గుజరాత్ ‘ఎన్‌కౌంటర్లకు సాక్ష్యాలు లేవు’: బడా నేతలు, ఐపీఎస్ అధికారులు, బీజేపీకి ఊరట

  • 14 జనవరి 2019
మోదీ, అమిత్ షా Image copyright BJP4India/facebook

పదిహేడో లోక్‌సభ కోసం జరగనున్న ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీకి పెద్ద ఊరటే లభించింది. 2002-2006 మధ్య గుజరాత్‌లో జరిగిన 17 ఎన్‌కౌంటర్లపై దర్యాప్తు కోసం ఏర్పాటైన రిటైర్డ్ జస్టిస్ హర్జీత్ సింగ్ బేడీ కమిటీ ఆ రాష్ట్రానికి చెందిన బడా నేతలు, అప్పటి ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు గుర్తించలేకపోయింది.

అయితే, వీటిలో మూడు ఎన్‌కౌంటర్లు మాత్రం బూటకమని.. వాటితో సంబంధమున్న పోలీస్ అధికారులపై మరింత విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఈ మూడు కేసుల్లో మృతుల బంధువులకు పరిహారం ఇవ్వాలని సూచించింది.

ఈ కమిటీ విచారణ చేపట్టిన 17 కేసులు కూడా నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినవే.

ఆ సమయంలో పోలీసులు ఎన్‌కౌంటర్ల పేరిట చాలామందిని కాల్చిచంపారని సుప్రీంకోర్టులో దాఖలైన వ్యాజ్యాల్లో పిటిషనర్లు ఆరోపించారు.

Image copyright Getty Images

పాత్రికేయుడు బీజీ వర్గీస్, గేయ రచయిత జావేద్ అక్తర్, మానవహక్కుల కార్యకర్త షబ్నమ్ హస్మీలు 2007లో వేసిన ఈ పిటిషన్లలో.. పోలీస్ కస్టడీలో ఉన్నవారినీ బూటకపు ఎన్‌కౌంటర్లలో చంపేశారని ఆరోపించారు.

2012లో వర్గీస్, జావేద్ అక్తర్‌ల పిటిషన్లను విచారించిన న్యాయస్థానం.. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి హర్జీత్ సింగ్ బేడీ నేతృత్వంలో ఒక పర్యవేక్షణ కమిటీ వేశారు. ఈ ఎన్‌కౌంటర్లపై విచారణ జరపాలని ఆయన్ను కోరింది.

బేడీ కమిటీ 2018 ఫిబ్రవరిలో తన దర్యాప్తు నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. అందులో కేవలం మూడు కేసులు మాత్రమే బూటకమని చెబుతూ.. వాటితో సంబంధమున్న పోలీసు అధికారులపై చర్యలకు సిపారసు చేసింది.

Image copyright KALPIT BHACHECH
చిత్రం శీర్షిక అహ్మాదాబాద్‌లో ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం

నివేదికలో ఏముంది?

''ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాల ప్రకారం సమీర్ ఖాన్, హాజీ ఇస్మాయిల్, ఖాసిం జాఫర్ హుస్సేన్‌లను బూటకపు ఎన్‌కౌంటర్లలో చంపేశారు'' అని నివేదికలో పేర్కొన్నారు. దీంతో సంబంధమున్న 9 మంది పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని నివేదిక సిఫారసు చేసింది.

అయితే, ఇందులో పోలీస్ శాఖలోని ఐపీఎస్ స్థాయి ఉన్నతాధికారులెవరూ లేరు. ముగ్గురు ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులు కాగా మిగతావారు అంతకంటే తక్కువ హోదా అధికారులు, సిబ్బంది.

దీనిపై క్రిమినల్ లాయర్ గీతా లూథ్రా బీబీసీతో మాట్లాడుతూ.. ''మూడు కేసులు బూటకమని, అందులో పాత్రధారులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కమిటీ నివేదిక సిఫారసు చేసింది. కాబట్టి ఈ మూడు కేసులపై మరింత విచారణ జరగాలి'' అన్నారు.

Image copyright KALPIT BHACHECH
చిత్రం శీర్షిక ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన సమీర్ ఖాన్ తల్లిదండ్రులు

‘ముస్లింలను లక్ష్యంగా చేసుకోలేదు’

కాగా.. ముస్లిం తీవ్రవాదులను లక్ష్యంగా చేసుకుని సాగిన ఈ హత్యాకాండల్లో అప్పటి గుజరాత్ ప్రభుత్వ హస్తముందంటూ ఆ రాష్ట్ర మాజీ డీజీపీ ఆర్బీ శ్రీకుమార్ లేవనెత్తిన అంశాలను కమిటీ తోసిపుచ్చింది.

ఏ అల్పసంఖ్యాక వర్గాలకు చెందినవారినీ లక్ష్యంగా చేసుకుని వ్యవస్థీకృతంగా హత్యలు చేసినట్లు ఆధారాలు లేవని.. పైగా హతుల్లో అన్ని వర్గాల వారూ ఉన్నారని.. వారిలో చాలామంది నేర చరితులని కమిటీ నివేదిక స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, మాజీ సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరణ్ దీనిపై స్పందిస్తూ.. ఈ నివేదికను తప్పుపట్టడానికి కారణాలేవీ కనిపించడం లేదన్నారు.

కాగా.. బేడీ కమిటీ నివేదికను రహస్యంగా ఉంచాలని కోరుతూ గుజరాత్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ గతవారం సుప్రీంకోర్టు.. ఈ నివేదికను కేసుతో సంబంధం ఉన్న పక్షాలన్నిటికీ అందించాలని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)