నమ్మకాలు-నిజాలు: తెల్లబట్ట ఎందుకొస్తుంది, ఏం చేయాలి?

  • 6 జనవరి 2019
గ్రామీణ మహిళలకు ఆరోగ్యంపై సూచనలు చేస్తున్న ఆరోగ్య కార్యకర్త Image copyright Getty Images
చిత్రం శీర్షిక గ్రామీణ మహిళలకు ఆరోగ్యంపై సూచనలు చేస్తున్న ఆరోగ్య కార్యకర్త

పన్నెండేళ్ల ప్రియాంకకు గత మూడు నెలలుగా తెల్లబట్ట అవుతోంది. అమ్మకు చెబితే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి ఇంజక్షన్ చేయిస్తుందన్న భయం.. అందుకే చెప్పకుండా తనలో తానే బాధపడుతోంది.

పద్నాలుగేళ్ల ప్రమీలకు ప్రతిసారీ పీరియడ్ రావడానికి పది, పన్నెండు రోజులముందు తెల్లబట్ట అవుతోంది. ఇదేమన్నా జబ్బా లేక అందరికీ అలాగే ఉంటుందా అనేది తెలియక ఆమె ఆందోళన చెందుతోంది.

పూర్ణిమకు ఈమధ్యే పెళ్లయింది. నిత్యం తెల్లబట్ట అవుతుండడంతో భర్త దగ్గరకు రావడం మానేశాడు. అంతేకాదు, ఆమె ప్రవర్తనను కూడా అనుమానించాడు. విషయం పెద్దల వరకూ పాకి విడాకుల వరకూ వెళ్లింది. చివరకు ఆమెను పరీక్షించిన ఫ్యామిలీ డాక్టర్ జోక్యం చేసుకుని ఆమెకు ఏ జబ్బూ లేదనీ, అదంతా పెళ్లయిన కొత్తలో సహజమేననీ వివరించడంతో వాళ్ల కాపురం నిలబడింది.

వీళ్లే కాదు, కొత్తగా కానుపైన కరుణ, బహిష్ఠులాగిపోయిన భ్రమరాంబను కూడా ఈ తెల్లబట్ట సమస్య ఇబ్బంది పెట్టింది.

మరి, ఇంతమందిని వేధిస్తోన్న ఈ తెల్లబట్ట సమస్య ఏమిటి? వైద్యశాస్త్రం ఏం వివరిస్తోందో తెలుసుకుందాం.

Image copyright Getty Images

నోట్లో ఉమ్మి ఎలా తయారవుతూ ఉంటుందో మహిళల జననేంద్రియాల నుంచి కూడా ఒక తెల్లని స్రావం తయారవుతుంది. దాన్నే వాడుకలో తెల్లబట్ట అంటుంటారు. వైద్య పరిభాషలో 'ల్యూకోరియా' అంటారు.

ఇది ప్రధానంగా గర్భాశయ ముఖ ద్వారం(సెర్విక్స్ )లో వుండే గ్రంథుల నుంచి యోని మార్గంలోకి స్రవిస్తుంది. యోనిమార్గంలో ఎలాంటి గ్రంథులూ ఉండవు. దీనిలో ద్రవ పదార్థంతో పాటు, కొన్ని మృత కణాలు, ఇంకా జననేంద్రియాలకు మంచి చేసే బాక్టీరియా కూడా ఉంటాయి. వీటిని "డోడర్ లైన్ బాసిల్లై " అంటారు.

ఇవి మృతకణాలలోని గ్లైకోజన్ ని విడగొట్టి లాక్టిక్ యాసిడ్‌ను తయారు చేసి వెజైనల్ PHని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఈ చర్య... వ్యాధికారక సూక్ష్మజీవులు జననేంద్రియాలలో ప్రవేశించకుండా నిరోధిస్తుంది.

అలా ఈ ద్రవపదార్థం, జననమార్గం తడిగానూ, ఆరోగ్యంగా ఉండటానికి, ఇంకా సూక్ష్మజీవులు శరీరంలో ప్రవేశించకుండా రక్షణకవచంగానూ ఉపయోగపడుతుంది.

సాధారణంగా రోజుకు దాదాపు 10 మిల్లీ లీటర్ల వరకు ఈ తెల్లబట్ట కనిపిస్తుంటుంది. కొన్ని పరిస్థితులలో మాత్రం ఇది ఎక్కువవుతుంది. ఇలా తెల్లబట్ట ఎక్కువయ్యే పరిస్థితులను రెండు వర్గాలుగా విభజించవచ్చు.

