నారా చంద్రబాబునాయుడు: నా మీద ముగ్గురు మోదీలు దాడి చేస్తున్నారు - ప్రెస్ రివ్యూ

చంద్రబాబు

ఫొటో సోర్స్, tdp.ncbn.official/fb

'కేసీఆర్‌ హుందాతనాన్ని కోల్పోయి చాలా దారుణంగా మాట్లాడారు. ఆయన వాడే భాష కూడా అసభ్యంగా.. నాగరిక ప్రపంచం అంగీకరించని రీతిలో ఉంది.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా.. గర్హిస్తున్నా..' అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారని 'ఈనాడు' రాసింది.

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కాకూడదనే లక్ష్యంతో మోదీ, కేసీఆర్‌, జగన్‌ కలిసి కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.

ఆదివారం శ్వేతపత్రం విడుదల సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై, వాడిన భాషపై చంద్రబాబు మండిపడ్డారు.

'ఆయన ఒడిశాకు.. పశ్చిమబెంగాల్‌కు వెళ్లారు.. అక్కడ ఏమీ అనుకూలించలేదని నిరాశకు గురైతే నేనేం చేస్తాను.. నాకేం సంబంధం...' అని పేర్కొన్నారు.

"దేశ ప్రయోజనాల కోసం.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలనే ఆలోచనతో.. మోదీ చేసే అన్యాయాలపైనే పోరాడుతున్నా.. నేను ఎక్కడా మాట తూలనప్పుడు కేసీఆర్‌ ఇష్టానుసారం మాట్లాడటం ఏమిటి? భగవంతుడు నోరిచ్చాడని పారేసుకోవడం తప్పు కదా?' అని ఆగ్రహం వెలిబుచ్చారు.

మోదీ నంబర్‌ 1 అయితే... మిడిల్‌ మోదీ కేసీఆర్‌, జూనియర్‌ మోదీ జగన్‌ మోహన్‌రెడ్డిగా తయారయ్యారు. కేసీఆర్‌ అక్కడ మాట్లాడతారు.. ఇక్కడ జగన్‌ ట్వీట్‌ చేస్తారు.. ఇద్దరినీ అభినందిస్తూ మోదీ ఫోన్‌ చేస్తారు.

కేసీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌కు వస్తే బ్రహ్మాండమైన స్వాగతం పలికారట. మరేం వచ్చి ఎన్నికల్లో ప్రచారం చేయండి. దానిలో తప్పేముంది? ప్రజాస్వామ్యంలో ఎక్కడికైనా రావచ్చు. సమావేశాల్లో పాల్గొనొచ్చు. వైకాపాతో పొత్తు పెట్టుకోవచ్చు" అని చంద్రబాబు అన్నారు.

వీడియో క్యాప్షన్,

బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్: తెలంగాణ జల ఫిరంగి.. కాళేశ్వరం ప్రాజెక్టు

చలో కాళేశ్వరం

రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని స్వయంగా పరిశీలించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ వెళ్లనున్నారని 'సాక్షి' పేర్కొంది.

జనవరి 1న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో కేసీఆర్ పర్యటించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ, పంప్‌హౌస్‌తో పాటు ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథక పనులను పరీశీలిస్తారు.

అదేరోజు సాయంత్రం కరీంనగర్‌ చేరుకుని, అక్కడే బస చేస్తారు.

జనవరి 2న ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎస్సారెస్పీకి నీరందించే శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పునరుజ్జీవన పథకం పనులు జరిగే ప్రాంతాలను సందర్శిస్తారు. రాజేశ్వరరావుపేట, రాంపూర్‌లో నిర్మాణంలో ఉన్న పంపుహౌస్‌ పనులను పరిశీలిస్తారు.

జనవరి 1న రిటైర్డ్‌ ఇంజనీర్ల బృందం పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టు పనులు జరిగే ప్రాంతాలను సందర్శించి అక్కడ పనులను పర్యవేక్షిస్తుంది. జనవరి 2న సీతారామ ప్రాజెక్టు పనులను సందర్శించి హైదరాబాద్‌ చేరుకుంటారు.

