హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలు: ‘ఈ రాత్రి నెక్లెస్‌ రోడ్డు.. ట్యాంక్‌బండ్‌‌లపై ఆ పనులు చేయొద్దు’

హైదరాబాద్ హుస్సేన్ సాగర్

ఫొటో సోర్స్, Getty Images

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు హైదరాబాద్‌, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్‌ పోలీసు అధికారులు తెలిపారు.

హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌పై ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజని కుమార్ తెలిపారు.

31 డిసెంబర్ రాత్రి 10 గంటల నుంచి 1 జనవరి 2 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్, నక్లెస్ రోడ్ మరియు అప్పర్ ట్యాంక్‌బండ్ మార్గాల్లో వాహనాలను అనుమతించరు.

బేగంపేట ఫ్లైఓవర్ మినహా.. నగరంలోని ఫ్లైఓవర్లన్నింటినీ మూసివేస్తున్నారు.

ఫొటో సోర్స్, HYDTP/fb

ఫొటో క్యాప్షన్,

పాత చిత్రం

  • వీవీ విగ్రహం వద్ద నెక్లెస్‌ రోడ్డు, ఎన్టీఆర్‌ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను ఖైరతాబాద్, రాజ్‌భవన్ వైపు మళ్లిస్తారు.
  • బీఆర్‌కే భవన్ నుంచి ఎన్టీఆర్‌ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను తెలుగు తల్లి కూడలి వద్ద ఇక్బాల్ మినార్, లక్డీకపూల్ వైపు మళ్లిస్తారు.
  • లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్‌కు వచ్చే వాహనాలను జీహెచ్‌ఎంసీ వై జంక్షన్ నుంచి బీఆర్‌కే భవన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు.
  • ఖైరతాబాద్ మార్కెట్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను ఖైరతాబాద్ వద్ద సెన్సేషన్ థియేటర్, రాజదూత్‌ లైన్‌కి మళ్లిస్తారు.
  • మింట్‌ కాంపౌండ్ నుంచి సచివాలయం వెళ్లే మార్గాన్ని మూసివేస్తారు.
  • నల్లగుట్ట రైల్వే వంతెన నుంచి సంజీవయ్య పార్కు, నెక్లెస్ రోడ్డు వైపు వాహనాలను అనుమతించరు. వాహనాలను కర్బాల మైదాన్ లేదా మినిస్టర్ రోడ్డుకి మళ్లిస్తారు.
  • సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలను షెయిలింగ్ క్లబ్ వద్ద కవాడిగూడ, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వైపు మళ్లిస్తారు.

రాత్రి 2 గంటల వరకు హైదరాబాద్ నగర పరిధిలోకి ట్రావెల్ బస్సులను, లారీలను, భారీ వాహనాలను అనుమతి ఉండదని పోలీసులు తెలిపారు.

మద్యం తాగి వాహనాలు నడపడం, నిర్లక్ష్యంగా నడపడం, ద్విచక్ర వాహానాలపై ట్రిపుల్ రైడింగ్ చేయడంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఇలాంటివి జరిగే అవకాశాలున్న ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్లపై ప్రత్యేక దృష్టి సారించారు.

ఫొటో సోర్స్, HYDTP

సైబరాబాద్‌ పరిధిలో

పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే సహా... సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఫ్లె ఓవర్లన్నీ రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు మూసివేసి ఉంటాయని ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ బీబీసీతో చెప్పారు. ఫ్లై ఓవర్ల మీద ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఔటర్ రింగు రోడ్డు మీద కూడా ఆంక్షలు విధిస్తున్నామని తెలిపారు. విమానాశ్రయానికి వెళ్లే వాహనాలు, అత్యవసర సేవల వాహనాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే భారీ వాహనాలు మినహా... మరే వాహనాలనూ అనుమతించబోమని చెప్పారు.

సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూసేందుకు శాంతిభద్రతల విభాగం పోలీసులతో కలిసి అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 600 మంది పోలీసులు విధుల్లో ఉంటారని డీసీపీ చెప్పారు.

డ్రంక్ అండ్ డ్రైవ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్, రేసింగులు, ట్రిపుల్ రైడింగ్‌‌తో పాటు రోడ్ల మీద ఆకతాయి చేష్టలను కట్టడి చేసేందుకు విస్త‌ృతంగా తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు.

ఫొటో సోర్స్, RachakondaCop/fb

రాచకొండ కమిషనరేట్ పరిధిలో

డిసెంబర్ 31 రాత్రి 11 గంటల నుంచి జనవరి ఉదయం 5 గంటల వరకు ఔటర్ రిండ్ రోడ్డు మీద రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ కూడా తెలిపారు.

ఎల్బీనగర్ కామినేని ఫ్లెఓవర్, చింతల్‌కుంట అండర్‌ పాస్ మార్గంలో రాత్రి 10 గం. నుంచి ఉదయం 5 గంటల దాకా నిషేధం ఉంటుంది.

మద్యం తాగి వాహనాలను నడిపేవారిని పట్టుకునేందుకు పలు చోట్ల తనిఖీలు చేపట్టనున్నట్లు ఎల్బీనగర్ పోలీసులు తెలిపారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వారికి మోటారు వాహన చట్టంలోని సెక్షన్‌ 185 కింద కేసు నమోదు చేస్తామని, వారికి 6 నెలల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.

రాత్రి 12.30 వరకూ మెట్రో

కొత్త సంవత్సర వేడుకల ప్రజల సౌకర్యార్ధం మెట్రోరైలు వేళల్ని పొడిగించారు.

మియాపూర్‌, ఎల్‌బీనగర్‌, నాగోల్‌ స్టేషన్ల నుంచి చివరి మెట్రోరైలు రాత్రి 12 గంటలకు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.

అమీర్‌పేట ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్‌ నుంచి అన్ని వైపులకూ చివరి మెట్రో రాత్రి 12.30 గంటలకు బయలుదేరుతుందని హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)