కొలువుదీరిన కొత్త హైకోర్ట్.. న్యాయమూర్తులతో ప్రమాణం చేయించిన గవర్నర్
- శంకర్
- బీబీసీ కోసం

ఫొటో సోర్స్, facebook/I & PR Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు
నవ్యాంధ్రలో కొత్త శకం ప్రారంభమయ్యింది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన పూర్తికావడంతో అమరావతిలో కొత్తగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొలువుదీరింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన హైకోర్టులో న్యాయమూర్తులు, న్యాయవాదుల సందడి కనిపించింది. దీంతో రాష్ట్రంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది.
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో తాత్కాలిక హైకోర్టు ఏర్పాటు చేశారు. అంతకుముందు హైదరాబాద్ హైకోర్టు ప్రాంగణం నుంచి నాలుగు బస్సుల్లో సుమారు రెండు వందల మంది అధికారులు, ఉద్యోగులు అమరావతి చేరుకున్నారు. దీంతో విజయవాడలో సందడి వాతావరణం నెలకొంది.
రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిగా నియమతులైన జస్టిస్ సి. ప్రవీణ్‌కుమార్‌తో పాటు మరో 13 మంది న్యాయమూర్తులకు నోవాటెల్ హోటల్ వద్ద అధికారయంత్రాంగం ఘన స్వాగతం పలికింది. ప్రధాన న్యాయమూర్తికి పోలీసులు గౌరవ వందనం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా స్వాగతం పలికారు.
సీజెతో పాటు న్యాయమూర్తులు కె.ఉమా దేవి, టి.రజని, కె.విజయలక్ష్మి, ఎస్వి.భట్, ఎ.వి.శేషసాయి, ఎం.సీతారామమూర్తి, యు.దుర్గాప్రసాదు, టి.సునీల్‌చౌదరి, ఎం.సత్యనారాయణమూర్తి, జి.శ్యాంప్రసాదు, ఎన్.బాలయోగి, డి.వి.ఎస్.ఎస్.సోమ యాజులు, ఎం.గంగారావు తదితరులున్నారు.
ఫొటో సోర్స్, facebook/I & PR Andhra Pradesh
ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు
ఏపీలో ఇంకా హైకోర్టు భవనం నిర్మాణం పూర్తవ్వకపోవడంతో సీఎం క్యాంపు కార్యాలయంలోనే కొన్నాళ్ల పాటు హైకోర్టు కార్యకలాపాలు జరుగనున్నాయి.
ఇందుకు సంబంధించి తొమ్మిది కోర్టు హాళ్లను సిద్ధం చేశారు. మరో హాలును మహాత్మాగాంధీ రోడ్డులో ఉన్న రాష్ట్ర రోడ్లుభవనాల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేశారు.
హైకోర్టు భద్రత రీత్యా 91 మంది ఎస్పీఎఫ్ సిబ్బందిని కేటాయించారు.
మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ తొలి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో గవర్నర్ నరసింహన్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
సీజే తర్వాత మిగిలిన న్యాయమూర్తులతో కూడా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పూర్తిస్థాయిలో కార్యకలాపాలకు శ్రీకారం చుట్టినట్లయింది.
నోటిఫికేషన్ ఇచ్చిన వారంలోపే..
2018 డిసెంబరు 26న ఉమ్మడి హైకోర్టు విభజన నోటిఫికేషన్ వెలువడింది. దీంతో జనవరి 1 నుంచి అమరావతి కేంద్రంగా ఏపీ రాష్ట్ర హైకోర్టు విధులు ప్రారంభమయ్యాయి.
ఉమ్మడిహైకోర్టులో 3.4లక్షల వ్యాజ్యాలు ఉండగా.. అందులో 70 శాతం వరకు కేసులు ఏపీకి చెందినవే కావడంతో నూతన కోర్టు పరిధిలోకి తీసుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి 37 మంది న్యాయమూర్తుల పోస్టులు ఉండగా, ప్రస్తుతం 14 మంది బాధ్యతలు తీసుకున్నారు.
ఫొటో సోర్స్, facebook/I & PR Andhra Pradesh
చీఫ్ జస్టిస్ నేపథ్యం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి చీఫ్ జస్టిస్‌గా చాగరి ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు.
2012 జూన్ 29న ఆయన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 డిసెంబర్ 4 నుంచి శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు.
జస్టిస్. ప్రవీణ్ కుమార్ తండ్రి ప్రముఖ న్యాయవాదిగా అందరికీ చిరపరిచితుడైన సి. పద్మనాభరెడ్డి. సుమారు 60 ఏళ్ల పాటు న్యాయవాద వృత్తిలో పద్మనాభ రెడ్డి సేవలు చేశారు.
పోలీసుల ఎన్కౌంటర్లో ఎవరైనా చనిపోతే కేసు నమోదు చేయాలా? వద్దా? అన్న దానిపై న్యాయమూర్తులు ఒక నిర్ణయానికి రాలేని సమయంలో కోర్టు సహాయకారిగా పద్మనాభరెడ్డి నియమించడం విశేషం.
ఆత్మ రక్షణ కోసమే కాల్పులు జరిపామని పోలీసులు నిరూపించుకోవాలని, కేసు నమోదు చేయకుండా పోలీసులే అది ఎన్కౌంటర్ అని తీర్పులు ఇచ్చుకోవడం సరికాదని పద్మనాభరెడ్డి సూచించి సంచలనం రేపారు.
దీంతో ఎన్కౌంటర్ జరిగితే పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందేనని హైకోర్టు తీర్పు చెప్పింది.
అలాంటి చారిత్రక సంచలన న్యాయపరమైన అంశాల్లో కీలకంగా వ్యవహరించిన పద్మనాభ రెడ్డి వారసుడిగా న్యాయవృత్తిని స్వీకరించిన జస్టిస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ఏపీ హైకోర్ట్ కి తొలి తాత్కాలిక న్యాయమూర్తిగా హోదా దక్కడం విశేషం. మంగళవారం బాధ్యతలు స్వీకరించిన ఆయన్ని పలువురు అభినందించారు.
ఇవి కూడా చదవండి:
- అప్పట్లో ఫుట్‌బాల్ అంటే హైదరాబాద్.. హైదరాబాద్ అంటే ఫుట్‌బాల్
- సోషల్ మీడియా: కావాలనే యూజర్లను వ్యసనపరుల్ని చేస్తున్న కంపెనీలు
- టికెట్ కలెక్టర్ నుంచి ట్రోఫీ కలెక్టర్ వరకూ ఎంఎస్ ధోనీ జర్నీ
- YouTube Stars: అమ్మాయిల కోసం, అమ్మాయిల చేత, అమ్మాయిలతో.. ‘గాళ్ ఫార్ములా’
- కొత్తగా పుట్టిన గ్రహం.. ఫొటోకి చిక్కింది
- ‘మనిషి లాంటి’ చేప: ఇది కేన్సర్‌కి పరిష్కారం చూపుతుందా?
- ఉత్తరాదిలో రెండు లక్షల మంది తెలుగు వారు ఏమయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)