Fact Check: విపరీతంగా షేర్ అవుతున్న ఈ ఫొటోలు నిజానికి భారతీయ సైనికులవి కాదు

  • 10 జనవరి 2019
ఫేక్

భారత సైనికులు అత్యంత తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో పనిచేస్తున్నట్లు చూపించే ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

శ్రద్ధా కపూర్, కిరన్ ఖేర్ లాంటి సెలెబ్రిటీలతో పాటు చాలామంది సామాన్యులు కూడా ఆ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ భారత సైన్యం గొప్పతనానికి సెల్యూట్ చేస్తున్నారు.

భారత సైనికులు సియాచెన్ గ్లేసియర్ లాంటి కఠిన పరిస్థితులుండే ప్రాంతాల్లో పనిచేసే మాట వాస్తవమే. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉండే యుద్ధభూమిగా సియాచెన్‌కు పేరుంది. 13వేల నుంచి 22వేల అడుగుల ఎత్తులో వాళ్లు విధులు నిర్వర్తిస్తారు. అత్యంత శీతల వాతావరణం ఒక్కోసారి ప్రాణాలు కూడా తీస్తుంది. మంచు చరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదమూ ఉంది.

కానీ, ఇక్కడ భారత సైనికులుగా పేర్కొంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫొటోల్లో మాత్రం నిజం లేదు. ఆ ఫొటోలు రష్యా, యుక్రెయిన్ సైనికులకు చెందినవనీ, వాటిని భారత సైనికులకు తప్పుగా ఆపాదించారని బీబీసీ పరిశీలనలో తేలింది.

Image copyright Twitter

‘లైకులు, షేర్ల’ కోసమే కావాలనే ఈ పని చేసినట్లు కనిపిస్తోంది. కానీ, కొందరు బాలీవుడ్ నటులు కూడా వీరి బుట్టలో పడ్డారు. సైనికులను గౌరవించే ఉద్దేశంతో వీళ్లు ఆ పోస్టులను షేర్ చేస్తున్నా, తెలియకుండానే ఒక ఫేక్ న్యూస్ వ్యాప్తిలో వాళ్లు భాగమవుతున్నారు.

అలా కావాలనే ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నారనడానికి కొన్ని ఉదాహరణలివి.

‘వీళ్లు సినీ తారలకు ఏమాత్రం తీసిపోరు. ఈ సాహసవంతులైన మహిళలు పాకిస్తాన్ సరిహద్దు దగ్గర సేవలందిస్తున్నారు. జై హింద్ అని రాయడానికి ఆలోచించకండి’ అంటూ పై ఫొటోను షేర్ చేస్తున్నారు. ఇద్దరు మహిళలు ఆర్మీ యూనిఫాం ధరించి, తుపాకులు పట్టుకొని కనిపించే ఈ ఫొటో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.

కుడివైపు ఉన్న మహిళ యూనిఫాంపై జెండా, భారత జెండాను పోలి ఉంటుంది. @indianarmysupporter అనే పేజీ కూడా ఈ ఫొటో పోస్ట్ చేసింది. దాన్ని 3వేల మందికి పైగా షేర్ చేశారు.

Image copyright Prashant Chahal

ఇదీ నిజం: ఆ ఫొటోలోని ఇద్దరు మహిళలు ఉత్తర ఇరాక్‌లోని కుర్దిష్ పెష్మార్గా ఫైటర్లు. ‘పెష్మార్గా’ అంటే మృత్యువును ఎదుర్కొనేవారని అర్థం. వాళ్లు ఐఎస్‌కు చెందిన ఇస్లామిక్ మిలిటెంట్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఒటోమన్ సామ్రాజ్యం పతనమయ్యాక పెష్మార్గాలు కుర్దిష్ ప్రజల యుద్ధ వీరులుగా మారారు. స్వతంత్ర కుర్దిస్తాన్‌ కోసం పోరాడే కుర్దిష్ ప్రజలు ధరించే జెండానే ఆ ఫొటోలో ఉన్న సైనికులు కూడా ధరించారు.

Image copyright Prashant Chahal

పై ఫొటోను షేర్ చేస్తూ, ‘మన సైనికులు -5డిగ్రీలలో కూడా ఇలా డ్యూటీ చేయబట్టే మనం ప్రశాంతంగా నిద్రపోతున్నాం. జైహింద్, జై భారత్’ అనే వ్యాఖ్యలు రాస్తున్నారు. మరో వ్యక్తి పూర్తిగా మంచులో కూరుకుపోయిన ఫొటోను కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

‘భారతీయ యోధా’ లాంటి కొన్ని పేజీల్లో ఈ ఫొటోకు వేలాది లైకులొచ్చాయి.

ఇదీ నిజం: ఈ ఫొటో అమెరికా స్విమ్మర్ డాన్ షెట్టర్‌కు చెందింది. ఒక మ్యూజిక్ డైరెక్టర్ పోస్ట్ చేసిన వీడియోలో నుంచి ఆ ఫొటోను తీసుకున్నారు. డాన్ షెట్టర్ అత్యంత శీతల వాతావరణంలో లేక్ సుపీరియర్‌లో ఈదడానికి ఎలా వెళ్లాడో చెబుతూ ఆ ఫొటోను జెర్రీ మిల్స్ పంచుకున్నారు. కానీ, దాన్ని మరో అవసరం కోసం సోషల్ మీడియాలో కొందరు ఉపయోగిస్తున్నారు.

అలాంటి ఫొటోలు షేర్ చేయడం కొత్త కాదు. అవన్నీ నకిలీవని తేలుతున్నప్పటికీ ఇప్పటికీ వాటిని పంచుకుంటూనే ఉన్నారు.

Image copyright Facebook

మరో ఫొటోలో ఇద్దరు సైనికులు పూర్తిగా మంచులో కూరుకుపోయినట్లు కనిపిస్తుంది. ఆ ఫొటో కూడా వివిధ పేజీల్లో షేర్ అవుతోంది. నిజానికి ఈ ఫొటో గత కొన్నేళ్లుగా ప్రచారంలో ఉన్నా, మళ్లీ వాట్సాప్, ఫేస్ బుక్ గ్రూపుల్లో ప్రత్యక్షమవుతోంది.

ఈ ఫొటోను శ్రద్ధా కపూర్ కూడా షేర్ చేశారు. 2014 ఇదే ఫొటో యుక్రెయిన్‌లో వైరల్ అయింది. యుక్రెయిన్ సైనికులు -20 డిగ్రీల చలిలో పనిచేస్తున్నారని దానికి క్యాప్షన్ పెట్టారు.

ఇదీ నిజం: ఈ ఫొటోలు రష్యాకు చెందినవి. అక్కడి సైనికులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే సమయంలో వీటిని తీశారు. రష్యాకు చెందిన కొన్ని అధికారిక వెబ్‌సైట్లు ఈ ఫొటోలు ప్రచురించాయి. యుక్రెయిన్‌కు చెందిన ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్‌సైట్ ‘స్టాప్‌ఫేక్’ కూడా ఈ ఫొటోలు నకిలీవని తేల్చింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)