1. ఫిజియొలాజికల్ ల్యుకోరియా 2. పెథలాజికల్ ల్యుకోరియా

Image copyright Getty Images

ఇలాంటి తెల్లబట్టతో ఏ ప్రమాదమూ లేదు

ఫిజియొలాజికల్ ల్యూకోరియా.. ఇది జబ్బు వల్ల వచ్చే తెల్లబట్ట కాదు. దీనికి చికిత్స అవసరం లేదు. ఇలా అయ్యే తెల్లబట్ట తెల్లగా ఉంటుంది. దుర్వాసన, దురద వంటి సమస్యలేమీ ఉండవు. శారీరకంగా, మానసికంగా ఉద్రేకానికి గురయినప్పుడు ఇది వస్తుంది. దాదాపు అన్ని వయసులవారిలో కనిపిస్తుంది.

* అప్పుడే పుట్టిన పసిబిడ్డలలో కూడా పుట్టిన వారం రోజులలోపు తెల్లబట్ట కానీ, ఎర్రబట్ట కానీ కనపడవచ్చు. దీనికి కారణం తల్లి కడుపులో ఉన్నపుడు రక్తంలో ప్రవహించిన హార్మోన్ల స్థాయి బయటకు రాగానే తగ్గడం. దీనికి చికిత్స అవసరం లేదు, దానికదే తగ్గిపోతుంది.

* 10 నుంచి 12 ఏళ్ల వయసులో.. అంటే రజస్వల కావడానికి ముందు సుమారు 3 నుంచి 6 నెలల పాటు తెల్లబట్ట అవుతుంది. ఇది జననావయవాల పెరుగుదల, రక్త సరఫరా ఎక్కువ కావడాన్నీ సూచిస్తుంది. దీనికీ చికిత్స అవసరం లేదు.

* బహిష్ఠు రావడానికి నాలుగైదు రోజుల ముందు కానీ, పది పన్నెండు రోజుల ముందుకానీ తెల్లబట్ట కనిపించడం సర్వ సాధారణం. నెల మధ్యలో అంటే అండం విడుదలయ్యే సమయంలో కనిపించే తెల్లబట్ట కొంత చిక్కగా ఉంటుంది.

* గర్భిణులుగా ఉన్నప్పుడు తొలి నెలల్లో, నిండు నెలల్లోనూ అయ్యే తెల్ల బట్ట జననావయవాల పెరుగుదలను, రక్త సరఫరా వృద్ధిని సూచిస్తుంది.

* బహిష్ఠులు ఆగిపోయే దశలో కూడా హార్మోన్ల సమతుల్యత సరిగా లేక తెల్లబట్ట అవుతుంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక గర్భాశయ ముఖద్వార కేన్సర్‌లో ప్రధానంగా కనిపించే లక్షణం తెల్లబట్ట

ఎప్పుడు జబ్బుగా పరిగణించాలి?

తెల్లబట్ట రంగుమారి కొంచెం పసుపుగా లేదా ఆకుపచ్చగా ఉన్నప్పుడు, దుర్వాసనతో ఉన్నప్పుడు, దురద కలిగిస్తున్నప్పుడు జబ్బుగా పరిగణించాలి. దీనినే 'పెథలాజికల్ ల్యూకోరియా' అంటారు.

* పెథలాజికల్ ల్యూకోరియాకి కారణాలు

ట్రైఖోమోనాస్ వజైనాలిస్ ఇన్ ఫెక్షన్: ఇది చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది.సుమారు నూటికి 50 మందిలో ఈ సూక్ష్మజీవి కనిపిస్తూ ఉంటుంది. జనన మార్గమంతా దురద, మంటగా ఉంటుంది. దుర్వాసనతో కూడిన ఆకుపచ్చ రంగు స్రావాలు మహిళలను ఇబ్బంది పెడతాయి. ఈ సూక్ష్మ జీవి లైంగిక సంబంధాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. కాబట్టి చికిత్స జీవిత భాగస్వాములిద్దరికీ ఇవ్వాలి.

క్లమీడియా ఇన్ ఫెక్షన్: ఇది క్లమీడియా ట్రైఖోమాటిస్ అనే సూక్ష్మజీవి కారణంగా వస్తుంది. లైంగిక సంపర్కం వల్ల వ్యాపిస్తుంది. జననేంద్రియ వ్యవస్థలో వాపు కలగ జేసి, ఒక్కోసారి వంధ్యంత్వానికీ దారితీసే ప్రమాదముంది. తప్పనిసరిగా చికిత్స చేయించుకోవాలి.

మరికొన్ని ఇతర బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లూ, గనేరియా, సిఫిలిస్ వంటి సుఖవ్యాధులూ కూడా పెథలాజికల్ ల్యూకోరియాకు కారణమవుతాయి.

