అయోధ్య కేసు: రాజ్యాంగ ధర్మాసనం నుంచి జస్టిస్ యు.యు. లలిత్ ఎందుకు తప్పుకున్నారు? .

రామ జన్మభూమి- బాబ్రీ మసీదు స్థల వివాదంపై కేసు విచారణలో అయిదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం నుంచి జస్టిస్ యు.యు. లలిత్ తప్పుకున్నారు.
దీంతో, తదుపరి విచారణను జనవరి 29కి వాయిదా వేశారు. ఈ కేసులో కొత్త రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తామని న్యాయస్థానం వెల్లడించింది.
ఇవాళ కేసు విచారణ కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయి నేతృత్వంలో న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.ఎ. బోబ్డే, జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ డి.వై. చంద్రచూడ్‌ల ధర్మాసనం వాదనలు ప్రారంభించగానే, బెంచ్‌లో జస్టిస్ లలిత్ ఉండటంపై సీనియర్ న్యాయవాది రాజీవ్ ధవన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
జస్టిస్ లలిత్ గతంలో బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కల్యాణ్‌సింగ్ తరఫున వాదించిన విషయాన్ని ధవన్ ప్రస్తావించారు. రాజ్యాంగ ధర్మాసనంలో ఆయన సభ్యులుగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
అయితే, తాను కేవలం వాస్తవాన్ని కోర్టు దృష్టికి తీసుకువస్తున్నానని, ధర్మాసనంలో కొనసాగేది, లేనిదీ జస్టిస్ లలిత్ విచక్షణకు వదిలేస్తున్నానని కూడా ధవన్ అన్నారు.
దీంతో, జస్టిస్ లలిత్ తనంతట తానుగా విచారణ నుంచి తప్పుకున్నారు.
ఈ పరిణామంతో కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. జనవరి 29 నుంచి కొత్త ధర్మాసనం వాదనలు వింటుందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.
- బాబ్రీ విధ్వంసానికి 'రిహార్సల్స్' ఇలా జరిగాయి..
- బాబ్రీ మసీదు విధ్వంసాన్ని పీవీ నరసింహారావు ఎందుకు ఆపలేదు?
జడ్జీలు ఎప్పుడెప్పుడు కేసు విచారణ నుంచి తప్పుకోవచ్చు?
ఒక జడ్జిని కేసు నుంచి తప్పుకోమని కోరడానికి భారతదేశంలో చట్టం లేదు. అది కేవలం న్యాయస్థానం, జడ్జీల విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది.
న్యాయవిచారణలో నిస్పాక్షికత అన్నది కీలక అంశం. అలాగే తన కేసులో తానే జడ్జిగా ఉండలేరన్నది ఒక మార్గదర్శకం.
'న్యాయం జరగడం మాత్రమే కాదు, న్యాయం జరిగినట్లు కూడా కనిపించాలి' అనేది న్యాయవ్యవస్థలో వినిపించే సూత్రం.
అందువల్ల ఒక కేసులో నిష్పక్షపాతంగా వ్యవహరించలేమని భావించినపుడు జడ్జీలు విచారణ నుంచి తప్పుకోవచ్చు.
జడ్జీలు న్యాయ విచారణ నుంచి తప్పుకునే సందర్భాలు:
- జడ్జిలకు ఒక కేసులో విరుద్ధ ప్రయోజనాలు (conflict of interest) ఉన్నాయనే అనుమానం ఉన్నపుడు ఆయన విచారణ నుంచి తప్పుకోవచ్చు.
- వాది ప్రతివాదుల్లో ఎవరో ఒకరి వైపు పక్షపాతం చూపించే అవకాశం ఉందని అనిపించినపుడు ఆ జడ్జి కేసు విచారణ నుంచి తప్పుకోవచ్చు.
- జడ్జికి కానీ, జడ్జి కుటుంబానికి కానీ, ఒక కేసులో ఆర్థికాంశాలకు సంబంధించి ప్రయోజనాలు ఉన్నట్లయితే జడ్జి తప్పుకోవచ్చు.
- జడ్జికి కానీ, జడ్జి కుటుంబ సభ్యులకు కానీ, కక్షిదారులు లేదా కేసును వాదించే న్యాయవాదులు బంధువులు అయితే విచారణ నుంచి తప్పుకోవచ్చు.
- ఒక కేసుకు సంబంధించిన నిజాల గురించి జడ్జికి వ్యక్తిగత సమాచారం తెలిసినట్లయితే కేసు విచారణ నుంచి తప్పుకోవచ్చు.
అయితే, సుబ్రతా రాయ్ సహారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2014) కేసులో సుప్రీంకోర్టు ఇలా ఒక జడ్జి కేసు విచారణ నుంచి తప్పుకోవాలన్న విజ్ఞప్తిని తిరస్కరించింది.
''కేసులో విచారణను వినకపోవడం అన్నది తమ బాధ్యతలను ఎలాంటి భయమూ, పక్షపాతమూ లేకుండా నిర్వహిస్తామని చేసిన ప్రమాణాలకు విరుద్ధం,'' అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
అయోధ్య కేసులో జస్టిస్ యు.యు. లలిత్ తనంతట తానుగా తప్పుకోవడం అన్నది ఇతరులకు మార్గదర్శకమని కేంద్ర సమాచార మాజీ కమిషనర్, ప్రముఖ పాత్రికేయులు మాడభూషి శ్రీధర్ కొనియాడారు.
అయితే, జడ్జి కాక ముందు ఆయన అనేక వందల కేసులు వాదించి ఉండొచ్చని, వాటిలో కక్షిదారుల కేసులేవీ విచారించవద్దంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు.
- 'బాబ్రీ' తర్వాత పాకిస్తాన్లో కూల్చిన మందిరాలివే!
- బీబీసీ ఇంటర్వ్యూ: ‘బాబ్రీ వద్ద హిందువులను ఆలయాన్ని కట్టుకోనివ్వండి’
ఈ కేసుతో జస్టిస్ లలిత్‌కు సంబంధమేంటి?
జస్టిస్ లలిత్‌కు ఈ కేసుతో సంబంధం 22 ఏళ్ల నాటిది.
రామమందిరం - బాబ్రీ మసీదు కేసులో హషీం అన్సారి అనే వ్యక్తి కోర్టు ధిక్కారం కింద కేసు వేశారు. దీనిలో ఆయన పీవీ నరసింహారావు, ఎల్ కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, కల్యాణ్ సింగ్ తదితరులను ప్రతివాదులుగా చేర్చారు.
1997లో జస్టిస్ లలిత్ నాటి ఉత్తర ప్రదేశ్ సీఎం కల్యాణ్ సింగ్ తరపున న్యాయవాదిగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- Fact Check: విపరీతంగా షేర్ అవుతున్న ఈ ఫొటోలు వాస్తవానికి భారతీయ సైనికులవి కాదు
- హరప్పా నాగరికతనాటి ‘దంపతుల’ సమాధి చెబుతున్న చరిత్ర
- మీ ఏడాది ఆదాయాన్ని మీ సీఈఓ ఒక పూటలో సంపాదిస్తాడు
- అంతరిక్షం నుంచి మళ్లీ అవే సంకేతాలు? ఎవరు పంపారు?
- హార్దిక్ పాండ్యా: ‘నేను ఎవరైనా అమ్మాయిని కలిస్తే ఆ పని చేసొచ్చానని ఇంట్లో చెబుతాను’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)