చైనా యూత్ ఒకరికి మించి ఎందుకు కనడం లేదు? ఇద్దరిని కనేందుకు ఎందుకు భయపడుతున్నారు?

  • 2 జనవరి 2019
చైనాలో తగ్గుతోన్న జనాభా Image copyright Victor Fraile Rodriguez

మూడేళ్ల కిందట 'ఒకే బిడ్డ విధానానికి' చైనా ముగింపు పలికింది. పనిచేసే యువత జనాభాను పెంచి ఆర్థికాభివృద్ధిని సాధించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో వృద్ధుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో నిబంధన సడలింపు వల్ల రెండో బిడ్డను కనడానికి ప్రజలు సిద్ధమవుతారని ప్రభుత్వం భావించింది.

కానీ, దీని వల్ల పెద్దగా ఫలితం రాలేదు అని లండన్ కేంద్రంగా పనిచేసే చైనా విశ్లేషకులు యువెన్ వ్యూ వెల్లడించారు.

మందగిస్తున్న జనాభా రేటు గురించే ఇప్పుడు చైనాలో ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి. దేశంలో ఆ సంక్షోభానికి సంబంధించిన వాస్తవ పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఇన్నాళ్లు ఒకే బిడ్డ విధానాన్ని కఠినంగా అమలు చేసిన చైనా ఇప్పుడు సరికొత్త నినాదాన్ని వినిపిస్తోంది.

దేశం కోసం బిడ్డలను కనండి అంటూ పిలుపునిస్తోంది. అయితే, దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు ప్రభుత్వం జనాభా పెంచే చర్యలను పరిశీలిస్తోంది. ముఖ్యంగా మెటర్నటీ సెలవులు పెంచడంతో పాటు రెండో బిడ్డను కనేవారికి నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని, పన్నులో మినహాయింపు ఇవ్వాలని యోచిస్తోంది.

జనాభా విస్ఫోటనాన్ని అరికట్టేందుకు చైనా ప్రభుత్వం 1979లో ఒకే బిడ్డ విధానాన్ని తీసుకొచ్చింది. దీన్ని కఠినంగా అమలు చేసింది. దీంతో ఆ తర్వాత నాలుగేళ్లలోనే జనాభా పెరుగుదల అదుపులోకి వచ్చింది. తనకున్న అపార మానవవనరులను ఉపయోగించుకొని వేగంగా అభివృద్ధి చెందింది.

ఇప్పుడు పరిస్థితి మారింది. పనిచేసే యువత కనిపించడం లేదు. మరోవైపు వృద్ధుల సంఖ్య భారీగా పెరిగింది.

దీంతో ఆర్థికాభివృద్ధిని కొనసాగించేందుకు చైనా జనాభా పెరుగుదలకు చర్యలు తీసుకుంటోంది.

ఇందులో భాగంగా 2015లో తమ ఒకే బిడ్డ విధానానికి చైనా ముగింపు పలికింది. దీనివల్ల జనాభా పెరుగుతుందని భావించింది. కానీ, గణాంకాలు మాత్రం భిన్నంగా కనిపిస్తున్నాయి. యువతరం ఒక్కరిని మించి కనడానికి ఇష్టపడం లేదని తెలుస్తోంది.

Image copyright Getty Images

జనాభా పెరుగుదల రేటు తగ్గడం పెద్ద సమస్యనా?

  • 2018 నుంచి జనాభా పెరుగుదల రేటు మందగమనం కొనసాగుతుంది.
  • 10 ఏళ్లలో 23-30 ఏళ్ల మధ్యనుండే మహిళల సంఖ్య 40 శాతానికి తగ్గింది.
  • వచ్చే పదేళ్లలో ఏడాదికి పెరిగే జనాభా 80 లక్షల లోపే ఉంటుంది.

