కుంభ మేళా: 'కుంభ్' సంప్రదాయం ఎప్పుడు మొదలైంది... ఈ మేళా చరిత్ర ఏమిటి?

  • 14 జనవరి 2019
కుంభమేళా, ప్రయాగరాజ్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక కుంభమేళా, ప్రయాగరాజ్

సంగమ తీరంలో మరోసారి కుంభమేళా సందడి మొదలైంది. ఇది అర్థ కుంభమేళానే అయినా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం దీనిని 'కుంభ్' అనాలని ప్రకటించింది.

అంతేకాదు, ఇప్పుడు పూర్ణ కుంభ్‌ను మహా కుంభ్ అని కూడా అంటున్నారు.

నిజానికి యునెస్కో కుంభమేళాను ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. ప్రభుత్వానికి దీనికంటే మించిన బ్రాండింగ్ ఏదీ దొరకదని అనిపిస్తోంది.

అయినా ఎలాంటి ఆహ్వానం లేకుండానే కొన్ని లక్షల మంది కుంభమేళా కోసం ఇక్కడకు చేరుకుంటారు.

ఎన్నికల సంవత్సరంలో కుంభమేళాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మెగా ఈవెంట్‌గా భావిస్తున్నాయి. అందుకే దీనికి ఇంతకు ముందు జరిగిన వాటికంటే ఈసారి ఎక్కువ బడ్జెట్ కేటాయించాయి.

Image copyright Getty Images

మత్స్య పురాణంతో సంబంధం

మత్స్య పురాణంలో సాగర మథనం కథ ప్రకారం అమృత కలశం సొంతం చేసుకోడానికి రాక్షసులు, దేవతల మధ్య 12 ఏళ్లు యుద్ధం జరిగింది.

ఈ గొడవలో అమృత కలశం నుంచి చిందిన బిందువులు భారతదేశంలోని నాలుగు ప్రాంతాల్లో పడ్డాయి.

ఆ నాలుగు ప్రాంతాల్లో అంటే ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్), హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని నదీ తీరాల్లో ప్రతి 12 ఏళ్లకు కుంభమేళా నిర్వహిస్తారు.

కుంభమేళా నిర్వహణలో బృహస్పతి గ్రహ స్థితికి చాలా ప్రాధాన్యం ఉంటుందని జ్యోతిషులు చెబుతారు.

ఈ గ్రహం మేష రాశిలో ఉన్నప్పుడు ప్రయాగలో పూర్ణ కుంభమేళా, వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు అర్థ కుంభమేళా జరుగుతుంది.

దాని ప్రకారం ఇప్పుడు అర్థ కుంభమేళా జరుగుతోంది.

Image copyright Getty Images

కుంభమేళా గురించిన లిఖిత ఆధారాలు

అర్థ కుంభమేళా, కల్పవాస్ సంప్రదాయాలు కేవలం ప్రయాగ, హరిద్వార్‌లో మాత్రమే ఉన్నాయనేది చాలా ముఖ్యమైన విషయం.

చరిత్రకారుల వివరాల ప్రకారం కుంభమేళా గురించి మొదటి వివరణ మొఘలుల కాలంలో కనిపించింది. 1665లో రాసిన ఖులాసాతు-త-తారీఖ్‌ అనే గెజిట్‌లో ఇది లభించింది.

కొంతమంది చరిత్రకారులు మాత్రం ఆ వాదనను విభేదిస్తున్నారు. పురాణాలు, వేదాలలో కుంభమేళా గురించి ఉందని, దానికి శతాబ్దాల పురాతన చరిత్ర ఉందని చెబుతున్నారు.

Image copyright Getty Images

పురాణ పండితుల వివరాల ప్రకారం పురాణాల్లో కుంభ్ అనే మాట ఉంది. కుంభమేళా గురించి మాత్రం ఎలాంటి ప్రస్తావన లేదు.

అయితే, 19వ శతాబ్దంలో 12 ఏళ్లకు ఒకసారి ఒకేచోట గుమిగూడే మతాచార్యులు మధ్యలో కూడా ఒకసారి అంతా కలిస్తే బాగుంటుందని అనుకోవడంతో ఆరేళ్లకు ఒకసారి అర్థ కుంభమేళా సంప్రదాయం ప్రారంభమైందని ఇంకొదరు చరిత్రకారులు చెబుతారు.

కొన్నిరోజుల క్రితం సంగమ తీరంలో ప్రసంగించిన ప్రధాని కూడా ఈ కుంభమేళాను 'అర్థ కుంభ్' అనే అన్నారు.

Image copyright Getty Images

కుంభమేళాలో అఖాడాల ప్రభావం

అయితే, ప్రయాగరాజ్‌లోని సంగమ తీరంలో కుంభమేళా ప్రారంభం కాబోతోంది.

