రమాకాంత్ అచ్రేకర్ మృతి: ‘సర్‌తో అద్భుతమైన నా ప్రయాణం అలా ప్రారంభమైంది’ - సచిన్ తెండూల్కర్

  • 2 జనవరి 2019
అచ్రేకర్‌తో సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ Image copyright Getty Images

ప్రముఖ క్రికెట్ కోచ్ రమాకాంత్ విఠల్ అచ్రేకర్ (86 ఏళ్లు) ముంబయిలో మృతి చెందారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

రమాకాంత్ అచ్రేకర్ ముంబయి దాదర్ ప్రాంతంలో ఉన్న శివాజీ పార్కులో యువ క్రికెటర్లకు కోచింగ్ ఇచ్చేవారు.

ఆయన వద్ద కోచింగ్ తీసుకున్న వారిలో ప్రముఖ క్రికెటర్లు సచిన్ తెందూల్కర్‌తో పాటు వినోద్ కాంబ్లీ, ప్రవీణ్ ఆమ్రే, సమీర్ డిగే, బల్వీందర్ సింగ్ సంధు కూడా ఉన్నారు.

అచ్రేకర్ ముంబయి క్రికెట్ జట్టుకు సెలక్టర్‌గా కూడా వ్యవహరించారు.

Image copyright Getty Images
Image copyright Getty Images

అచ్రేకర్ క్రికెట్ క్రీడకు అందించిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనకు ద్రోణాచార్య, పద్మశ్రీలను ప్రదానం చేసింది.

‘‘ఆయన ఇక లేరు. ఈ రోజు సాయంత్రం మృతి చెందారు’’ అని అచ్రేకర్ బంధువు రష్మీ దేవి పీటీఐ వార్తా సంస్థకు ఫోన్లో చెప్పారు.

సచిన్ తెండూల్కర్‌కు చిన్నతనంలో కోచింగ్ ఇచ్చిన అచ్రేకర్ మరెంతో మంది యువకులను తీర్చిదిద్దారు.

Image copyright Getty Images

‘అచ్రేకర్ సర్‌తో అద్భుతమైన నా ప్రయాణం అలా ప్రారంభమైంది’ - సచిన్ తెండూల్కర్...

రెండేళ్ల కిందట అచ్రేకర్‌పై ది రోలీ బుక్స్ ఒక పుస్తకాన్ని ప్రచురించింది. ఆ సందర్భంగా సచిన్ తెందూల్కర్ తన చిన్ననాటి కోచ్ గురించి కొద్దిసేపు మాట్లాడారు. ఆయన ఏమన్నారో.. ఆయన మాటల్లోనే..

‘‘సర్ (అచ్రేకర్) ఎల్లప్పుడూ నా హృదయంలోనే ఉంటారు. ఆయనతో నా అనుబంధాన్ని మాటల్లో వర్ణించలేను. దాదాపు 30 ఏళ్ల కిందట, 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నేను అచ్రేకర్ సర్ వద్దకు వెళ్లాను. ఆయన నా వెనుక నిల్చున్నప్పుడు చాలా ఆందోళనకు గురయ్యాను. నేను సరిగా బ్యాటింగ్ చేయలేదు.

దీంతో నా సోదరుడు అచ్రేకర్ సర్‌ను కొంచెం దూరంలో నిలబడాలని కోరారు. అప్పుడు నేను నాకు తెలిసినట్లుగా బ్యాటింగ్ చేశాను. ఆయన నాలో స్పార్క్‌ను గుర్తించారు. ‘నువ్వు స్కూల్ మారేందుకు సిద్ధంగా ఉన్నావా?’ అని అడిగారు. నేను నా స్కూల్ మారాను. అలా అచ్రేకర్ సర్‌తో అద్భుతమైన నా ప్రయాణం ప్రారంభమైంది.

