రఫేల్ డీల్ ఆడియో టేపు లీక్ చేసిన రాహుల్ గాంధీ.. మొత్తం సంభాషణ ఇదే..

ఫొటో సోర్స్, Getty Images
రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు, అవినీతి ఆరోపణలపై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఒక ఆడియో టేపు వినిపించటానికి తనకు అనుమతి కావాలని బుధవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పీకర్‌ను కోరారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.
ఈ ఆడియో టేపు అసలైనదా? లేక నకిలీదా? దీన్ని ఎంత వరకు నమ్మొచ్చు? అన్న అనుమానాలు వ్యక్తం చేసిన స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ ఆడియో టేపును వినిపించేందుకు అనుమతి నిరాకరించారు.
ఈ ఆడియో టేపు నిజమైనదేనని, దానికి తాను బాధ్యుడినని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని కూడా ఆమె రాహుల్ గాంధీకి చెప్పారు.
దీంతో ఆ ఆడియో టేపులో ఉన్న సంభాషణల్ని చదవి వినిపించేందుకు రాహుల్ గాంధీ అనుమతి కోరగా.. దానికి కూడా స్పీకర్ వాటి ప్రామాణికతపై అనుమానం వ్యక్తం చేస్తూ అనుమతి నిరాకరించారు.
ఈ ఆడియో టేపు వినిపించేందుకు రాహుల్ గాంధీ చాలా ప్రయత్నించినప్పటికీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆయన వాదనను తోసిపుచ్చారు.
అయితే అసలు ఈ టేపులో ఏముంది? ఎందుకు విపక్ష కాంగ్రెస్ పార్టీ ఈ టేపును పార్లమెంటులో వినిపించాలనుకుంది? ఎందుకు అధికార పక్షం సిద్ధపడలేదు?
సభ వాయిదా పడిన అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా విలేకరుల సమావేశంలో ఈ ఆడియో టేపును మీడియాకు విడుదల చేశారు.
ఫొటో సోర్స్, VISRANE/TWITTER
గోవా ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజీత్ పీ రాణే
గోవా ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజీత్ పీ రాణేగా భావిస్తున్న వ్యక్తి, మరొక గుర్తు తెలియని వ్యక్తికి మధ్య జరిగిన సంభాషణ ఈ టేపులో ఉంది. ఈ ఇద్దరూ రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై కూడా మాట్లాడుకున్నారు. ఆ సంభాషణ వారి మాటల్లోనే..
అజ్ఞాత వ్యక్తి: గుడ్ ఈవ్నింగ్ సర్.
విశ్వజీత్ రాణే: బాస్ గుడ్ ఈవ్నింగ్. ఈరోజు 3 గంటలపాటు క్యాబినెట్ మీటింగ్ జరిగింది. అందుకే ఫోన్ చేశా.
అజ్ఞాత వ్యక్తి: ఓకే
విశ్వజీత్ రాణే: దీన్ని గోప్యంగా ఉంచు
అజ్ఞాత వ్యక్తి: ఓకే.. ఓకే..
విశ్వజీత్ రాణే: చాలా గొడవలు జరిగాయి.. చాలా గొడవలు. నీలేష్ కబ్రాల్ తన నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది ఇంజినీర్లను రిక్రూట్ చేశారు. జయేశ్ సల్గోవాంకర్ ఆ జాబితాను సంపాదించి, ఆయనకు చూపించారు. అందరూ ఆయనతో గొడవ పడ్డారు. నియామకాల దిశగా పని జరగడం లేదని అంతా నిరాశ వ్యక్తం చేశారు.
అజ్ఞాత వ్యక్తి: ఓకే
విశ్వజీత్ రాణే: సుదిన్ ధవాలికర్తో బాపూ అజ్గోవాంకర్ గొడవపడ్డారు.. తన పనులు జరగడం లేదని. ఇవన్నీ ఇలా ఉంటే.. ముఖ్యమంత్రి ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు. రఫేల్‌కు సంబంధించిన సమాచారం అంతా తన బెడ్రూమ్లో ఉందని చెప్పారు.
అజ్ఞాత వ్యక్తి: మీరేమంటున్నారు?
విశ్వజీత్ రాణే: నేను చెబుతున్నా కదా..
అజ్ఞాత వ్యక్తి: మై గాడ్
విశ్వజీత్ రాణే: దీనిపై నువ్వొక స్టోరీ చేయొచ్చు. క్యాబినెట్లో నీకు సన్నిహితులైన వారి నుంచి ఒకసారి క్రాస్ చెక్ చేసుకో.
అజ్ఞాత వ్యక్తి: ఓకే
విశ్వజీత్ రాణే: ఎందుకంటే.. ఈ విధంగా.. అసలు ఇది.. ఆయన చెప్పింది.. దాన్ని బట్టి ఆయన వారి నుంచి జరిమానా కోరుకుంటున్నారు.
అజ్ఞాత వ్యక్తి: నిజంగా
విశ్వజీత్ రాణే: రఫేల్‌కు సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ తనవద్దే.. తన బెడ్రూమ్లో.. ఇక్కడే.. ఫ్లాట్‌లోనే ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని ఎవరైనా వెళ్లి ఢిల్లీలోని వారికి చెప్పాలని ఆయన కోరుకుంటున్నారా? లేక మరేదైనా ఉందా? నాకు తెలీదు.. నాకు అర్థం కాలేదు.
అజ్ఞాత వ్యక్తి: దేవుడా
విశ్వజీత్ రాణే: ఇది చెబుదామనే నేను నీకు కాల్ చేశాను.
అజ్ఞాత వ్యక్తి: మరి 3 గంటల క్యాబినెట్ మీటింగ్ వాస్తవంగా సాధించిందేమీ లేదు. అంతకు మించి ఇంకేమైనా ఉందా?
విశ్వజీత్ రాణే: ఏమీ లేదు. అసలు దీనికి మార్గదర్శనమే లేదు. టైం వేస్ట్.
అజ్ఞాత వ్యక్తి: సర్.. స్పీకర్ సడెన్‌గా అసెంబ్లీ సెషన్ పెట్టాలని ఎందుకు కోరుకుంటున్నారు?
విశ్వజీత్ రాణే: ఎందుకంటే.. ఆయన సీఎం అయ్యేందుకు ఆర్ఎస్ఎస్ మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు.
అజ్ఞాత వ్యక్తి: అవునా.. అందుకే ఆయన తనదారిలో తాను వెళ్తున్నారు.
విశ్వజీత్ రాణే: అవును. ఆయన దారిలో ఆయన వెళ్తున్నారు. సుదిన్ చాలా స్పష్టంగా ఉన్నట్లు ఎవరో చెప్పారు. ఆయన మద్దతు ఇవ్వట్లేదంట. విజయ్ కూడా మద్దతు ఇవ్వట్లేదంట. వాళ్లే చెప్పారు.
అజ్ఞాత వ్యక్తి: దేవుడా
విశ్వజీత్ రాణే: మనం ఒకసారి కలవాలి. నువ్వు కొన్ని విషయాలను ఢిల్లీకి తెలియజేయాలి. ఈ మొత్తం వ్యవహారం వల్ల సాధించేదేంటి?
అజ్ఞాత వ్యక్తి: మీరు చెప్పండి సార్. మీరెప్పుడంటే అప్పుడే.
విశ్వజీత్ రాణే: నేను చెబుతా.. క్లుప్తంగా చెబుతా. ఎందుకంటే.. ఈ మార్గంలోనే అది వెళ్తుంది. నేను చాలా స్పష్టంగా ఉన్నా.
అజ్ఞాత వ్యక్తి: ఓకే. మీరు చెప్పండి సార్. మీరెప్పుడంటే అప్పుడే.
విశ్వజీత్ రాణే: ఓకే..
అజ్ఞాత వ్యక్తి: ఓకే..
విశ్వజీత్ రాణే: బై
ఆడియో టేపుపై పారికర్ స్పందన
కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఈ ఆడియో టేపుపై గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో ఒక ట్వీట్ చేశారు.
‘‘కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఆడియో టేపు.. వాస్తవాలను వక్రీకరించేందుకు చేసిన ప్రయత్నం. వాళ్లు చెబుతున్న అబద్ధాలను సుప్రీంకోర్టు రఫేల్ తీర్పులో బట్టబయలు చేసింది. అలాంటి చర్చ క్యాబినెట్ మీటింగ్‌లో కానీ, మరే మీటింగ్‌లో కానీ ఎప్పుడూ జరగలేదు’’ అని పారికర్ ట్వీట్ చేశారు.
మనోహర్ పారికర్ గతంలో రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు.
ప్రస్తుత రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పారికర్ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు.
విశ్వజీత్ రాణే స్పందన
ఆడియో టేపులో వినిపించిన గొంతు విశ్వజీత్ రాణేదేనని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. అయితే, రాణే మాత్రం ఈ టేపు నకిలీదని చెప్పారు. ఇందులో వినిపిస్తున్న గొంతు తనది కాదని ఆయన అన్నారు. ఈ టేపులో చెప్పినట్లుగా తనకూ, ముఖ్యమంత్రికీ మధ్య ఈ విషయంపై చర్చ ఎప్పుడూ జరగలేదని ఆయన తెలిపారు.
ఈ ఆడియో టేపుపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు కూడా రాణే తెలిపారు.
ఎవరీ విశ్వజీత్ రాణే
విశ్వజీత్ రాణే 2017లో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవటంతో ఆయన కాంగ్రెస్‌ను నిందిస్తూ.. బీజేపీలో చేరారు.
విశ్వజీత్ రాణే తండ్రి ప్రతాప్ సింహ రాణే కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయన ఆరుసార్లు గోవా ముఖ్యమంత్రిగా పనిచేశారు.
ఇవి కూడా చదవండి:
- రఫేల్ విమానాల విషయంలో ఎవరి మాటల్లో నిజముంది?
- రఫేల్ డీల్: అసలు ఏమిటీ ఒప్పందం... ఎందుకీ వివాదం?
- అభిప్రాయం: రాజీవ్‌కు బోఫోర్స్.. మోదీకి రఫేల్?
- 'రఫేల్ డీల్‌ను ప్రశంసించాలి' : బీబీసీ ప్రత్యేక ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్
- రఫేల్ కేసులో సుప్రీం తీర్పు: "ఒప్పందంపై కోర్టు జోక్యం అవసరం లేదు..."
- రఫేల్ ఒప్పందం: HAL ఉద్యోగులు వేల సంఖ్యలో రోడ్డున పడతారా?
- రఫేల్ యుద్ధ విమానాల వివాదం: అసలు ఒప్పందం ఏంటి? వివాదం ఎక్కడ? తప్పక తెలుసుకోవాల్సిన 7 విషయాలు
- సీబీఐ వర్సెస్ సీబీఐ: డైరెక్టర్ అలోక్ వర్మ తొలగింపునకు.. రఫేల్ విచారణకు సంబంధముందా?
- అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం ఏమిటి
- మూడు బ్యాంకుల విలీనంతో సామాన్యుడికి లాభమేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)