‘మకర జ్యోతి’ నిజమా? కల్పితమా? ట్రావెన్‌కోర్ దేవాస్వాం బోర్డు ఏం చెప్పింది?

  • 14 జనవరి 2019
శబరిమల అయ్యప్పస్వామి ఆలయం Image copyright Getty Images

సంక్రాంతి అనగానే హిందూ భక్తులు చాలా మందికి శబరిమల ఆలయం ప్రముఖంగా గుర్తొస్తుంది. శబరిమలలో సంక్రాంతి రోజున 'మకర జ్యోతి'ని వీక్షించటానికి వేలాది భక్తులు పోటెత్తుతారు.

సంక్రాంతి రోజున సాయం సమయంలో ‘‘కనిపించే’’ మకరజ్యోతిని చూశాక అయ్యప్ప మాలధారులు దీక్ష విరమిస్తారు. అయ్యప్పస్వామి స్వయంగా 'మకర జ్యోతి' రూపంలో కనిపిస్తారన్నది వారి విశ్వాసం. ఆ రోజున చాలా టీవీ చానళ్లు కూడా ఈ ‘మకరజ్యోతి’ని ప్రత్యక్ష ప్రసారం చేస్తుంటాయి.

అయితే.. 2011 జనవరి 14వ తేదీ రాత్రి ‘మకర జ్యోతి’ని వీక్షించటానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి తిరిగి వెళ్లే సమయంలో భారీ తొక్కిసలాటి జరిగి దాదాపు 106 మంది చనిపోయారు.

ఈ నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో రావటానికి కారణమయ్యే ‘‘మకర జ్యోతి’’ వివాదాస్పద అంశంగా మారింది. అది స్వయంగా ఏర్పడుతుందా? లేకపోతే మనుషులు వెలిగిస్తారా? అనేది పరిశోధించి ప్రజలకు వాస్తవాలు తెలియజేయటానికి అనుమతి ఇవ్వాలంటూ హేతువాద, మానవవాద సంఘాలు కేరళ హైకోర్టులో పిటిషన్ వేశాయి.

ఆ పిటిషన్ మీద - శ్రీని పట్టథానమ్ వర్సెస్ కేరళ ప్రభుత్వం కేసు - కేరళ హైకోర్టు 2011 ఏప్రిల్ 25న తీర్పు చెప్పింది. ఆ తీర్పులో ట్రావెన్‌కోర్ దేవాస్వాం (తెలుగులో దేవస్థానం) బోర్డు తన అఫిడవిట్‌లో 'మకర జ్యోతి' గురించి వివరించిన విషయాలను ప్రస్తావించింది.

మకరజ్యోతిపై ఎవరేం చెప్పారంటే..

పిటిషనర్లు

  • మకరజ్యోతి నిజం కాదు. అది దేవుడి మహిమ కాదు. దానిని మానవులే వెలిగిస్తున్నారు.

ట్రావెన్‌కోర్ దేవాస్వాం బోర్డు

  • భక్తులంతా దర్శించుకునే, కొండపై నుంచి మూడుసార్లు కనిపించే ‘మకరజ్యోతి’ ఒక దీపం (మకర విళక్కు పూజ). దీనిని పొన్నంబళమేడు పర్వతంపై కొందరు గిరిజనులు వెలిగిస్తారు. ఆ గిరిజనులు (బోర్డు) ఉద్యోగులు.
Image copyright daluparameswaran/i&pr/sabarimaladevaswom/facebook
చిత్రం శీర్షిక అయ్యప్ప ఆలయం వద్ద సూర్యాస్తమయ దృశ్యం

కేరళ ప్రభుత్వం

మకరజ్యోతి దేవుని మహిమా లేక మనుషులు వెలిగించే దీపమా అన్న అంశంపై మేం ఎలాంటి విచారణా జరపబోం. ఇది మత విశ్వాసాలకు సంబంధించిన అంశం.

శబరిమల ఆలయం ప్రధానార్చకుడు

మకరజ్యోతి మానవులు వెలిగించేది కాదు. అదొక నక్షత్రం. మకర విళక్కు (కొండపై నుంచి మూడుసార్లు కనిపించే దీపం)... పొన్నంబళమేడు పర్వతంపైన చేసే ఒక దీపారాధన.

Image copyright sabarimaladevaswom/facebook

మకరజ్యోతి ఏంటి? మకర విళక్కు ఏంటి?