‘ఎక్కడో దాక్కుని మమ్మల్ని గమనిస్తూ ఉండేవారు’

సర్‌లో ఉన్న గొప్పతనం ఏంటంటే.. ఆయన ఎక్కువ సేపు ప్రాక్టీస్ చేయించేవాళ్లు. అప్పుడు మా కమిట్‌మెంట్ కంటే ఆయన కమిట్‌మెంటే ఎక్కువగా ఉండేది. ఆయన రోజంతా గడిపేవారు. ఆయన ఎక్కడ ఉన్నారో మాకు తెలిసేది కాదు. కానీ, ఎక్కడో దాక్కుని మమ్మల్ని గమనిస్తూ ఉండేవారు. మేం కూడా ఆయన గమనిస్తున్నారు.. మనం జాగ్రత్తగా ఉండాలి అన్నట్లుగా ఆడేవాళ్లం. చాలాసార్లు ఆయన అలాగే మా తప్పుల్ని పట్టుకునేవారు. టీమ్ మీటింగుల్లో ఆయన రాసుకున్న అంశాలన్నింటిపైనా చర్చించేవాళ్లు. ఆటను మెరుగుపర్చుకునేందుకు చాలా అవకాశం ఉందని ఆయన చెప్పేవారు. ఆయన ఆ విధంగా కనుక తర్ఫీదు ఇవ్వకపోతే మేం క్రికెటర్లుగా ఎదగాల్సినంత ఎదిగేవాళ్లం కాదు.

ఆయన చాలా స్ట్రిక్ట్. ఆయన మా తప్పుల్ని పట్టుకునేవారు. మేం వాటిని కొన్నిసార్లు సరిదిద్దుకోలేకపోయేవాళ్లం.

‘సెంచరీ చేస్తేనే డిన్నర్‌కి వస్తానన్నారు’

ఒకసారి నేను ఆయన్ను మా ఇంటికి డిన్నర్‌కి పిలిచాను. ఆయన నాకో షరతు విధించారు. సెంచరీ చేస్తేనే డిన్నర్‌కి వస్తానన్నారు. చేయలేకపోతే మీ ఇంటికి డిన్నర్‌కి రావాల్సిన అవసరం లేదనుకుంటా.. అన్నారు. ఆరోజు నేను బహుశా 94 పరుగులు చేశారు. తర్వాతి రోజు సెంచరీ చేస్తానని రాత్రంతా అనుకున్నాను. మొదటి ఓవర్‌లోనే సెంచరీ పూర్తి చేశాను. వెంటనే ఆయన దగ్గరికి వెళ్లి డిన్నర్‌కి పిలిచా. నా జీవితంలో అదో పెద్ద సంఘటన.

‘స్టంప్‌పై రూపాయి కాయిన్ పెట్టి ప్రాక్టీసు’

ప్రాక్టీసులో చాలా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చేది. అలా శ్రమించిన రోజులు చాలా ఉన్నాయి. వాటిని నేను మర్చిపోలేదు. రోజంతా కష్టపడిన తర్వాత సర్ ఒక రూపాయి కాయిన్ తీసుకుని, స్టంప్‌పైన పెట్టి.. 60 నుంచి 70 మంది చిన్నారులకు సవాలు విసిరేవారు. ఎవరైనా సరే బౌలింగ్ చేయొచ్చు.. వికెట్ పడగొట్టొచ్చు. నేనేమో బ్యాటింగ్ చేయాలి.. (వికెట్ పడకుండా) బంతిని గ్రౌండ్‌లోకి కొట్టాలి.. ఇది రోజంతా ప్రాక్టీసు అయిపోయిన తర్వాత సవాలు.

ఈ సవాళ్లన్నీ నన్ను మానసికంగా బలోపేతం చేశాయి. నేను శారీరకంగాను, మానసికంగాను బాగా అలసిపోయిన తర్వాత కూడా నా వికెట్‌ కోల్పోకుండా ఉండేందుకు ఉపయోగపడ్డాయి.

నా కలను సాకారం చేసుకునేందుకు సహకరించినందుకు, నా ప్రయాణంలో ఉన్నందుకు అచ్రేకర్‌ సర్‌కు ధన్యవాదాలు.’’

Image copyright Getty Images
చిత్రం శీర్షిక తన ఆత్మకథ పుస్తకాన్ని అచ్రేకర్‌కు బహూకరిస్తున్న సచిన్ తెండూల్కర్. చిత్రంలో సచిన్ కుమార్తె సారా కూడా ఉన్నారు
Image copyright Getty Images

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)