ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులివ్వడం క్రిమినల్ నేరం, మూడేళ్ల వరకూ జైలు శిక్ష.. బిల్లుకు ఆమోదం తెలిపిన రాజ్యసభ

  • 30 జూలై 2019
రాజ్యసభ ట్రిపుల్ తలాఖ్

ముస్లిం మహిళల (వివాహ హక్కుల రక్షణ) బిల్లు 2019కి రాజ్యసభ మంగళవారం ఆమోదం తెలిపింది.

ఈ బిల్లుపై నాలుగు గంటలకు పైగా చర్చ జరగ్గా.. అనంతరం రాజ్యసభ ఛైర్మన్ ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 99 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 84 ఓట్లు వచ్చాయి.

ఈ బిల్లుకు లోక్‌సభ గతవారం ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి సంతకంతో ఇది చట్టంగా మారనుంది. ఇప్పటికే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపంలో 2018 సెప్టెంబర్‌ నుంచి ఈ చట్టాన్ని అమలు చేస్తోంది.

దీని ప్రకారం 'ఇన్‌స్టెంట్ ట్రిపుల్ తలాక్'ను ఇకపై క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. మూడుసార్లు తలాక్ చెప్పి ముస్లిం భర్తలు తమ భార్యలకు విడాకులు ఇవ్వటం ఇకపై నేరం. ఒకవేళ అలా విడాకులు పొందిన మహిళ ఫిర్యాదు చేస్తే.. ట్రిపుల్ తలాక్ ఇచ్చిన భర్తకు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.

ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ బిల్లును ప్రవేశపెట్టారని ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది.

మహిళల రక్షణ కోసమే ఈ బిల్లును తెచ్చామని అధికార బీజేపీ సమర్థించుకుంది.

ఒకేసారి ట్రిపుల్ తలాక్ చెప్పడాన్ని సుప్రీంకోర్టు 2017లో రాజ్యాంగ విరుద్ధం అని చెప్పింది. ఆ తర్వాత ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తూ మోదీ ప్రభుత్వం బిల్లును తయారు చేసి లోక్‌సభలో ప్రవేశపెట్టింది. 2018లో లోక్‌సభ దానికి ఆమోదం తెలిపింది. కానీ, రాజ్యసభ ఆమోదం లభించలేదు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ఈ చట్టాన్ని తీసుకొచ్చింది.

తిరిగి అధికారం చేపట్టిన తర్వాత తాజా బిల్లును ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందింది. ఇప్పుడు రాజ్యసభ ఆమోదం కూడా లభించింది. దీనిపై రాష్ట్రపతి సంతకం చేస్తే ఇప్పటికే అమలులో ఉన్న ఆర్డినెన్స్ స్థానంలో కొత్త చట్టం వస్తుంది. అయితే, ఆర్డినెన్స్‌లో ఉన్న విధి, విధానాలు, శిక్షలనే బిల్లులో కూడా పేర్కొన్నారు.

Image copyright Rajya Sabha TV
చిత్రం శీర్షిక రవిశంకర్ ప్రసాద్

‘ఓటుబ్యాంకు రాజకీయం కాదు’ - రవి శంకర్ ప్రసాద్

ఈ బిల్లును కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీనిని ఓటు బ్యాంకు రాజకీయంగా చూడొద్దని, లింగ సమానత్వం కోసమే ఈ బిల్లును ప్రవేశపెడుతున్నామని చెప్పారు.

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా 574 ట్రిపుల్ తలాక్ కేసులు నమోదయ్యాయని, ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత 101 కేసులు నమోదయ్యాయని, అక్రమంగా ఈ పద్ధతిని కొందరు ఇంకా పాటిస్తున్నారని చెప్పారు.

20కి పైగా ముస్లిం దేశాలు ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయడం లేదా వివిధ పద్ధతుల్లో నియంత్రించడం చేస్తున్నాయని తెలిపారు.

Image copyright Rajya Sabha TV
చిత్రం శీర్షిక గులాంనబీ ఆజాద్

‘భార్య, భర్తలు లాయర్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది’ - గులాంనబీ ఆజాద్

ప్రతిపక్ష నాయకుడు గులాంనబీ ఆజాద్ ఈ చర్చలో ప్రసంగిస్తూ.. ఈ చట్టం వల్ల ముస్లిం, భార్య భర్తలు న్యాయ వివాదాల్లో చిక్కుకుంటారని, ఇద్దరూ న్యాయవాదుల చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. న్యాయవాదులకు ఫీజులు చెల్లించేందుకు వాళ్లు తమ భూముల్ని కూడా అమ్ముకోవాల్సి వస్తుందని అన్నారు.

ఒకవేళ భర్త జైలు పాలయితే భార్యకు భరణం ఎలా చెల్లిస్తాడని ప్రశ్నించారు.

ఈ బిల్లు వివాహాలను పరిరక్షిస్తుందని పేర్కొన్నారని, వాస్తవానికి దీని ఉద్దేశం కుటుంబాలను విడదీయడమేనని అన్నారు.

ట్రిపుల్ తలాక్ పద్ధతిని సుప్రీంకోర్టు రద్దు చేస్తే ఇక (ఈ బిల్లులో పేర్కొన్నట్లుగా) శిక్షలు దేనికని ప్రశ్నించారు.

ఈ బిల్లు వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.

కాగా, అధికార బీజేపీ మిత్రపక్షం అయిన జేడీయూ ఈ బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యసభ నుంచి వాకౌట్ చేసింది. అదేవిధంగా టీఆర్ఎస్, టీడీపీలు ఈ బిల్లుపై ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఆ రెండు పార్టీల ఎంపీలు కూడా వాకౌట్ చేశారు. ఏఐఏడీఎంకే సైతం వాకౌట్ చేసింది.

వైఎస్సార్‌సీపీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తున్నట్లు ప్రకటించింది.

Image copyright Rajya Sabha TV

అసలు 'ఇన్‌స్టెంట్ ట్రిపుల్ తలాక్' అంటే ఏంటి?

'ఇన్‌స్టెంట్ ట్రిపుల్ తలాక్' లేదా 'తలాక్-ఉల్-బిద్దత్' అనేది 'తలాక్' చెప్పే ఒక విధానం. దీని ద్వారా భర్తలు ఒకే సమయంలో మూడు సార్లు 'తలాక్', 'తలాక్', 'తలాక్' అని చెప్పడం ద్వారా విడాకులు పొందవచ్చు.

దీనిని మాటల ద్వారా లేదా టెక్ట్స్ మెసేజ్‌ల ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా - ఎలాగైనా చెప్పవచ్చు.

దీనిని నిషేధించాలంటూ ముస్లిం మహిళల నుంచి సుప్రీంకోర్టుకు పెద్ద ఎత్తున పిటిషన్లు వెల్లువెత్తడంతో, కోర్టు ఇది రాజ్యాంగవిరుద్ధం అంటూ 2017 ఆగస్టులో దానిని నిషేధించింది.

'ఇన్‌స్టెంట్ ట్రిపుల్ తలాక్' చుట్టూ అలుముకున్న వివాదమేంటి?

ముస్లిం మహిళల (వివాహ హక్కుల రక్షణ) బిల్లు ప్రకారం 'ఇన్‌స్టెంట్ ట్రిపుల్ తలాక్'ను క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. దీని కింద ఒక ముస్లిం పురుషుడికి అత్యధికంగా మూడేళ్ల జైలుశిక్ష విధించవచ్చు.

అంతే కాకుండా భర్త ఆ కాలంలో బాధితురాలికి భరణాన్ని కూడా చెల్లించాలి.

కొన్ని ముస్లిం మహిళా బృందాలు దీని వల్ల ముస్లిం మహిళలకు ప్రయోజనం ఉండదని వాదిస్తున్నాయి. వివాహ బంధాన్ని కొనసాగించడంలో మహిళలకు కూడా సమానమైన హక్కులు, రక్షణ వ్యవస్థలు ఉండాలని, వివాహ రద్దు విషయంలో తమ అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు.

కేవలం జైలులో పెట్టడం వల్ల లక్ష్యం నెరవేరదు. దీని వల్ల భర్తలు తాము జైలులో ఉండడం వల్ల భరణం చెల్లించలేకపోతున్నామని కూడా చెప్పే అవకాశం ఉంది. అప్పుడు భార్యలే తమను, తమ పిల్లలనూ పోషించుకోవాల్సి వస్తుందని వారు అంటున్నారు.

Image copyright Getty Images

భారతదేశంలోని ముస్లింలంతా ఈ 'ఇన్‌స్టెంట్ ట్రిపుల్ తలాక్'ను పాటిస్తారా?

సున్నీ ఇస్లామిక్ చట్టంలోని మూడు సాంప్రదాయాలు 'ట్రిపుల్ తలాక్' విధానం ఇప్పుడు చెల్లుబాటు కాదని చెబుతున్నా... నాలుగోది అయిన దేవ్‌బంద్ సాంప్రదాయంలో మాత్రమే ఈ వివాదాస్పద విధానం ప్రస్తుతం చెల్లుబాటులో ఉంది.

భారతదేశంలోని ముస్లింలలో ఈ 'ఇన్‌స్టెంట్ ట్రిపుల్ తలాక్'పై అధికారిక గణాంకాలు లేవు.

అతి తక్కువ మందితో నిర్వహించిన ఒక ఆన్‌లైన్ సర్వేలో, ఒక్కశాతం కన్నా తక్కువ మంది ఈ రకం విడాకుల విధానాన్ని ఉపయోగించుకున్నారని తెలిసింది.

ఖురాన్ ప్రకారం 'ట్రిపుల్ తలాక్' ఎలా ఇస్తారు?

విడాకుల ప్రక్రియను ఒక ముస్లిం పురుషుడు ప్రారంభిస్తే దానిని 'తలార్-ఉల్-అహ్సాన్' అని పిలుస్తారు. పరిస్థితులు చక్కబడేందుకు, దంపతుల మధ్య అభిప్రాయభేదాలు తొలగించుకునేందుకు అవకాశం కల్పించే విధంగా ఇది మూడు నెలల వ్యవధిలో జరగాలి.

ఎవరైనా ముస్లిం మహిళ కూడా విడాకులను కోరవచ్చు. దీనిని 'ఖులా' అని అంటారు.

ఒకవేళ ఒక మహిళ విడాకులు కావాలనుకుని, ఆమె భర్త దానికి నిరాకరిస్తుంటే, ఆమె ఎవరైనా ఒక ఖాజీ వద్దకు లేదా షరియా కోర్టుకు వెళ్లవచ్చు. ఈ విధంగా న్యాయబద్ధంగా జారీ అయిన విడాకులను 'ఫష్క్-ఎ-నిఖా' అని అంటారు.

వివాహం జరిగేటప్పుడే, వివాహ ఒప్పందం 'నిఖానామా'లోనే ఒక మహిళ 'తలాక్' నియమ నిబంధనలను పేర్కొనవచ్చు. దీనిని 'తఫ్‌వీద్-ఎ-తలాక్' లేదా భార్యకు తలాక్ హక్కుల బదిలీ అంటారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ఈ కథనం గురించి మరింత సమాచారం