మూడు రోజుల పాటు కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, డిండి, సీతారామ ప్రాజెక్టులను సందర్శించే ఈ బృందం 2వ తేదీ సాయంత్రం హైదరాబాద్‌ చేరుకుని ముఖ్యమంత్రికి వివరాలు అందిస్తారు. 3 లేదా 4న కేసీఆర్‌ అన్ని ప్రాజెక్టులపై ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images

మొండి బకాయిల రికవరీ రూ.40,400 కోట్లు

కొత్త దివాలా స్మృతి కోడ్‌(ఐబీసీ)తో పాటు సర్ఫేసీ చట్టంలో సవరణలతో డిఫాల్టర్ల నుంచి బకాయిల రికవరీ మెరుగుపడిందని 'ఆంధ్రజ్యోతి' ప్రచురించింది.

ఆర్‌బీఐ డేటా ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం(2017-18)లో బ్యాంకులు రూ.40,400 కోట్ల మొండి బకాయిలను తిరిగి రాబట్టగలిగాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2016-17)లో రికవరీ రూ.38,500 కోట్లుగా నమోదైంది.

డిఫాల్టర్ల నుంచి బకాయిలు వసూలు చేసేందుకు బ్యాంకులు.. ఐబీసీ, సర్ఫేసీ యాక్ట్‌ అధికారాలను ఉపయోగించుకోవడంతోపాటు డెట్‌ రివకరీ ట్రిబ్యునల్స్‌, లోక్‌ అదాలత్‌లను ఆశ్రయిస్తున్నాయి.

2017-18లో బ్యాంకులు సర్ఫేసీ చట్టం కల్పించే అధికారాలను ఉపయోగించుకోవడం ద్వారా రూ.26,500 కోట్లు, ఐబీసీ ప్రయోగం ద్వారా రూ.4,900 కోట్ల మొండిపద్దులను పరిష్కరించుకోగలిగాయి.

బ్యాంకులు ఒకవైపు మొండి బకాయిల రికవరీకి ప్రయత్నిస్తూనే, మరోవైపు ఆస్తుల నాణ్యతను పెంచుకునేందుకు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా కొన్ని మొండిపదుల్ని ఆస్తుల పునర్వ్యవస్థీకరణ కంపెనీలు(ఏఆర్‌సీ), ఎన్‌బీఎ్‌ఫసీలు, ఇతర ఆర్థిక సేవల సంస్థలకు విక్రయిస్తున్నాయి.

ఫొటో సోర్స్, ANKIT SRINIVAS

వణికిస్తున్న చలి

తెలంగాణలో చలి తీవ్రరూపం దాల్చింది. దీనికి చలిగాలులు కూడా తోడవడంతో జనం వణికిపోతున్నారని 'నమస్తే తెలంగాణ' ఓ కథనం ప్రచురించింది.

ఉత్తరాది రాష్ట్రాలతోపాటు ఈశాన్య రాష్ట్రాల నుంచి వీస్తున్న చలిగాలులు తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

ప్రత్యేకించి ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉన్నది. ఆదిలాబాద్, రామగుండం, మెదక్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయిలో పడిపోయాయి.

కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 2 నుంచి 9 సెల్సియస్ డిగ్రీల వరకు తగ్గిపోయాయి. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 4.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదవగా.. మెదక్‌లో 4.9, నిజామాబాద్‌లో 6.6, మేడ్చల్‌లో 7.9, హైదరాబాద్‌లో 11.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు హైదరాబాద్‌లో 9.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. బీహెచ్‌ఈఎల్ పరిసర ప్రాంతాల్లో 6.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయినట్టు తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది.

హైదరాబాద్‌లో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదుకావడం గత పదేండ్లలో ఇది రెండోసారి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)