రియాలిటీ చెక్: నికితా వీరయ్య నిర్మలా సీతారామన్ కూతురేనా...

  • 3 జనవరి 2019
రియాలిటీ చెక్

భారత రక్షణ మంత్రి నిర్మాలా సీతారామన్ సైనిక దుస్తుల్లో ఉన్న ఒక యువతితో ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఫొటోలో ఆమెతోపాటు ఉన్న ఒక మహిళా సైనికాధికారిని నిర్మలా సీతారామన్ కుమార్తె అని, ఆమె ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నారని చెబుతున్నారు.

ఫేస్‌బుక్, ట్విటర్‌లో వందల మంది రక్షణమంత్రి తన కూతురిని సైన్యంలో చేర్పించడాన్ని 'గర్వకారణం'గా పేర్కొంటూ ఆ ఫొటో షేర్ చేశారు. ఆమెలాగే మిగతా నేతలూ తమ పిల్లలకు దేశ సేవ నేర్పాలని సూచిస్తున్నారు.

కానీ బీబీసీ పరిశోధనలో ఈ ఫొటోతో జరుగుతున్న ప్రచారం తప్పని తేలింది.

రక్షణ మంత్రి నిర్మాలా సీతారామన్‌తో ఈ ఫొటోలో ఉన్న యువతి ఆమె కుమార్తె కాదు. ఆమె పేరు నికితా వీరయ్య.

ఎవరీ నికితా వీరయ్య

రక్షణ మంత్రిత్వశాఖ వివరాల ప్రకారం.. వైరల్ అవుతున్న ఫొటోలో కనిపిస్తున్న మహిళా ఆఫీసర్ నికితా వీరయ్యను రక్షణ మంత్రికి అధికారిగా నియమిచారు.

Image copyright Nikita Veeraiah/FB

ఫేస్‌బుక్‌లో ఉన్న ఆమె పబ్లిక్ ప్రొఫైల్ ద్వారా ఫొటోలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఉన్నది నికితే అని ధ్రువీకరించుకున్నాం.

ఫేస్‌బుక్ ప్రొఫైల్ ప్రకారం నికిత కర్ణాటకలోని మంగుళూరుకు చెందినవారు. 2016లో ఆమె ఇండియన్ ఆర్మీలో చేరారు. సైన్యంలో చేరడానికి ముందు నికిత ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేశారు.

ప్రచారం నిజం కాదు: రక్షణ మంత్రిత్వశాఖ

రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధి కూడా ట్విటర్ ద్వారా ఈ వైరల్ ఫొటోపై స్పష్టత ఇచ్చారు.

"ఇటీవల ఒక అధికారిక పర్యటనకు వెళ్లిన సమయంలో ఒక మహిళా అధికారి కోరికపై ఈ ఫొటో తీశారు. కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్టు ఈ మహిళా అధికారి రక్షణ మంత్రి కుమార్తె కారు". అని అందులో తెలిపారు.

ఎంపీగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన వివరాల ప్రకారం ఆమె కుమార్తె పేరు వాంజ్ఞ్మయి పరకాల.

డిసెంబర్ 27న ఈ ఫొటోను మొదటిసారి సోషల్ మీడియాలో షేర్ అయింది.

ఆ తర్వాత ఈ ఫొటోను వాట్సప్‌లో కూడా చాలా మంది షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు