ఫిబ్రవరి 1 నుంచి మారుతున్న కేబుల్ ధరలు.. చానల్‌కు ఎంత చెల్లించాలి?

  • 2 జనవరి 2019
అనసూయ Image copyright facebook/anasuyabharadwaj

కొత్త కేబుల్ ధరలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. జనవరి 31 వరకూ పాత ధరలే ఉంటాయి. కొత్త నిబంధనలు అమలు చేయడానికి కేబుల్ ఆపరేటర్లు, ఎమ్మెస్వోలకు తగిన సమయం ఇవ్వడానికి వీలుగా గడువు సడలించారు.

తొలుత 2018 డిసెంబర్ 29 నుంచే అమలు చేయాలని నిర్ణయించినా తాజాగా ఫిబ్రవరి 1కి మార్చారు.

అయితే బిల్లులు పెరగడంపైనా, కేబుల్ కనెక్షన్ విషయంలో వినియోగదారులకు ఉన్న హక్కులపైనా అనేక మంది సందేహాలున్నాయి.

కేబుల్ విషయంలో వినియోగదారునికి ఉన్న ముఖ్యమైన హక్కులను ఇక్కడ అందిస్తున్నాం.

Image copyright Getty Images

గరిష్ఠ ధర రూ.19

* కొత్తగా కేబుల్ కనెక్షన్ తీసుకుంటుంటే, సెట్ టాప్ బాక్సును వాయిదా పద్ధతిలో లేదా అద్దె పద్ధతిలో కూడా తీసుకోవచ్చు. కచ్చితంగా కొనాలన్న నిబంధన లేదు.

* ఏ పే చానల్ అయినా గరిష్ఠంగా 19 రూపాయలు మాత్రమే వసూలు చేయగలదు. అంత కంటే తక్కువ కూడా చేయవచ్చు. ఎక్కువ చేయకూడదు.

* కొత్త నిబంధనల ప్రకారం 100 ఉచిత చానళ్లు తప్పనిసరిగా ఇవ్వాలి. అందులో 26 దూరదర్శన్ చానళ్లే ఉంటాయి. ఈ వంద చానళ్లకీ కలిపి 130 రూపాయలు, 18 శాతం జీఎస్టీ అంటే మొత్తం 153.40 రూపాయలు చెల్లించాలి.

* ఈ ఉచిత చానళ్లను ఎంపిక చేసుకునే హక్కు వినియోగదారుడికి ఉంది.

* వంద చానళ్ల కంటే ఎక్కువ ఉచిత చానళ్లను ఎంపిక చేసుకునే హక్కు కూడా వినియోగదారుడికి ఉంది. ఉదాహరణకు వందకు పైన ఇంకో 25 ఉచిత చానళ్లు కోరుకుంటే దానికి మరో 20 రూపాయలు ఎక్కువ బిల్లు కట్టాలి. సాధారణంగా ఈ అవసరం ఎక్కువ మందికి రాదు.

Image copyright facebook/sreemukhi

* ప్రతీ చానల్ కీ విడివిడి ధర ఉంటుంది. లేదంటే ఒకే గ్రూపుకు చెందిన చానళ్లు నాలుగైదింటికి కలిపి ఒక ధర ఇవ్వవచ్చు.

* ప్రతీ ఆపరేటరూ మీ దగ్గరకు ఒక చానళ్ల లిస్టు తేవాలి. అందులో తాను అందిస్తోన్న చానళ్ల పేర్లు, వాటి ధరలూ ఉంటాయి. అందులో మీకు ఏది కావాలో టిక్ పెట్టి కింద సంతకం పెట్టాలి. ఈ కాపీ మీ దగ్గర ఒకటి, ఆపరేటర్ దగ్గర ఒకటీ ఉండాలి.

* కేబుల్ యాక్టివేషన్ చార్జీలు 350 రూపాయలకు మించకూడదు. అన్నిటికీ బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలి. నెల నెలా కట్టే డబ్బులతో సహా.

* మీకిచ్చే కార్డులో మొత్తం చానళ్ల పట్టిక, వాటి ధరలు, గ్రూపు చానళ్ల ధరలు, మీ ఎంపికను మీ నెలవారీ బిల్లూ - మొత్తం ఉండాలి. ఈ కార్డు ఒక కాపీ వినియోగదారుడి దగ్గరా, ఇంకో కాపీ ఆపరేటర్ దగ్గరా ఉండాలి.

* అన్ని రకాల నిబంధనలు ముద్రించిన కాగితం ఇవ్వాలి. అన్ని రకాల రేట్లు, రూల్స్ గురించి వివరించి చెప్పాలి. ఫిర్యాదు చేస్తే 8 గంటల్లో సర్వీసు సమస్య పరిష్కరించాలి.

* ఏదైనా పే చానల్ ప్రసారాలు ఆగిపోతే ఆ డబ్బు వసూలు చేయకూడదు. కానీ దాని బదులు అంతే ధర ఉన్న వేరే పే చానల్ కావాలంటే ఇవ్వవచ్చు లేదా తీసుకోవచ్చు.

* ఫిర్యాదులకు సంబంధించిన నంబర్లు ఇవ్వాలి, వెబ్ సైట్ ఏర్పాటు చేయాలి. చానళ్ల మార్పిడి రాతపూర్వకంగా ఉండాలి, 72 గంటల్లో జరగాలి.

* నెల కంటే ఎక్కువ రోజులు చానల్ చూడకపోతే ఆ నెల బిల్లు కట్టక్కర్లేదు. కానీ ఆ విషయం 15 రోజుల మందే ఆపరేటర్ కి చెప్పాలి. కానీ మళ్లీ రీ కనెక్షన్ కి మూడు నెలల లోపు అయితే 25 రూపాయలు, మూడు నెలలు దాటితే 100 రూపాయలు కట్టాలి.

* ఈ ఏర్పాట్లు కేబుల్ ఆపరేటర్ లేదా ఎమ్మెస్వో (ఎమ్మెస్వో అంటే చానల్ కీ కేబుల్ ఆపరేటర్ కీ మధ్యలో ఉండే డిస్ట్రిబ్యూటర్ వంటి వారు)లు చేయాలి.

Image copyright facebook/RashmiGautam

ప్రస్తుత తెలుగు చానళ్లు ఆఫర్ చేస్తోన్న ధరలు(రూ.ల్లో):

1) జెమినీ టీవీ19.00

2) జెమినీ మూవీస్17.00

3) జెమినీ కామెడీ5.00

4) జెమినీ లైఫ్5.00

5) జెమిని మ్యూజిక్4.00

6) ఖుషి టీవీ4.00

7) జెమిని న్యూస్0.10

* పాకేజ్/బొకే ధర30.00

Image copyright Etv

ఈటీవీ పాకేజ్(ధర రూ.ల్లో)

1) ఈటీవీ 17.00

2) ఈటీవీ ప్లస్7.00

3) ఈటీవీ సినిమా 6.00

4) ఈటీవీ అభిరుచి 2.00

5) ఈటీవీ లైఫ్ 1.00

6) ఈటీవీ ఆంధ్రప్రదేశ్ 1.00

7) ఈటీవీ తెలంగాణ 1.00

* పాకేజ్/బొకే ధర24.00

Image copyright facebook/starmaa

స్టార్ తెలుగు వాల్యూ పాక్(రూ.ల్లో)

1) మా టీవీ19.00

2) మా మూవీస్10.00

3) మా గోల్డ్2.00

4) మా మ్యూజిక్1.00

5) స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు19.00

6) స్టార్ స్పోర్ట్స్ 26.00

7) స్టార్ స్పోర్ట్స్ 34.00

8) నేషనల్ జాగ్రఫిక్2.00

9) నాట్ జియో వైల్డ్1.00

10) స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్1.00

* పాకేజ్/బొకే ధర39.00

Image copyright facebook/zee telugu

జీ ప్రైమ్ పాక్

1) జీ తెలుగు19.00

2) జీ సినిమాలు10.00

3) లివింగ్ ఫుడ్జ్4.00

4) జీ యాక్షన్1.00

5) జీ ఇటిసి1.00

6) వియాన్1.00

7) జీ న్యూస్0.50

8) జీ హిందుస్తాన్0.50

9) జీ కేరళమ్0.10

* పాకేజ్/బొకే ధర20.00

Image copyright Getty Images

నెలవారీ బిల్లు

ప్యాకేజీ, ధరల వివరాలు: 100 ఉచిత చానళ్లు రూ. 153.40, జెమినీ బొకే 35.40, ఈటీవీ బొకే 28.32, స్టార్ తెలుగు బొకే 46.02, జీ ప్రైమ్ పాక్ బొకే 23.60, మొత్తం బిల్లు 286.74

(సీనియర్ జర్నలిస్ట్ తోట భావనారాయణ ఇచ్చిన సమాచారం ఆధారంగా)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)