మకరజ్యోతి

ఇది ఒక నక్షత్రం అని, అది మకర సంక్రాంతి రోజున కనిపిస్తుందని దేవస్థానం బోర్డు, ప్రధానార్చకులు చెబుతున్నారు. అయితే, అది ఏవైపు కనిపిస్తుంది? అందరికీ కనిపిస్తుందా? లేక అరుంధతీ నక్షత్రం లాంటిదా? అసలు ఉందా? లేదా? అన్న అంశాలపై స్పష్టత లేదు.

మకర విళక్కు

మకర సంక్రాంతి రోజు లేదా ఆ ఘడియల్లో కొండపై నుంచి భక్తులందరికీ కనిపించే వెలుగు. దీనిని పొన్నంబళమేడు పర్వతంపై దేవస్థానం బోర్డు ఉద్యోగులు అయిన గిరిజనులు వెలిగిస్తారు. ఇదొక దీపం అని, దీనిని వెలిగించేది మనుషులేనని దేవస్థానం బోర్డు కూడా అంగీకరించింది.

Image copyright sabarimaladevaswom/facebook

కోర్టుకు దేవాస్వాం బోర్డు ఏం చెప్పింది?

దేవాస్వాం బోర్డు కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం..

''శబరిమల ఆలయాన్ని పరశురాముడు స్థాపించారన్నది విశ్వాసం. శబరిమల ప్రస్తావన రామాయణంలో కూడా ఉంది. రాముడు పంపాకు, శబరిమల వద్ద శబరి ఆశ్రమానికి వెళ్లినట్లు నమ్ముతారు.

శబరిగిరికి తూర్పు వైపున ఉన్న పొన్నంబళమేడు పర్వతం.. శబరిమల ఆలయానికి మూలాస్థానమని నమ్ముతారు. ప్రాచీన కాలంలో పొన్నంబళమేడు మీద ఒక ఆలయం ఉంది. ఆ ఆలయ శిథిలాలు 'శివలింగం' సహా ఇటీవలి కాలం వరకూ అక్కడ ఉన్నాయి. అక్కడ ఒక చెరువు కూడా ఉంది.

పొన్నంబళం అంటే స్వర్ణ దేవాలయం. మేడు అంటే పర్వతం. పొన్నంబళమేడు అనే మాట.. ధర్మశాస్త అయ్యప్పస్వామిగా అవతరించిన పురాణ కథలను వర్ణించే జానపద పాటలలోకి వచ్చింది.

Image copyright sabarimaladevaswom/facebook

పొన్నంబళమేడు మీద ఉండిన ఆలయంలో గతంలో నిరంతర పూజలు జరిగేవని ఆధారాలున్నాయి. కాలక్రమంలో ఆ ఆలయం శిథిలమైంది. ఆలయం శిథిలమైనా కూడా ఆ ప్రాంతంలో నివసించే ఆదివాసీలు.. ముఖ్యమైన దినమైన మకర సంక్రాంతి రోజున దీపారాధన సహా పూజా కార్యక్రమాలు కొనసాగించారు.

కాలక్రమంలో గిరిజనులను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు. కానీ ఉద్యోగ రీత్యా ఇక్కడే ఉండిపోయిన కొందరు గిరిజనులు ఆ రోజున పూజలు కొనసాగించారు. ఆ ఆచారం కొనసాగింది.

''పొన్నంబళమేడులో సంక్రాంతి రోజున కనిపించే దీపం...''

పొన్నంబళమేడు వద్ద మకర సంక్రాంతి రోజున కనిపించే దీపం (లైట్) దైవికమైనది కానీ, మానవాతీత శక్తి ద్వారా ఏర్పడిందని కానీ ఈ బోర్డు లేదా బోర్డు అధికారులు ఎన్నడూ చెప్పలేదు. కానీ మకర సంక్రాంతి రోజున అక్కడ ఆ దీపం కనిపిస్తుందనేది వాస్తవం.

శబరిమలలోనూ, అయ్యప్పస్వామి మూలాస్థానమైన పొన్నంబళమేడులోనూ మకర సంక్రాంతి ఎంతో మత ప్రాధాన్యమున్న పవిత్రమైన దినం. అయ్యప్పస్వామి మకర సంక్రాంతి రోజును జన్మించినట్లు విశ్వసిస్తారు. ఉత్తరాయణం మకర సంక్రాంతి రోజున మొదలవుతుంది.

