‘ఆలయాల్లో ఆచారంపై కాదు... ఆడవాళ్ల సమస్యలపై దృష్టి పెడదాం’ - రేణూ దేశాయ్

  • రేణూ దేశాయ్
  • బీబీసీ కోసం
రేణూ దేశాయ్

ఫొటో సోర్స్, Facebook/RenuDesai

మతం... తల్లి గర్భంలోంచి బయటకు వచ్చి ఇంకా తొలి శ్వాస కూడా తీసుకోక ముందే మనకు పరిచయమైపోతుంది. మతం మనిషి సృష్టించిన భావనేననీ, ఎవ్వరూ దేవుడిని తమ కళ్లతో చూడలేదనీ అందరికీ తెలుసు. నాలో నాస్తికురాలి కోణం, దైవాన్ని నమ్మే కోణం రెండూ ఉన్నాయి. నేను నాణేనికి రెండు వైపులా చూస్తాను.

నేను సర్వోన్నత శక్తిని నమ్ముతాను. మతం పేరుతో మనుషులు ఒకరినొకరు చంపుకోవాలనుకుంటున్నప్పుడు నాస్తికురాలినైపోతాను.

భారత్‌లోని కొన్ని ఆలయాలు కేవలం ప్రార్థనా మందిరాలు మాత్రమే కాదు, అత్యంత శక్తిమంతమైన కేంద్రాలు కూడా.

వివిధ కారణాల వల్ల, పుష్పవతి అయిన మహిళలు రుతుక్రమం ఆగిపోయే వరకు ఇలాంటి ఆలయాలను సందర్శించకూడదని చెబుతారు.

ఈ అంశాన్ని పూర్తిగా శాస్త్రీయ కోణంలోనే చూస్తే- ఫలానా వయసులో ఉండే మహిళలు ఫలానా ఆలయాన్ని ఎందుకు సందర్శించకూడదో వివరించడం, దీనిని అర్థం చేసుకోవడం చాలా కష్టమవుతుంది.

ఫొటో సోర్స్, tWITTER

మహిళలు ప్రవేశించేందుకు, వచ్చి ప్రార్థన చేసుకొనేందుకు అనుమతించే ఆలయాలు దేశంలో వేల సంఖ్యలో ఉన్నాయి.

కేవలం కొన్ని ఆలయాలే మహిళలను రావొద్దని చెబుతాయి.

ఔను, స్త్రీవాదం చాలా ముఖ్యమైన భావనే. శతాబ్దాలుగా మహిళలు అణచివేతకు, చిత్రహింసలకు గురవుతూ వస్తున్నారు.

ఆడవారిగా పుట్టారనే కారణంతో వారికి సమానత్వం, సంతోషంతో కూడిన జీవితాన్ని దూరం చేయకూడదు.

అదే సమయంలో విజ్ఞతతో ఆలోచించాల్సి ఉంది.

ఫొటో సోర్స్, Kaviyoor Santosh

ఫొటో క్యాప్షన్,

డిసెంబర్ నెలలో పలువురు మహిళలు అయ్యప్ప ఆలయ ప్రవేశం కోసం కొండ ఎక్కడానికి ప్రయత్నించగా, పురుష భక్తులు కొందరు వారిని అడ్డుకున్నారు

యోగా విషయాన్నే తీసుకుంటే పురుషుడు ఏడాదిలో 365 రోజులూ దీనిని సాధన చేయొచ్చు.

కానీ మహిళలను రుతుస్రావం సమయంలో ఆసనాలు వేయనివ్వరు. ఇది అసమానత కాదు. ఇది కామన్ సెన్స్.

ఇందులో కొంత శాస్త్రీయత కూడా ఉంది. భ్రూణహత్యలు, గృహహింస, పెరుగుతున్న అత్యాచారాలు లాంటి చాలా ముఖ్యమైన సమస్యలపై దృష్టి కేంద్రీకరించకుండా, మహిళల మేలుకే ఉద్దేశించిన ఆచార వ్యవహారాలను రాజకీయం చేస్తున్నారు.

ప్రతికూల శక్తి నా కంటికి కనిపించనంత మాత్రాన అది లేనట్టు కాదు. సర్వోన్నత శక్తిని కూడా నా కళ్లతో నేను చూడలేదు. కానీ నేను నమ్ముతున్నా.

కొన్ని ఆలయాల్లోకి మహిళలను అనుమతించనంత మాత్రాన వారిని అణచివేస్తున్నట్టు కాదని భారతీయులు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను.

భ్రూణహత్యలు, గృహ హింస, అత్యాచారాలు మహిళలను అణచివేసే సమస్యలు. మనందరం కలసికట్టుగా పోరాడి సమాజంలోని ఈ రుగ్మతలను పారదోలాలి.

ఫొటో సోర్స్, Getty Images

మన తల్లులు, అక్కాచెల్లెళ్లు, స్నేహితురాళ్లకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలి. వారికి సాధికారత కల్పించాలి.

దైవాన్ని నమ్మేవాళ్లు, నమ్మనివాళ్లు, శాస్త్రవేత్తలు, పూజారులు, రాజకీయ నాయకులు, మేధావులు- మనమందరం సమష్టిగా పోరాడి, ఇంటిని, పనిచేసే ప్రదేశాన్ని, మొత్తం సమాజాన్ని మహిళకు సురక్షితమైనదిగా మారుద్దాం.

ఒక మనిషిగా ఆమెకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇద్దాం. ఇవన్నీ జరిగిన రోజే మనమందరం స్వేచ్ఛగా శ్వాసించగలం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)