శబరిమల: "చంపేస్తామని బెదిరిస్తున్నారు... అయినా మాకు భయం లేదు" - ఆలయంలోకి వెళ్ళిన బిందు, కనకదుర్గలతో బీబీసీ ఇంటర్వ్యూ

  • 5 జనవరి 2019
కనకదుర్గ, బిందు
చిత్రం శీర్షిక కనకదుర్గ, బిందు

శబరిమల ఆలయంలో ప్రవేశించటం ద్వారా చరిత్ర సృష్టించిన ఇద్దరు మహిళలు, తమ ఇళ్ల ముందు నిరసనలు జరుగుతున్నా, తీవ్ర స్థాయిలో హెచ్చరికలు వస్తున్నా తమకు భయం లేదని చెప్తున్నారు.

వీరిద్దరూ అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించటం కేరళను రెండు రోజుల పాటు స్తంభింపచేయటంతో పాటు ఆందోళలను హింసకు కూడా దారితీసిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం 'సురక్షిత గృహం'లో ఉన్న ఆ ఇద్దరు మహిళలు బీబీసీకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. తమను చంపేస్తామని బెదిరించిన వారు ఆ పని చేస్తారని తాము నమ్మటం లేదని చెప్పారు.

''క్రిస్టమస్ పండుగ రోజున ఆలయంలోకి ప్రవేశించటానికి మేం మొదట ప్రయత్నించినపుడు.. మా ఇళ్ల దగ్గర నిరసన ప్రదర్శనలు చేశారు. మా ఇంటి దగ్గర ఉన్నవారు నన్నేమీ చేయరని నేను అనుకుంటున్నాను. వారికి నేనంటే చాలా ఇష్టం. మా ఇంటిని చుట్టుముట్టి బెదిరించిన వారు ఏమీ చేయరు'' అని 40 ఏళ్ల బిందు అమ్మిని పేర్కొన్నారు.

చిత్రం శీర్షిక బిందు, కనకదుర్గ శబరిమల ఆలయంలోకి వెళ్తున్న దృశ్యం

పెరియార్ టైగర్ రిజర్వ్ పర్వతం మీద ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలోకి.. 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు మహిళల్లో పిల్లలు లేని వారికి మాత్రమే ప్రవేశం కల్పించే సంప్రదాయాన్ని బిందు, కనకదుర్గలు తమ రెండో ప్రయత్నంలో బద్దలుకొట్టారు. సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసుల భద్రత మధ్య వారు జనవరి రెండో తేదీన ఈ ఆలయంలోకి ప్రవేశించారు.

సంప్రదాయం కన్నా మహిళల ప్రాథమిక హక్కులు చాలా ముఖ్యమని సుప్రీంకోర్టు గత సెప్టెంబర్ 28వ తేదీన ఇచ్చిన చరిత్రాత్మక 4-1 మెజారిటీ తీర్పులో స్పష్టంచేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి జనవరి రెండో తేదీ వరకూ కనీసం 10 మంది మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించటానికి ప్రయత్నించినప్పటికీ ఎవరూ సఫలం కాలేదు.

''భవిష్యత్తు గురించి నాకు ఎలాంటి భయమూ లేదు. నేను దేవుడ్ని నమ్ముతాను'' అని 39 ఏళ్ల కనకదుర్గ చెప్పారు.

కనకదుర్గ లాగా కాకుండా మతవిశ్వాసం తక్కువగా ఉన్న బిందు, తన భద్రత గురించి ''పెద్దగా పట్టించుకోను'' అని అన్నారు. దానికి కారణం తను చిన్నప్పటి నుంచీ చాలా కష్టాల్లో పెరగటమని ఆమె అంటారు. ఆమె చాలా చిన్న వయసులోనే తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తర్వాత ఒక రోజు ఆమె తల్లి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

చిత్రం శీర్షిక 'శబరిమల వెళ్లాలని నేను నిర్ణయించుకోవటానికి ప్రధాన కారణం.. రాజ్యాంగ విలువ' అని బిందు చెప్తున్నారు

''ఆమె నడవటం మొదలుపెట్టింది. ఎన్ని కిలోమీటర్లు నడవాలని అనుకుంటున్నావని నేను అడిగాను. ఆమె బతకాలని నిర్ణయించుకుంది. అప్పటి నుంచీ ఇప్పటివరకూ నేను చాలా కష్టాలు పడ్డాను. నాకు భయం లేదు'' అని చెప్పారు.

ఆమె జీవితమంతా సంఘర్షణే. స్కూలులో బాగా రాణించినా, చాలా పోటీలు, కార్యక్రమాల్లో పాల్గొన్నా కూడా తనకు 'సగటు' విద్యార్థి అనే పేరు మాత్రమే వచ్చిందన్నారు.

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్ - లెనినిస్ట్) విద్యార్థి విభాగం కార్యకర్తగా ఆమె పోరాటం ప్రభావంతో.. ఆమె న్యాయశాస్త్రం చదివి లా కాలేజీలో టీచర్‌ అయ్యారు.

ఈ నేపథ్యంలోనే బిందు, కనకదుర్గ.. అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశానికి మద్దతుగా ఉన్న ఒక సోషల్ మీడియా గ్రూపులో భాగస్వాములయ్యారు.

అయ్యప్ప స్వామిని ''శాశ్వత బ్రహ్మచారి''గా పరిగణించటం వల్ల 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసులోని మహిళలను ఈ ఆలయంలో ప్రవేశించటానికి అనుమతించరు.