మకర సంక్రాంతి సమయంలో శబరిమల ఆలయంలో దీపారాధన జరుగుతుంది. ఆ సమయంలో దిగంతంలో ఓ నక్షత్రం కనిపిస్తుంది. అదే సమయంలో పొన్నంబళమేడులో కూడా గతంలో దీపారాధన నిర్వహించేవారు.

ఇప్పుడు ఆ జ్ఞాపకంలో అక్కడ దీపారాధన సమయంలో ఒక దీపం కనిపిస్తుంది. దానిని శబరిమల నుంచి స్పష్టంగా చూడవచ్చు.

శబరిమల ఆలయంలో దీపారాధన, శబరిమల నుంచి ఈశాన్య ఆకాశంలో నక్షత్రం కనిపించటం, పొన్నంబళమేడులో 'దీపం' కనిపించటం అన్నీ ఏకకాలంలో జరిగి.. శబరిమలలో గాఢమైన భక్తి వాతావారణాన్ని నింపుతాయి.

Image copyright sabarimaladevaswom/facebook

''మకర జ్యోతి అంటే పొన్నంబళమేడులో కనిపించే దీపం కాదు...''

ఈ మూడు ఘటనలనూ భక్తులు అనాదిగా వీక్షిస్తున్నారు. ఈ మూడు సంఘటనల్లో ఏ ఒక్కటి జరగకపోయినా పెద్ద సంఖ్యలో శబరిమలకు పొటెత్తే భక్తులు తీవ్ర నిస్పృహకు గురవుతారు. ట్రావెన్‌కోర్ దేవాస్వాం బోర్డు ఏర్పడటానికి ముందు నుంచే పొన్నంబళమేడులో దీపం కనిపిస్తోంది.

1999లో పొన్నంబళమేడులో పూజలు నిర్వహించే కాల్తారా ధ్వంసమైంది. కోర్టు నిర్దేశం ప్రకారం ట్రావెన్‌కోర్ దేవాస్వాం బోర్డు పొన్నంబళమేడులో కాల్తారాను పునర్నిర్మించి, మకర సంక్రాంతి రోజున అక్కడ పూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.

పిటిషనర్లు పేర్కొన్నట్లుగా.. పొన్నంబళమేడులో కనిపించే 'దీపం' మకరజ్యోతి కాదు. మకరజ్యోతి అనేది దీపారాధన సమయంలో కనిపించే నక్షత్రం. అది మానవ జోక్యంతో జరిగేది కాదు.

పొన్నంబళమేడులో కనిపించే దీపం మానవాతీత సంఘటన అని, శబరిమల ఆలయంలో దీపారాధన సమయంలో అది సహజంగా ఏర్పడుతుందని దేవాస్వాం బోర్డు ప్రచారం చేస్తున్నట్లు పిటిషనర్లు చెప్తున్నారు. అది సరికాదు.

ట్రావెన్‌కోర్ దేవాస్వాం బోర్డు కానీ, దాని అధికారులు ఎవరైనా కానీ ఎన్నడూ అటువంటి ప్రచారం చేయలేదు. ... పొన్నంబళమేడులో ఆదివాసీలు గతంలో పూజలు చేసేవారు.. అదే ఇప్పటికీ ఇతర సంస్థల ద్వారా కొనసాగుతోంది'' అని ట్రావెన్‌కోర్ దేవాస్వాం బోర్డు కోర్టుకు తెలిపింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 2011 జనవరి 14న శబరిమల వద్ద తొక్కిసలాట జరిగి 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు

దేవస్వాం బోర్డు చెప్పిన ఈ విషయాన్ని కేరళ హైకోర్టు తన తీర్పులో ఉటంకించింది. మకర జ్యోతి గురించి భక్తుల విశ్వాసాలు ఏవైనప్పటికీ.. పొన్నంబళం మేడులో కనిపించే దీపం ఆచారాల్లో భాగంగా మనుషులు వెలిగించేదేనని బోర్డు చెప్పటాన్ని.. శాస్త్రీయ ఆలోచనకు నిలుస్తున్న వాస్తవంగా పరిగణించవచ్చునని పేర్కొంది.

అలాగే.. ఇది మతానికి సంబంధించిన విశ్వాసాలు, నమ్మకాలు, ఆచారాలకు సంబంధించిన అంశం కనుక దీనిపై దర్యాప్తు అవసరం లేదన్న ప్రభుత్వ వాదనను సమర్థించింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)