గత ఆగస్టులో కమ్యూనిస్టు పార్టీ అధికారిక దినపత్రిక ఈ సమస్యపై చర్చించేందుకు ఎక్కువ పేజీలను కేటాయించింది. పిల్లలుండటం కుటుంబానికి సంబంధించిన విషయమే కాదు దేశానికి సంబంధించినది కూడా అని తన సంపాదకీయం పేర్కొంది. జనాభా పెరుగుదల రేటు పడిపోతుండటంపై ఈ సంపాదకీయం ప్రభుత్వాన్ని హెచ్చిరించింది. ప్రభుత్వం సరికొత్త విధానాలు తీసుకురావాలని సూచించింది.

Image copyright Getty Images

జనాభా పెంచాలని చైనా ఎందుకు అనుకుంటోంది

చైనా ఆందోళనకు కారణం ఉంది. దేశంలో వృద్ధుల సంఖ్య బాగా పెరిగిపోతోంది. మరోవైపు జనాభా పెరుగుదల మందగించింది.

ఒకే బిడ్డ విధానం అమలు చేసిన తర్వాత దేశంలో సగటు ఆయుప్రమాణం 66 ఏళ్ల నుంచి 76 ఏళ్లకు పెరిగింది.

చైనా జాతీయ గణాంక సంస్థ నివేదిక ప్రకారం 2013లో ఆ దేశంలో 15 నుంచి 64 ఏళ్ల లోపు ఉన్న జనాభా అత్యధికంగా వంద కోట్లకు చేరింది. కానీ, జనాభా పెరుగుదల రేటు మాత్రం తగ్గుతూ వస్తోంది.

అదే సమయంలో వృద్ధుల జనాభా మరింతగా పెరుగుతోంది. 2017లో చైనా మొత్తం జనాభాలో 65 ఏళ్లు దాటిన వారి సంఖ్య 11.4 శాతంగా ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యధికం. పనిచేసే స్థితిలో లేని జనాభా అధికంగా ఉండటంతో ఈ ప్రభావం చైనా ఆర్థికస్థితిపై పడింది. మరోవైపు వారికి పెన్షన్‌లు, ఆరోగ్య సేవలు అందించడం కూడా ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతోంది.

చైనీయులు పిల్లలను ఎందుకు వద్దనుకుంటున్నారు

ఒకే బిడ్డ విధానాన్ని 30 ఏళ్ల పాటు కఠినంగా అమలు చేయడంతో ప్రజల మానసిక స్థితిలో మార్పు వచ్చింది. ఇప్పుడు ఆ విధానాన్ని తొలగించినా ప్రజల్లో మార్పు రావడం లేదు. ఆలస్యంగా వివాహం చేసుకోవడం, ఆలస్యంగా సంతానాన్ని కనడం చేస్తున్నారు.

తమ కెరీర్ మీదే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఒకరిని మించి కంటే వారి ఆలనాపాలనకు సంపాదన సరిపోదని భావిస్తున్నారు.

Image copyright Getty Images

ఇద్దరు సంతానం వల్ల ధనవంతులవుతారా?

కొన్ని ప్రాంతాల్లో ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలను కన్నవారి నుంచి ప్రభుత్వం అపరాధ రుసుం వసూలు వేయడం లేదు. జనాభా పెరుగుదల చర్యల చేపట్టేందుకు దంపతులకు నగదు ప్రోత్సాహకాలు, పన్నుల్లో మినహాయింపు ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలు వారికి ఇష్టమొచ్చినమందిని కనేలా స్వేచ్ఛ ఇవ్వాలని మరికొందరు కోరుతున్నారు.

ఇప్పుడు చైనాలో ఓ కొత్త మాట వినిపిస్తోంది. అదేమంటే,- ''ఒక బిడ్డ వల్ల మీరు పేదవారు అయిపోతారు. ఇద్దరు పుడితే ధనవంతులవుతారు'అని. త్వరలో ఈ మాటలు నినాదాలుగా మారే అవకాశమూ ఉంది.

జనాభాను నియంత్రించడం కంటే జనాభాను పెంచడం చాలా కష్టమైన ప్రక్రియ. ఎందుకంటే ఇది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కాదు. ఎంత మంది పిల్లలను కనాలనేది కుటుంబాలు వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు