పేరు మారింది.. ఇక పెళ్లిళ్లు జరుగుతాయ్

  • 5 జనవరి 2019
హర్‌ప్రీత్ కౌర్

‘మా ఊరి పేరు ‘గందా’. (హిందీలో మురికి). ఆ పేరు చాలు మమ్మల్ని అందరూ వెక్కిరించడానికి. ఊరి పేరు చెప్పి ఎన్నిసార్లు హేళనకు గురయ్యానో లెక్కే లేదు’ అంటోంది హర్‌ప్రీత్ కౌర్ అనే యువతి.

ఏడాదిన్నర క్రితం వరకూ హరియాణాలో ‘గందా’ అనే ఊరుండేది. హర్‌ప్రీత్ లాంటి వాళ్ల చొరవ వల్ల ఇప్పుడా ఊరి పేరు అజిత్ నగర్‌గా మారింది. ‘మాది అజిత్ నగర్’ అని ఇప్పుడు ఆ అమ్మాయి గర్వంగా చెబుతుంది.

‘ఒకప్పుడు పరిస్థితి ఇబ్బందికరంగా ఉండేది. మా బంధువులు కూడా మమ్మల్ని ఆటపట్టించేవాళ్లు. కొత్త వాళ్లకు ఊరి పేరు చెప్పాలంటే అవమానంగా అనిపించేది’ అంటారు హర్‌ ప్రీత్.

ఆ ఊరి పేరు మార్చాలని గ్రామస్థులు చాలా ఏళ్లు పోరాడారు. ‘మేం చాలా ఏళ్లుగా ప్రభుత్వాన్ని మా ఊరి పేరు మార్చమని అడుగుతున్నాం. కానీ, అది జరగలేదు. దాంతో ఎవరైనా యువతీయువకులు నేరుగా ప్రధానికి లేఖ రాస్తే పనవుతుందని అనుకున్నాం. చివరికి అదే జరిగింది’ అంటారు గ్రామ పంచాయతీ పెద్ద లఖ్విందర్ రామ్.

తమ ఊరి పేరు మార్చాలని కోరుతూ 2016లో హర్‌ప్రీత్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. 2017లో ఆ ఊరి పేరు మార్చాలని మోదీ అధికారులను ఆదేశించారు. అలా హరియాణాలోని ‘గందా’ గ్రామం ఇప్పుడు అజిత్ నగర్‌గా మారింది.

పేరు వల్ల పెళ్లి కాలేదు

కొన్ని దశబ్దాల క్రితం ఆ ఊరిని వరదలు ధ్వంసం చేశాయి. ఇళ్లన్నీ కొట్టుకు పోయాయి. ఊరి నిండా చెత్తా చెదారం పోగైంది. తరువాత పరిస్థితిని సమీక్షించడానికి వచ్చిన ఓ అధికారి ఆ ఊరిని చూసి ‘గందా’ అన్నారు. అప్పట్నుంచీ దానికి గందా గావ్ అనే పేరు స్థిరపడిపోయింది.

ఆ ఊరి పేరు కారణంగా చాలామంది అబ్బాయిలు, తమ గ్రామంలోని అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదని, ఆ పేరు నామోషీగా భావించారని గ్రామస్థులు చెబుతారు. కానీ, ఇప్పుడు వాళ్లకా సమస్య తీరిపోయింది.

కానీ, అలాంటి ఇబ్బంది ఆ ఒక్క గ్రామానికే లేదు. హరియాణా, రాజస్థాన్‌ లాంటి రాష్ట్రాల్లో దాదాపు 50 గ్రామాలు తమ ఊరి పేర్లు మార్చాలని పోరాడుతున్నాయి. దానికోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. అలా పేరు మార్చమని కోరడం వెనుక ఒక్కొక్కరికీ ఒక్కో కారణం ఉంది. కొన్ని ఊరిపేర్లు వర్ణ వివక్షను సూచిస్తే, ఇంకొన్ని విచిత్రంగా ఉన్నాయి.

‘ఇప్పటికే దాదాపు ఓ 40 గ్రామాల ప్రజల వినతులను స్వీకరించి వాళ్ల ఊరి పేర్లు మార్చాం’ అని చెబుతారు కృష్ణ కుమార్ అనే ప్రభుత్వాధికారి.

అలాంటి గ్రామాల్లో ‘కిన్నర్’ ఒకటి. హిందీలో ఆ పేరుకు అర్థం ట్రాన్స్‌జండర్‌ అని. 2016లో దాన్ని గైబీ నగర్‌గా మార్చారు.

రాజస్థాన్‌లోని ఒక ఊరి పేరు ‘చోర్’ (దొంగ) బసాయ్‌గా ఉండేది. దాన్ని ఇప్పుడు బసాయ్‌గా మార్చారు.

నిజానికి ఓ ఊరు పేరు మార్చడం అంత సులభం కాదు. మొదట ఊరి పేరు మార్చాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. తరువాత దాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. దానికంటే ముందు రైల్వే, పోస్టల్ శాఖ, సర్వే ఆఫ్ ఇండియా లాంటి సంస్థల నుంచి కూడా అనుమతి పొందాలి.

హరియాణాలోని లులా ఆహిర్ గ్రామ ప్రజలు కూడా తమ ఊరి పేరుతో ఇబ్బంది పడ్డారు. హిందీలో ఆ పదాన్ని వికలాంగులను కించపరచడానికి ఉపయోగిస్తారు. వాళ్లు తమ పేరు దేవ్ నగర్‌గా మార్చాలని కోరారు. ఆర్నెల్ల తరువాత ప్రభుత్వం నుంచి పేరు మార్చడానికి కుదరదని జవాబొచ్చింది. దేవ్ నగర్ పేరుతో మరో గ్రామం ఉండటమే దానికి కారణం.

తరువాత మరోసారి ప్రయత్నిద్దామని వారు తమ గ్రామం పేరును ‘కృషన్ నగర్’గా మార్చాలని కోరారు. గత జూలైలో వారి కోరిక తీరింది. గ్రామ పేరును మారుస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ, కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఇంకా ఆ నిర్ణయాన్ని అమలు చేయలేదు. ఇంకా ఆ వినతి ‘ప్రాసెస్’లో ఉందని అధికారులు చెబుతున్నారు.

‘మేం ఏళ్ల తరబడి ఎదురు చూస్తూనే ఉన్నాం’ అని నిరాశగా చెప్పారు గ్రామానికి చెందిన వీరేందర్ సింగ్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు