అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల బిల్లుకు లోక్ సభ‌లో చర్చ... ఆమోదం

  • 8 జనవరి 2019
పార్లమెంట్ Image copyright Getty Images

అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. రిజర్వేషన్ల పెంపు కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉండటంతో ఇందుకు అనుగుణంగా 124వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనిని కేంద్ర మంత్రి థావర్ చంద్ గహ్లోత్‌ లోక్ సభలో ప్రవేశపెట్టారు.

ఈ బిల్లుపై లోక్ సభలో వివిధ పార్టీలు తమ అభిప్రాయాలను వినిపిస్తున్నాయి. ప్రభుత్వం తరఫున కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. ''ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారిని పైకి తీసుకురావాలన్నదే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. రాష్ట్రాల ఆమోదం అవసరం లేకుండానే ఈ బిల్లును ఆమోదించవచ్చు. చాలా మంది రిజర్వేషన్లు 50 శాతం దాటితే కోర్టు కొట్టివేస్తుందని చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఆర్టికల్‌ 15, 16 ఆధారంగానే రిజర్వేషన్లను కల్పిస్తున్నారు' అని ఆయన చెప్పారు.

Image copyright loksaba tv
చిత్రం శీర్షిక రాంవిలాస్‌ పాశ్వన్‌

మాజీ ప్రధాని పీవీ నరసింహరావు హయాంలో ఆర్థిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు తెచ్చారని, కానీ ఆ రిజర్వేషన్లను సుప్రీం కోర్టు కొట్టేసిందని కాంగ్రెస్ ఎంపీ కేవీ థామస్‌ అన్నారు. తొందరపాటుతో ఎన్డీయే ప్రభుత్వం ఈ బిల్లు తీసుకొచ్చిందని అన్నారు.

అగ్రవర్ణ పేదలకు ఇప్పుడు రిజర్వేషన్లు కల్పించాలని హడావుడిగా బిల్లుతీసుకరావడం ఎన్నికల ముందు బీజేపీ చేస్తున్న జిమ్మిక్కు అని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వ్యాఖ్యానించారు.

ఈబీసీ బిల్లును తాము ఆహ్వానిస్తున్నామని చర్చ సందర్భంగా శివసేన ఎంపీలు తెలిపారు.

టీఆర్ఎస్ తరఫున ఈ బిల్లుపై చర్చ సందర్భంగా ఆ పార్టీ ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ, బిల్లును తమ పార్టీ స్వాగతిస్తుందని చెప్పారు. ఈ బిల్లుతో పాటు తెలంగాణలో ముస్లింలకు 12 శాతం, గిరిజనలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. కొన్ని సవరణలతో ఈ బిల్లుకు మద్దతిస్తున్నామని చెప్పారు.

ఎల్జీపి అధినేత రాంవిలాస్‌ పాశ్వన్‌ మాట్లాడుతూ, తాము ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. వీపీ సింగ్ అగ్రవర్ణానికి చెందినప్పటికీ ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేశారని గుర్తు చేశారు. వేర్వేరు మతాల్లోని పేదలకు ఈ బిల్లు వల్ల లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ప్రైవేటు రంగంలోనూ 60 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు.

సమాజ్‌వాది పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగాల్లో లక్షల సంఖ్యలో ఖాళీలున్నాయని, మొదట వాటిని భర్తీ చేయాలని కోరారు.

Image copyright Supriya/twitter
చిత్రం శీర్షిక ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే

రిజర్వేషన్ల బిల్లు రాజకీయ జిమ్మిక్కు కాకూడదని తాము భావిస్తున్నామని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే అన్నారు.

సీపీఐ(ఎం) పార్టీ ఎంపీ జితేంద్ర చౌదరి మాట్లాడుతూ ''మా పార్టీ ఈ బిల్లును వ్యతిరేకించడం లేదు కానీ, చివరి నిమిషంలో ఈ బిల్లును తీసుకరావడంపై అభ్యంతరాలున్నాయి'' అని చెప్పారు.

2013లో హర్యానా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుకు ప్రస్తుతం తీసుకొచ్చిన బిల్లు నకలుగా ఉందని కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హూడా అన్నారు.

బీజేపీకి నిజంగా అగ్రవర్ణ పేదల మీద ప్రేమ ఉంటే ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ బిల్లు తీసుకొచ్చేదని ఆప్ ఎంపీ భగవత్ మాన్‌సింగ్ వ్యాఖ్యానించారు.

ఈ బిల్లును తీసుకరావడం అంటే అంబేద్కర్‌ను అవమానించడమేనని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. తాము ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని, ఇది రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. కోర్టులో ఈ బిల్లుకు భంగపాటు తప్పదని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం