తెలుగు రాష్ట్రాల్లో ఎందుకింత చలి

చలి తీవ్రత

ఫొటో సోర్స్, Getty Images

ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్‌‌ను చలి చంపేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది.

ఆదివారం తెల్లవారుజామున ఆదిలాబాద్‌లో 5 డిగ్రీల సెల్సియస్, మెదక్‌లో 8, రామగుండంలో 8, హన్మకొండలో 10, హైదరాబాద్‌లో 11 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

తెలుగు రాష్ట్రాల్లో చలి ఇలా పెరగడం గత పదేళ్లలో ఇది రెండోసారని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

ఇంతకీ వణికించే స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోడానికి కారణం ఏంటి?

చల్ల గాలులు

శీతాకాలంలో ఉత్తర భారతం నుంచి దక్షిణానికి చల్ల గాలులు వీస్తుంటాయి. వాటి వల్ల ఇక్కడ చలి పెరుగుతుంది. ఇలా ప్రతీ ఏటా నాలుగైదుసార్లు జరుగుతుంది. ఆ చల్లగాలుల ప్రభావం ఉన్న రెండు మూడు రోజులు రాత్రి పూట చలి పెరుగుతుంది.

వానలు

తుపాను ప్రభావంతో ఇటీవల తెలంగాణలో చాలా చోట్ల వానలు పడ్డాయి. సహజంగానే వానలు పడ్డచోట్ల వేడి తగ్గుతుంది. దాంతో రెండు మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి.

ఫొటో సోర్స్, Getty Images

కమ్ముకున్న మేఘాలు

రెండు మూడు రోజులుగా హైదరాబాద్, తెలంగాణలో చాలా చోట్ల ఆకాశంలో సూర్యుడు కనపడలేదు. మొత్తం మేఘాలు కమ్మేశాయి. ఇంత భారీగా మేఘాలు కమ్మడం వల్ల సూర్యకాంతి నేరుగా భూమిపై పడే అవకాశం ఉండదు. దీంతో భూమి వాతావరణం వేడెక్కదు. దీంతో చలిగా ఉంటుంది. వర్షం కురిసే ముందు మేఘం పట్టినప్పుడు వచ్చే వాతావరణం ఇక్కడ రెండు రోజులు కొనసాగింది.

పైన ఉన్న మూడు కారణాల్లో ఏదో ఒక కారణంతో చలి పెరుగుతుంది.కానీ, ఈ రెండు రోజుల్లో తెలంగాణలో ఈ మూడు కలసి వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images

తుపాను ప్రభావంతో వానలు కురుస్తున్న సమయంలోనే ఉత్తరాది నుంచి చల్ల గాలులు వచ్చాయి. దాంతో ఉష్ణోగ్రతలు బాగా పడిపోయి చలి పెరిగింది.

తుఫాను ప్రభావం తగ్గాక కూడా సూర్యుడు కనిపించి ఉండుంటే ఆ తేడా తెలిసేది కాదు. కానీ దట్టమైన మేఘాలతో ఆ అవకాశం లేకపోయింది. మూడు కారణాలు కలిసి తెలంగాణలో చలి తీవ్రతను పెంచాయి.

శీతాకాలం పగటి ఉష్ణోగ్రతలు పడ్డాయి

శీతాకాలంలో రాత్రి పూట ఉష్ణోగ్రత తగ్గడం, పగలు పెరగడం మామూలే. కోస్తాతో పోలిస్తే, రాయలసీమ - తెలంగాణలున్న దక్కన్ పీఠభూమిలో ఈ తేడాలెక్కువ. ఇక్కడ శీతాకాలం పగలు 28 డిగ్రీల వరకూ వేడి నమోదు కావాల్సి ఉంటుంది. కానీ పైన చెప్పిన మూడు కారణాల వల్ల అది 20 డిగ్రీల కంటే తగ్గిపోయింది. పగటి పూట కూడా 19-20 డిగ్రీలు ఉండడం, రాత్రుళ్లు ఇంకా తగ్గడంతో చలి తీవ్రత పెరిగిపోయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)