Image copyright KAVIYOOR SANTOSH
చిత్రం శీర్షిక డిసెంబర్ నెలలో పలువురు మహిళలు అయ్యప్ప ఆలయ ప్రవేశం కోసం కొండ ఎక్కడానికి ప్రయత్నించగా, పురుష భక్తులు కొందరు వారిని అడ్డుకున్నారు

వీరిద్దరూ డిసెంబర్ 24వ తేదీన కొండ ఎక్కి ఆలయంలోకి ప్రవేశించటానికి చేసిన ప్రయత్నం విఫలమవటంతో నిస్పృహకు గురయ్యారు. వారు ఆలయం మరో 1.5 కిలోమీటర్ల దూరంలో ఉందనగా.. శాంతిభద్రతలు అదుపుతప్పుతాయన్న భయంతో వారికి భద్రతగా యూనిఫాంలో వచ్చిన పోలీసులు వెనుదిరగటానికి మొగ్గుచూపారు.

''మేం నిస్పృహ చెందలేదు. ఆ సమయంలో పోలీసులు మమ్మల్ని వెళ్లిపోవాలని చెప్పారు. తర్వాత కొట్టాయం మెడికల్ కాలేజీలో మేం మళ్లీ శబరిమలకు వెళ్లాలని కోరుకుంటున్నామని వారికి చెప్పాం. మమ్మల్ని ఇంటికి తిరిగి వెళ్లాలని వారు చెప్పారు. మేం నిరాహార దీక్ష ప్రారంభించాం. దాంతో సాధ్యమైనపుడు మాకు సాయం చేస్తామని అధికారులు చెప్పారు'' అని బిందు వివరించారు.

జనవరి రెండో తేదీన మళ్లీ శబరిమల వెళ్లాలని నిర్ణయించుకోవటానికి ముందు వీరిద్దరూ తమ స్నేహితుల వద్ద గడిపారు. ఈసారి వీరికి సాధారణ దుస్తుల్లో పోలీసు రక్షణ కల్పించాలని అధికారులు నిర్ణయించారు.

ఈ మహిళలను ఆలయ సిబ్బంది మాత్రమే ఉపయోగించే మార్గంలో తీసుకెళ్లారా? అంబులెన్సులో తీసుకెళ్లారా? అంటే.. ''కాదు. మీడియా దీనిని తప్పుగా ప్రసారం చేసింది. ఇతర భక్తుల నడిచే దారిలోనే మేం నడుచుకుంటూ వచ్చాం'' అని ఆమె తెలిపారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక శబరిమలలో మహిళల ప్రవేశానికి నిరసనగా కేరళలో ఆందోళనలు తలెత్తాయి

శబరిమల ఆలయంలోకి ప్రవేశించటానికి బిందును ప్రేరేపించింది.. కనకదుర్గకు దేవుడి మీద ఉన్న విశ్వాసం కాదు. సుప్రీంకోర్టు తీర్పు అమలయ్యేలా చూడటం బిందు ప్రయత్నానికి ప్రధాన కారణం.

''శబరిమల వెళ్లాలని నేను నిర్ణయించుకోవటానికి ప్రధాన కారణం.. రాజ్యాంగ విలువ'' అని ఆమె చెప్పారు.

ఆమెతో పాటు కనకదుర్గ కూడా.. శబరిమల ఆలయానికి వెళ్లటానికి అవసరమైన ఉపవాసం వంటి అన్ని ఆచారాలనూ పాటించారు.

ఆలయానికి చేరుకున్న తర్వాత అయ్యప్ప స్వామిని బిందు ఏమీ కోరలేదు. ''కానీ నేను అయ్యప్ప స్వామితో మాట్లాడాను. ఆయన నాతో మాట్లాడారు. నా దర్శనం ఎలా జరిగిందని ఆయన నన్ను అడిగారు. నాకు చాలా సంతోషంగా ఉంది'' అని బిందు పేర్కొన్నారు.

ఇక అయ్యప్ప స్వామిని విశ్వసించే కనకదుర్గ మతంలో పురుషులు, మహిళల మధ్య వివక్షను సహించటానికి సిద్ధంగా లేరు. ''రాబోయే రోజుల్లో శబరిమలకు తప్పకుండా తిరిగి వెళ్లాలనుకుంటున్నాను'' అని ఆమె చెప్పారు.

చిత్రం శీర్షిక భవిష్యత్తులో మళ్లీ శబరిమల వెళ్తానని కనకదుర్గ చెప్తున్నారు

మళ్లీ శబరిమల వెళ్లాలా లేదా అన్న విషయంలో బిందు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దేవుడి మీద తనకు విశ్వాసం కలిగిందా అన్నదీ ఆమెకు ఇంకా తెలియదు. ''కావచ్చు.. స్పష్టంగా తెలీదు'' అంటారామె.

అయితే తాను, కనకదుర్గ.. ''ఇతర మహిళలు అక్కడికి వెళ్లటానికి నాంది పలకడం'' తనకు చాలా సంతోషాన్నిచ్చిందని ఆమె చెప్పారు.

తన చర్యల పర్యవసానాల గురించి బిందుకు బాగా తెలుసు. ''బహుశా.. నన్ను చంపేయవచ్చు'' అని వ్యాఖ్యానించారు.

''భవిష్యత్తులో మాకు భద్రత కల్పించే విషయం మీద ప్రభుత్వంతో ఎలాంటి చర్చలూ జరగలేదు. అయితే భద్రత కల్పిస్తామని పోలీసులు మాకు భరోసా ఇచ్చారు. నిజానికి నా భద్రత గురించి నాకు ఆందోళన లేదు'' అని బిందు పేర్కొన్నారు.

''నాకు భయం లేదు. మహిళలు ఏదైనా ముందడుగు వేసిన ప్రతిసారీ సమాజం చాలా గొడవ చేసింది'' అని కనకదుర్గ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)