మేళాకు ప్రధాన ఆకర్షణగా భావించే నాగా సాధువులతో అన్ని అఖాడాలూ ఊరేగింపుగా కుంభమేళాలోని తమ శిబిరాలకు చేరుకున్నాయి.

సాధువులు, సన్యాసులు, మతపెద్దలు ఉండే అఖాడాలకు నాగా సాధువులు కేంద్రంగా ఉంటారు. సనాతన మత ధర్మాలను పరిరక్షించేందుకే సాధువుల సంప్రదాయం ప్రారంభమైందని చెబుతారు.

ఏళ్ల క్రితం ప్రారంభమైన అఖాడా సంప్రదాయంలో మొదట పది అఖాడాలే ఉండేవి, కానీ, మెల్లమెల్లగా వాటి సంఖ్య పెరిగింది. ఇప్పుడు 15 అఖాడాలు ఉన్నాయి.

సనాతన ధర్మానికి చెందిన శివ, వైష్ణవ సంప్రదాయాలను ఆచరించే అఖాడాలతోపాటు, సిక్కులకు కూడా తమ సొంత అఖాడా ఉంది. అది 1855 నుంచే కుంభమేళాలో పాల్గొంటోంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక హిజ్రాల అఖాడా

పరీ అఖాడా, హిజ్రాల అఖాడా

కొత్తగా ఏర్పడిన అఖాడాల్లో మహిళా సాధువులు మాత్రమే ఉండే దానిని పరీ (దేవకన్యల) అఖాడా అంటున్నారు. ట్రాన్స్‌జెండర్, హిజ్రాల అఖాడా కూడా ఉంది.

ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఈ అఖాడాలు చాలా పోరాటాలు చేసిన తర్వాత కుంభమేళాలో పాల్గొనడానికి స్థానం సంపాదించాయి.

పరీ అఖాడాకు ప్రయాగలో 2013లో జరిగిన కుంభమేళాలో ప్రాధాన్యం లభించింది. ఇక హిజ్రాల అఖాడాకు ఇప్పుడు జరుగుతున్నదే మొదటి కుంభ్.

ఈ అఖాడాలు ఈసారీ కుంభమేళాకు వచ్చే వారిని ఆకర్షించనున్నాయి. కానీ, వీరి ఊరేగింపులు మూడు రోజులే ఉండనున్నాయి.

Image copyright Getty Images

కల్పవాస్

అలహాబాద్ అంటే ప్రయాగరాజ్ కుంభమేళాకు ఉన్న ఒక ప్రత్యేకత ఇక్కడ జరిగే కల్పవాస్.

లైఫ్ మేనేజ్‌మెంట్, టైమ్ మేనేజ్‌మెంట్ లాంటి వాటిని నేర్పించే ఈ కల్పవాస్ చేయడానికి దేశవ్యాప్తంగా లక్షల మంది ఇక్కడకు చేరుకున్నారు.

ఇప్పడు ఇది చాలా మంది విదేశీయులను కూడా బాగా ఆకర్షిస్తోంది.

Image copyright Getty Images

ప్రభుత్వం, చాలా మంది బాబాలు, ఎన్నో ఇతర సంస్థలన్నీ కలిసి కల్పవాస్ కోసం రకరకాల ఏర్పాట్లు చేశాయి.

పూరి గుడిసె నుంచి ఫైవ్ స్టార్ హోటల్ సౌకర్యాల వరకూ ఉన్న గదులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

కానీ జనం భారీగా తరలివచ్చే కుంభమేళాలో మతం, విశ్వాసాలతో ముడిపడిన అసలైన కల్పవాసీల సంఖ్య మాత్రం ప్రతిసారీ పరిమితంగానే ఉంటుంది.

అయితే, లక్షల మందిని తనలో మమేకం చేసుకోగల శక్తి ఉన్న ఈ కుంభమేళా కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చాలా జోరుగా చేస్తోంది.

మొత్తానికి ప్రభుత్వం ఏర్పాట్లు ఒక ధార్మిక కార్యక్రమానికి కాదు, ఏదో ఒక భారీ ప్రాయోజిత ప్రదర్శనకు ఆహ్వానిస్తున్నట్టు కనిపిస్తున్నాయి.

ఎన్నో ఇబ్బందులను దాటుకుని ఇంత దూరం వచ్చే యాత్రికులను ఆ షో ఎంత వరకూ ఆకట్టుకుంటుందో చూడాలి.

( ధనుంజయ్ చోప్రా అలహాబాద్ విశ్వవిద్యాలయం సెంటర్ ఆఫ్ మీడియా స్టడీస్ ఇంచార్జ్. ఈ వ్యాసంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం. దీనికి బీబీసీ ఏ విధంగానూ జవాబుదారీ కాదు)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)