Image copyright Getty Images

ఫంగల్ ఇన్‌ఫెక్షన్లతోనూ..

సాధారణంగా మహిళలలో ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు వారి రోగనిరోధక శక్తి తగ్గిన సమయాలలో.. ఉదాహరణకు డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు, కుటుంబనియంత్రణ మాత్రలు వాడుతున్నప్పుడు, స్టెరాయిడ్ మాత్రలు వాడే సమయాల్లోనూ వస్తూఉంటాయి.

ఈ ఫంగల్ ఇన్‌ఫెక్షన్లలో ఎక్కువగా కనిపించేది 'కాండిడా ఆల్బికన్స్'. షుగర్ వ్యాధితో బాధపడే మహిళలు ఎక్కువగా దీనిబారిన పడుతుంటారు.

చాలా తీవ్రమయిన దురద, చిన్నచిన్న తెల్ల పెరుగు కుదుపల్లాంటి తెల్లబట్ట కావడం దీని లక్షణాలు. షుగర్‌ను అదుపులోకి తీసుకొచ్చిన తరువాత ఈ వ్యాధి మందులకు లొంగుతుంది.

ఈ సూక్ష్మజీవుల వలన వచ్చే వ్యాధులే కాక, జననేంద్రియాలలో వచ్చే కణుతులూ, గడ్డలు, కేన్సర్లూ తెల్లబట్టకు కారణమవుతాయి.

పాప్ స్మియర్ పరీక్ష చేయించుకోవాలి

ముఖ్యంగా 40-60 ఏళ్ల వయసు మహిళలు ఎలాంటి నొప్పి, బాధ లేకపోయినా కూడా 'పాప్ స్మియర్' అనే పరీక్ష చేయించుకుని కేన్సర్ లేదని నిర్ధారించుకోవాలి. అవసరమయితే 'సర్వయికల్ బయాప్సి' కూడా చేయించుకోవాలి.

మహిళల్లో ఎక్కువగా వచ్చే గర్భాశయ ముఖద్వార కేన్సర్‌లో ప్రధానంగా కనిపించే లక్షణం తెల్లబట్ట. కాబట్టి ఈ పరీక్షలు తప్పనిసరి.

Image copyright Getty Images

నివారణ, జాగ్రత్తలు

* వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం

* కాటన్ లోదుస్తులు వాడడం

* బహిష్ఠు సమయంలో శానిటరీ నాప్కిన్స్ వాడడం, వాటిని ప్రతి రెండు గంటలకూ వాటిని మార్చుకోవడం.

* జననేంద్రియాలను గోరు వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవడం.

* గాఢమైన కెమికల్స్ కలిగి వుండే డెట్టాల్, సబ్బులు వాడకూడదు. మైల్డ్ సోప్స్‌తో శుభ్రం చేసుకోవాలి.

* జననేంద్రియాల వద్ద ఎలాంటి పెర్ఫ్యూమ్స్, సుగంధ ద్రవ్యాలు వాడరాదు.

* దుర్వాసన, దురదతో కూడిన తెల్లబట్టను గుర్తించగానే డాక్టర్ని సంప్రదించి జీవిత భాగస్వాములిద్దరూ చికిత్స తీసుకోవడం అవసరం.

చికిత్స

తెల్లబట్టకు కారణం గుర్తించి అది సాధారణమైనదా... లేదంటే చికిత్స అవసరమా అనేది వైద్యులు తెలియజేయాలి.

చికిత్స అవసరమైతే, వైద్య పరీక్షలు నిర్వహించి తెల్లబట్టకు కారణమేంటో తెలుసుకుని తగిన చికిత్స ప్రారంభించాలి.

40 ఏళ్లు దాటిన ప్రతి మహిళా ఏడాదికి ఒకసారి 'పాప్ స్మియర్' పరీక్ష చేయించుకుని కేన్సర్, ఇతర ఇన్ఫెక్షన్లు లేవని నిర్ధారించుకోవాలి. ఒకవేళ అలాంటి సమస్యలు గుర్తిస్తే వెంటనే చికిత్స చేయించుకోవాలి.

జీవిత భాగస్వాములిద్దరిలో ఒక్కరికి ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఇద్దరికీ చికిత్స అవసరం.

షుగర్ ,బి.పి లాంటి వ్యాధులను నియంత్రణలో ఉంచుకుంటూ బరువు పెరగకుండా చూసుకుంటూ, మంచి ఆహారంతో, తగినంత వ్యాయామంతో, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ జీవన శైలిని మార్చుకుంటే ఇటువంటి వ్యాధులు దరిచేరవు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)