజిబుర్ రెహ్మాన్ కుమార్తె. హసీనా 2014లో మూడోసారి ప్రధాని పదవిని చేపట్టారు. ఆమెకు 71 సంవత్సరాలు.
1960ల్లో ఢాకా విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడే హసీనా రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. 1968లో ప్రముఖ శాస్త్రవేత్త ఎంఏ వాజెద్ మియాను హసీనా పెళ్లాడారు.
ముజిబుర్ రెహ్మాన్ బంగ్లాదేశ్‌కు తొలి అధ్యక్షుడు. అధ్యక్ష పదవి చేపట్టిన కొన్ని నెలలకే 1975 ఆగస్టు 15న ముజిబుర్ రెహ్మాన్ హత్యకు గురయ్యారు. ఆయనతోపాటు, హసీనా తల్లిని, ముగ్గురు సోదరులను పలువురు సైనికాధికారులు ఇంట్లోనే హత్య చేశారు. ఈ హత్యలు జరిగినప్పుడు ఆమె బంగ్లాదేశ్‌లో లేరు.
అప్పట్లో హసీనా ఆరేళ్లు ప్రవాసంలో ఉన్నారు. ఆ సమయంలోనే అవామీ లీగ్ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. 1981లో ఆమె బంగ్లాదేశ్ తిరిగివచ్చాక రాజకీయాల్లో కీలక నాయకురాలయ్యారు. ఆ సమయంలో కొన్నిమార్లు గృహనిర్బంధానికి గురయ్యారు.
1990 డిసెంబర్లో ప్రజల ఒత్తిడికి తలొగ్గిన బంగ్లాదేశ్ చివరి సైనిక పాలకుడు లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ ఎర్షాద్ రాజీనామా చేశారు. 1991లో జరిగిన ఎన్నికల్లో షేక్ హసీనా పార్టీకి మెజారిటీ లభించలేదు. ఆమె ప్రత్యర్థి ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఆ తర్వాత ఐదేళ్లకు 1996లో జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్ విజయం సాధించటంతో హసీనా తొలిసారి ప్రధానమంత్రి అయ్యారు.
ఫొటో సోర్స్, Reuters
హసీనా రాజకీయ ప్రస్థానంలో ముఖ్య ఘటనలు..
- 1996 జూన్ ఎన్నికల్లో అవామీ లీగ్ విజయం సాధించగా, హసీనా ప్రధానమంత్రి అయ్యారు.
- 2001 అక్టోబరులో ఎన్నికల్లో ఖలీదా జియా నేతృత్వంలోని బీఎన్పీ, మూడు సంకీర్ణ భాగస్వామ్య పక్షాల చేతిలో అవామీ లీగ్ ఓడిపోయింది.
- 2004 ఆగస్టులో దేశ రాజధాని ఢాకాలో అవామీ లీగ్ ర్యాలీపై గ్రెనేడ్ దాడిలో 22 మంది మృతి. దాడి నుంచి బయటపడిన హసీనా.
- 2008 డిసెంబరులో సార్వత్రిక ఎన్నికల్లో 300 స్థానాలకుగాను 250కి పైగా స్థానాల్లో హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ జయకేతనం.
- 2009 జనవరిలో ప్రధానిగా హసీనా ప్రమాణం.
- 2014 జనవరిలో సార్వత్రిక ఎన్నికలను బహిష్కరించిన బీఎన్పీ. ఎన్నికల్లో అవామీ లీగ్ విజయం, మూడోసారి ప్రధానిగా హసీనా బాధ్యతల స్వీకారం.
ఫొటో సోర్స్, Getty Images
బీఎన్పీ అధినేత ఖలీదా జియా ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అవినీతి అభియోగాల కారణంగా ఎన్నికల్లో పోటీచేయకుండా ఆమెపై అనర్హత ప్రకటించారు. ఖలీదాపై ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవని ఆమె మద్దతుదారులు విమర్శిస్తున్నారు.
బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో ముజిబుర్ రెహ్మాన్, ఖలీదా జియా భర్త జనరల్ జియావుర్ రెహ్మాన్లలో ఎవరి పాత్ర ఎక్కువనే అంశంలోనూ, ఇతర అంశాల్లోనూ హసీనా, ఖలీదా మధ్య విభేదాలు ఉన్నాయి.
1982 నుంచి 1990 వరకు సైనిక పాలకుడు హుస్సేన్ మొహమ్మద్ ఎర్షాద్ అధికారంలో ఉన్నప్పుడు వీరిద్దరూ తమ విభేదాలను పక్కనబెట్టి కలిసినడిచారు. ఆ తర్వాతి నుంచి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత తీవ్రస్థాయిలో వైరం నెలకొంది.
ఇవి కూడా చదవండి:
- బంగ్లాదేశ్ యుద్ధంలో 'రా' చీఫ్ రామేశ్వర్నాథ్దే కీలక పాత్ర!
- BBC EXCLUSIVE: బంగ్లాదేశ్ మొదటి హిందూ చీఫ్ జస్టిస్ దేశ బహిష్కరణ
- బంగ్లాదేశ్: ఇద్దరి మరణం.. ఉద్యమానికి ఊపిరి పోసింది
- బంగ్లాదేశ్: ఖలేదా జియాకు ఏడేళ్ల జైలు శిక్ష
- రోహింజ్యాలను వెనక్కు పంపేందుకు కుదిరిన ఒప్పందం
- 'గాంధీ జాత్యహంకారి'
- ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం సాధ్యమేనా?
- భారత్ కన్నా పేద దేశమైన చైనా 40 ఏళ్లలో ఎలా ఎదిగింది?
- ఠాక్రే ట్రైలర్: దక్షిణ భారతీయులంటే బాల్ ఠాక్రేకు ఎందుకు నచ్చదు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)